సాహిత్యంలో కొన్ని
మాటల్ని ప్రయోగిస్తుంటాం. వాటిని ప్రతిసారీ వివరించకుండా ఆయా వ్యాసాల్లో
ఉపయోగిస్తుంటాం. నా బ్లాగులో ‘‘సామాజిక
దృష్టి , సైద్ధాంతిక
దృష్టి, చారిత్రకదృష్టి, కళా సౌందర్య దృష్టి ‘‘ వంటి
మాటల్ని గుర్తించిన ఒక అభిమాన పాఠకుడు వాటిని కొంచెం వివరించమని రాసారు. అందువల్ల వాటిని నేను ఏ అర్థంలో ఉపయోగించానో
కింద వివరిస్తున్నాను.
దృష్టి : ‘‘దృష్టి’’ అంటే చూపు, కన్ను,
బుద్ధి వంటి అర్థాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ‘‘చూడడం’’ అని సాధారణార్థంలోఉపయోగిస్తుంటాం.
దీన్ని సాహిత్యంలో పరిశీలించడం, అధ్యయనం చేయడం, పద్ధతి అనే విస్తృతార్థంలో ప్రయోగించడం
సహజం. దీని నుండి వచ్చిందే ‘‘దృక్కోణం’’ వంటి పారిభాషిక పదం కూడా. ‘‘దృక్కు’’ అంటే స్త్రీ, కన్ను, చూపు, బుద్ధి, చూడడం వంటి అర్ధాలు
ఉన్నాయి.
సామాజిక దృష్టి : సమాజంలో ఉండే భిన్న వైరుధ్యాల్ని జాతి, వర్ణం,
వర్గం, జెండర్ వంటివాటిని ఆధారంగా చేసుకొని విశ్లేషించడం. భారతదేశాన్ని ఆధారంగా
తీసుకొంటే చాతుర్వర్ణ వ్యవస్థను ఈ పద్ధతిలో తీసుకుంటుంటారు. వీటి వల్ల కూడా
అణచివేత, హింస జరుగుతుంటుంది. అటువంటప్పుడు ఆ యా సమాజాలలో అమలులో ఉన్న ఆచార సంప్రదాయలు, ఒప్పందాలు, చట్టాలు, వీటితో పాటు ఇవేమీ పైకి
కనిపించకుండా కొనసాగే లేదా జరిగే
ఆధిపత్యాన్ని గుర్తించి, అణచివేతకు గురైయ్యేవారి వైపు సానుభూతి చూపాలనేది ఈ
పద్ధతిలో ప్రధానం. సమాజంలో అనేక పొరలు ఉన్నాయని గుర్తిండమే దీనిలో ముఖ్యం.
సాహిత్యంలో దీన్ని వస్తుగత పరిశీలనగా భావిస్తుంటారు. ఎలా రాసారనే దానికంటే, రాసిన
విషయమేమిటనేది ముఖ్యమనేది గమనించాలని భావించడం ప్రధానమంటారు. రచయిత లేదా
కళాకారుడికి ఈ దృష్టి’’
చాలా అవసరం. అలాగని రచయితలు లేదా
కళాకారులకు అందరికీ దృష్టి’’ ఉంటుందని చెప్పలేం.
దీన్ని మార్క్సిస్టులు బాగా ప్రచారంలోకి తెచ్చారు.
సైద్ధాంతిక దృష్టి,: ‘సిద్ధాంతం’ అనే మాటను ఆంగ్లంలో theory అనే మాటకి సమానార్థంగా ప్రయోగిస్తున్నారు. ఏదైనా
ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది లోతైన చర్చోపచర్చలకు అవకాశమిస్తూనే, వాటన్నింటికీ
సమాధాన్ని వివరించగలిగే అర్థంలో ఉంటుంది. కొంత కాలానికే గానీ, లేదా కాలాలకు
అతీతంగా గానీ నిలవగలిగే సత్యాన్నినిరూపించగలిగేదిగా ఉంటుంది. వీటిని సూత్రాలుగా
సోదాహరణపూర్వకంగా వివరిస్తుంది. సిద్ధాంతంలో ఊహలు, తార్కికత, నిరూపణ సోపానాలు
వంటివి ఉంటాయి. మాట్లాడేది లేదా రాసేది ఏదైనా బలమైన వాదనా పటిమతో నిరూపించగలిగే
దాన్ని సాధారణార్థంలో సైద్ధాంతికంగా వివరించడమని అంటుంటారు. దీన్ని ఆంగ్లంలో theoretical view అంటారు.
ప్రపంచ చరిత్ర అంతా వర్గపోరాటాలమయమేనని శ్రీశ్రీ కవిత్వం రాయడం వెనుక కారల్
మార్క్స్ ప్రతిపాదించి నిరూపించిన గతితార్కిక, చారిత్రక భౌతికవాదం’ ఉంది. ఉదాహరణకు ఈ సిద్ధాంతలోతులతో శ్రీశ్రీ సాహిత్యాన్ని
పరిశీలించడాన్ని సైద్ధాంతిక దృష్టి ఉందంటారు.
అలా కాకుండా ఈ సిద్ధాంత అవగాహన లేకుండా తన స్వీయాభిప్రాయాలతో మాత్రమే నిర్ణయాలు
చేస్తే, దానికి తగినంత విలువ ఉండదు. అలా కాకుండా, శ్రీశ్రీని కూడా యాంటీథీసిస్ ని
ఆధారంగా చేసుకొని కూడా విశ్లేషించవచ్చు. అందులో కూడా ఒక సిద్ధాంత అవగాహన
కనిపిస్తుంటుంది. ఒక కవిని లేదా రచయితని ఆ సాహిత్యం, అతని వ్యక్తిత్వాన్ని, అది
వెలువడిన పరిస్థితులను గుర్తిస్తూ రకరకాలైన పద్ధతుల్లో పరిశీలించడం అవసరం. ఇలా
అధ్యయనం చేయడంలో వచ్చినదే సైద్ధాంతిక దృష్టి అనేది కూడా. సాహిత్యంలో ఈ రకమైన పరిశీలనకు ఎంతో విలువ ఉంది.
చారిత్రక దృష్టి: దీన్ని ఇక్కడ సాహిత్యం వరకే పరిమితం చేసి వివరిస్తున్నాను. ఒకరచన
వెలువడడానికి దారితీసిన పరిస్థితులకు అనుగుణంగా ఆ రచనను లేదా ఆ రచన రాసిన కవి లేదా
రచయితను విశ్లేషించాలి. ఒక రచనకున్న స్వభావం, రచయితకున్న స్వభావాన్ని ఈ పద్ధతి
ద్వారా అవగాహన చేసుకోవచ్చు. సాధారణార్థంలో చెప్పాలంటే ఒక రచన వెలువడినప్పుడు ఆ
రచనా కాలాన్ని, రచనలో వెలువడిన వస్తువు కాలాన్నీ పరిశీలించడం. ఆ రచన అలా వ్యక్తం
కావడానికి ఆ రచయితపై ఆ కాలంలో చూపిన ప్రభావాలను కూడా పరిశీలించాలి. దీన్ని
పరిశీలించడం వల్ల ఆ రచయిత నిబద్ధత తెలియడంతో పాటు, ఆ సమాజవాస్తవికతను పాఠకులు
అవగాహన చేసుకోగలుగుతారు.
కళా సౌందర్య దృష్టి: కళ అంటే చాలా అర్థాలు ఉన్నప్పటికీ, వ్యక్తి
ప్రదర్శించే నైపుణ్యాన్ని ‘కళ’ అని అంటారని చెప్పుకోవచ్చు. రచయిత ఏదైనా రాయాలనుకున్నప్పుడు
తనకి నచ్చినది రాస్తాడు. నిజంగా అలాగే చేస్తాడా అనే ప్రశ్న వచ్చందంటే మీలో
విమర్శకుడు బయలు దేరినట్లేనన్నమాట. తన రచన తనకోసం రాసుకోవడం లేదా తనని అందరూ లేదా
కొందరైనా మెచ్చుకోవాలని గాని రాస్తుంటాడు. మరికొంతమంది ఎవరో రాయమంటే రాస్తారు. రాసేదేమిటి? రాసేదెవరు? చదివేదెవరు? దాని
ప్రయోజనమెంతవరకూ ఉంటాయి? వంటి విషయాలన్నీ రచనను అంటిపెట్టుకొనే ఉంటాయి. రచన లో
వ్యక్తమైన వస్తువుగానీ, దాన్ని వ్యక్తీకరించిన పద్ధతిగానీ రచయిత ఇష్టాయిష్టాలే
ప్రధానమైతే, వాటిలో సౌందర్యం బాగా అభివ్యక్తమవుతుంది. తనలో ఉన్న ఆనందమే బయట
వస్తువులో కనిపించడం సౌందర్యమని కొంతమంది సౌందర్యాన్ని నిర్వచించారు. తనకు కావలసినట్లు
సాహిత్యాన్ని లేదా కళల్ని సృజనీకరించడాన్ని
సౌందర్య దృష్టి అంటారు. సాహిత్యానికి గానీ, కళలకు గానీ ఉన్న పరమ ప్రయోజనం
ఆనందాన్ని కలిగించడమేనని ఈ వాదాన్ని నమ్మేవాళ్ళు వాదిస్తుంటారు. సమాజాన్ని వదిలేసి
తమకిష్టం వచ్చినదాన్ని రాసి ఆనందం పేరుతో చెలామణీ చేయడం సమాజానికి హానిచేయడమని
సాహిత్య ప్రయోజనవాదులు అభిప్రాయం. ఈ రెండింటినీ విశ్లేషించేదే కళా సౌందర్య
దృష్టి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి