"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

07 సెప్టెంబర్, 2009

భరత ఖండంబు చక్కని పాడియావు ... చిలకమర్తి రాయలేదా?



దీన్ని చెన్నాప్రగడ భానుమూర్తిగారు రాశారని ఒక వాదన ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన ఒక వ్యాసం సూర్య దినపత్రికలో 7-9-2009 న ప్రచురితమైనది. సూర్య సౌజన్యం తో దీన్ని ఇక్కడ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రచురిస్తున్నాను. .. Dr.Darla


ఆ ‘పాడియావు’ చిలకమర్తిది కాదు !
అతివాద త్రయంగా ముద్రపడిన నాయకులలో ఒకరైన బిపిన్‌ చంద్ర పాల్‌ వందేమాతర ఉద్యమ ప్రచారం కోసం 1907 ఏప్రిల్‌ నెల లో రాజమండ్రి వచ్చారు. ఐదు రోజులు (కొందరు చరిత్ర కారులు మూడు రోజులన్నారు) సభలు పెట్టి ఆంగ్లంలో ప్రసం గాలు చేశారు. ప్రతిరోజూ వారు ప్రసంగించిన తరువాత, ఆనా టి ప్రసంగ సారాంశాన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగు లో చెప్పినట్లు స్వీయ చరిత్రలో రాసుకున్నారు. ఇంకా ‘కట్ట కడపటి దినమున సభలో కూర్చొండి నా మనసులో ఊహిం చుకొని ఈ కింది పద్యమును బహిరంగముగ కట్టకడపట జదివితిని.
తే.గీ. భరత ఖండంబు చక్కని పాడి యావు‘ఈ పద్యమును విని సభా సదులు సంతోష పారవశ్యమున బ్రహ్మాండము పగులునట్లు చప్పట్లు కొట్టిరి. ఈ పద్యము అన్ని పత్రికల్లోనూ పడెను... ఈ పద్యమెట్లు ప్రాకి వెళ్ళెనోగాని క్రిష్ణా నది వంతెన గోడల మీద పెన్సిళ్ళతో వ్రాయబడెను..’ అని చిలక మర్తి స్వీయ చరిత్రలో (అభ్యుదయ రచయితల సంఘం ప్రచు రణ 1944 పే 225,226 రాసుకున్నారు. ఈ ఒక్క ఆధారంతో పై పద్యం చిలకమర్తి వారి రచనగా-ఎక్కడో ఒకరిద్దరు మినహా - తెలుగు సాహిత్య లోకం గత వంద సంవత్సరాలుగా గౌరవించింది.‘మనసులో ఊహించుకొని అని చిలకమర్తి వారు రాస్తే’ చంద్రపాల్‌ ఉపన్యాసం విని ఉద్రిక్తులై చిలకమర్తి లక్ష్మీనర సింహం రాసి చదివిన పద్యమిది’ అని డా సి.నారాయణ రెడ్డి తన పరిశోధనా గ్రంథమైన ‘ఆధునికాంధ్ర కవిత్వం’ (పే .377) లోను, తన సమగ్ర సాహిత్యం లోనూ (పే.356) రాసి, చిలక మర్తి వారు పెట్టిన చిచ్చును రగిల్చారు. ‘1907లో బిపిన్‌ చంద్ర పాల్‌ ఆంధ్రదేశమునకు వచ్చిన సందర్భంలో సహజ కవితా ధారతో వీరు (చిలకమర్తి) చెప్పిన ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అను పద్యం అజరామరమైనది’ అని డా కొత్తపల్లి వీరభద్రరావు తన పరిశోధనా గ్రంథమైన ‘తెలుగు సాహిత్యం పై ఇంగ్లీషు ప్రభావం’లో (పే.506) ఆ చిచ్చును ఊదారు. తెలు గులో జాతీయోద్యమ కవిత్వం మీద పరిశోధన చేసి డామ ద్దూరి సుబ్బారెడ్డి ‘చిలకమర్తివారు ఆశువుగా ఈ పద్యం చెప్పా’ రన్నారు (తెలుగులో జాతీయోద్యమ కవిత్వం పే.98). డా ముక్తేవి భారతి చిలకమర్తి వారి సాహిత్యం మీద పరిశోధన చేసి ప్రచురించిన ‘చిలకమర్తి సాహిత్య సేవ’లో ‘1907 బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసానికి తెలుగు అనువాదం చేస్తూ ఆశు వుగా చెప్పిన పద్యమిది’ అని పీఠికలో స్పష్టంగా పేర్కొని అదే పరిశోధనా గ్రంథంలో (పే.273) మరో చోట ‘చిలకమర్తివారు ఒక పద్యం చదివారు’ అని పేర్కొన్నారు. ముందు పీఠికలో ఆశు వుగా చెప్పారని, తరువాత చదివారనటం ఎంతవరకు సబబు? అసలు పరిశోధకుల మధ్య ఈ వైవిధ్యం ఏమిటి? దీనికి కారణం ఏమిటంటే, డాసి.నారాయణరెడ్డి వంటి పెద్దలు మూ లాన్ని చూడక పోవటం, కొందరు ‘పరిశోధన’ పేరుతో ఊహిం చుకొని రాయటం జరిగింది. చిలకమర్తివారు పేర్కొన్న ‘మదిలో ఊహించుకొని’ అనే పదాలకు చిలకమర్తీయులు ఏవేవో అర్థాలు చూపించి అది చిలకమర్తి రచనే అని వాదిస్తున్నారు.1907లో చిలకమర్తివారు ప్రచు రణకర్తగా, సంపాదకుడిగా జోడు గుర్రాల స్వారీ చేసిన ‘మనోరమ’ అనే మాస పత్రికలో పాల్‌ సభ గురించి గాని, ఆ సభలో ‘భరత ఖండంబు...’ పద్యం చదవటం గురించి గాని ఒక్క మాట కూడా రాయలేదు. అట్లాంటిది, అది జరిగిన 35 సంవత్సరాలకు (స్వీయ చరిత్రము రాసింది 1942 లో) ఆ సంఘటన గుర్తు కొచ్చిందా? ఆనాడు మనోరమలో (ఆ రోజుల్లో దానికి మంచి పేరుంది) రాయటానికి నోచుకోని ఈ పద్యం గురించి స్వీయ చరిత్ర లో రాసుకుంటే, దానికున్న ప్రామాణికత ఎంత? స్వీయ చరిత్రలో చిలకమర్తి వారు ఈపద్యానికి దాని నేపథ్యానికి ఇవ్వవల సినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ పద్యం చదివిన 15 రోజుల కే అతివాద త్రయంలో ఒకరైన లాలా లజపతిరాయ్‌ని ప్రభుత్వం నిర్బంధించింది. చరిత్ర పాఠ్య పుస్తకాల్లోనూ రాయ ని ఆయన అరెస్టు అయిన నెల, తేదీ మొదలైన వివరాలు స్వీయ చరిత్రలో పేర్కొన్నారు గాని, రాజమండ్రిలో పాల్‌ సభ లు ఎప్పుడు జరిగాయో (ఏ తేదీన), చిలకమర్తి వారీ పద్యాన్ని ఏ తేదీన చదివారో స్వీయ చరిత్రలో రాయలేదు.స్వీయ చరిత్రలో ‘ఈ పద్యమన్ని పత్రికల్లోనూ పడెను’ అన్న చిలకమర్తి వారి మాటలకు డా సి.నారాయణరెడ్డి ఇంకో అడు గు ముందుకేసి ‘ఈ పద్య ప్రభావం అంతటితో తీరి పోలేదు (అంటే సభలో వినిపించటంతోనే అని అనుకోవాలి), ఆనాడు ఆంధ్ర దేశంలో వ్యాప్తిలోనున్న అన్ని పత్రికల్లో కెక్కింది’. అని తెలియజేశారు. డాముక్తేవి భారతి మాత్రం ‘పత్రికల్లో పడెను’ అనే వాక్యాన్ని మాత్రమే తన సిద్ధాంత గ్రంథంలో వదిలే యటం ఈ సందర్భంలో గమ నార్హం. 1907-1942 మధ్య కాలంలో సాహితీ వేత్తలుగాని, చరిత్ర కారులు గాని చిలకమర్తి వారీ పద్యాన్ని చదివినట్లు ఎక్కడా రాసిన దాఖలా లేదు. కాబట్టి ఆనాడీ పద్యం పత్రికల్లో పడెను, లేదా ఎక్కెను అని అనుకోవటం ప్రశ్నార్థకం. చిలకమర్తివారు ‘ఆనాడీ ఈ పద్యం క్రిష్ణానది వంతెన గోడల మీద పెన్సిళ్ళతో రాయబడెను’ అని స్వీయ చరిత్రలో రాస్తే, ప్రముఖ చరిత్రకారుడు మామిడి పూడి వెంకట రంగయ్య సంపాదకత్వంలో వెలువడిన (Freedom struggle in Andhra Vol II అనే గ్రంథంలో and was insenites in public places and on the walls of the godavari bridge)ü (పే.19) అని స్వీయ చరిత్రలో రాసిన దానిి భిన్నం గా పేర్కొన్నారు.‘చిలకమర్తి వారి ‘భరత ఖండంబు’ అను పద్యం తెలుగులో భారత జాతీయోద్యమ సంబంధమైన తొలి రచనయని చెప్పవ చ్చును. ఈ పద్యముతో జాతీయోద్యమ కవిత్వమునకు బీజా వాపనము జరిగినది’ అని డా సి.నా.రే ‘ఒక లక్ష్మణ రేఖ’ లాంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఒక మేడిపండు! ఎందుకంటే డాయన్‌.వి.యస్‌. ప్రసాద్‌ ‘ది జర్నల్‌ ఆఫ్‌ తెలుగు లిటరేచర్‌’ అనే తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించే పత్రికలో (జు.లై.1988) ‘చిలకమర్తివారి ‘‘భరత ఖండంబు అనే పద్యం-ఒక సందేహం’’ అంటూ ఓ వ్యాసాన్ని రాసి, అది చెన్నా ప్రగడ భానుమూర్తిదని అభిప్రాయపడ్డారు. 1959లో పోతు కూచి సూర్యనారాయణ మూర్తి వెలువరించిన భానుమూర్తి కావ్యకుసుమాంజలి అనే సంకలనంలో ‘భరత ధర్మ దర్శనం’ అనే ఓ పద్య కావ్యం ఉండగా, అందులోని నాల్గవ ఖండంలో మొదటి పద్యంగా ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ ఉన్నది. ఈ ఖండకావ్యాన్ని భానుమూర్తి 1905లో రాయగా, జాతీయోద్యమ కవిత్వంలో తొలి గ్రంథంగా మచిలీపట్నానికి చెందిన ‘ఆంధ్రభాషాభి వర్ధనీ సంఘం లిమిటెడ్‌’ వారు 1907లో తమ తొలి ప్రచురణగా ముద్రించారు. చెన్నా ప్రగడవారు నిష్కళంక దేశభక్తుడు. 1907లో మచిలీ పట్నం నోబుల్‌ కాలేజీలో లెక్చరర్‌. పెద్దస్కాలర్‌. చిలకమర్తి వారికి బా ల్య మిత్రుడు. ఆ రోజుల్లో చిలకమర్తి వారి ‘మనోరమ’లో వీరి నాటకాలు, ఖండికలు చాలా ప్రచురించారు.స్వీయ చరిత్రలో ‘భారత ధర్మ దర్శనం’ గురించి-అది తన బాల్య మిత్రుడు రాసిందే అయినా, దేశభక్తికి సంబంధించి వెలువడిన తొలిగ్రంథమే అయినా-చిలకమర్తి వారు ప్రస్తావించకపోవటం, వారి స్నేహధర్మాన్ని శంకించవలసి వస్తోంది. స్వీయ చరిత్ర రాసే నాటికి కూడా తన పేరుతో చలామణీ అవుతున్న ఈ పద్యం భారత ధర్మ దర్శనంలో 35 సంవత్సరాలకు ముందే ముద్రించి ఉంటే, ఆసమకాలీన జాతీయోద్యమ సాహిత్యాన్ని గురించి చిలకమర్తివారు స్వీయ చరిత్రలో వివరించలేదు. ఆ పద్యం నిజంగా తనదే అయితే-దాన్ని భానుమూర్తి తస్కరించి తన ‘భరత ధర్మ దర్శనం’లో ముద్రించుకున్నాడని రాసుకోవచ్చు కదా! స్వీయ చరిత్రలో కొన్ని లొసుగులుండబట్టే-చిలకమర్తి వారు బతికు న్నప్పుడే టంగుటూరి శ్రీరాములు 1945లో ‘త్రిలింజ్ఞ’ పత్రి కలో ఈ స్వీయ చరిత్రను విమర్శిస్తూ వ్యాసాలు ముద్రిం చారు. ఇట్టి స్వీయ చరిత్ర ‘భరత ఖండంబు.....’ పద్య కర్తృత్వానికి సంబంధించి ప్రామాణికం కాదు సరికదా ప్రమాదం. ఇప్ప టికైనా తెలుగు సాహిత్యంలోకం దీన్ని గుర్తించాలి.

1 కామెంట్‌:

Bolloju Baba చెప్పారు...

డా.దార్ల గారికి
నమస్కారములు
ఈమాట లో నా పాబ్లో కవితపై మీ కామెంటుకు ధన్యవాదములండీ.

ఈ అంశంపై ఇదివరలో ఈ క్రింది లింకులో నా నా రొష్టూ పద్దాను :-)

http://jeedipappu.blogspot.com/2009/05/blog-post_14.html

భవదీయుడు

బొల్లోజు బాబా