( కృపాకర్ మాదిగ రాసిన ఈ వ్యాసం చర్చ కోసం ఆంధ్రజ్యోతి దినపత్రిక ( 31-12-2009)సౌజన్యంతో ఇక్కడ ప్రచురిస్తున్నాను.)
చిన్న రాష్ట్రాల డిమాండ్లకు సానుకూలంగా ఉండడం అంబేడ్కర్‌వాద దృక్పథమని సామాజిక న్యాయం కోరుకునే ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సీమాంధ్ర రాజకీయ పార్టీల ఉచ్చుల్లో చిక్కుకోకుండా, గుడ్డి ద్వేషాలను పెంచుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును స్వాగతించాలి.
నేను సమైక్య వాదిని కాదలుచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని వ్యతిరేకిస్తూ 'సమైక్యాంధ్ర' నినాదంతో సీమాంధ్ర రాజకీయ పార్టీ లు బలవంతపు 'ఐక్యత'కి దిగాయి. మూకుమ్మడిగా ఎంపీ, ఎమ్మెల్యేల పదవుల రాజీనామాల నాటకాలతో ఇటు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న వారిని, అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేశాయి. సీమాంధ్రా రాజకీయ నేతలు ఆమరణ నిరాహార దీక్షలు, బందులు, ప్రదర్శనలు, రాస్తారోకోలు, నిరసనల తో తెలంగాణ రాష్ట్రం పునరుద్ధరణని వ్యతిరేకిస్తూ సామాజిక అన్యాయానికి ఒడిగట్టినందుకు... నేను సమైక్యవాదిని కాను.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఊపందుకున్న సమయంలోనే తెలంగాణ ప్రాంతం పట్ల అత్యంత వివక్ష చూపెడు తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 1845ను జారీ చేసింది. ఈ జీవో ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం కోస్తాంధ్ర ప్రాంతానికి 103.67 కోట్లు, రాయలసీమ ప్రాంతానికి 15.57 కోట్లు, తెలంగాణ ప్రాంతానికి కేవలం 9.31 కోట్ల రూపాయల ను మాత్రమే కేటాయించి ఆంధ్ర పాలకులు మరోసారి తెలంగాణ ప్రాంతం పట్ల వివక్షాపూరిత దురహంకారాన్ని నిరూపించుకున్నారు. ఇదేమని ముఖ్యమంత్రిని నిలదీసిన తెలంగాణ ప్రజాప్రతినిధులను సచివాలయంలోనే అక్రమంగా అరెస్టులు చేసినందుకు గాను... నేను సమైక్యవాదిని కాను.
1956లో తెలంగాణ, ఆంధ్ర విలీనం షరతులతో కూడుకున్నదన్న సంగతిని సీమాంధ్ర నేతలు, రాజకీయ పార్టీలు మరుగుపరుస్తున్నందుకు నేను సమైక్యవాదిని కాను. 1956కు ముందున్న హైదరాబాద్ (తెలంగాణ) రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశిస్తు న్న ముల్కీ నిబంధనలను కొనసాగిస్తామని రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందాన్ని ఆంధ్ర పాలకులు నిరంతరాయంగా ఉల్లంఘిస్తున్నందుకు నేను సమైక్యవాదిని కాను. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీ నిబంధనలు కొనసాగకపో తే, తెలంగాణకు విపరీతమైన అన్యాయం జరుగుతుందని, ఇదే గనక నిజమైతే తిరిగి తెలంగాణ (హైదరాబాద్) రాష్ట్రాన్ని పునరుద్ధరించుకోవచ్చునని సూచించిన ఫజల్ ఆలీ, నెహ్రూల అభిప్రాయాలను సీమాంధ్ర రాజకీయ పార్టీలు అగౌరవపరిచినందుకు నేను సమైక్యవాదిని కాను. 1919 నవంబర్ 16న నిజాం ముల్కీ ఫర్మానా జారీ చేశా డు.
ఈ ఫర్మానా ప్రకారం స్థానికులు మాత్రమే ప్రభుత్వోద్యోగాలకు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే, స్థానికులు ముల్కీ సర్టిఫికెట్స్‌ని తప్పనిసరిగా సమర్పించాలి. ఐతే ఇంకా స్పష్టతతో సవరించిన ముల్కీ ఫర్మానా 1934 జూన్7న జారీ అయ్యింది. దీని ప్రకారం 12-15 సంవత్సరాల స్థిర నివాసం తో పాటు అభ్యర్థి పూర్వీకుల నివాసం, వివాహబంధం, ఆస్తు లు తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని ముల్కీ సర్టిఫికెట్ జారీ చెయ్యాలని ఈ ఫర్మానా ఆదేశిస్తున్నది. కాగా, ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనానికి ముందు 1956 జూన్19న జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం విలీనానంతరం కూడా తెలంగాణలో ముల్కీ రూల్స్ అమలు జరగాలి.
అలా జరగని పక్షంలో తెలంగాణ వారు తమ రాష్ట్రాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ఐతే ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా 1956- 1968 నాటికి హైదరాబాద్‌లో అక్రమంగా ఉద్యోగాల్లోకి చొరబడిన సీమాంధ్రుల సంఖ్య 22 వేలు. వీరిని వెనక్కి పంపాలని అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 36ను జారీ చేసింది. ఈ జీవోకు వ్యతిరేకంగా ముల్కీ రూల్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రావారు ఉన్నత న్యాయస్థానాలకు ఎక్కినందు వల్ల నేను సమైక్యవాదిని కాను. ఆంధ్రుల అక్రమ నియామకాలను నిలువరిస్తూ, ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమేనని 1972 అక్టోబర్ 16న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనితో ఖంగుతిన్న ఆంధ్ర రాజకీయ పాలకులు అంతటితో ఊరుకోకుండా ఏకంగా సుప్రీంకోర్టు ధృవీకరించిన ముల్కీ రూల్స్‌నే రద్దు చేయించారు.
ఇందుకు వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి పార్లమెంటులో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణం 371కి 'డి' క్లాజు ను చేర్చారు. ఈ సవరణతో సంక్రమించిన అధికారంతో రాష్ట్రపతి 1975 అక్టోబర్ 18న (ఆరు సూత్రాల పథకం) ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల స్ఫూర్తిని కూడా ఉల్లంఘించి ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు 1975 నుంచి 1985 వరకు 60 వేల మంది అక్రమంగా హైదరాబాద్‌లో చొరబడ్డారు. వీరిని వెనక్కి పంపడానికి 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం 610 జీవోని జారీ చేసింది. హైదరాబాద్‌లో అక్రమంగా ఉన్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపడానికి ఉద్దేశించిన ఈ జీవోను హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను వెనక్కి పంపడానికి ఉపయోగిస్తూ మరో చారిత్రక తప్పిదాన్ని చేస్తున్న ఆంధ్ర పాలకుల పోకడల వల్ల నేను సమైక్యవాదిని కాను.
సీమాంధ్ర రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాయి. ఆంధ్రోళ్ల మోసపూరిత పొత్తు వద్దని తెలంగాణ వారు అంటుండగా, మనమంతా ఒక్కటే, మనదంతా ఒక్కటేనని సీమాంధ్ర నేతలు ముందుకు తెస్తున్న దౌర్జన్యపూరిత ఐక్యత వల్ల నేను సమైక్యవాదిని కాను. నీళ్లు, నిధులు, నియామకాల అమలులో తెలంగాణకు పంపిణీ న్యాయం ఎన్నడూ అందలేదు. ప్రతిచోట, ప్రతిదశలో పథకం ప్రకారం తెలంగాణ ప్రజలు ఆంధ్ర పాలకులచే మోసగించబడ్డారు. కొల్లగొట్టబడ్డారు. 20 ఏళ్ల కిందట తూర్పు ఐరో పా సంఘర్షణలకు లోనై అనేక కొత్త, చిన్న దేశాలుగా విడిపోయిన చరిత్ర మనం చూశాం. ఎంత రక్తపాతం జరిగిందో తెలిసిందే.
అటువంటి హింసాపూరిత సంఘటనలు మన దేశంలో చోటు చేసుకోకూడదు. అత్యంత అణచివేతలకు గురైన ప్రాంతాలకు, అణగారిన సాంఘిక సమూహాలకు, జెండర్ వర్గాలకు, వివిధ రకాల మైనారిటీలకు వారు కోరుకున్న రీతు ల్లో ప్రాధాన్యంతో కూడిన సామాజిక న్యాయాన్ని ప్రభుత్వాలు అందించాలి. ఇందుకు వీలుగా మొదట రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యీకరించబడాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ, మహిళల హక్కులు, ప్రాతినిధ్యాలు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు అత్యవసరంగా పరిష్కరించవలసిన ప్రాధాన్యం గల డిమాండ్లుగా మన దేశంలోని రాజకీయ పార్టీ లు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించాలి.
దేశంలో ప్రాంతీ య, సామాజిక శాంతి భద్రతల సుస్థిర స్థాపన కోసం తెలంగాణ రాష్ట్రం, ఇతర కొత్త రాష్ట్రాల డిమాండ్లకు సానుకూల పరిష్కారాల కోసం రాజకీయ పార్టీలు స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ స్నేహంగా విడిపోయి మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. తదుపరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మన్యసీమ రాష్ట్రాలు ఏర్పడాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాలు పది ఉన్నప్పు డు తెలుగు మాట్లాడే రాష్ట్రా లు నాలుగైదు ఉంటే నష్టమేమీలేదని అందరూ గుర్తించాలి. రాష్ట్రాల సంఖ్య పెరిగి తే, కేంద్రం బలహీనపడుతుందనేది అపోహ మాత్రమే. ఎన్టీఆర్ తాలూకా వ్యవస్థకు మారుగా మండల వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు స్వాగతించిన రాజకీయ పార్టీలు నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అంగీకరించలేకపోవడం చాలా అన్యాయం.
అందువల్ల నేను సమైక్యవాదిని కాలేను. చిన్న రాష్ట్రాల డిమాండ్లకు సానుకూలంగా ఉండడం అంబేడ్కర్‌వాద దృక్పథమని సామాజిక న్యాయం కోరుకునే ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సీమాంధ్ర రాజకీయ పార్టీ ల ఉచ్చుల్లో చిక్కుకోకుండా, ద్వేషాలను పెంచుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును స్వాగతించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్లమెంటులో చట్టం చెయ్య డం తప్ప, రాష్ట్ర శాసనసభ అభిప్రాయం నిర్ణయాత్మకం కాదంటున్న రాజ్యాంగ స్ఫూర్తిని సీమంధ్ర పార్టీలు, ప్రజాప్రతినిధు లు, నేతలు గ్రహించాలి. రాజ్యాంగంలోని అధికరణం 3కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీలు, సీమాంధ్ర నేతలు చిత్తశుద్ధితో ముందుకు సహకరించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడనంత వరకు, సీమాంధ్రుల్లో సానుకూల పరివర్తన రానంత వరకు నేను సమైక్యాంధ్రుడను కాజాలను.
-కృపాకర్ మాదిగ
(వ్యాసకర్త మాదిగ దండోర ఉద్యమ వ్యవస్థాపకులు)
1 కామెంట్:
Darla garu,
please see this.
http://telanganaonline.org/news/2009/12/26/salute_telangana_students/
కామెంట్‌ను పోస్ట్ చేయండి