Thursday, August 06, 2009

'నిశితమైన పరిశోధన స్పర్శ గ ల వ్యాస సంపుటి "వీచిక'

(హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న డా. అద్దంకి శ్రీనివాస్ " తొలివీచిక' పేరుతో డా.దార్ల వెంకటేశ్వరరావు విమర్శవ్యాస సంపుటి " వీచిక" కు రాసిన అభిప్రాయాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను
. ...దార్ల )


విమర్శ వ్యాసాలు రాయడంలో మిత్రుడు "దార్ల'ది ఒక ప్రత్యేకమైన దారి. దారిలో అతనికి కొన్ని ప్రమాణాలున్నాయి. విశాలమైన రహదారుల్లాంటి విశ్లేషణలున్నాయి. చదువరులను ఆపి మరీ ఆలోచింపజేసే మజిలీలున్నాయి. ఇలా సాగే విమర్శ ప్రయాణానికి గమ్యం తీర్పు (Judgment). ఇది విమర్శకో సల్లక్షణం. Hudson తన "Literary Criticism'లో ""In its straight sense the word criticism means Judgment'' అంటాడు. నిజమైన విమర్శకుడు తన వ్యక్తిగతాభిరుచులను సంపూర్ణంగా త్యాగం చేసి విషయ విశ్లేషణపై భీష్మించుకొని కూర్చుంటాడు. సరిగ్గా తూకం వేసినట్లుగా తన లోచూపు ప్రసరించిన పరిసరాల్లోని చీకటి కోణాల్ని, వెలుగు రేఖల్ని సమానంగానే ఆవిష్కరిస్తాడు. సమస్థితి మీదే విమర్శ తాలూకూ స్థితి కూడా ఆధారపడి ఉంటుంది. నేపథ్యంలో కావ్య స్రష్ఠలు విమర్శకుని చేతిలో పూర్తి అస్తిత్వాన్ని కోల్పోతారు. విమర్శకునికి కావలసింది కావ్యమే. అందుకే ఇలియట్ అంటాడు ""The real criticism is based not upon the poet, but upon the poetry'' అని! అందుకే కళింగాంధ్ర కవిత్వం వెలువరించిన కవులు కన్నా కవుల కలాల్లో ప్రతిధ్వనించిన అస్తిత్వవేదనలే విమర్శకుడికి ముఖ్యమయ్యాయి.

"విమర్శ' అంటే ఒక మథనం. మనం ఒక దానికోసం చిలకడం మొదలుపెడితే ఊహించనివెన్నో చేతికి తగులుతాయి. అప్పుడు గనక విమర్శకుడు కొంచెం అటో ఇటో అయ్యాడంటే, ఇంక విమర్శ ఎటుపోతుందో చెప్పలేం. సమ్యగ్వీక్షణం, నిరంతర ప్రయత్నం విమర్శకు ఎంతో అవసరం. రెండూ పుష్కలంగా పండిన వ్యాసాలు రెండున్నాయి. అవి వల్లంపాటి, పింగళి లక్ష్మీకాంతాలపై రాసిన వ్యాసాలు ఒక కవిత్వం మీదో, ఒక కథా సాహిత్యం మీదో విమర్శ చేయడానికి విమర్శకుడికి చేతినిండా ముడి సరుకు ఉంటుంది. కానీ విమర్శపై విమర్శ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీనిలోనూ ముడిసరుకు ఉంటుంది. అయితే అది నివురు కప్పిన నిప్పు.

భాషలో కొన్ని మధురమైన శబ్దాలుంటాయి. అవి భావ మాధుర్యాన్ని పిడికిట బట్టిన కవి కలంలోంచి జాలువారతాయి. భాష, భావం జంట ప్రవాహాలుగా సాగే మాధురీభరిత కావ్యంలోని మాధుర్యాన్ని పట్టుకోవాలంటే విమర్శకుడు ప్రవాహంతో పరుగుతీయడం కాదు. అవసరమైతే కవి కన్నా, కవితా మాధుర్య రస ప్రవాహం కన్నా కొన్ని సార్లు ముందు ఉండగలగాలి. లక్షణం కోసం చేసిన ప్రయత్నానికి రూపమే మల్లవరపు జాన్ కవిత్వంలో మాధుర్యం వ్యాసం.

ప్రక్రియా వైవిధ్యం, విషయ వైవిధ్యం, ఉద్యమ నేపథ్యాలు కల రచనల్ని వివేచించి, వాటి విలువల్ని నిర్ణయించే వ్యాసాలిందులో ఉన్నాయి. ఆధునిక ఉద్యమాల మూలాలను స్పృశిస్తూ, వాటి ప్రభావాలతో వచ్చిన రచనలను విశ్లేషించిన తీరులో లాక్షణికత ఉంది. "దళిత సాహిత్యం - మౌలిక భావనలు', ""ఆమ్రపాలి కథలు - మార్పులు ఔచిత్యపు తీర్పులు'' రెండు వ్యాసాలూ లాక్షణికతకు నిదర్శనంగా నిలుస్తాయి. విమర్శకుడు విషయ వివేచన గావించిన తర్వాత రచనపట్ల ఒక తీర్మానానికి వస్తాడు. తీర్మానంతో పాటు తన అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు. అభిప్రాయమే రచనకు కల విలువను నిర్ణయిస్తుంది. మాక్సిమ్ గోర్కీ అమ్మ నవల రచనా నైపుణ్యంపై విమర్శకుడు వెలువరించిన అభిప్రాయాలు, నవల చిత్రించాలనుకున్న లక్ష్యాలను, చిత్రించిన జీవన వాస్తవికతను నిరూపిస్తున్నాయి.

సమకాలీన సమాజంలో మారుతున్న సాహిత్య వాతావరణాన్ని చూస్తూ విమర్శకుడు ఊరుకోలేడు. అందుకే దార్ల వెంకటేశ్వరరావు ఆధునిక ప్రక్రియగా మధ్య కాలంలో కవుల కలాలను ఎక్కువగా ఆకర్షించిన నానీ ప్రక్రియ నేపథ్యంగా ""ప్రయోగాల పల్లకిలో నానీల సినారె'' వ్యాసం రచించారు. వ్యాసం వర్తమాన సాహిత్య వాతావరణానికి నిలువుటద్దం. ఒకవైపు ద్వానాశాస్త్రి గారు సినారెపై రాసిన నాని శతకాన్ని విశ్లేషిస్తూనే, హైకూ, నానీ ప్రక్రియల స్వరూప స్వభావాల్ని, సమకాలీన సమాజంలో వాటి స్థితిని, కవుల అభిప్రాయాలను, వాటిపై వచ్చిన విమర్శల్ని సాహితీ లోకానికి పరిచయం చేశారు.

స్త్రీవాద సాహిత్యం భూమికగా నిలిచిన ఒక నవలను, సమాజంలో ఒక వర్గంగా బలమైన గొంతుకతో కవిత్వం చెప్పిన ముస్లింవాద కవిత్వాన్ని విమర్శించిన తీరులో వైవిధ్యం ఉంది. "మనసున మనసై' నవల స్త్రీవాద తాత్త్వికతను ఎలా ప్రతిబింబించిందో నిరూపించారు. ముస్లిం మైనారిటీలలో స్త్రీలు తమ అస్తిత్వం కోసం, సమానత్వం కోసం స్పందించిన తీరు, వారి అంతరంగం వంటి తాత్త్విక అంశాలను విశ్లేషించారు. ముస్లిం మైనారిటీని ఒక వాదంగా, వాదం నేపథ్యంగా వెలువడ్డ సాహిత్యాలను నిర్వచించి నిరూపించిన తీరు సహేతుకంగాఉంది. పూర్వ విమర్శకుల వాదాలను సమగ్రంగా ప్రస్తావిస్తూ చేసిన ప్రతిపాదనలు భావి విమర్శకులకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పవచ్చు. తొలి తెలుగు కథానిక పై రాసిన వ్యాసంలో ఆ కథలను పరిచయం చేసి విశ్లేషించడం పట్ల పాఠకుడు కూడా తన దైన నిర్ణయానికి రాగలుగుతాడు.

మొత్తం 14 వ్యాసాలతో "వీచిక' రూపంలో సాహిత్య లోకంలో విస్తరించుకొంటున్న డా. దార్ల వెంకటేశ్వరరావు గారిది విమర్శ రంగంలో తొలివీచిక. స్థూలంగా విషయాన్ని ఒడిసిపట్టుకోగల నేర్పు, సూక్ష్మంగా నిశితమైన పరిశోధన స్పర్శలు మిక్కుటంగా కన్పించే వ్యాస సంకలనం సాహిత్యాభిలాషులకు విమర్శపట్ల ఒక సదభిప్రాయం కల్గించేందుకు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. తొలి "వీచిక' మున్ముందు నా మిత్రుడు డా. దార్ల వెంకటేశ్వరరావు వెలువరించ బోయే మరిన్ని మలివీచికలకి శుభ వీచిక కావాలని ఆశిస్తూ...

-డా.అద్దంకి శ్రీనివాస్

లెక్చరర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.


No comments: