Important Contact Numbers of The University of Hyderabad link https://www.uohyd.ac.in/index.php/administration/contact

దార్ల సాహిత్య విమర్శ వ్యాసాల పుస్తకం " వీచిక"కు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి అభిప్రాయం

నేను రాసిన సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పేరు " వీచిక".
Veechika vrdarlaఈ వ్యాస సంపుటికి ఈ పేరు పెట్టిన వారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఆయనను రెండు ఆశీర్వచనాలు రాయమని అడిగితే " లహరి " పేరుతో ఇలా రాసి నన్ను దీవించారు.
"అనారతాధ్యాపన తత్పరుడు మా సహవ్రతుడు డా.దార్ల. అధ్యాపనం సంతృప్తికరంగా సాగాలంటే అనారతాధ్యయన తత్పరత ఉండాలి. ఈ రెండు గుణాలూ పుష్కలంగా ఉన్నాయి వీరిలో. ఇక్కడితో సంతృప్తి చెందకుండా తరగతి గదికి వెలుపల ఉండే అసంఖ్యాక సాహితీ ప్రియులకు తన ఆలోచనలను, విశ్లేషణలను, సమన్వయాలను, అవగాహనలను అందించి స్వీయాభివృద్ధికీ సాహిత్యాభివృద్ధికీ రచనా వ్యాసంగాన్ని ఒక వ్యసనంగా సాగిస్తున్న విమర్శకుడు ఈయన. సంప్రదాయ ఆధునిక సాహిత్యాలలోని అన్ని రూప భేదాలనూ, వాద వైవిధ్యాలనూ ఆకళింపు చేసుకుని విలువైన వ్యాసాలూ, సమీక్షలు, గోష్టి పత్రాలూ పుంఖానుపుఖంగా వెలువరిస్తున్న సాహితీ కృషీవలుడు ఈయన. వీటి అన్నింటికీ నిదర్శనం ఈ వ్యాస సంపుటి.
పరిశోధకుడిగా పింగళి లక్ష్మీకాంతంగారి వరివస్యను మదింపు వేసినా, వల్లంపాటి వారి విమర్శ దృక్పథాన్ని విశ్లేషించినా, జ్ఞానానందకవి, మల్లవరపు జాన్‌ గార్ల పద్యకృతులను అనుశీలించినా, సాహిత్యంలోని ప్రాంతీయతలనూ, మానసిక స్థితిగతులనూ మూల్యాంకన చేసినా, నానీలూ, కథలూ, నవలలూ, అనువాద నవలల్లోని రూప వైవిధ్యాన్ని ఆవిష్కరించినా, దళిత వాద, స్త్రీవాద, మైనారిటీ వాదాల నేపథ్యంలో ఆయా రచనల విలువలను నిర్ధారించిన డా. దార్ల - తలస్పర్శి అవగాహనతో, నిష్పాక్షికతతో చేసి తన ఉత్తమ విమర్శక లక్షణాన్ని నిరూపించుకున్నారు. ఈ సంపుటిలోని ప్రతి వ్యాసమూ పాఠకుల అవగాహన పరిధులను విస్తరించేదే. ఏదో ఒక కొత్తదనాన్ని ఆలోచనాత్మకంగా అందించేదే. మామూలు మాటల్లో చెప్పాలంటే చదువరి శ్రమకు ప్రతి వ్యాసమూ గిట్టుబాటు అవుతుంది.
ఇది ఇలా ఉండగా వీరిలోని మరో విశిష్టత ఏమంటే - ఈయన ఒక నెటిజన్‌. ఆధునిక సాంకేతికతను సాహిత్య చర్చలకు సద్వినియోగం చేసుకుంటున్న యువతరం ప్రతినిధి. భూగోళం మీద ఏ మూల ఉన్న తెలుగు సాహితీ ప్రియుడికైనా తన రచనలను అందిస్తున్నారు. ఆలోచనలను పంచుతున్నారు. చర్చలను సాగిస్తున్నారు. ఇది బహుధా ప్రశంసనీయం.
నిజానికి - లబ్ధ ప్రసిద్ధుడైన ఈ విమర్శకుడి రచనలకు నా కితాబు అవసరం లేదు. అయినా వృద్ధోపసేవీ రాఘవ: అన్న తీరున నన్ను నాలుగు ముక్కలు రాయమని అడిగారు. సహవ్రతులం. వీరి సాహితీ గురువులు ద్వా.నా.శాస్త్రి, రమణమూర్తి ప్రభృతులు నా చెలికాండ్రు. పైగా ఈ వ్యాసాలు చదివి లబ్ధి పొందిన వాణ్ని. అభినందించకుండా ఎలా ఉండగలను! మరొక విషయం - నానాటికీ అన్ని రంగాలలోనూ విలువలు దిగజారిపోతున్న నేటి తరుణంలో వీరు ఈ గ్రంథాన్ని గురు ఋణమీగు పొంటె ఆచార్య పరిమి రామనరసింహం గారికి అంకితం చేశారు. ఎంతటి ఆనందమోహిని ఈ సన్నివేశం! ఇన్నింట ఇలా నన్ను భాగస్వామిని చేసిన సోదరుడు డా. దార్లకు పున: పునరభినందనలతో - సెలవు.

భవదీయుడు
-ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
20.02.2009

1 comment:

డా.ఆచార్య ఫణీంద్ర said...

దార్ల గారు !
మరో కొత్త పుస్తకం వేసారన్న మాట !
అభినందనలు !
అన్నట్టు ... ఆచార్య సి.ఆనందారామం గారి ఫోన్ నం. ఇవ్వగలరా ? కావలసిన వారు అడిగారు.