సెమిస్టర్ సెమిస్టర్ కీ
మా యూనివర్శిటీ చెట్లు స్ఫందిస్తుంటాయి
కోర్స్ లో చేరేటపుడు పచ్చదనంతో
రోడ్లకిరుపక్కలా నిలబడి పూలు జల్లుతుంటాయో
కొత్త ఆలోచనల సుగంధాల్నివ్యాపిస్తుంటాయో
మళ్ళీ
ఎప్పుడు యూనివర్శిటీకి వచ్చినా అదొక నిత్య వసంతమే....
గోప్స్ చింత
ఒడి లో
బజ్జీలు
చాయలతో కలిసి పంచుకొనే ఊసుల్తోను
లేక్వ్యూలో
నెమలినృత్యాలపులకరింతల మై మరపుల్తోను
ఓపెన్ ఆడిటోరియం
డి. జె. నైట్స్ జిలుగుల్లోను
ఆకాశం నుండి
ఒలికి పడుతున్న
ఆ శీతాకాల పవన
స్ఫర్శను శాలువాల్లో బంధించిన
ఆక్షణాలన్నీ స్మృతిపథంలో
మెదిలినప్పుడల్లా
ఎవరూలేరనుకుంటున్నప్పుడు
నేనూ ఆ
యూనివర్సిటీ చెందినవాడ్నే అని గుర్తొచ్చినప్పుడల్లా
తేనెల ఊటల మాటలతో
తన్మయత్వం పొందినప్పుడల్లా
మళ్ళీఒక్కసారిగా
ఉరికిపడే వసంతం...
నోరూరిస్తూ వార్డెన్
కి తెలియకుండా వండుకున్న రుచులు
ఒక్కకంచంలోనే
ఒక్కరే ఇద్దరుముగ్గురైన చాణక్యాలు
మనది కాని
మెస్ కార్డుకోసమో,
మనం
వచ్చేసరికే మనకార్డు మిస్సయ్యినందుకో
మెస్
క్లర్కుతో పొట్టేళ్ళైన ప్రదర్శనలు...
బైక్ లో,
కెమెరాలో, వయ్యారాల్తో మెరిసిపోయే మెస్ సెక్రటరీలు
ఫ్యాక్ట్
ఫైండింగ్ కమిటీ ముందు మసిబారిపోవడాలు
నాన్ వెజ్ ని
అంటుకోరు, ముట్టుకోరనుకొనే వాళ్ళే ముందునిలబడ్డాలు
తాను
తినకపోయినా లేడీస్ హాస్టల్ కి బాక్స్ పట్టుకెళ్ళడాలు
ఒకరికోసం
మరొకరైన పంచుకునే ఆరోగ్యబంధాలు
తీపిపులుపల
సంగమమైయ్యే క్యాంపస్ మామిడి, ఉసిరి కాయలు,
మది గదినంతా
గుభాళించే పనస తొనలు
రాత్రేమి
జరిగిందో తెలియకపోయినా
పొద్దున్నే
పోస్టరై పలకరించే భావచిత్రాలు...
ముఖకవళికల్లో
డౌన్ లోడై మళ్ళీ ఓసారి చదివించేస్తుంటాయి...
విద్యార్ధులకోసం,
విద్యార్థులే ఎన్నికలసిబ్బంధైన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు
ప్రజాస్వామ్యాన్ని
మళ్లీ ఓ సారి ప్రత్యక్షీకరిస్తుంటాయి...
ప్రాచీనమానవుల
చరిత్ర యూనివర్శిటీలో బయటపడిందని
టి.వి.లు, పత్రికలు
దృశ్యాలై కనిపిస్తున్నప్పుడల్లా
బయటపడని
పురాతన వస్తువుల్లా
పూర్తైనాసబ్మిట్
చేయని సిద్ధాంతగ్రంథాలెన్నో
ఉద్యోగం దొరక్క
నిరుద్యోగిననిపించుకోలేక
గైడ్స్ కెన్ని
కథలు ఎట్రాక్టివ్ గా చెప్పాలో
ఎన్.ఆర్.ఎస్.
హాస్టల్లో చేసే రిహార్సిల్స్ లో ఎంతటి
సజనాత్మకతో...
.
గ్రంథాలయాల్నంతా
తానే చదివేయాలనే తపన
రాక్స్ లో
పుస్తకాలెన్నోతారుమారు చేసిన ఆ రోజులు
రాత్రీపగలూ
తేడా తెలియకుండా ఇంటర్నెట్ ముందు కూర్చున్న క్షణాలు
అడ్రస్ అడిగితే
మెయిల్ ఐడి రాసుకో....
యూనివర్సిటీ
బయటకొచ్చిన తర్వాత
ఎండమావులుగా
మారడాన్ని గుర్తించినప్పుడొచ్చో నవ్వులు...
మళ్ళీ
చిరునామాలు అక్షరాలుగా మారడం...
అయినా...నువ్వూ
నేనూ కలిస్తే
అది ఎక్కడైనా
మన యూనివర్శిటీ వసంతాన్నే పంచి పెడుతుంది కదూ…
వసంతం
ఏడాదికోసారి మాత్రమే రావొచ్చు
యూనివర్సిటీ
నా కెప్పుడు కావాలంటే అప్పుడు అందిస్తోందీ వసంతాన్ని.
(హైదరాబాద్
సెంట్రల్ యూనివర్సిటీలో పి.జి. నుండి డాక్టరేట్ వరకు చదువు పూర్తి చేసి బయటకెళ్ళేటప్పుడు
Farewell Function (2001) కోసం
రాసుకున్న కవిత.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి