ఆత్మకథా ప్రక్రియ మరాఠీ సాహిత్యంలోనే కాదు, భారతీయ
సాహిత్యంలోనే ప్రత్యేకతని సాధించింది. తెలుగులో నవలా ప్రక్రియ
వచ్చినంత బలంగా ఆత్మకథలు రాలేదు. వచ్చినవి కూడా
సంపూర్ణంగా లేవు. ఆత్మకథా ప్రక్రియ ఇంకా బలంగా తెలుగులో రావలసిన అవసరం ఉంది. దళిత పాంథర్స్, మరాఠీ దళిత ఆత్మకథలప్రేరణలతో తెలుగు దళిత సాహిత్యం కవిత్వాన్ని, కథల్ని
దాటి విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాహిత్యంలోనే ప్రత్యేకతని సాధించింది. తెలుగులో నవలా ప్రక్రియ
వచ్చినంత బలంగా ఆత్మకథలు రాలేదు. వచ్చినవి కూడా
సంపూర్ణంగా లేవు. ఆత్మకథా ప్రక్రియ ఇంకా బలంగా తెలుగులో రావలసిన అవసరం ఉంది. దళిత పాంథర్స్, మరాఠీ దళిత ఆత్మకథలప్రేరణలతో తెలుగు దళిత సాహిత్యం కవిత్వాన్ని, కథల్ని
దాటి విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరాఠీ దళిత సాహిత్యంలో ఆత్మకథా ప్రక్రియ చాలా బలమైంది. ఈ ప్రక్రియ కేవలం దళిత సాహిత్యానికే కాదు, మరాఠీ సాహిత్యానికీ, భారతీయ సాహిత్యానికీ మకుటాయమానంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.మరాఠీ దళిత సాహిత్యంలో ఆత్మకథా ప్రక్రియ ‘గంగాధర్ పానతావణే’ సంపాదకత్వంలో వెలువడిన ‘అస్మితాదర్శ్’ 1976 దీపావళి ప్రత్యేక సంచిక నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. అందులో ప్రముఖ దళిత రచయితలు ‘నేను నాజీవితం’ అనే శీర్షికతో ఆత్మకథల్ని సంక్షిప్తంగా వెలువరించారు. హిందీలోకూడా దళిత ఆత్మకథలు ఆవిధంగానే తర్వాత వెలువడ్డాయి.
డా అంబేడ్కర్ ప్రత్యేకంగా తన ఆత్మకథ రాయలేదు. కానీ ‘మేరా జీవన్’ అనే పేరుతో ఆయన 6 నవంబరు 1954 న జనతా పత్రికలో తన జీవన ప్రస్థానాన్ని పరిచయం చేశాడు. అంబేడ్కర్ ఆ కథనంలో తన జ్ఞాప కాల్ని పొందుపరచారు. ఇంకో 10 సంవత్సరాలు తాను బతుకుతాననే నమ్మకం ఆయనకుండేది. కానీ అనా రోగ్యంతో ఆయన 2 సంవత్సరాలకే మరణించారు. ‘మేరా బచ్‌పన్’ అనే పేరుతో రాయాలనుకున్న ఆయన కల అలా సగం పూర్తయి మిగిలింది. మరాఠీ దళిత సాహిత్యానికి ఆద్యుడైరన దయాపవార్ 24 సంవత్సరాల తరువాత 1978లో బలూత్ (అచూత్) పేరుతో ఆత్మకథ ప్రచురించి బాబాసాహెబ్ కన్న కలని నెరవేర్చాడు.ఆ తర్వాత దళిత ఆత్మకథలు చాలా వెలువడ్డాయి. మరాఠీ దళిత ఆత్మకథల తర్వాత దేశంలోని అన్ని భాషల్లోనూ ఆత్మకథలు వెలువడసాగాయి.
నేడు దళిత సాహిత్యంలో ఆత్మకథ ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా వెలుగొందుతోంది. అంబేడ్కరిజపు ఆలోచనా విధానమే పునాదిగా దళిత సాహిత్యం భారతీయ భాషలన్నింటిలోకి విస్తరించి ప్రత్యేక స్థానాన్ని పొందింది. దళిత సాహిత్యం, అందులోని ఆత్మకథా ప్రక్రియ ఎవరికీ వ్యతిరేకమైంది కాదు.
దళిత ఆత్మకథలు- దళితేతరుల ఆత్మకథలకు, జీవన వృత్తాంతాలకు భిన్నమైనవి. దళితుల్ని బానిసలుగా చేసి వారిచేత వెట్టిచాకిరీ చేయించుకోవడానికి వారి మనసుల్లో కర్మ సిద్ధాంతపు గుదిబండలు నాటిన రీతి ప్రపంచ చరిత్ర మొత్తంలో భారతదేశంలో తప్ప మరి ఏ సందర్భంలో కూడా ఇలా కనపడదు.దయాపవార్ రచించిన బలూత్ మరాఠీ దళిత సాహిత్యంలో వెలువడిన మొదటి దళిత ఆత్మకథ. ఇది 1978లో ప్రచురితమైంది.
దీని హిందీ అనువాదాన్ని ‘అచూత్’ పేరుతో 1980లో హిందీలో రాధాకృష్ణ ప్రకాశన్ ప్రచురించింది. ఇది మరాఠీ నుండి హిందీలోకి అనువాదితమైన మొదటి ఆత్మకథ. దీన్ని హిందీ పాఠకులు సహృదయతతో స్వీకరించారు. దయాపవార్ దీన్ని ఆత్మకథగా ప్రస్తావించాడు కానీ నవలగా చెప్పలేదు. దీని ప్రచురణకర్త ‘ఇందులో సమాజపు చిట్టచివరి వరుసలో పశువులకన్నా హీనంగా బతుకుతున్న మహర్ల జీవితం, వారి దుర్దశ చాలా తీవ్రంగా వర్ణితమయింది’ అన్నారు. దీనితో పాఠకుల పరిభాషలు వేదన, పీడన, దోపిడీ, అణచివేతల అర్థాలు మారిపోయాయి. ‘అచూత్’ దళిత రచనల స్వరూపాన్ని మార్చడమేకాదు దళిత రచయితల ఆత్మకథా ప్రక్రియకు పునాదిరాయి వేసింది.
శరణ్‌కుమార్ లింబాలే ‘అక్కర్‌మాసీ’ (అక్రమ సంతానం) పేరుతో తన 35 సంవత్సరాల వయస్సులో మరో దళిత ఆత్మకథతో మనువాద ప్రపంచానికి ఓ సవాలు విసురుతూ ముందు కొచ్చాడు. ఇంత చిన్న వయస్సులో ఆయన ఎదుర్కొన్న ఘటనలు కేవలం ఆయనవి మాత్రమే కావు. కాలుప్టెడానికి, కనీసం చస్తే తల పాతుకోడానికి కూడా కాసింత స్థలం దొరకక, భూమండలమంతటా వెతుక్కొంటున్న లక్షల కోట్ల, అంటరాని ప్రజలవి.లక్ష్మణ్‌మానే అనే మరో రచయిత ‘పరాయా’ అనే ఆత్మకథతో తన ప్రస్థానం సాగించాడు. ఈ ఆత్మకథలో ఈ రచయిత మండించే తన అనుభవాల తీవ్రతని, పోరాటాన్ని, వేల సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన సమాజపు అసలు స్వరూపాన్ని వ్యక్తపరచింది. దీన్ని భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన కథగా అయినా స్వీకరించవచ్చు. లక్ష్మణ్‌గైక్వాడ్ ‘ఉఠారుూగీరే’ అనే ఆత్మకథ రాశారు.
సమాజంలో అట్టడుగు స్థాయికి నెట్టివేసిన వ్యక్తి అనుభవాల్ని ఇందులో వివరించారు. సామాజిక అసమానతపై ప్రయోగించిన వ్యంగ్యాస్త్రాల్ని ఇందులో చూడవచ్చు. నిజానికి దీన్ని ఒక కార్యకర్త విముక్త పోరాటపు ఆలోచనల నుండి ఉద్భవించినదిగా చెప్పవచ్చు. ఒకరకంగా దీన్ని సాహిత్య మూల్యాంకనంగానే కాకుండా సమాజ శాస్ర్తీయ మూల్యాంకనంగా కూడా చెప్పవచ్చు. ఈ పుస్తకంలో రచయిత లక్ష్మణ్ గైక్వాడ్ తన ‘ఉఠారుూగీర్’ రచనకు శరణ్ కుమార్ లింబాలే ‘అక్కర్‌మాసీ’, లక్ష్మణ్ మాన్‌ల ‘పరాయా’లు ప్రేరణ నిచ్చాయని పేర్కొన్నారు.బేబీ కాంబ్లే రచించిన ‘జీవన్ హమారా’ ఆత్మకథలో మహారాష్ట్రలోని దళిత సమాజమే కాదు, అట్టడుగున ఉన్న అన్ని అంటరాని కులాల హాహాకారాలు, వేదనలు, నెత్తురు మండే అనుభవాలు కనిపిస్తాయి. దోపిడీ, పీడన అణచివేతల నిలువెత్తు డాక్యుమెంట్‌గా ఇది నిలుస్తుంది.
నవలలు ఆత్మకథల కంటే భిన్నమైనవి. నవలల్లో కల్పిత పాత్రలు లేక నిజ జీవితాలకి అనుకరణలు ఉంటాయి. కానీ ఆత్మకథల్లో ‘నేను’ అనే సంబోధనతో రచయితలు తమ స్వీయ జీవితాల్ని రచిస్తారు. నవలలకి అనేక శైలులు ఉంటాయి. కానీ ఆత్మకథలకి ఒకే శైలి ఉంటుంది.
మరాఠీ భాషకి చెందిన కౌసల్యా బైసంత్రీ ‘దొహరా అభిశాప్’ పేరుతో హిందీ దళిత స్ర్తీ ఆత్మకథను రచించారు. మరాఠీ భాషకి చెంది, హిందీలో ఆత్మకథ వ్రాసిన మొదటి రచయిత్రిగా కౌసల్యా బైసంత్రీని చెప్పవచ్చు. మరాఠీలో వచ్చినట్టుగా దళిత మహిళల జీవితాలు హిందీలో నమోదు కాలేదు కనుక తాను హిందీలో ఆత్మకథ రాసినట్టుగా ఆమె పేర్కొన్నారు. స్వీయ కథనంలో, ఆత్మకథలో పెద్దగా తేడాలేమీ లేదు. కానీ ఆత్మకథ దళితుల జీవితాల్ని, అనుభవించిన ఎదుర్కొన్న ఘోరమైన పరిస్థితుల్ని అంతే బలంగా చెప్పేదిగా ముందుకు వచ్చింది.
దళిత ఆత్మకథలో రచయిత తనద్వారా తన సమాజం అను భవించిన ఘోరమైన, క్రూరమైన ఘటనల్ని వర్ణిస్తాడు. తద్వారా ఒక వ్యక్తి సమాజంపై సంధించే ప్రశ్నల బాణాలు మొత్తం సమాజపు ప్రశ్నలుగా ముందుకు వస్తాయి.
‘అక్కర్‌మాసీ’ ఆత్మకథలో శరణ్ కుమార్ లింబాలే సవర్ణ సమాజాన్ని అగ్రకుల తండ్రికి, అంటరాని తల్లికి పుట్టిన తాను ఏ సమూహానికి చెందుతాను అంటూ ప్రశ్నిస్తాడు. మరో మరాఠీ ఆత్మకథ ‘ఛోరా కొల్హాటీకా’ రచయిత్రి కిశోర్ శాంతాబాయి కాలే కులవ్యవస్థ అక్రమాలకు గురైన తమ కులంతో సవర్ణ సమాజాన్ని అనేక ప్రశ్నలు వేస్తారు. సమాజంలో అన్ని వర్గాల, కులాల స్ర్తీలు నాట్యం చేస్తుంటారు. కానీ తమ పైన ఎందుకు నాట్యగత్తె అనే ముద్ర వేస్తారు అని శాంతాబాయి ప్రశ్నిస్తుంది. సినిమాల్లో నాట్యం చేసేవారు గౌరవాన్ని, డబ్బుని సంపాదిస్తుంటారు. దాన్ని కళ, ఫ్యాషన్ అంటారు. కానీ తమని తక్కువగా చూస్తూ తమపై వేశ్యలు అనే ముద్ర ఎందుకు వేస్తారో అంటుంది ఆమె.లక్ష్మణ్ గైక్వాడ్ ‘ఉఠారుూ గీర్’ ఆత్మకథలో తన సమాజపు వేదనను అత్యంత దుఃఖంతో వ్యక్తీకరిస్తాడు. ప్రపంచంలో తమ సమాజపు వ్యక్తులపైనే దొంగ, అపరాధి అనే ముద్రలేసి నేరస్థ సమాజంగా పిలుస్తున్నారు అంటాడు. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి దోచుకుంటున్న వారు నేడు నాయకులుగా గౌరవంగా బ్రతుకుతుంటే ఆకలై 15-20 రూపాయలు దొంగతనం చేసిన తమని నేరస్థులని అంటున్నారని వాపోతారు.
మరాఠీ దళిత రచయితలకి, ఆత్మకథలకి ప్రేరణ ఇచ్చిన ఆత్మకథలు అచూత్ (దయాపవార్). యాదోం కే పంఛీ (సోన్ కాంబ్లే), తరాల్ అంతరాల్ (శంకర్ రావ్ ఖరాత్) రచయితలు మహారాష్ట్రలోని మహర్ సమాజపు చిన్న, పెద్ద దుఃఖాల్ని, వేదనల్ని వారి పోరాట దృశ్యాల్ని పాఠకుల కళ్ళముందుకి తెస్తారు. వీటిలో క్రూరమైన మనువాద సంస్కృతి మహర్ల సంపాదనా మార్గాల్ని మూసివేసి కడుపు నింపుకోవడం కోసం చనిపోయిన పశువుల్ని తినేట్లు చేసిన దుర్మార్గమైన పరిస్థితులపై, ఘటనలపై అంబేడ్కర్ చూపుడివేలుని ఎక్కుపెట్టి ప్రశ్నిస్తాయి. అమానవీయమైన నాటి పరిస్థితుల్ని ఇవి నిలువెత్తు సాక్ష్యాలుగా నడిబజాట్లో నిలబెడతాయి. అచూత్ ఆత్మకథలో దయాపవార్ ‘నేను కడుపు నింపుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా క్రూరమైన వర్ణవ్యవస్థ నన్ను పశువుకన్నా హీనంగా బతికేటట్లు శాసించింది’ అంటాడు. మాజ్యా జల్మాచీ చిత్తర్ కథా రచయిత్రి శాంతాబాయి కాంబ్లే (ప్రముఖ మరాఠీ కవి అరుణ్ కాంబ్లే తల్లి) తన కుటుంబపు అవమానాలకి, పీడనకి విసిగిపోయి తండ్రి ఇంటి నుంచి బైటికి వస్తారు.
అంబేడ్కర్ ప్రేరణతో స్వాభిమానంతో, ఆత్మగౌరవంతో మతమార్పిడి చేసుకొ ని ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా రిటైర్ అవుతారు. ఈ విధంగా ఆత్మకథా ప్రక్రియ మరాఠీ సాహిత్యంలోనే కాదు, భారతీయ సాహిత్యంలోనే ప్రత్యేకతని సాధించింది. తెలుగులో నవలా ప్రక్రియ వచ్చినంత బలంగా ఆత్మకథలు రాలేదు. వచ్చినవి కూడా సంపూర్ణంగా లేవు. ఆత్మకథా ప్రక్రియ ఇంకా బలంగా తెలుగులో రావలసిన అవసరం ఉంది. దళిత పాంథర్స్, మరాఠీ దళిత ఆత్మకథల ప్రేరణలతో తెలుగు దళిత సాహిత్యం కవిత్వాన్ని, కథల్ని దాటి విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
26-3-2012, www.suryaa.com
http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=74938
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి