Monday, October 04, 2010

వాస్తవానికీ, కళానందానికీ మధ్య గల తేడా?


ప్లాటో ఆదర్శరాజ్యభావనకు కవుల అనుకరణ దోహదపడకపోగా, ఊహాప్రపంచంలో జీవించేటట్లు చేస్తుందని, నీతిని బోధించని కావ్యాలను రాసే వారిని ఆదరించాల్సిన పనిలేదన్నాడు. అంటే ప్లాటో కావ్యానికీ నీతికి అవినాభావసంబంధంతో అనుకరణను చూశాడు. దాన్నీ ఆధ్యాత్మిక జగత్తుతోనే చూశాడు. ఈ చరాచర జగత్తు అంతా భగవన్నిర్మితమనీ, దానికి అనుకరణ   రూపమే ప్రకృతిగా భావించాలంటాడు. ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. ఆ ప్రకృతిని అనుకరించే కవి కావ్యం కూడా సత్యం కాదంటాడు. మనం చూసే భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకి ప్రతిరూపం. ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఇది మిథ్య. అసత్యం. అందుకనే లోకంలో తాను చూసిందొకటైతే, చెప్పాలనుకున్నది మరొకటైతే, బయటకొచ్చేది ఇంకొకటి అవుతుంది. కవి తాను చూసినదాన్ని చూసినట్లే రాయడు. రాస్తే బాగుండదు. బాగుండాలని దానికి తన నైపుణ్యాన్ని చేరుస్తాడు. అంటే మరోరూపంలో చెప్తున్నాడు. ఒక సత్యం మరో సత్యంగా మారిపోయింది. అసలైన సత్యం ఆధ్యాత్మిక సత్యమైతే, ఇప్పుడు పాఠకులకు అందిన సత్యం రెండింతల దూరంలోనే ఉన్న ట్లనేది ప్లాటో భావన.
ప్లాటో ఆధ్యాత్మిక ఆదర్శవాది. దైవం పట్ల నమ్మకమున్నవాడు. నిజమైన కవిత్వం దైవావేశంతో వెలువడాలంటాడు. అప్పుడే కావ్యం సత్యవంతమై పౌరుణ్ని ఆదర్శరాజ్యం వైపు నడిపించగలుగుతుంది. అలా కానప్పుడు మాటల గారడీలతో కవులు తాము వర్ణించేదే సత్యమనే భ్రాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతుందంటాడు. అందువల్ల ప్లేటో చెప్పిన అనుకరణ కవుల్ని నిరాదరించేలా ఉన్నా, పరోక్షంగా ఆధ్యాత్మిక సత్యం పేరుతో ముందుకొచ్చే కవుల్ని ఒక మెట్టుకి పైనే ఉంచుతుంది. సామాజికంగా కనిపించే భౌతిక వాస్తవికత కంటే, కనిపించనిదేదో అన్వేషించే దిశగా అనుకరణ సిద్ధాంతం వెళ్ళిపోయింది!
దీన్ని ప్లాటో తర్వాత వచ్చిన అరిస్టాటిల్‌ తదితరులు నీతికీ, కావ్యానికీ మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ అనుకరణను వివరించారు. వాటిని  మన తెలుగు కవుల భావాలతో సమన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.
1977లో ఒక నల్ల జాతీయుడు తొలిసారిగా డిగ్రీ పట్టాను తీసుకున్నాడు. అది అమెరికాలోని మిసిసిపి విశ్వవిద్యాలయంలో జరిగింది. ఆ డిగ్రీ తీసుకున్న అతని పేరు జేమ్స్‌ మెరిడిట్‌. అంతకు ముందు తెల్లజాతి వాళ్ళకూ నల్ల జాతి వాళ్ళకూ మధ్య ఎన్నో యేండ్లుగా జాతి వివక్ష గురించి పోరాటాలు జరిగాయి. అబ్రహాం లింకన్‌ హత్యకు గురికావడంలోనూ జాత్యంకారమే ప్రధాన పాత్ర వహించిందని చరిత్ర చెప్తుంది. అటువంటి జాతివివక్షను ఎదుర్కొన్న వాళ్ళు తెల్లవాళ్ళతో సమానంగా చదువుకుని డిగ్రీ సాధించడమంటే మాటలా? ఇది తెలిసిన కవి దాశరథి ఒక పద్యాన్నిలా రాశాడు.
  ‘‘ నల్లనివాడ, జ్ఞాననయనమ్ముల వాడ! మనస్సులోపలన్‌
తెల్లని వాడ, హింసను వధించిన నల్లనివాడ! శాంతిపై
జల్లినవాడ, తెల్లని విషమ్మునకు విరుగైనవాడ! నా
ఉల్లములోనివాడ! పదవోయి విశాల విభాపథాలపై’’ దీన్ని చదివిన చాలా మంది పాఠకులకి వెంటనే కృష్ణుణ్ని వర్ణించిన పోతన పద్యం గుర్తుకొస్తుంది కదూ! ఆ పద్యం ఇది:
నల్లనివాడు, పద్మనయనమ్ముల వాడు, కృపారసంబు పై
జల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్ము చెప్పరే!
                అందరికీ కనిపించే వాస్తవాన్ని ఒకరు కవిత్వీకరించగా, మరొకరు కొందరికి మాత్రమే కనిపించే అనుభవాన్ని వర్ణించారు. రెండింటిలోను జీవిత సత్యం ఉంది. రెండిరటిలోనూ సత్యం అక్షరరూపంలో అభివ్యక్తీకరించే  ప్రయత్నం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ రెండు రకాల జీవితాల్ని అనుకరించడం కన్పిస్తుంది. అయితే ఇది నిజంగా సత్యమేనా? తరతరాలుగా బానిస జీవితం జీవించిన వాళ్ళు, జాతి వివక్షను ఎదుర్కొన్న వాళ్ళు ప్రధాన జీవన స్రవంతిలో కలవడానికి చేసే ప్రయత్నంలో సాధించిన సందర్భం నిజంగా ఆ జాతి మహానందానికి కారణమై వుంటుంది. అలాంటిదే భారతదేశంలో ఒక దళిత రాష్ట్రపతిగా, స్పీకర్‌గా పదవిని అధిష్టించినప్పుడూ ప్రధానంగా ఆ జాతి ప్రజలు ఆనందపడ్డారు. ఒక సామూహిక జీవిత వాస్తవాన్ని అనుభవీకరించుకుని కళాత్మక సత్యంగా మారుస్తున్నాడు కవి!  ఇప్పుడు ఆ అనుభవం ఎవరిది! కవిదా? ఆలా భావించి ఉండొచ్చనుకునే వాళ్ళదా? ఏది సత్యం?
మరో రకం కవి భౌతిక జీవనానంతరాన్ని దర్శించే ప్రయత్నంలో తాను పొందిన అనుభవాన్ని ఆవిష్కరిస్తున్నాడన్న మాట! నిజంగా అది కవికి కనిపించినరూపానికి కళాత్మక ఆవిష్కరణేనా? అంటే ఇది కూడా సత్యమవుతుందా?  అనేది చర్చనీయాంశం గానే మారిపోతుంది.

                దాశరథి రాసిన పద్యం ఒకజాతి జీవితానికి అనుకరణని చెప్పొచ్చా లేక పోతన పద్యానికి పేరడీ అనుకోవచ్చా అనేదీ కొంతమందిలో సందేహం రావచ్చు. పేరడీ సాహిత్యంపై కృషి చేసిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు దీన్ని పేరడీ కాదన్నారు. పేరడీని తెలుగులో వికటకవిత్వం అనొచ్చని మన సాహిత్యకారులు అంటున్నా,  దానికది సరిగ్గా సరిపోదనీ,  రెండూ వేర్వేరనీ,  వాటి లోతుల్ని చూసేవాళ్ళకనిపిస్తుంది. పేరడీలో హితవు, సామాజిక హితం ఉన్నా, వాటికంటే అధిక్షేపం, హాస్యచతురతా ప్రాధాన్యాన్ని పొందుతాయి. అనుకరణ బాహ్యరూపంగా కనిపించినా అంత: తత్వం జీవితాన్ని అనుకరించడం కంటే, హాస్యాన్ని కురిపించడమే లక్ష్యమవుతుంది. వీటి మధ్య జీవిత మూలాల్ని అన్వేషించడంలో వ్యత్యాసం ఉంటుంది. దీన్నీ చూద్దాం. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం గీతాన్ని ‘‘ మరోపిశాచం’’ పేరుతో కమలాకరం అనే కవి ఒక పేరడీ రాశాడు.
                ‘‘ మరో కంచం/ మరో లంచం / మరో మంచం పిలిచిందీ
                పదండి విందుకు / పదండి కాసుకు / పోదాం పోదాం పదవుల్లోకి
                కాళ్ళు మొక్కుతూ / కథల్‌ చెప్పుతూ పదవి కోసం సిగ్గువిడుస్తూ
                ఎత్తు లేద్దాం / చిత్తు చేద్దాం / కనపడలేదా
                తరతరాల పదవీ పిశాచం’’  దీనిలో కవి మౌలికత శ్రీశ్రీ కవితను అనుకరించడంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అంతర్భాగంగా నేటి రాజకీయ వికృత చేష్టల్ని తూర్పారబట్టడమూ ఉంది. కానీ, ఈ ఖండిక అప్పటికే బాగా ప్రాచుర్యంలోకి రావడం వల్ల దాన్ని హాస్యభరితంగా చెప్పడానికి ఉపయోగపడిరది. హాస్యం పాళెక్కువయ్యేసరికి కవి అంతర్గతంగా చెప్పిన సత్యంలోని సీరియెస్‌నెస్‌ తగ్గిపోతుంది. ఇది కూడా అనుకరణలాగే కనిపిస్తుంది.
                ఆ మధ్య కాలంలో దళితసాహిత్యం ఉద్ధ ృతంగా వస్తున్న రోజుల్లో చిక్కనవుతున్నపాట’ (1995) ని అనుకరిస్తూ, దానిలోని వాదాన్ని తిప్పికొట్టేప్రయత్నంలో పాట చిక్కబడ్తుందా?’ ( 1996) పేరుతో ఒక కవితా సంకలనం వచ్చింది. రెండూ రెండుకోణాల్లో జీవిత వాస్తవాల్ని చూశారు. ఇంకా చెప్పాలంటే సమాంతరంగా కొనసాగుతున్న రెండు జీవనవిధానాల్ని అనుకరించారు. ఈ అనుకరించడంలో మొదటిదానిలో జీవనానుభవ వేదన ఉంది. జీవితం విధ్వంసమైన వ్యథార్థకథనాల బీభత్సముంది. కవిత్వంలోకి జీవితం అనుకరించబడిరది. రెండవదాంట్లోనూ జీవనవ్యథ ఉన్నా మొదటి దానిలోని వ్యథలాంటిది కాదు. అందుకే రెండవదీ అనుకరణగానే వెలువడినా మౌలికంగా నిలవలేకపోయింది. ఒక జీవితాన్ని గానీ, ఒక వ్యవస్థని గానీ అనుకరించి కవిత్వీకరించేటప్పుడు అది భౌతిక వాస్తవమే అయినా, ఇంద్రియవాస్తవమై కళాత్మక సత్యమవుతుంది. 1977న దివిసీమలో వచ్చిన తుఫాను బీభత్సం, తదనంతర పరిస్థితులు చూసిన కవి నగ్నముని తన ధర్మాగ్రహాన్ని కవిత్వరూపంలో ప్రకటించాడు. అదే ‘‘ కొయ్యగుర్రం’’ దీర్ఘకావ్యమైంది. అది ఆనాటి సామాజికజీవనాన్ని అనుకరించడమే. ఆ అనుకరణ కవిత్వమై  భౌతికవాస్తవాల్ని ఇంద్రియానుభవంతో సత్యంగా మార్చగలిగాడు.
‘‘ కొయ్యగుర్రం భూమ్మీద నడవదు
ఇనప నాడాల్తో చెక్క హృదయంతో ధనమదంతో
అలగాజనంబుజాలమీద స్వారీ చేస్తుంది
బరువుకి కుంగిపోతూ తలెత్తితే
భీషణంగా సకిలించి అణగదొక్కుతుంది’’  ఇక్కడ  సత్యం ప్రతీకాత్మకంగా వెలువడింది. ప్రకృతి విలయతాండవానికి సరైనరీతిలో స్పందించని పాలనా విధానాన్ని దుయ్యబడుతూ, కదులూ మెదులూ లేని ‘‘ కొయ్యగుర్రాన్ని’’ కాల్చిపారేసే ప్రత్నామ్నాయ వ్యవస్థ కోసం ప్రయత్నించాలనే కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నాడు కవి. ఇది నాటి తుఫాను బీభత్సాన్ని మాత్రమే అనుకరించలేదు. అలాంటి విపత్కరపరిస్థితులు వచ్చినప్పుడు ఆ కావ్య సత్యం పాఠకుల్ని మళ్ళీ మళ్ళీ ప్రేరణ కలిగిస్తుంది. కావ్యసత్యం త్రికాలాలకు సంబంధించినదవుతూనే జీవనమూలాల్ని తడమగలుగుతుంది.
అందుకనే ప్లేటో కంటే భిన్నంగా  అరిస్టాటిల్‌ అనుకరణ సిద్ధాంతం రూపొందింది. ప్రకృతి అందంగా ఉంటుంది. దాని కంటే కళ మరింత అందంగా ఉంటుందనిపించింది. దీన్ని బట్టి ప్రకృతి  కొంత మార్పులు చేర్పులకు గురైందన్నమాట. అనుకరణకు గురైన ప్రకృతే కళాకారుని హృదయంలో మరోరూపు దిద్దుకుని, అనుగుణమైన సత్యంగా వ్యక్తమవుతుందన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం కంటే ప్రకృతి అనుకరణే జీవిత సత్యంగా మారుతుంది. కనిపించే ప్రకృతి నుండే మానవుడు కళాత్మకతను అలవర్చుకుంటూ, దాన్ని అధిగమించి కళకు ఉన్నతత్వాన్ని కలిగిస్తున్నాడని చెప్పడం ద్వారా అనుకరణకు అరిస్టాటిల్‌ ప్రాధాన్యతనిస్తున్నాడని తెలుస్తుంది. ఆ అనుకరణ నుండే మానవుడిలో ఉండే విషాదం క్షాళితమయ్యే కెథారిసిస్‌ని ప్రతిపాదించాడు. విషాదాంతరూపకాన్ని చూపినప్పుడు ప్రేక్షకుడు ఏడ్వడం ద్వారా తనలో ఉన్న దు:ఖం బయటకి పోయి మనసంతా స్వచ్చంగా మారిపోతుందంటాడు. దీనికి మానవుడిలో ఉండే ఏదో ఒక చిన్న లోపం విషాదాంతానికి కారణమవుతుందనేది గుర్తించాలంటాడు. మానవజీవితానుకరణమే విషాదాంతరూపకాల్లో ఉంటుందనేది ఈ ఆలోచనల్లోనుండి వచ్చిందే. కానీ ఈ భావనల్ని భారతీయులు ఆదరించలేకపోయారు. ‘‘మంగళా దీన, మంగళ మధ్యాని, మంగళాంతాని కావ్యాని.... ’’గానే భావించారు. నాటకం చూడ్డం పూర్తైయ్యేసరికి మానవుడ్ని విజయపథంలోకి నడిపించి, జీవితాన్ని ఆనందమయం చేయగలుగేవేమిటో గుర్తించి, అలాంటి ఆదర్శజీవనాన్ని అలవర్చుకోమనే ప్రబోధాన్ని కలిగిస్తాయి. రెండు దృక్పథాలు అనుకరణకు సంబంధించినవే. వీటిలో ఉత్తమాధమ విలువల్ని నిర్ణయించడమంత సులువుగా తేలేది కాదు.
ఇక్కడ అనుకరణలో రెండు కోణాల్ని గమనించాం. ఆధ్మాత్మికం, భౌతికం. ఇవే కావ్యంలో పరస్పరత్వాన్ని పొందుతున్నాయి. ఆ పొందటంలోనూ భిన్నత్వం ఉన్నా, రెండింటిలోనూ సంవేదన ఉంది. కవి వ్యక్తీకరించిన దానితో సమానంగా పాఠకుడు సంవేదనకు గురికావాలి. ఆ సంవేదన తన జీవితానుభవాలనుండి రూపొందిందైనప్పుడు ఆ అనుకరణకు సార్ధకత చేకూరుతుంది. అనుభవం జీవితంలోకి రానప్పుడు అది మార్మికమవుతుంది. అప్పుడది  అవాంఛనీయధోరణులకు దారితీస్తుంది. మన భారతీయ ఆలంకారికుడు ధనంజయుడు ఒక సందర్భంలో ‘‘ రమ్యమ్‌ జుగుప్సితముదార మదాపి నీచమ్‌...’’ అంటూ రమ్యమైంది కానీ, వికృతమైంది కానీ దేన్నైనా సరే రసవంతం చేయగలిగే నైపుణ్యముంటే ప్రతీదీ రసవంతమే అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, రసవంతమైనదంతా జీవితానికి ఉపయోగపడుతుందనీ చెప్పుకోలేం. దాంతోనే ఉంటే నేలవిడిచి ఆకాశం మీదే విహరించడమో అవుతుంది. అందుకే గోపి గారొక చోట రాసింది గుర్తొస్తుంది...
‘‘ కలకీ, మెలకువకీ
ఒక్కటే తేడా
అది చంద్రశాంతి
ఇది సూర్యకాంతి’’. ఇటువంటిదే అనుకరణకీ, వాస్తవానికీ, కళానందానికీ జీవితానందానికీ మధ్య గల తేడా. దీన్ని గుర్తించగలిగితే కవిత్వంలో సత్యాన్ని గుర్తించగలిగినట్లే!
-          డా దార్ల వెంకటేశ్వరరావు
9989628049

1 comment:

jaggampeta said...

satyam telisidhi thank you. automatic songs bavunnayi