"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

28 July, 2014

సాహిత్యాన్ని అనుభవించడంఃమెలాగో నేర్పిన ‘చేరా’ ( సూర్య 28 జూలై 214)



-డా.దార్ల వెంకటేశ్వరరావు,
                                                                                                  అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగుశాఖ,
 సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు-46,
 
పాశ్చాత్య సాహిత్య విమర్శకు శాస్త్రప్రతిపత్తిని నిరూపించిన ముఖ్యమైనవారిలో ఐ.ఏ.రిచర్డ్స్ గురించి చెప్పుకున్నట్లే, ఆధునిక కవిత్వాన్ని భాషాశాస్త్ర భూమికతో విశ్లేషించిన తెలుగు సాహిత్య విమర్శకుల్లో చేకూరి రామారావు (చేరా)ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తుంటాం. హైదరాబాదులోని అనేక సాహిత్య సభల్లో ముఖ్యఅతిథిగా, ప్రధానవక్తగా ప్రసంగించిన ఆయనే, సామాన్య ప్రేక్షకుడుగా కూడా ఎన్నో సభల్లో పాల్గొనడం చాలామంది గమనించే ఉంటారు. సాహిత్యం పట్ల ఆయనకున్న ప్రేమకది నిదర్శనం. అంత నిరాడంబరుడిగా జీవించిన ఆ సాహితీవేత్త జూలై 24, 2014న మరణించారని తెలిసిన తెలుగు సాహితీలోకం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఆయన జీవితాన్ని, రాసిన రచనలను ఒకసారి గుర్తుచేసుకునేలా చేసింది. ఆయనేదైనా సెలక్షన్ కమిటీలో ఉన్నా ఆ అభ్యర్థిపై తన పాండిత్యాన్నంతటినీ ప్రదర్శించకుండా పెద్దమనిషి తరహాగా వ్యవహరించేవారని చెప్తుంటారు. తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఆ ఇంటర్వ్యూ సమయంలో మాత్రం అభ్యర్థిని భయాందోళనలకు గురిచేయని మనస్తత్వమని చాలామంది చెప్తుంటారు.  ఈ మాటను స్వీయానుభవంతో కూడా అనగలుగుతున్నాను.  
వ్యాకరణం, భాషాశాస్త్రాలను ప్రత్యేకాంశాలుగా చదువుకొని, వాటిలోనే పరిశోధన కూడా చేశాడాయన. 1966-67 మధ్య కాలంలో A Transformational Study of Telugu Nominals పేరుతో సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించి 1968లో డాక్టరేట్ పొందారు.  Noam Chamsky పరివర్తన సిద్ధాంతప్రభావంతో ‘తెలుగువాక్యం’ (1975) గ్రంథంలో అనేక విశేషాంశాలను తెలుగు పాఠకులకు వివరించారు. వివిధ ప్రసిద్ధ పత్రికలు, పరిశోధన సంచికల్లో భాషా శాస్త్రాంశాలను వివరిస్తూ రాసిన వాటిలో కొన్నింటిని ‘తెలుగులో వెలుగులు’ (1982) మరికొన్ని గ్రంథాల్లో ప్రచురించారు. తర్వాత కాలంలో కేవలం ‘భాష’ కి సంబంధించిన గ్రంథాలన్నట్లుగా  కొన్ని పుస్తకాలకు పేర్లు పెట్టారు.  భాషానువర్తనం’  (2000), ‘భాషాంతరంగం’ (2001), ‘భాషా పరివేషం’ (2003) వంటివి వీటిలో కొన్ని రచనలు. సాహిత్యం లేకుండా భాష తన పరిమళాల్ని విరజిమ్మలేదని ఈ గ్రంథాల్లోని వ్యాసాల్ని చదివితే తెలుస్తుంది.
‘ముత్యాల సరాల ముచ్చట్లు’(1997), ‘వచన పద్యం: లక్షణ చర్చ’(1978)  గ్రంథాలు వచనకవిత్వానికి ఉన్న విశిష్టతను బయటపెట్టేదిశగా కొనసాగాయి. వాదోపవాద విమర్శ కూడా వ్యక్తిగత నిందారోపణలకు అవకాశం లేకుండా విషయంపైనే కేంద్రీకరించేటట్లు నేర్పుతాయి. తెలుగు వాక్యం సరళంగా, సుందరంగా, అర్థవంతంగా చేరా చేతిలో అమిరిపోయింది. అయితే ఎందుకో ఆయన కొన్ని పుస్తకాలకు పాఠకులందరికీ వెంటనే అర్థమైయ్యేరీతిలో లేని శీర్షికల్ని కూడా పెట్టారు. ‘సాహిత్య వ్యాస రింఛోళి’(2001). ‘రింఛోళి’ అంటే ‘గుంపు’ అని అర్థం.  అలాగే మరో వ్యాస సంపుటి ‘సాహిత్యకిర్మీరం’ (2002). కిర్మీరం అంటే ‘వర్ణాల కలయిక’ అని అర్థం.  చేరాతలులో రాసిన కొన్ని వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు.  కేవలం ఒక భావజాలానికో, ఒక వర్గానికో చెందిన వ్యాసాలను కాకుండా వివిధ రకాల వ్యాసాలను వివిధ అనుభూతులను సమ్మేళనం చేసి అందిస్తున్నట్లుగా ఈ శీర్షికలు పాఠకులకు స్ఫురిస్తుంటాయి. ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం(1998)లో వాడుకలో ఉన్న కొత్త కొత్త పదాలను చేర్చారు.
రెండు పదుల పైన (1982), చేరాతలు సాహిత్య విమర్శ – పరామర్శ (1991), చేరా పీఠికలు (1994), స్మృతికిణాంకం (2000), కవిత్వానుభవం (2001), వచన రచన తత్త్వాన్వేషణ (2002) గ్రంథాల్లో చేరా సాహిత్య విమర్శ స్వరూపం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనలోని సహృదయుడు కనిపిస్తాడు. ఆయనలో భాషాశాస్త్రపండితుడు ఉన్నా, ప్రధానంగా సాహిత్య విశ్లేషకుడుగానే కనిపిస్తారు. కవిత్వాన్ని చదువుకోవడమెలాగో బోధిస్తున్న మాష్టారులా వినిపిస్తుంటారు.
చేరా భాషాశాస్త్రంలో లోతైన పరిశోధన చేసినా పండితవర్గంలో ఆ పరిశోధనలకు గుర్తింపు వచ్చినా, సామాన్య పాఠకుడు కూడా గుర్తించేలా చేసింది మాత్రం ‘చేరాతలు’ అని చెప్పుకోవచ్చు.  1986 అక్టోబరు లో చేరాతలు ప్రారంభించి మధ్యలో కొన్నాళ్ళు(1988 ఫిబ్రవరి – 1988 సెప్టెంబరు) మానేసినా తర్వాత 1988  అక్టోబరు వరకు రాశారు. వీటిలో కొన్ని వ్యాసాల్ని దేవిప్రియ సంపాదకత్వంలో ప్రచురించారు. చేరాతలకు ఒక ప్రణాళికను వేసుకోకపోవడం వల్ల వ్యక్తీకరణకిచ్చిన ప్రాధాన్యం, సిద్ధాంతాలకివ్వలేకపోయానని ఆయనే చెప్పుకున్నారు. అందువల్ల చేరాతల్లో సమకాలీన ధోరణులన్నీ వచ్చాయని చెప్పుకోలేం.  
గురజాడ అప్పారావు గారి ‘పూర్ణమ్మ’ కవితాఖండికలను పురిపండా అప్పలస్వామిగారి ‘మల్లెమడుగు’; నాయని కృష్ణకుమారిగారి ‘ఊడలమర్రి’లతో పోల్చి చూపిస్తూనే వీటిని అనుసరణ, అనుకరణలగా కాకుండా ఒక సెట్ గా చదవ్వలసిన కథాకావ్యాలని వ్యాఖ్యానిస్తారు. విమర్శకుడు నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు పాటించాల్సిన సంయమనాన్ని గుర్తించేలా ఉందీ వ్యాఖ్య. త్రిపురనేని రామస్వామి చౌదరి మన సమాజానికిచ్చిన సందేశాన్ని వివరిస్తూ పురాణకథలను గుడ్డిగా నమ్మవద్దనీ, పురాణపురుషులను దేవుళ్లను చెయ్యొద్దనీ, ఏ విషయాన్నైనా హేతువాదదృష్టితో పరిశీలించడాన్ని నేర్పాడని సారాంశాన్నంతటినీ ఒక్కవాక్యంలో చెప్పేస్తారు.
విశ్వనాథసత్యనారాయణగారు రాసిన ‘అంధభిక్షువు’ గురించి ఒక కథలా స్వీయానుభూతిని వివరిస్తూ విమర్శను రాయడం వల్ల కవిత్వాన్ని కూడా ‘కథ’లా చదువుకునేలా చేశారు. ఈ సందర్భంలోనే ప్రాచీన, ఆధునిక కవిత్వానికి మధ్య గల భేదాల్ని వివరిస్తూ ప్రాచీనసాహిత్యంలో వస్తువుని అలంకారాల్లో వర్ణిస్తే, ఆధునిక కవిత్వంలో భావస్ఫూర్తినిచ్చే భావచిత్రాల్లో వర్ణిస్తారని కవిత్వరహస్యాల్ని వెల్లడించారు. (పుట:16) అంథభిక్షువు గొప్పఖండిక.  అంధభిక్షువు గురించి విశ్వనాథ ‘‘అతడు పూర్వజన్మమందు ఏ నూతిలోననో చచ్చిపోవు చెంత విలపించి వినువారలేని లేక, ఆ పిలుపు ప్రాణ కంఠ మధ్యములయందు సన్నవడి, సన్నవడి నేటి జన్మనతని కనుచు వెదకుచు వచ్చి చేరినది’’ అని వర్ణించారు. దీనిలో పూర్వజన్మగురించి చేరా తర్వాత రాసిన చేరాతల్లో  పూర్వజన్మప్రసక్తి ఆధ్యాత్మికత కోసం కాకుండా కవిత్వం కోసం తెచ్చారన్నారు. ‘‘భిక్షుకుని స్వరహైన్యాన్ని, కనుగూళ్ళ శూన్యాన్ని మన మనసులో ముద్రించటం కోసం కవికి పూర్వ జన్మపనికి వచ్చింది. ఆ స్వరం వింటున్నప్పుడు, కనుబొత్తలు చూస్తున్నప్పుడు అతని పూర్వజన్మవృత్తాంత భ్రాంతి కలిగి అతన్ని బావిలోంచి తీద్దామా అన్న త్వరపుడుతుంది కవికి’’ (పుట:28) అని కవిత్వానుభవాన్ని వివరించారు. సహృదయ విమర్శకుడు తన రచన ద్వారా మూలరచనను చదివేలా చేయగలగాలని అంటుంటారు. ఆ పనిని చేరా ఎంతోసమర్థవంతంగా చేయగలిగారు. చేరాతలు ఆధునిక తెలుగుకవిత్వాన్ని స్త్రీవాద కవిత్వం వరకూ ఎలా అవగాహన చేసుకోవాలో తెలియడానికి ఎంతగానో సహకరిస్తాయి. చేరాతలు తర్వాత అంతశక్తివంతంగా మరలా కవిత్వం గురించి రాసి మెప్పించిన వారు జి.లక్ష్మీనరసయ్య. చేరాతలు స్త్రీవాదకవిత్వం వరకు రాస్తే, దాని తర్వాత కవిత్వాన్ని జి.లక్ష్మీనరసయ్య కొనసాగించినట్లనిపిస్తుంది.
చేరా శైలి రెండు రకాలుగా కనిపిస్తుంది. భాషాశాస్త్ర వ్యాసాలు పూర్తిగా లిఖితసంప్రదాయంలోను, సాహిత్య విమర్శ వ్యాసాలు కొంతమౌఖికసంప్రదాయంలోను ఉన్నట్లుంటాయి. సాహిత్య విమర్శశైలిని గమనిస్తే, దాన్ని చెప్తుంటే ఎవరో రాయసగాడు రాసినట్లుండే మౌఖిక సంప్రదాయంలో ఉన్నట్లనిపిస్తుంది.  కొన్ని విమర్శ వ్యాసాల్ని చదువుతుంటే అనుభూతివాదిగా కూడా కనిపిస్తుంటారు.  అందువల్ల ఈయన శైలిని ప్రత్యేకంగా గమనించాలి. చేరా చిన్నవ్యాసం రాసినా దానిలో కూడా ఏదొక ప్రతిపాదనగానీ, సమన్వయం గానీ లేకుండా ఏ వ్యాసాన్నీ రాయరనీ నాకు అనిపిస్తుంది.
 చేకూరి రామారావుగారి భాష, సాహిత్యం, అధ్యాపకత్వం, బోధన తదితరాంశాలతోపాటు ఆయన వ్యక్తిత్వం గురించి బహుముఖంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. అన్నింటినీ ఇప్పుడే స్మరించుకోలేం. ఆ యా రంగాల్లో నిష్ణాతులు, ఆయనతో అత్యంత అనుబంధం గల వాళ్ళు వాటన్నింటినీ పంచుకుంటారు. చేరా గార్ని రకరకాలుగా చూసే అవకాశం ఉన్నా, నాకు ఆయనొక ఆధునిక సాహిత్య విమర్శకుడుగానే కనిపిస్తారు. రాబోయే యువవిమర్శకులకు మార్గదర్శిగానే అనిపిస్తారు. ఇది ఆయనకు విమర్శలోకమంతా నివాళి అర్పించాల్సిన సమయం. దీనిలో భాగమే ఈ చిన్ని వ్యాసం.

No comments: