surya telugu daily 8-11-2010
ప్రపంచ సాహిత్యమంటే ఏమిటి?
శాస్త్ర,సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచం చిన్నదైపోతుందని పరిశీలకులంటున్నారు. అందుకే ప్రపంచమిప్పుడు ఒక గ్లోబల్‌విలేజ్. ప్రపంచంలో ఏ మూల్లో ఏమి జరిగినా వెంటనే తెలిసిపోతుంది. తెలిసేవేమిటీ, తెలియాల్సినవి నిజంగా తెలుస్తున్నాయా అనే అనుమానాలూ ఉన్నాయి. ఇలా తెలిసిన విషయాల్ని అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ మార్చుకునేవాళ్ళున్నారు. ఇది మానవ స్వభావం. ఇక్కడ మనం సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచం గ్లోబల్‌విలేజ్‌గా మారడం వల్ల సాహిత్యంలో కొత్త భావాల్ని అందుకోవడానికి, అందించడానికీ మంచి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు దీన్ని మానవుడు స్థానికత నుండి విశ్వమానవుడుగా ఎదగడానికి సాహిత్యాన్ని ఒక మార్గంగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయోమో చూడాలి.
సాహిత్యంలో ‘‘ప్రపంచసాహిత్యం’’ అనే మాటొకటి విన్పిస్తుంది. దీన్ని మొట్టమొదటి సారిగా 1827లో గెథే (Goethe)గా ప్రసిద్ధి చెందిన జర్మన్ సాహితీవేత్త యోహాన్ వుల్ఫ్‌గాంగ్ వాన్ గెయిథే ప్రయోగించాడని పరిశోధకులంటున్నారు. ఆయన తర్వాత అటువంటి భావననే కారల్ మార్క్స్ & ఏంగిల్స్ శ్రామికవర్గ చైతన్య దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో ద్వారా అందించారనీ అంటున్నారు. ప్రపంచసాహిత్యం అంటే ఏమిటో చర్చలోకి తీసుకొస్తూ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ డామ్రోశ్చ్ ‘‘వాటీజ్ వరల్డ్ లిటరేచర్?’’ అనే గ్రంథాన్ని రాశాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రచనను, లేదా ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆలోచనలున్న రచనను ప్రపంచసాహిత్యంగా గుర్తించవచ్చనేది ఈ గ్రంథంలోని ప్రధాన ప్రతిపాదన. ఈ గ్రంథం రాకముందే అనేక సంవత్సరాల పాటు ప్రపంచసాహిత్యం గురించిన చర్చ జరుగుతోంది. సాంకేతికంగా వస్తున్న మార్పుల వల్ల ఇటీవల దీనికి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. మన భారతీయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇప్పుడు ‘‘వరల్డ్ లిటరేచర్’’ అనేది ఒక ప్రత్యేకపాఠ్యాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని చర్చించుకోవడం అవసరం.
జీవితానుభవాల్ని కళాత్మకంగా సృజనీకరించే అనుభూతి వ్యాపారం సాహిత్యం. తాను దర్శించిన సత్యాన్ని అనుభూతిగా అక్షరీకరించే స్వభావం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. ఈ అనుభూతి పూర్తిగా తనదే కాకపోయినా, తనలాంటి వారి అనుభూతి కావడం వల్లనో, జీవితంలో అలాంటి సంఘటనలు తనకీ ఎదురవ్వడం వల్లనో పాఠకుడు ఆ రచనను తనదిగా భావించుకుంటాడు. అప్పుడు రచనలో ఉండే వస్తువు తనదే కాకపోయినా, పూర్తిగా తన అనుభూతికి దూరంగా ఉందని చెప్పలేడు. దీనికి భాష అడ్డంకి కాదు. ఆ భావాలతో తాదాత్మ్యం చెందడానికి మూలరచనను చదవలేకపోయినా, దాన్ని అనువాదంలో చదివినా చాలు. అందువల్లే ఎప్పుడో క్రీ.పూ 8, 9 శతాబ్దాలలో హోమర్ రాసిన ‘‘ ఇలియడ్’’ ‘‘ ఒడిస్సీ’’ లు గ్రీకు సాహిత్యానికి చెందినవైనా, ప్రపంచవ్యాప్తంగా చదువుకోగలుగుతున్నారు. అందులోని వీరత్వాన్ని, అద్భుతాల్నీ పాఠకులు హాయిగా ఆస్వాదించగలుగుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఈ సాహిత్యం ప్రపంచసాహిత్యంగా గుర్తింపుపొందింది. షేక్‌స్పియర్ సాహిత్యానికి కూడా ఇలాంటి ప్రచారమే లభించడం వల్ల దాన్నీ ప్రపంచసాహిత్యంగానే చెప్తున్నారు. ఆ దృష్టితో చూసినప్పుడు భారతదేశంలో వెలువడిన రామాయణ, మహాభారతాలు కూడా ప్రపంచసాహిత్యమే అవుతుంది. వీటినే కాదు, ప్రపంచ సాహిత్యానికి ప్రధానమైన లక్షణం ప్రాచుర్యం కావడమే ప్రధానమైతే, అనేకభాషల్లోకి అనువాదం పొంది, అత్యధికులకు అందుబాటులోకొస్తే ప్రపంచసాహిత్యమైపోవాలి. కానీ, ప్రపంచసాహిత్యమనిపించుకోవడానికి అలా ప్రాచుర్యం మాత్రమే సరిపోదు. కళాత్మక విలువలతో పాటు, ప్రపంచానికి తెలియని ఒక కొత్తవస్తువు సృజనవ్యాపారంగా మారాలి. అలా మారగలిగింది కాబట్టే, అలెక్స్‌హెలీ రాసిన ‘‘ది రూట్స్’’ ప్రపంచ సాహిత్యమైంది. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి జరిగిన ప్రయత్నం ఆ నవల్లో వర్ణితమైంది. మానవుల్లో కనిపించే పీడన, పీడిరపబడటం పాఠకుల్ని అనుభూతితో నింపేసింది.అనుభూతి సాంద్రతలో భేదాలనేవి భావజాలాన్ని బట్టీ ఉండొచ్చు. ఎలాంటి భావజాలమైనా అనుభూతి అత్యంత ప్రధానం. అలాంటివే జాన్ మిల్టన్ ‘‘పారడైజ్ లాస్ట్’’, ఇలియట్ ‘‘ ది వేస్ట్‌లాండ్’’ ఇలా ఎన్నో చెప్పొచ్చు.
సాహిత్యానికున్న ప్రధానగుణం అనుభూతి. పాత్రల పేర్లు, స్థలాలు వేరైనా వాటిలో పాఠకుడు తనని ఊహించుకుంటాడు. వాటితో తాదాత్మ్యం చెందుతాడు. కాబట్టి రచనకు భాష,స్థల, కాలాల కంటే సామాన్యీకరించడమనే గుణం చాలా ముఖ్యం.ఇలా సామాన్యీకరించడమనేది కళాత్మక గుణమే అయినా, చాలా సందర్భాల్లో ఇది కుదరకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల జాతుల వాళ్ళున్నప్పుడు, రకరకాల సంస్కృతులు కూడా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి సమస్యల్లో తేడాలుంటాయి. అందువల్ల అన్నింటినీ సామాన్యీకరించడం కుదరకపోవచ్చు. అందుకనే సార్వజనీనం, సార్వకాలీనం, సార్వదేశికం అనే భావనలను పూర్తిగా అంగీకరించలేమనే వాళ్ళున్నారు. దీనికి కారణం సాహిత్యాన్ని తన అస్తిత్వం నుండి పరిశీలించడం కావచ్చు. సాహిత్యానికి ఉన్నదనుకున్న ప్రయోజనం సామాజిక సమస్యల్ని పరిష్కరిస్తుందని నమ్మడమవ్వచ్చు. దీనికి ప్రపంచసాహిత్యంలో నిలవదగిన భారతీయసాహిత్యాన్ని చెప్పుకోవాలంటే, కచ్చితంగా రామాయణ, భారతాలు ఉంటాయి.కనుక, వీటి గురించి కొద్దిగా చర్చిద్దాం.
మహాభారతమంతా చెప్పిన తర్వాత ఉగ్రశ్రవసుడు ( సూతుడు) చివరలో ‘‘యదిహాస్తి తదన్యత్ర, యన్నేహాస్తి నతత్ క్వచిత్’’ అని చెప్తాడు. దీన్లో ఉండేదే ఎక్కడైనా ఉంటుందనీ, దీన్లో లేనిదెక్కడా ఉండదనీ చెప్తున్న మహాభారతం ప్రపంచ ప్రసిద్ధం. అలాగే రామాయణంలో రాముడు ఆదర్శపురుషుడుగా కీర్తించబడ్డాడు. ఇక్కడే కొన్నిప్రశ్నలు మొదలవుతాయి. ప్రపంచసాహిత్యం అనగానే డేవిడ్ డామ్రోశ్చ్ ఎదుర్కొన్న ప్రశ్నల వంటివే ఈ మహాకావ్యాల విషయంలోనూ ఎప్పుడో ఎదురయ్యాయి. ‘‘భారత రామాయణాదులు అన్ని జాతులకు, అన్ని భాషలకు, అన్ని కాలాలకు, అన్ని దేశాలకు శాశ్వతంగా ఉపయోగపడతాయనటం వెనుక స్వార్థశక్తుల ప్రయోజనం నిక్షిప్తమయి ఉంద’’ని సాహిత్య విమర్శకులన్నారు.
సంస్కృత మహాభారతం ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమైంది. అయితే ఆ అనువాదం మూలంలో ఎలా ఉంటే అలా వెళ్ళిందా? లేదా? అనేదొక సమస్య. మన ఆంధ్రమహాభారతాన్నే తీసుకుందాం. 11 వ శతాబ్దంలో నన్నయ దీన్నెంతో సాహసంతో తెలుగులో అనుసృజన చేశాడు. ఈ కావ్యప్రయోజనాన్నిలా వర్ణించాడు
‘‘బహుభాషల బహువిధముల
బహుజనముల వలన వినుచు భారత బద్ధ
స్పృహులగు వారికి నెప్పుడు
బహుయాగంబుల ఫలంబు పరమార్థమిలన్ ’’ దీన్ని విన్నవాళ్ళకీ, దీనిలో చెప్పిన దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళకీ అనేక యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చే ఫలితం చేకూరుతుందన్నాడు. కాబట్టి ఇది గొప్పకావ్యమే అనుకుందాం. ఈ కావ్యంలోనే కవి మరోచోటిలా అన్నాడు. ‘‘ ..సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ మహామహిమ’’తో రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరాజనరేంద్రుల వారి ఆఙ్ఞను అనుసరించి మహాభారతాన్ని తనదైన బుద్ధిబలంతో తెలుగులో రాశానన్నాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షించడమంటే, ఆ యా వర్ణాల వాళ్ళు వాళ్ళకు నిర్దేశించిన విధుల్ని ఇష్టమున్నా లేకున్నా నిర్వర్తించవలసిందే కదా! ఆజ్ఞను మీరితే రాముడు శంబూకుడ్ని వధించినట్లు రాజు ‘‘ధర్మాన్ని’’ నిర్వర్తించాల్సిందే కదా! మరి ఇది ప్రపంచ సాహిత్యమైతే, ఈ ప్రపంచసాహిత్యంలో అందరికీ భాగస్వామ్యముందని భావించవచ్చా? ఇప్పుడు సంస్కృత మహాభారతాన్ని ప్రపంచసాహిత్యంగా పరిగణించాలా? ఆంధ్రమహాభారతాన్ని పరిగణించాలా?
సంస్కృత, రామాయణ, మహాభారతాల విషయంలో కూడా ఒక విమర్శ ఉంది. ఆర్య, ద్రావిడ ఆధిపత్యపోరాటంలో భాగంగానే ఆ సాహిత్యం వచ్చిందనేది ఆ విమర్శ సారాంశం. అలాగని ఆ సాహిత్యాన్నంతటికీ ఏవో కొన్ని కారణాల వల్ల కొట్టిపారేయలేం. పక్కన పెట్టేయలేం. వాటిలోనూ భిన్న దృక్పథాల్లో వచ్చిన సాహిత్యం ఉందని గుర్తించాలి. మరి అలాంటి గుర్తింపే వివక్షను ప్రశ్నిస్తూ వస్తున్న సాహిత్యానికీ దక్కాలి. ఆ కోణాన్నుండి ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుంటారు. ‘‘ప్రపంచ సాహిత్యంలో కొన్ని మైలు రాళ్ళవంటి సాహిత్య నిర్మాణాలు ఎప్పటికీ నిలిచి ఉన్నట్లు అనిపిస్తుంది. నిలిచి ఉండటం కంటే నిలిపి ఉంచటం గుర్తించాలి. నిలపటం అవసరార్థం జరుగుతుంది. ఆ అవసరం వ్యవస్థదయితే మేటి, వ్యక్తులదైతే కీడు’’ అనేది విమర్శకుల నిర్ణయం. అందువల్ల ప్రపంచసాహిత్యంగా చలామణీ కావాలంటే డేవిడ్ డామ్రోశ్చ్ భావించినట్లు అనువాదంలో మూలభాష, సాహిత్య సంస్కృతుల్ని విస్మరించకూడదు.
ప్రపంచంలో వాళ్ళందరికీ అర్థం కావాలనో, అర్థం కాదనో స్థానిక, దేశీయ మూలాల్ని అనువాదకులు నిరాకరించడమో, నిర్లక్ష్యం చేయడమో, విస్మరించడమో సరైంది కాదనేది కూడా ‘‘ప్రపంచసాహిత్యం’’ కావాలనుకునే వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే ప్రపంచసాహిత్యమనే భావన బాగా వ్యాపించాలంటే వివిధ భాషా, సాహిత్యాల్లో తులనాత్మక అధ్యయనం పెరగాలి. ప్రపంచసాహిత్యంలో కొన్ని భాషలకే ప్రాచుర్యం ఉండడం వల్ల మరికొన్ని భాషల్లో వెలువడే ఉత్తమసాహిత్యం అత్యధికులకు అందడం లేదు. అనువాదకుల్లో ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాల కంటే ఉత్తమ సాహిత్యాన్ని అందించాలనే కృతనిశ్చయం కూడా ప్రపంచసాహిత్య భావనను మరింత ముందుకి తీసుకెళ్ళగలుగుతుంది.
ప్రపంచ సాహిత్యం ఎలా ఉండాలో విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరు కవిత అందంగా చెప్తుందనిపిస్తుంది.
‘‘ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో
ఎక్కడ విరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో
తలపులో, పనిలో, నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనసు పయనిస్తుందో
` ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ! నాదేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు’’ ఇది ‘‘గీతాంజలి’’లోది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలోని ఎన్నో భాషల్లో దీన్ని చదువుకుంటున్నారు. టాగూరు రాసిన దీనికే నోబుల్ బహుమతి కూడా వచ్చింది. ఈ కవిత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి దీన్ని ప్రపంచసాహిత్యంలో భాగంగా చెప్పాలా? ప్రపంచసాహిత్యంగా చెప్పాలా? రెండు ప్రశ్నలూ ఒకటి కాదు!
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు
Assistant Professor,
Dept .of Telugu,
University of Hyderabad, (Central University),
Gachibowli, Hyderabad-500 046
e-mail: vrdarla@gmail.com
Ph: 040-23133563 (O), Mobile: 0998962804
1 కామెంట్:
సమాధానం చెప్పారేమోనని చదివాను. కానీ ప్రశ్న దగ్గఱే ఆపేశారేం ?
ప్రపంచస్థాయి సాహిత్యం అంటే ప్రపంచంలో ఉన్న అందఱి గుఱించీ రాసేదని కాదు. అందఱికీ ప్రాతినిధ్యమో, పాత్రో, గౌరవమో ఉన్నదనీ కాదు. అందులోని సందేశాల్నీ, సత్యాల్నీ అందఱూ అనుభూతిలోకి తెచ్చుకోవడానికి వీలయ్యేటంత వ్యక్తిత్వబాహుళ్యమూ, సన్నివేశవైవిధ్యమూ గలది అని ! రామాయణం, మహాభారతం ఈ లక్షణాలు గలవి. మీరు చెప్పే దుర్విచక్షణ సమస్యని కూడా ఈ గ్రంథాలు ప్రస్తావించాయి. అతిగొప్ప సాహిత్యం అత్యంత లోతైన స్థానిక, వైయక్తిక (Local and personal) మూలాలు గలదై ఉంటుంది. ఒకానొక కృతి పూర్తిగా స్థానిక సంస్కృతిప్రదర్శనకే పరిమితమైనప్పటికీ కూడా అందులో యావన్ మానవాళీ నేర్చుకోదగ్గ విషయాల పెల్లు విలసిల్లితే అది ప్రపంచసాహిత్యమే అవుతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి