Monday, April 11, 2011

ఈ పదేళ్ళ కవిత్వం పట్టుకున్నదేమిటి?

Courtesy : సూర్య పత్రిక ‘‘ అక్షరం'' 11-4-2011

సరదాగోనో, సీరియస్‌గానో పదేళ్ళ కవిత్వాన్ని గమనిస్తే ఎలా ఉంటుంది? లేదా పదేళ్ళ నుండి కవులు ఎలాంటి కవిత్వాన్ని రాస్తున్నారు? లేదా పదేళ్ళలో పత్రికలు, ఇంటర్నెట్‌ పత్రికలు ఎలాంటి కవిత్వానికి ప్రాధాన్యాన్నిస్తున్నాయి? పోనీ, పత్రికలకేమాత్రం సంబంధం లేకుండా కవులే స్వయంగా ప్రచురించుకున్న పుస్తకాల్లోనో, స్వేచ్చగా రాసుకోగలిగే అవకాశం ఉన్న బ్లాగుల్లోనో ఎలాంటి కవిత్వం కనిపిస్తుంది? మొదలైన ప్రశ్నలకు అందరికీ సంతృప్తికరమైన సమాధానాన్నివ్వలేకపోయినా, అలాంటి ప్రయత్నంతో వెలువడిన ఒక కవితాసంకలనాన్ని చూపించవచ్చు.దీని పేరు ‘‘అనేక’’ సుమారు 2000 నుండి 2009 వరకూ తెలుగులో వచ్చిన వచన కవితల్లో 182 కవితల్ని అఫ్సర్‌, వంశీకృష్ణ సంపాదకత్వంలో ‘‘అనేక’’ పేరుతో సారంగపబ్లికేషన్స్‌ వారు ప్రచురించారు. విలువైన విషయాల్ని ప్రస్తావిస్తూ సంపాదకీయం రాసినా, కొన్ని అంశాల్ని స్పర్శించలేకపోయారు. పైగా సేకరించిన కవితల్లోని అంశాల కంటే ఇతర అంశాల్ని ఎక్కువగా ప్రస్తావించినట్లుంది.
దండోరా నుండి గ్లోబలైజేషన్‌ దాకా, ముస్లిం సాంస్కృతికత నుండి ‘‘గుజరాత్‌ గాయం’’ దాకా వచ్చిన కవిత్వ సంకలనాల నుండి కవితల్ని తీసుకున్నా, ఆ యా కాలాల్లో వచ్చిన ఉద్యమాన్ని ప్రాతినిథ్యం వహించగలిగే కవితల్ని ఎంపిక చేయకపోవడం వల్ల ఈ పదేళ్ళ కాలంలో వచ్చిన ఉద్యమాలకి సరైన ప్రాతినిథ్యం ఇచ్చినట్లనిపించట్లేదు. ఆ ఉద్యమాల ప్రస్తావన చేసినా ఆ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గని కవిత్వం రాసేవారి కవితల్ని ఎంపికచేయకుండా దీన్ని ‘‘ఒక ముద్రవేసిన తరువాత ఆ కవిని ఆ ముద్రలోంచి చూసి అతని కవిత్వ సారాన్ని, స్థానాన్ని అంచనా వేయడం అందరూ చేస్తారు. కనుక, అటువంటి పనిచేయడం లేదని’’ చెప్పుకుంటూ, మరో కవితని వేయడం కవి లక్ష్యాన్ని, ఆ కాలంలో ఆ ఉద్యమం పట్ల కవి ఆశించిన దాన్ని నీరు కార్చేప్రయత్నం చేసినట్లవుతుంది. ఉదాహరణకు ఎండ్లూరి సుధాకర్‌, కృపాకర్‌మాదిగ, దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి వంటి వాళ్ళు దండోరా గురించి బలమైన కవిత్వాన్ని రాస్తే, దాన్ని విస్మరించి, వాళ్ళు ఒకానొక సందర్భంలో రాసిన కవితల్ని ప్రచురించారు. అమ్మాయిలపై పెరుగుతున్న యాసిడ్‌ దాడుల గురించి ఎండ్లూరి సుధాకర్‌ రాసిన ‘‘దు:ఖగంధకామ్లవర్షం’’, కృపాకర్‌ సెజ్‌ లను వ్యతిరేకిస్తూ ‘ప్రత్యేక చావుమండళ్ళు’ అంటూ రాసిన కవితను, ఎజ్రాశాస్త్రి ‘‘మా ఊరికో శ్మశానం కావాలి’’ అని ప్రపంచీకరణ ప్రభావాన్ని పట్టిచూపే కవితల్నీ ఎంపిక చేశారు. ఎండ్లూరి దళితగోవిందం, ఖైర్లాంజీ సంఘటనలపైనా, ఇంకా రకరకాలుగా దళిత, మాదిగ జీవితాన్ని పండిరచిన కవితలెన్నో రాశారు. అలాగే మిగాతా వాళ్ళు కూడా రాసినా,వాటిని పట్టించుకోకుండా, మాదిగ జీవితానికే మాత్రం సంబంధం లేని కవి సీతారాం రాసిన ‘కుప్పం కాబ్లర్‌’’ కవిత తీసుకున్నారు.
‘‘ఈ చెట్టు కిందే /
మాతాత గూటం పాడతాడు /
దీనిలోనే మా అయ్య నడిచాడు /
నేనూ ఇక్కడే పాతుకుపోయాను పాతికేళ్ళుగా.../
ఇలా కొనసాగిన కవితలో ‘‘ ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడు నాకు /
నన్ను గమనించే వాడంటే నాకు పడదు.../
పాడెకడతానంటాను వాడి కవిత్వానికి నేను’’ వంటి కవిత్వాన్ని ఎంపికచేశారు.
అలాగే ఒక ముస్లిం దేశభక్తినీ, స్త్రీవేదననీ వ్యక్తీకరించిన ముస్లిం రచయితల కవితల కంటే కొండేపూడి నిర్మల రాసిన 
‘‘ దేశద్రోహికన్నీటి చుక్క’’ ను ప్రచురించారు. దీనిలో చూడండి
‘‘ఆస్తితో సహా ఆడదాన్ని ఏలుకోవడానికి /
కీర్తివంతులయిన నా అత్తింటి వారెవరో ముందుకొస్తారు /
బహుశా మరికొన్నిసార్లు వితంతువునవడానికి నేను /
పులకించిపోవాలి /
నిఖా సంబరాలు వెలిసిపోకుండానే /
ఫాతెహాలకు దర్బారు తీరిన మన జీవితాల్లో /
దేనికి మాత్రం అర్థసందర్భాలున్నా’’ యని ముస్లిం స్త్రీవేదనను పలికించారు. వీటి కంటే మరింతబలంగా తమ సమస్యల్ని మూలాల్లోకి వెళ్ళి, భాషతో సహా షాజహానా మరికొంతమంది ఇంతకంటే బలమైన కవిత్వాన్ని రాయలేదా? దీన్ని బట్టి కేవలం కవిత్వానికిచ్చిన ప్రాధాన్యం, ఆ అస్తిత్వం కోసం కవిత్వం రాసిన వారికివ్వలేదనిపిస్తుంది. దీన్నిబట్టి అస్తిత్వ ఉద్యమాల్ని గుర్తిస్తున్నట్లా? ఆ ఉద్యమాల పరిధి విస్తరించాలని భావిస్తున్నట్లా? స్త్రీవాదంలోని దళిత స్త్రీవాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని బలంగా అభివ్యక్తీకరించిన జూపాక సుభద్ర కవితల్ని వదిలేసి మరో కవితని ప్రచురించారు. ప్రాంతీయవాదాన్ని బలంగా వ్యక్తీకరించే కవితలు అనేకం ఉండగా వాటినీ పట్టించుకోకపోయినా, తెలంగాణ కవుల్నీ, కవిత్వాన్నీ మాత్రం అధికశాతంగానే రికార్డ్‌ చేయగలిగారు. అలాగే, కొద్దోగొప్పో ముస్లిం, క్రైస్తవ కవిత్వాన్ని రిప్రజెంట్‌ చేసే కొన్ని కవితలకు చోటు లభించినా,అందులోనూ బలమైన కవితల్ని తీసుకోలేదు.
ఎంపిక చేసిన వారికి స్వేచ్చ ఎంత ఉన్నా, అన్నింటికీ ఆర్థిక కోణమే ప్రధానమనే రీతిలో సంపాదకీయం కొనసాగించినా, కవిత్వం పేరుతో సౌందర్యానుభూతికే అధికప్రాముఖ్యాన్నిస్తూనే, ఆర్థిక సంఘర్షణలే నిర్దిష్టవాదాలు బయలుదేరడానికీ, బలం పుంజుకోవడానికీ కారణభూతమైయ్యాయని, అందువల్ల ప్రపంచీకరణ నీడలోనే పదేళ్ళ కవిత్వం నడిచిందనే సూత్రీకరణ చేసేప్రయత్నం చేశారు. నిజానికిది ప్రపంచాన్నీ, ఆంధ్రప్రదేశ్‌నీ అమెరికా ఆర్థిక నయనాలతో చూడ్డమే తప్ప, అన్ని అస్తిత్వ ఉద్యమాలకీ ఆర్థికమే కారణమనడం సరికాదు.కమ్యూనిష్టులు ప్రతిదాన్నీ ప్రపంచీకరణతో ముడిపెట్టి దాన్ని వ్యతిరేకించడం ఒక ఫ్యాషన్‌గా మార్చుకున్నట్లు, దేశీయవాస్తవికతను విస్మరించి కులాన్నీ, ప్రాంతీయతనీ దానిలోనే ఇరికించాలనుకునే ప్రగతిశీల గతస్మృతుల్నీ, అనుబంధాల్నీ వీడలేని సాహితీవేత్తలు కూడా ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే దీన్నీ భావించాలి.
ఈ దేశంలో ఏదో ఒకకులంలో పుట్టినా, పైకి కులం బాధ కనిపించనట్లుంటూనే, వాళ్ళు ఒక రాజకీయశక్తిగా ఎదగలేకపోవడానికి, ఆర్థికశక ి్తలేకపోయినా, సాంఘికంగా కులం వల్ల లభించిన అవకాశాల కారణంగా వైయక్తికంగానూ, వ్యవస్థీకృతంగానూ ముందుకి వెళ్ళడానికి కూడా కేవలం ఆర్థికపరమైన అంశాలే కారణమని భావించాలా?అయితే, ఈ పదేళ్ళలో వెనుకబడినతరగతుల నుండి నాయకత్వాన్ని వహించగలవాళ్ళు ఉన్నా, పెట్టిన పార్టీల్ని మళ్ళీ అగ్రవర్ణఆధిపత్యంలో నడుస్తున్న పార్టీల్లోనే విలీనం చేయడం వెనుక కులం కారణమా? ఆర్థిక పరిస్థితులు కారణమా? అనేది ఆలోచించాలి.
ఈ పదేళ్ళలో అటుసామాజికంగాను,రాజకీయంగాను దళితులు, వెనుకబడిన తరగతులు ముందుకొస్తున్నట్లే కవిత్వంలోను తమదైన బలమైన ముద్రను వేయడమే కాకుండా, పదిహేనువందల యేండ్లపాటు ఆధిపత్యాన్ని వహించిన కవిత్వానికి అర్థశతాబ్దంలోనే వణుకుపుట్టించగలిగారు. ‘‘వెనుకబడిన తరగతులు’’గా సాధించలేని అభివృద్ధిని ‘‘వెనుకబడిన కులాలు’’గా గుర్తింపజేసుకోవడం ద్వారా సాధించవచ్చని ఉద్యమాలు మొదలైయ్యాయి. తమ నిజమైన శత్రువుని గుర్తించడంలో కొంచెం అటూ ఇటైనా ఈపదేళ్ళలో వెనుకబడిన కులాల వాళ్ళు తమ జీవితానుభవాల నుండి ‘‘వెంటాడే కలాలు’’ పేరుతో 2001లో ఒక కవితా సంపుటిగా బయటకొచ్చారు. దీనిలోనూ ఆర్థికాంశాలున్నా, వాటికంటే కుల చైతన్యమే ప్రధానంగా కనిపిస్తుంది. వీళ్ళని వృత్తుల వాళ్ళగానే కాకుండా కులవృత్తుల వాళ్ళుగా పరిగణించడం వల్ల వాళ్ళ నిజమైన అస్తిత్వాన్ని గుర్తించినట్లవుతుంది.కానీ, శ్రామికుల చట్రంలోనే కట్టేయడం వల్ల వెనుకబడిన కులాల వాళ్ళకి తీరని అన్యాయమే జరిగిందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటు, ఉద్యమాలతో ముందుకొస్తున్నారు.
సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు కవిత్వాన్ని నిలదీసిన దండోరా కవిత్వాన్ని జల్లెడపట్టి ఉత్తమకవిత్వాన్ని ఒకచోటకు చేర్చిన కవితాసంకలనం ‘‘కైతునకలదండెం’’ (2008). ఈ దేశంలో కులం, మతం తమనెలా పీల్చిపిప్పిచేశాయో కులాన్ని ఆశ్రయించుకున్న ఆర్థిక, రాజకీయ,సాంస్కృతికాంశాల్ని రికార్డ్‌ చేసిన కవితా సంకలనమిది. ఇలాగే మతం తమనెలా హింసించిందో వ్యక్తిగతంగాను, సంకలనాల రూపంలోను ఈ పదేళ్ళలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీకవిత్వానికి సంబంధించినవి వచ్చాయి. వీటినీ ఆర్థికపునాది మింగేసిందన్నట్లే చూపారు. కుల, మత పీడనను బలంగా చెప్పిన కవితలు దీనిలో తీసుకోలేదు. సంకలనంలో ఉన్నవాటి గురించి మాట్లాడాలంటే ఈ పదేళ్ళలో వెలువడిన ‘‘కవిత్వాన్ని’’ పట్టకోగలిగినా, కవుల ఆత్మల్ని పట్టించుకోలేదు. కవుల ఆశయాల్ని, లక్ష్యాల్ని గుర్తించాల్సిన కవితల్ని విస్మరించి కవుల్ని మాత్రం గుర్తించారు.పైకి ప్రపంచీకరణ ప్రభావమనే వ్యవస్థీకృత చైతన్యంగా కనిపించినా, వాళ్ళ జీవితలోతుల్ని తాకని కవిత్వాన్ని స్వీకరించి, ఆ వ్యక్తుల్ని గుర్తించి, పరోక్షంగా వైయక్తికతకు పీఠం వేశారు.
పుస్తకంలో ఎంపిక చేసిన కవితల్ని వివిధ విభాగాలుగా చేసి, ఆ విభాగానికి ఒక్కో పేరు పెట్టడంలో నూతనత్వం కనిపిస్తున్నా, కేవలం అవి ఆ వర్గంలోకి మాత్రమే వచ్చే కవితలని స్పష్టంగా చెప్పలేనివీ అనేకం అందులో ఉన్నాయి.అక్షరం, అనుభవం, అస్తిత్వం, అలజడి, ఆందోళన, అతడు`ఆమె, ఆవలితీరం, అనంతరం అని ‘‘అ,ఆ’’లతో ఒక క్రియేటివిటీని ప్రదర్శించడం చాలా మందికి అది ఒక చమత్కారమనిపించినంతగా, అందులోని సీరియెస్‌నెస్‌ గుర్తించకపోచ్చు.
కవిత్వ చరిత్ర మాత్రమే తెలుగు సాహిత్య చరిత్రగా వక్రీకరించడం సరైంది కాదని మన సాహిత్య చరిత్రకారుల్ని తప్పుపట్టిన విమర్శకులకు, మళ్ళీ అలాంటి అవకాశం ఇవ్వకుండా మాత్రం జాగ్రత్త పడుతూనే ఈ సంకలనాన్నితీసుకొచ్చారు. సుమారు తొమ్మిది వందల సంవత్సరాలుగా అవిచ్చిన ప్రవాహమైన పద్యకవిత్వాన్ని భావకవిత్వం బద్దలు కొడితే, భావకవిత్వంలోని స్వేచ్ఛాప్రియత్వం పేరుతో సమాజాన్ని పట్టించుకోనికవుల్ని అభ్యుదయకవిత్వం గాడిలో పెట్టింది. రాయడం వరకే పరిమితమైపోతే కుదరదని, దాన్ని ఆచరణలోనూ చూపాలని విప్లవకవిత్వం కవుల్ని మరింత హెచ్చరిస్తే, ఆచరణలోని ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ స్త్రీ, దళిత,బహుజన, ప్రాంతీయ, ముస్లిం, క్రైస్తవ మైనారిటీ కవిత్వ ఉద్యమాలు ముందుకొచ్చిన తర్వాత చాలామంది కలాలు మూతపడ్దాయి. దానితో అంతకు ముందు రాసిన వాటితోనే తమకి దక్కిన ‘‘కవి’’ గౌరవ మర్యాదల్ని కొనసాగించుకుంటూ పోతున్నవాళ్ళెంతో మంది ఉన్నారు. ఆధునికంలో ఉంటూనే, ‘‘గతకాలము మేలు, వచ్చు కాలముకంటే’’ అని పైకి అనకపోయినా, గతంలో రాసిన కవిత్వాన్నే నెమరువేసుకుంటూ మాత్రం బతికేస్తున్నవాళ్ళున్నారు. ఇలాంటప్పుడు నొప్పించక, తానొవ్వక ‘‘మానవతావాదం’’ పేరుతో సమకాలీనతను ఏమాత్రం పట్టించుకోకుండా కేలండర్‌ కవిత్వాన్ని రాస్తూ, ప్రభుత్వకవులుగా బతికేస్తున్న వాళ్ళూ ఉన్నారు. ఇలాంటిస్థితి పట్ల ఈ పదేళ్ళ కవిత్వాన్ని గమనిస్తున్న కవి ఇలా అంటున్నాడు.
‘‘బాధలేదని కాదులే!/
కాకపోతే, ఎవరిబాధో తప్ప/
రాయలేనితనం / .....
సొంతమూ, పరాయీ అని కాదు కాని/
నువ్వు నీదేహంలో సంచరించడం మానేసి /
ఎంతకాలం అయ్యింది, చెప్పకూడదూ,కాస్త ’’ (అఫ్సర్‌) అనడంలో నిత్యం రాయాల్సిన కవులు ఎందుకు రాయడంలేదో తెలుసుకోవాలనే తహతహ కనిపిస్తుంది. కవులు, సాహితీవేత్తలు అందరి ఓట్లు తమకి దక్కుతాయో లేదో, ఏదోలా దక్కించుకోవాలనుకొనే చాలా మంది రాజకీయవేత్తల్లా ప్రవర్తించకూడదనే ఆవేదన చాలామందికి ఉందని ఈ కవితా ఖండికచెప్తుంది. కానీ, దీనిలో నిజంగా అలా స్పందించిన వారి కవిత్వమేది? పదేళ్ళ కవిత్వాన్ని ఓ చోటుకి తీసుకుని రావాలనే ప్రయత్నం మంచిదే కాని, పదేళ్ళనే కాలంలో జరిగిన సంఘటనల్ని సరైన రీతిలో గుర్తిస్తే మరింత బాగుండేది.
(అనేక ` పదేళ్ళ కవిత్వం) కవితా సంకలనం, సంపాదకులు : అఫ్సర్‌, వంశీకృష్ణ, సారంగబుక్స్‌ ప్రచురణ, వెల. రూ.199లు. పుటలు: 400 ప్రతుల కోసం సంప్రదించాల్సిన చిరునామా: పాలపిట్టబుక్స్‌, లేదా ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు)
-డా॥దార్ల వెంకటేశ్వరరావు
9989628049
(సూర్య పత్రిక ‘‘ అక్షరం’’ 11-4-2011)

2 comments:

బొల్లోజు బాబా said...

సర్జికల్ ప్రెసిషన్ తో ఉందీ వ్యాసం.

కొద్దిరోజులక్రితమే అనేక నా చేతికొచ్చింది. ఇంట్రో నిజాయితీగా నే అనిపించింది.

ఈ లోపు మీ వ్యాసం. కొన్ని కొత్త ఆలోచనల్ని కలిగించింది. అన్యధా భావించరనే ఇలా పంచుకొంటున్నాను సార్.

కొంతమంది కవులు తమ బ్రాండ్ ఇమేజ్ లకు భిన్నంగా వ్రాసిన కవితలు వారికి మరింత విస్త్రుత గుర్తింపునిస్తాయనుకొంటాను.

భిన్న వాదాల ప్రతినిధుల స్థాయికి ఎదిగినా, సుధాకర్ అంటే గూర్ఖా కవిగా, శిఖామణి అంటే దిశమొల కవిత వ్రాసిన కవిగా, మెహజబిన్ అంటే వీధిబాలల కవయిత్రిగా, నిర్మల అంటే రూం ఖాళీచేసినపుడు వలికే విషాదాన్ని పట్టుకొన్న కవయిత్రిగా, శ్రీనివాస్ అంటే కవిత్వం కావాలి కవిత్వ్బం అని పలవరించిన వ్యక్తిగా, కొప్పర్తి అంటే తెరచియుండు వేళలు రాసిన కవిగా -- మాత్రమే మనసులో ముద్రింపబడిపోయారు. ఈ విషయంలో నేను "ఒంటరిని" కాకపోవచ్చు.

మీ వ్యాసం లోతుగా, ఆలోచింపచేసేదిగా, భాద్యతకలిగిన ఒక అకడమీషియన్ చేసిన ఒక పరామర్శగా ఉంది.
thankyou for thought provoking thoughts sir

భవదీయుడు
బొల్లోజు బాబా

డా.దార్ల said...

సాహితీ మిత్రులు బాబా గార్కి,
మీరన్నది చాలా వరకూ నిజం. ఈ పదేళ్ళ కవిత్వాన్ని పట్టించుకునేటప్పుడు, ఈ కాలంలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలను, ఆ కవిత్వాన్ని పట్టించుకోవాలనేదే నా ఆలోచన. థాంక్యూ.