మరో ఆలోచన
ఇది 22 వ్యాసాల సంకలనం. దార్ల వివిధ పత్రికలకు రాసిన విమర్శ వ్యాసాలు, విశ్వ విద్యాలయాల్లో ఆయన సమర్పించిన పరిశోధన పత్రాలు ఇందులో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయ్య, వీరబ్రహ్మేందస్వామి ఆలోచనల పునర్మూల్యాంకనం కూడా ఉంది. బహుజన దృక్పథంతో వచ్చిన ఎన్నదగిన పుస్తకాలలో ఇది ఒకటి.
బహుజన సాహిత్య దృక్పథం
డా.దార్ల వెంకటేశ్వరరావు
పేజీలు : 176, వెల : రూ 100
ప్రతులకు : అన్ని పుస్తకాల షాపులు
నమస్తేతెలంగాణ ‘బతుకమ్మ’ ఆదివారం అనుబంధం
పుట: 27 ( 7-4-2013)
బహుజన
సాహిత్యం-శాస్త్రీయ దృక్పథం
వర్తమాన సాహిత్య విమర్శకుల్లో ఒకరైన దార్ల వేంక నిరంతర అధ్యయనశీలి. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగంలో అధ్యాపకులు. రచయితగా, విమర్శకులుగా ఆయన సమాజంలోని అసమానతలపై పదునైన తన రచనలతో పీడిత జాతిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. సాహిత్య విమర్శకులు తాము ప్రతిపాదించే అంశాలలోని సాహిత్య, శాస్త్ర, సామాజిక నేపథ్యం తెలుసుకోగలిగితే, బలమైన ప్రతిపాదనలు చేయగలరని అంటారు. అందుకు దార్ల ప్రత్యేక సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అతను అట్టడగు వర్గం నుంచి ఎదిగి వచ్చిన విద్యా కుసుమం. అందుకే, అతని విమర్శల్లో పదునుంటుంది. ఇప్పటికే అతను ‘సృజనాత్మక రచనలు చేయడం ఎలా?’ సాహితీ సులోచనం, ‘వీచిక,’ ‘పునర్మూల్యాంకనం’ వంటి విమర్శనాత్మక గ్రంథాలు ప్రచురించారు. తాజాగా ప్రపంచీకరణ తర్వాత వచ్చిన మానవ సంబంధాల్లోని మార్పులు, ముఖ్యంగా బహుజనుల్లో పెంపొందుతున్న సాహితీ వికాసాన్ని ఆయన ఈ పుస్తకంలో చక్కగా ఆవిష్కరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, సమకాలీన తెలుగు సాహిత్యంలో వస్తున్న ధోరణులను అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం చక్కగా దోహదపడుతుందనడంలో సందేహం లేదు. వివరంగా చెబితే, ఈ వ్యాసాలన్నీ కులం, మతం, ప్రాంతీయ సమస్యల్ని దళిత, స్త్రీవాద, మైనారిటీ, బహుజన వాదుల కోణం నుండి ఎలా అర్థం చేసుకుంటున్నారనే విషయాల్ని విశ్లేషించేవిగానే ఉన్నాయి. నిజానికి ఇవన్నీ వివిధ పత్రికల్లో అచ్చయినవే. ఇప్పుడు వాటన్నిటినీ క్రోడీకరించి ‘బహుజన సాహిత్య దృక్పథం’ పేరుతో వెలువరించారు. ఇందులోని వ్యాసాలు చదివితే వారి పరిశోధనా పటిమ, అధ్యయన విస్తృతి పాఠకులకు తెలుస్తుంది. అంతేకాదు, ఈ పుస్తకం ప్రజల్లో సహేతుకమైన ఆలోచనల్ని రేకెత్తించి తమ అస్తిత్వపు చైతన్యాన్ని మేల్కొలుపుతుందనడంలో సందేహం లేదు. ....అశోక్
వెల: 100, ప్రతులకు: యం. మంజుశ్రీ, చిరునామా: బి.202, సాయి
క్లస్టర్ ఆపార్ట్ మెంట్, శివాజీనగర్ కాలనీ, పెట్రోల్ బంక్ పక్కన, శేరిలింగంపల్లి, హైద్రాబాద్,
http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=9&ContentId=224713
‘‘బహుజన సాహిత్యం దృక్పథం’’
పరిశోధన పత్రాల సంపుటిలో గల ముఖ్యాంశాలు
తెలుగుసాహిత్యంలో వస్తున్న భాషా, సాహిత్య,
సంస్కృతుల్లో వస్తున్న పరిణామాలను, ముఖ్యంగా
1990 తర్వాత నుండి నేటి వరకు వస్తున్న భాషా, సాహిత్యధోరణులను
విశ్లేషిస్తూ, వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయసదస్సుల్లో
సమర్పించిన పరిశోధన పత్రాల సంపుటి ఇది. దీనిలో బహుజనసాహిత్యదృక్పథం, దళిత-బహుజన కళాతత్త్వశాస్ర్తం, కుల అస్తిత్వ
ఉద్యమసాహిత్యం పై కొన్ని కొత్త భావనలను, వాటి సమన్వయాన్ని
వివరించే 22 వ్యాసాలున్నాయి. 176 పుటల్లో, 1/8 డెమ్మీ సైజులో ముద్రించిన పుస్తకం. ఈ పుస్తక రచయిత డా. దార్ల
వెంకటేశ్వరరావు. ప్రస్తుతం తెలుగుశాఖ, హైదరాబాదు
విశ్వవిద్యాలయంలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు.
పురాణాల్లో జాంబవపురాణాన్ని ఎలా అధ్యయనం చేయాలనే పద్ధతిని అష్టాదశపురాణాలతో
తులనాత్మకంగా పరిశీలించి ఒక పరిశోధన పత్రం ఉంది. అలాగే నన్నయను ఆదికవి అనడంలో గల
సామంజస్యాలను, నేటికీ దానిపై వస్తున్న
వాదోపవాదాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించిన మరో వ్యాసం దీనిలో ఉంది. తాళ్ళపాక
అన్నమాచార్యుల సాహిత్యంలో కేవలం భక్తి మాత్రమే కాదనీ, సామాజిక
అంశాలకు ప్రతిస్పందించిన తీరుతెన్నుల్ని, నాటి సమకాలీన
పరిస్థితులతో అంచెనా వేసిన వ్యాసం, అలాగే, శ్రీకృష్ణదేవరాయల భక్తితత్త్వాన్ని విశ్లేషిస్తూ కులం, వర్ణం భక్తికి ఆటంకం కాదని మాలదాసరికథ ద్వారా చెప్పాలనుకున్నారని
నిరూపించిన పరిశోధన పత్రం ఒకటుంది. అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
తత్త్వాలపై రాసిన వ్యాసంలో ఆయనది అచలమతమనీ, దానిలో కులమతాలకు
చోటులేదని బోధిస్తుందనీ, అందువల్ల శూద్రకులానికి
చెందినవ్యక్తి కావడం వల్ల దాన్ని ఆచరించాడనీ సమన్వయించడం ప్రధానం.
దీనిలో
శ్రీశ్రీ పై ఇంతవరకు చర్చకు రాని అంశాలున్న ఒకపరిశోధన పత్రం ఉంది. ఆయన వర్గ
దృక్పథంలో కూరుకుపోవడానికి తనను ఆదరించిన సంస్థల ప్రభావమే ప్రధానకారణమనీ, దానివల్లనే వంశపారంపర్యంగా, కులాన్ని
ఆశ్రయించుకొని కొనసాగుతున్న వృత్తులను వర్గంగానే పరిగణించాడనీ, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంతో కూడా ముడిపడి ఉన్నాయని ఆధారసహితంగా నిరూపించిన
వ్యాసం ఉంది.ఇంకాదీనిలోడా.బోయజంగయ్యసాహిత్యం, డయాస్పోరాసాహిత్యం,
మాండలిక రచనల్లో వస్తువు, భాష, సాహిత్య స్థితిగతుల్ని, పరిశోధనలు జరిగేటప్పుడు
పర్యవేక్షకుని ఎలా ఉండాలి, ప్రపంచసాహిత్యభావన తెలుగు భాషా,
సాహిత్యాలకు ఎంతవరకు సమన్వయిస్తుందనే విషయాలు, జానపదసాహిత్యంలో ఉండే మౌలికాంశాల పట్ల జరగాల్సిన చర్చనీయాంశాలు, సాహిత్యవిలువల్ని నిర్ణయించడంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగా
చూపే ప్రభావితాంశాలేమిటి? ఎం. ఎఫ్.హుస్సేన్ చిత్రకళను ఎలా
అర్ధం చేసుకోవాలి? వర్గం వల్ల గిరిజనులు పడుతున్న బాధల్ని
వర్ణిస్తూనే, వారి సంస్కృతిలోని వివిధ పార్శ్వాలను వర్ణించిన
ఎన్నెల నవ్వు’’ నవలను ఆధారంగా జరిగిన విశ్లేషణ కొత్తకోణాలను
అందించేలా ఉంది.
ఇంతవరకు వచ్చిన సాహిత్యాన్ని
విమర్శనాత్మకంగా పరిశీలించేటప్పుడు చేసే పునర్మూల్యాంకనం ఎలా ఉండాలి? అలాగే, విమర్శరంగంలో ఆధునిక
భాషావికాసం ఎలా జరుగుతందనే విషయాలను శాస్ర్తీయంగా విశ్లేషించే 22 పరిశోధనపత్రాల సంపుటి ఇది. దీనికి ముందుమాట
రాస్తూ ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ఈ పరిశోధన పత్రాల గురించి ‘‘ దార్ల విమర్శలో స్పష్టత కనిపిస్తుంది.వర్తమాన సమాజంలో అనేకభావధారలు
ఉన్నాయని తెలుసు. అందులో తన భావజాలం మీద ఆయనకు సంపూర్ణవిశ్వాసం ఉంది. అందుకే ఆయన
విమర్శ సైద్ధాంతికంగా ఉంటుంది.’’ అని దీనికి రాసిన ముందుమాట
(విస్తరిస్తున్న విమర్శకుడు దార్ల, పుటలు: 9-11) అని
వ్యాఖ్యానించారు. ఈ విధంగా చూసినప్పుడు తెలుగు సాహిత్య విమర్శల్లో బహుజనసాహిత్య
దృక్పథం గురించి ఒక చక్కని అవగాహననీ, అన్వయాన్నీ కలిగించే
గ్రంథంగాను; సమకాలీన సమాజాన్నీ, సాహిత్యాన్ని
చూపిస్తూనే ఒకచక్కని మార్గనిర్దేశం చేసే పుస్తకంగా ఉపకరిస్తుంది.
( ఈ పుస్తకాన్ని త్వరలోనే http:// kinege.org ద్వారా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రింట్ కాపీ లభిస్తోంది. పుస్తకం
కావలసినవారు : Dr.Darla VenkateswaraRao, B-202, Saicluster Apartment,
Sivajinagar Colony, SeriLingampally, Hyderabad-500018 కి 100
రూపాయలు మనీ ఆర్డర్ పంపి, రప్పించుకోవచ్చు.
పోస్టల్ చార్జెస్ అదనం)
1 కామెంట్:
Happy to know about your new book Sir. My hearty congratulations.
కామెంట్‌ను పోస్ట్ చేయండి