( వీచిక పుస్తకాన్ని ఆచార్య పరిమి రామనరసింహం గారికి అంకితమిస్తూ...రాసిన కవిత.)
కలలా ఉంది
కళగా ఉంది
కల నిజమయినట్లుంది
రాయలసీమ కరువు తీరినట్లుంది
తెలంగాణా వీణ మోగినట్లుంది
కోనసీమ మీగడ బొండం నీళ్ళలా ఉంది
పండిన గుంటూరు మిరపతోటలా ఉంది
డిసెంబరు నెల్లో కప్పేసిన మంచుని
జయించిన కొత్త సంవత్సరం కొత్త పొద్దులా ఉంది
ఎంత మారిపోయిందిప్పుడు
నాడు మూలకి విసిరేసినట్లుండే తెలుగుశాఖ!
పాఠాలు విన్న విద్యార్థి స్థానం మారినా
"ఆ' స్థానం మారని నిత్య విద్యార్థినవుతూనే
మాష్టారు ముందు నిలబడేదెప్పుడూ...
చదువుకున్న చోటే
చదువు చెప్పే చోటయ్యింది
చెప్పలేనా మధురానుభూతి
చదువు చెపిన గురువులే
సహాధ్యాపకుడిగా ఒడి చేర్చుకున్నప్పుడు
ఎలా వర్ణించగలనా దివ్యానుభూతి!
కలలా ఉంది
తళతళ మెరిసిపోతోంది
తెలుగు కన్న కంప్యూటర్ కల
తెర మీదే చూస్తున్నట్లుంది
పై కొచ్చే కొద్దీ పొద్దుని చుట్టేస్తూ
ముంచుకొస్తున్న మబ్బులు
మేథోతీరంలో వాలి
మింగేయాలని చూసే కర్ణ గ్రహణాలు
ఆపగలవా నిజకిరణాల్ని!
పాస్ వర్డ్సే కాదు
అవకాశాల్తో చొచ్చుకొచ్చే వైరస్‌నీ
కనిపెట్టగలడా అవధానకవి రవి
కడిగిన ముత్యమై
పైపైకొచ్చే అమృతంగమయి భానూదయుడే!
అనుభవమిదిగో నా స్మృతి పథంలో
అరవైలో చూశాను
ఆరేళ్ళ బాల్యం నడిచిన ముద్రల్నీ
ఒక్కొక్క అడుగు పడినప్పుడల్లా
అమరావతి గుడి గం టలు ఆ గుండెల్లో
పవిత్రంగా ప్రతిధ్వనించిన పులకాంకురాల్నీ
గుడిలో కనిపించిన
బడిలో మాష్టారింకా
పేరుపెట్టే పిలుస్తుంటే
చూశాను
ఆనందాశ్రువుల్లో మెరిసిపోతున్న కళ్ళనీ
ఒదిగి ఒదిగి ప్రవహిస్తున్న
ఆచార్యత్వంలోనూ వినియాన్ని!
అరవైలో చూశాను
పదహారేళ్ళ నవయవ్వన ప్రాయాన్నీ
అమరం వరమైన పద్యాలహారంతో
ఒళ్ళు పులకరించిన కృష్ణానదిని
అదిగో ఆ మురళీ మాధుర్య గానంలో
సరస రుచులూరిస్తున్న
బాల్య సఖుడ్ని చూసినప్పుడల్లా
కృష్ణవేణి మళ్ళీ మళ్ళీ పొంగుతోంది
అరవైలో చూశాను
పుట్టిన ఊరూ
కన్న తల్లీ స్పర్శించి రూపుకట్టిన పసిమొగ్గనీ
శిథిల శకలాల్లోనే
సౌందర్య భరిత జన్మస్థలాన్ని దర్శించిన ఉద్వేగాన్నీ!
పురావస్తు శాఖకు చెప్పాలి
అమ్మలా ఆహ్వానించే సల్లని వేపచెట్లనీ
మళ్ళీ మళ్ళీ మనోహరంగా కనిపించే
మనిషి పుట్టిన ప్రతిచోటునీ
బ్రహ్మ రాతల్లో రాసుకున్న
వారాలబ్బాయి మట్టి పలకల్నీ
జ్ఞాపకాలై పుష్పించే
వీథి వీథుల్నీ
ప్రొటెక్టెడ్ ఏరియాలుగా ప్రకటించాలని
పురావస్తు శాఖకు చెప్పాలి!
కలలా ఉంది
కలలోని కళ ఫలించినట్లుంది
కళ తళుక్కుమన్నట్లుంది
పలికే ప్రతి చిలుక పలుకూ సావధానం
మేథో గీత గీసే సంతకమో చమత్కారం
శ్రమించే అహర్నిశలకీ ఓ పురష్కారం
భాషా సాహిత్య సంస్కృతులూ
ప్రాచీనాధునిక సాంకేతికాలూ
ప్రాజెక్టుల్లో చేరి
నల్ల బల్లపై వాలే తెల్ల పావురాలు
ఎంత మారిపోయిందిప్పుడు
పునాదుల్లోని పూరి గుడిసె
నవజీవన కాంతుల్లో కొత్త జన్మ ఎత్తినట్లే ఉంది!
-- దార్ల వెంకటేశ్వరరావు
23-01-2006
1 కామెంట్:
అద్భుతం. కల సాకారమైన వేళ కళ కళల కవితా తరంగం. కలలా కరిగిన భూతం కళకళల భవిత.
కామెంట్‌ను పోస్ట్ చేయండి