Monday, August 25, 2014

తొలి తెలుగు కావ్యం కవిజనాశ్రయం (నమస్తేతెలంగాణ 25 ఆగస్టు 2014 సౌజన్యంతో)

(ఆచార్య ఎస్వీరామారావుగారు ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు. ఈయన ‘కవిజనాశ్రయం’ లక్షణగ్రంథాన్ని ‘‘కావ్యం’’గా సంబోధిస్తూ వ్యాసం రాశారు. మా విద్యార్థినీ విద్యార్థుల సౌకర్యార్థం ఈ వ్యాసాన్ని ‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో పున: ప్రచురిస్తున్నాను...దార్ల )

8/25/2014 12:17:18 AM
తొలి తెలుగు కావ్యం గురించి భిన్నమైన అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నా యి. మహాభారత కర్త (1050) నన్నయభట్టు ఆదికవి అనీ, కాదు తొలిదేశీ కవి పాల్కురికి సోమన (12వ శతాబ్దం) ఆదికవి అనీ భావిస్తున్నారు. కానీ వీరికంటే ముందే 10వ శతాబ్దంలోనే కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మల్లియ రేచన తొలి తెలుగు కావ్యం రచించాడని చాలామందికి తెలియదు.

సుకవిబుధజనముల నాదరమున తలచి జినేంద్ర పదభక్తి మెయిన్ (పద్యం-2) కవిజనాశ్రయుడు మల్లియరేచన సుకవి కవిజనాశ్రయమను ఛందము తెనుగు భాస నరుదుగజెప్పెన్ (పద్యం-5) అని కావ్యాదిలో పేర్కొన్న రేచన ఇది శ్రీవాదీంద్ర చూడామణి చరణ సరసీరుహ మధుకరాయమాన కవిజనాశ్రయ శ్రావకాభరణాంక విరచితంబైన కవిజనాశ్రయంబను ఛందంబు అని ప్రకరణాంత గద్యలో స్పష్టంగా వచించాడు. జైనముని వాదీంద్రుల శిష్యుడైన రేచనకు శ్రావకాభరణుడుఅన్న బిరుదు ఉంది. కాగా జనాశ్రయుడు అన్న పదం తెలంగాణలో మొదటినుంచీ వాడుకలో ఉంది. ఆరవ శతాబ్దానికి (517)చెందిన విష్ణుకుండిన రాజు మాధవవర్మ (జనాశ్రయుడు) జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి అనే ఛందోగ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. రేచన కావ్యరచనా కాలాన్ని నిర్ణయించటానికి కింది పద్యం ఆధారంగా ఉంది.

అసమాన దాన రవితనయ సమానోన్నతుడు వాచకాభరణుడు ప్రాణ సమాన మిత్రుడీ కృతికి సహాయుడుగా నుదాత్త కీర్తి ప్రీతిన్ (పద్యం-4)కరీంనగర్ జిల్లా కుర్క్యాల బొమ్మలగుట్టలో జిన వల్లభుడు వేయించిన శాసనం లో (క్రీ.శ 946) వాచకాభరణుడు అన్న బిరుదు ప్రస్తావన ఉంది. (వాచాకాభరణ కీర్తి మాకల్పతం-సంస్కృత శ్లోకం-3). వేములవాడ రాజధానిగా పాలించిన చాళుక్యరాజు రెండవ అరికేసరి (910-930) కాలంలో అతని ఆస్థాన కవిగా ఉన్న పంపడు కన్నడంలో కావ్యరచన చేయ గా, అతని తమ్ముడైన జిన వల్లభుడు మూడు సం స్కృత శ్లోకాలు, ఆరు కన్నడ వృత్త పద్యాలు, తెలుగు తెలుగు కంద పద్యాలతో కూడిన శాసనం రచించాడు. జిన వల్లభుడు 30 సంస్కృత శ్లోకాలతో కూడిన మహావీరస్వామి సోత్రం కూడా రాశాడు. పంప, జిన వల్లభుడు, మల్లియరేచన ముగ్గురూ జైనమతానుయాయులు, జైన కవులు.

వాచకాభరణుడైన జినవల్లభుని ప్రోత్సాహంతో శ్రావకాభరణుడైన మల్లియరేచన కవిజనాశ్రయం రచించినట్టు కావ్యంలో స్పష్టంగా ఉన్నా, దీన్ని వేములవాడ భీమనకు అన్యాయంగా అంటగట్టారు కొందరు. రేచన భీమనాగ్రసుతుడు,భీమతనూజుడనని తన గురించి చెప్పుకొన్నాడు. మల్లమ్మ తల్లి అవడం చేత మల్లియరేచన అయినాడు. భీమన కొడుకు రాసిన కావ్యం భీమన ఛం దంగా ప్రచారంలోకి రావడం దురదృష్టకరం.అప్పకవి, కస్తూరి రంగకవి మున్నగు లాక్షణికులు ఈ ప్రమాదానికి దారితీశారు.
1917లో కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారు వేములవాడ భీమకవి పేరుతో కవిజనాశ్రయమును ముద్రించినారు. కానీ 1950లో వావిళ్లవారు ఈ ముద్రణను పరిష్కరించి నిడుదవోలు వేంకటరావుగారి విపుల పీఠికతో మల్లియరేచన కృతముగా ప్రచురించినారు. నేడు మనకుపలబ్ధములైన గ్రంథములలో ప్రాచీనమైనది కవిజనాశ్రయము. ఇది మల్లియరేచన రచితము. జైన సాంప్రదాయకము అని తమ పీఠికలో నిడుదవోలు వారు చాటిచెప్పినారు.

పూర్వ శాస్ర్తోక్తవిధిన్ సలలితముగ జెప్పు, తొలి పింగళు చెప్పిన క్రియ చెప్పబడె అని పూర్వ ఛందోగ్రంథాలను పేర్కొన్న మల్లియరేచన జయదేవాది చ్ఛందో/నయమున సంక్షేప రూపునంజెలువుగ మ/ల్లియరేచన సుకవి జనా/శ్రయుడీ ఛందంబు జెప్పే జనులకు దెలియన్ అని జయదేవుని ఛందస్సును అనుసరించినట్లుగా చెప్పుకొన్నాడు (కంద పద్యం నాలుగు పంక్తులు). మాధవవర్మ జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి, జయదేవచ్ఛందము రేచనకు మార్గదర్శకమై ఉంటాయి. సమాకాలీనుడైన కన్నడ కవి నగావర్మ ఛందోంబుధికి (990) కవిజనాశ్రయానికి పోలికలు కనిపిస్తాయి. తర్వాతివాడైన నన్నెచోడుడు (12వ శతాబ్దం) రేచన పద్యాన్ని అనుసరించాడు.

శ్రీ శ్రతవక్షుడు విద్యా/శ్రీశ్రితముఖం/డఖిలజన విశేషితకీర్తి/శ్రీ శ్రితభువనుడు సుకవిజ/నాశ్రయు/డెఱిగించు కృతులనగు దోషంబుల్ (దోషాధికారము-1) శ్రీ శ్రితవక్షుడుముక్తి/ శ్రీ శ్రితసహజావదాతచిత్తుడు వాణీ/ శ్రీశ్రిత సుముఖడు కీర్తి/ శ్రీ శ్రిత దిఙ్మఖుడు శేముషీ నిధి పేర్మిన్ (కుమారసంభవం 7 ఆ-)(కంద పద్యం నాలుగు పంక్తులు)

క్తీస్తు శకారాంభం నుంచే బహుభాషా పాండిత్యం, ఛందః శాస్త్ర రచన, శాసన కవిత తెలంగాణ సాహిత్య చైతన్య ప్రతీకలుగా ప్రకాశిస్తున్నాయి. తెలుగు ప్రాచీనతను చాటుతున్నాయి. గుణాఢ్యుడు, హాలుడు, భవభూతి, సోమదేవసూరి, పంప, మల్లియ రేచన మున్నగు ప్రాకృత-సంస్కృత-కన్నడ-తెలుగు కవులు ఈ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. అత్యంత ప్రాచీన కాలంలోనే ఈ నేలలో కవితా రచన నెలకొని ఉన్నదనడానికి జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి (సంస్కృ తం), కవిజనాశ్రయం (తెలుగు) వంటి ఛందో గ్రంథాలు నిదర్శనంగా నిలచి ఉన్నాయి.

కందపద్యానికి పుట్టినిల్లుగానే కాక ఆటపట్టుగా కూడా తెలంగాణ ప్రాంతం విలసిల్లింది. ఇందుకు జినవల్లభుని బొమ్మలగుట్ట శాసనం తొలి సాక్ష్యం కాగా, మల్లియ రేచ న కావ్యం మలి సాక్ష్యం. ఇందలి లక్షణ పద్యాలన్నీ (113) కందంలో కొనసాగటం గమనార్హం. కేవలం లక్ష్యాలు మాత్రమే ఆయా ఛందస్సుల్లో రాయబడినాయి. ఇంకా కొంత ముందుకువస్తే తొలి తెలుగు వీరశైవకవి మల్లికార్జున పండితారాధ్యుని శివతత్వసారం (12వ శతాబ్దం) ఆద్యంతం కందపద్యాల్లోనే (సుమారు 500) సాగింది. కాగా పదవ శతా బ్దం తర్వాత వర్ధిల్లిన తెలుగు కావ్య జగత్తలోని చంపూ మార్గ సంప్రదాయానికి, వైవిధ్యపూరితమైన వృత్త పద్య నిర్మాణానికి తెలంగాణ కవులే మార్గదర్శనం చేశారంటే అత్యుక్తి కాదు. పంపభారతం, బొమ్మలగుట్ట శాసనం, కవిజనాశ్రయం పద్య గద్యాత్మక రూపంలోనే విరచితమైనాయి.

కన్నడంలోని వృత్తపద్యాలు (పంప, జినవల్లభుడు), గూడూరు విరియాల మల్లభూపతి శాసనం (11వ శతాబ్దం)లోని తెలుగు చంపక-ఉత్పల మాల పద్యాలు భావికవులకు పద్య రచనలో దారిచూపాయి. తెలుగు సాహితీ వైభవానికి పునాదులు వేసిన బంగరు భూమి తెలంగాణ అన్న వాస్తవసత్యం ఇప్పటికైనా వెలుగులోకి రావాలి.

3 comments:

శ్యామలీయం said...

ఆచార్యులవారు ఛందోలక్షణగ్రంథానికి కావ్యత్వం ఆపాదించటం కొంచెం ఆలోచించదగిన విషయం. ఇది అనిదంపూర్వమైన ధోరణి అనుకుంటాను. అచార్యులవారికి కావ్యలక్షణాల గురించి తప్పకుండా మంచి అవగాహన ఉండే ఉంటుందన్నది నిర్వివాదం. ఛందోలక్షణగ్రంథంలో కనీసం ఒక కథ అంటూ కూడా ఉండదు కదా అటువంటి కావ్యం అనటం సబబేనా అన్నది నా ప్రశ్న. ఇదే ధోరణిని ప్రామాణికం చేసేస్తే వైద్యజ్యోతిషాదిరంగాల్లో అప్పట్లూ రచించబడ్ద పుస్తాకాలూ‌కావ్యాలే అవుతాయి కదా. అలాగే ఉదాహరణకు వ్యవసాయరంగానికి పనుకొచ్చే జ్యోతిషవిషయాలతో కూడిన రెట్టమతం‌ అనే పేరున్న గ్రంథమూ ఒక కావ్యం అనే పిలవవలసి వస్తుంది. ఆచార్యులవారు నా అజ్ఞానాన్ని మన్నించి సమాధానం చెబుతే తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోనే ఈ‌ ప్రశ్న వేయటం జరిగింది.

vrdarla said...

శ్యామలీయంగారు,
చాలా మంచి విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. ఇక్కడ కవిజనాశ్రయం ఒక లక్షణగ్రంథం. కానీ కావ్యంగా సంబోధిస్తూ ఆచార్య ఎస్వీరామారావుగారు ఈ వ్యాసాన్ని రాశారు. మరి శీర్షికను ఆయనే పెట్టారో, పత్రికల వాళ్ళు పెట్టారో తెలియదు కానీ కావ్యం అనడంలోని ఔచిత్యాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిందే.మీరు ఆచార్యుల వారు అని సంబోధించింది కూడా ఆయనకే చెందుతుందనుకుంటున్నాను. సమాధానం ఆయన నుండి మనం తెలిసికొంటే బాగుంటుంది. బహుశా నేను అనుకోవడం... అప్పకవీయం,కావ్యాలంకారసంగ్రహం సర్వలక్షణసారసంగ్రహం వంటివి కేవలం లక్షణగ్రంథాలుగానే చూడ్డానికి వీల్లేదు. అవి లక్ష్య, లక్షణగ్రంథాలు. లక్షణాల సమన్వయం,వాటిని తెలుసుకోవడానికి చదువుతున్నా కావ్యం చదువుతున్న అనుభూతికి గురవుతుంటాం. అలాగని దానిలో కావ్యనాయకుడు, కావ్యనాయిక, పాత్రలు, రసపోషణాది విషయాలను ’కావ్యం‘లో చూసినట్లు చూడ్డానికి వీలుపడదు. మల్లియరేచన ‘కవిజనాశ్రయం’కూడా అటువంటి లక్షణాలను కలిగి ఉండటం వల్ల కావ్యం అని పిలిచి ఉండొచ్చేమో. కవిజనాశ్రయంలో రేచన ఛందోలక్షణాలతో పాటు, కావ్యదోషాలను, కావ్యభేదాలను కూడా చర్చించాడు.మీకు అనిపించినట్లే నాకూ వెంటనే అనిపించింది. తర్వాత ఆలోచిస్తే ఇదొక చర్చనీయాంశమే కదా అనిపించి నా బ్లాగులో పునర్ముద్రించాను.
ఆచార్య ఎస్వీరామారావుగారు తెలుగు సాహిత్య విమర్శ గురించి లోతైన పరిశోధన చేసినవారు. వారి గ్రంథం ‘‘ తెలుగులో సాహిత్య విమర్శ‘‘ ఆ విషయాన్ని చెప్పకనే చెప్తుంది. అలాంటి పరిశోధకుని వ్యాఖ్యలోని పరమార్థమేమిటో చెప్తే నేనూ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం.
మీ
దార్ల వెంకటేశ్వరరావు

మఠం మల్లిఖార్జున స్వామి said...

కావ్యం అంటే మూలార్థం కవిచే రచించబడిన గ్రంథం, ఇదే అర్థాన్ని పలుచోట్ల పలువురు ప్రముఖులు ప్రస్తావించడం జరిగింది. నిజానికి మొదట్లో వచ్చినవి పద్య గ్రంధాలే వాటినే కావ్యాలని వచించారు. తరువాత కాలంలో గద్య గ్రంధాలూ వచ్చాయి, వాటిని గద్య కావ్యాలు అన్నారు. కాకపోతే కాలం మారిన కొద్ది కావ్యానికి కొత్త కొత్త నిర్వచణాలు వచ్చి చేరాయి-విస్తృతమయ్యాయి. కవిజనాశ్రయం కావ్యం ఎలా అవుతుంది అని ప్రశ్నించటం అర్థంలేని వాదనే అవుతుంది. కవులకే మార్గనిర్దేశం చేసిన లాక్షణిక పద్య కృతి కావ్యం కాదనటం అర్థరహితమే అవుతుంది. నాయికా నాయకులతో నవరసాలు నిండి ఉండేదే కావ్యం అనే అభిప్రాయం సామాన్యార్థమే.

కావ్యం గురించి ఆంద్ర సాహిత్య పరిషత్పత్రిక వారు 1912 లో విపులంగా వివరించటం జరిగింది.

వినుత యశంబునంగలుగు విశ్రుత నాకనివాసమయ్యశో
జననము శ్రవ్య కావ్యముల సంగతి మెప్పగు శ్రవ్య కావ్యముం
దనరు గవిప్రభావమున దత్కవి సమ్మతిలేని రాజులే
పునవిహరింపరవ్విభులు పోయినజాడ లెరుంగబోలునే

లోకోభిన్నరుచి - వికీపెడియాలో కావ్య నిర్వచనం గూర్చిన విభిన్న వ్యక్తులు ఇచ్చిన నిర్వచనాలను కింది లింక్ ద్వారా చూడవచ్చు.

http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81

అసలు కవిజనాశ్రయము వేములవాడ భీమకవికి అంటగట్టిన వారు కొందరైతే, ఆ భీమకవి కరీంనగర్ వాడు కాదు, ద్రాక్షారామం దగ్గరలోని వేములవాడ గ్రామానికి చెందినవాడనీ వాదించినవారూ ఉన్నారు - కాలం గడచిన కొద్ది కొత్త విషయాలూ వెలుగుచూడటం, వాటితో బాటు అభిప్రాయాల్లోనూ మార్పు రావటం సహజం. ఏదైనా కాలమే నిర్ణయిస్తుందనటానికి కవిజనాశ్రయం ఒక ఉదాహరణ. రాబోవు కాలాల్లో కొత్త విషయాలు వెలుగు చూసిన, వాటిని అంగీకరించటం సంస్కారమే అవుతుంది. నా అక్షరసత్యాలు బ్లాగులో ఈ కవిజనాశ్రయం గూర్చి విపులంగా టపా ఉంచగలను.