"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

23 February, 2012

ఆత్మ యోగి ముమ్మిడివరం బాలయోగి - శిఖామణి ( ఆంధ్రజ్యోతి 19.2.2012 సౌజన్యంతో)

రుషులు ఏ అరణ్యాల్లోనో ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటారని చెప్పే కావ్యాలు, తెలుగు వాచకాల మధ్య సరిగ్గా 82 ఏళ్ల క్రితం ఒక సామాన్యుడు రుషియై జనావాసాల మధ్య తపస్సు చేశాడు. యోగమూ తపస్సూ ఉత్త ట్రాష్ అనుకునే అత్యాధునిక సాంకేతిక యుగంలో తన కఠోర తపోదీక్షతో యోగశక్తిని చాటి చూపించాడో మౌని. అయితే ఆయన ఏనాడూ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయలేదు, ప్రవచనాలనూ చెప్పలేదు. ఆయన బాలయోగి. ఊరు పేరుతో ఈశ్వరత్వాన్ని జోడించుకున్న ముమ్మిడివరం బాలయోగీశ్వరులు.

1930 అక్టోబర్ 23న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో ఒక పేద మాల కుటుంబంలో కటికదల గంగయ్య రామమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు సుబ్బారావు. వంశపారం పర్యంగా వచ్చే గోపాలక వృత్తిలో సుబ్బారావు అయిష్టంగానే చేరాడు. చదువుకునే అదృష్టం ఎటూ లేదు. ఎరుకనిచ్చే చదువు వేరే ఉందని గ్రహించిన సుబ్బారావు తన 16వ ఏట 1946 మే 22న కృష్ణుడు నారదుల ఫోటోతో సమీపంలోని కొబ్బరితోటలోకి వెళ్ళి తపస్సుకు కూర్చున్నాడు. తల్లిదండ్రులు వారించి తీసుకొచ్చారు.

ఇంటిదగ్గరా అదే బాట. ఇక లాభం లేదనుకుని ఇంటి ప్రాంగణంలోనే కొబ్బరాకులతో పందిరి కట్టారు. పదహారేళ్ల ప్రాయం వాడు కఠోర తపస్సా అని ఆనోట ఈనోట పాకి భక్తజనం పోటెత్తారు. ఆ ఇల్లు, ఆ వాడ, ఆ ఊరు ఒక ముక్తిథామం అయిపోయింది. అలా రెండు సంవత్సరాల 8 నెలలు ఆయన కనువిప్పి లోకాన్ని చూసిందీ లేదు,

పెదవి విప్పి సంభాషించిందీ లేదు. అందుబాటులో ఉన్న దేవుడని అందరూ పాదాల్ని స్మృశించి, చుట్టూ గుమ్మిగూడుతుంటే తపస్సుకు ఇది మార్గం కాదనుకుని ఆయన లోలోపలి గదుల్లోకి వెళ్లిపోయారు. ఈ సంగతి తెలుసుకున్న మహర్షి ఈలి వాడపల్లి ఆయన్ని దర్శించి ఇతను బాలయోగి అన్నారు. అప్పటి వరకూ ప్రతిరోజూ దర్శనం ఇచ్చే బాలయోగి ఇక మీదట వద్దన్నారు. భక్తులు, నిర్వాహకులు కోరితే 16-2-1950 నాటి నుంచి మహాశివరాత్రి మరుసటి రోజు దర్శనానికి అనుగ్రహించారు. అప్పటి నుంచి తన అవతార పరిసమాప్తి అయిన 19.7.1985 వరకు బాలయోగి భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యలోనే ఆయన తనేమిటో తన తపోశక్తి ఏమిటో అనేక నిదర్శనాల ద్వారా తెలియజేశారు.

అదలా ఉంచితే ఎవరైనా ఒక వ్యక్తి 40 ఏళ్ళపాటు నిరాహారంగా, స్వీకార విసర్జనలు లేకుండా వుండటం సాధ్యమా అని ప్రశ్నలు లేవనెత్తిన తరుణంలో బాలయోగి దానికి తార్కాణంగా నిలిచారు. సంప్రదాయమైన యోగవిద్యను వశపరచుకున్న బాలయోగి అష్టాంగ యోగం ద్వారా సమాధిలోకి వెళ్ళిపోయి ఆకలి దప్పులను విసర్జించారు. భారతీయ యోగ సంప్రదాయంలో ఆపాద మస్తకము విస్తరించిన కుండలినీ శక్తిని జాగృతం చేసి, వెన్నువెన్నంటి నడిచే శుషమ్నా నాడిద్వారా ప్రయాణించి ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మునిపుర, స్వాథిస్థాన, మూలాధార చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరడాన్ని జీవైక్యంగా ప్రతిపాదించారు. బాలయోగి దాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఇంతచేసి బాలయోగి మాట్లాడకపోలేదు. అదికూడా యోగంలో ఉన్న ఒకటి రెండు సందర్భాల్లోనే. చివరికి ఆయన భక్తులు చెప్పమంటే ఆయన చెప్పింది ఇది.... "భగవంతుని ధ్యానించడానికి అరణ్యం వెళ్ళనవసరం లేదు.

ప్రపంచము నందు ఒక్క సూర్యుడే ఇంత ప్రకాశముగా ఉన్నాడు. కోటి సూర్య ప్రకాశము గల భగవంతుడు ఎంత ప్రకాశముగా నుండును. జీవాత్మ పరమాత్మ స్వరూపము. పంచభూతములు దానికి మాయలోకి లాగుచుండును. తానెవ్వరో తెలుసుకుని చలించే మనస్సును కట్టిపెట్టగలిగితే తన ఆత్మే తన గురువగును''. అంత మాట అన్న యోగికీ క్రియా యోగంలో సామాజిక యోగం వెన్నంటి వుంది. లేకపోతే... ఎక్కువలో పుట్టినా/ తక్కువలో పుట్టినా/ తనువు శాశ్వతము గాదు అనే సిద్ధయోగం వారికి ఎలా సిద్ధిస్తుంది. అంతేకాదు ఆయన ప్రబోధంలో సమాజంలోని అసమానతలు, ఈనాటి సామాజిక ఉద్యమాలకు ఇది అతీంద్రయంగా అనిపించేదే కాని ఆధ్యాత్మిక నేపథ్యంలో సర్వ మానవులు ఒకటే భావనను ధ్వనింపచేసేది.

అయితే ఆయన జీవిత కాలంలోనే హేతువాదుల నుండి నాస్తికుల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ హేతువాది డాక్టర్ కోట్నీస్ ఈ వ్యవహారాన్ని తన కెమెరాలో బందిద్దామని వచ్చి తనే బాలయోగికి బందీ అయిపోయిన విషయం యావద్భారతానికి పత్రికా ముఖంగా తెలియజేశారు. అయితే బోయి భీమన్న లాంటి విద్వత్‌కవులు ఆయన జీవితాన్ని కావ్యంగా, నాటకంగా మలుస్తూ ఆధునికమైన సిద్ధాంతాలను ప్రతిపాదింపజూశారు కాని బాలయోగి ఆ కోవలోనికి ఎంతవరకు వస్తారో పరిశీలించాల్సి ఉంది.

దాదాపు నాలుగు దశాబ్దాల కాలం పాటు ఆంధ్రదేశ భక్తసమాజాన్ని ఉర్రూతలూగించిన బాలయోగి నేడెందుకు అనాదృతంగా ఉన్నారు? అందుకు ఇతర సామాజిక అంశాలున్నాయా! ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది. బాలయోగి తాత్విక దృక్పథాన్ని యోగతత్వాన్ని ప్రచారం చేయడానికి ముమ్మిడివరంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. యోగులు త్యాగంలోనే జన్మిస్తారు, తాగ్యంలోనే జీవిస్తారు. మన కొలమానాలు వారికెందుకు.

మాల ఇంట పుట్టి, పాలేరుతనముండి, 
బాలకృష్ణునట్లు పశులగాసి,
 పశుపతీత్వమంది  పరమాత్మవైనావు 
నిన్ను మించి యతులు నేడు గలరె? (  బోయి భీమన్న)
 - శిఖామణి  (మహాశివరాత్రి సందర్భంగా దర్శనమిచ్చే బాలయోగీశ్వరులకు)

2 comments:

durgeswara said...

mahaa yogulaku asaadhyamemi ledu

Kottapali said...

One's caste had never been an obstacle to reach Brahma Vidya or Athma Vidya. If you read Malapalle, this is illustrated several times throughout the story.