Important Contact Numbers of The University of Hyderabad link https://www.uohyd.ac.in/index.php/administration/contact

అమ్మ నవల-మాక్సిమ్ గోర్కీ రచనా నైపుణ్యం

మాక్సిమ్ గోర్కి

(గతంలో రాసిన ఈ వ్యాసం దట్స్ తెలుగులో వచ్చింది। తీరా పాత వ్యాసాలు చూస్తే లేవు।అయ్యో అనిపించింది।అందుకే దీన్ని మళ్ళి నా బ్లాగులో పెడుతున్నాను. ఇది నూరేళ్ళ అమ్మ పేరుతో ప్రజాసాహితి వారి ప్రత్యేక సంచికలో కూడా ప్రచురించారు.)

డా// దార్ల వెంకటేశ్వర రావు
తెలుగు లెక్చరర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు,
గచ్చిబౌలి, హైదరాబాదు – 500046 vrdarla@gmail.com
ఫోన్‌: 9989628046

ప్రతి రచయితకు సృజనాత్మక నైపుణ్యం ఉంటుంది. నైపుణ్యం వల్ల తాను చేపట్టిన ప్రక్రియకూ కొన్ని సార్లు ప్రక్రియా గౌరవం పెరుగుతుంది. మరి కొన్ని సార్లు నైపుణ్యం కొరవడినా వస్తువుని బట్టి ప్రక్రియ ఆదరణకు పాత్రమవుతుంది. మాక్సిమ్ గోర్కి రాసిన "అమ్మ'‘ నవలలో రెండింటికీ సముచిత ప్రాధాన్యం కనిపిస్తుంది. నవలను ప్రారంభించటం, పాత్రలను తీర్చిదిద్దటం, భావజాలాన్ని వ్యాపింపచేయటంలో రచయిత గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

నవల ప్రారంభంలో నైపుణ్యం :

ప్రతి రచనకు "ప్రారంభం' చాలా ముఖ్యం. అనేక రకాలుగా రచనను ప్రారంభిస్తుంటారు. "అమ్మ'‘ నవలను రచయిత సాధారణంగానే ప్రారంభించారు. ""ప్రతిరోజూ తెల్లవారే సరికి ఫ్యాక్టరీ కుయ్యమని కూతపెడుతుంది. ఆకూత వినడంతోనే కూలిపేటలోని జనమంతా కలత నిద్ర నుంచి లేచి ఒళ్ళు విరుచుకుని చిరచిరలాడుతూ ఇళ్ళలో నుంచి బెదిరిపోయిన బొద్దింకల లాగున గబగబా వీధుల్లో పడతారు...''‘ ఇలా సాగిపోతుంది నవల.

కార్మికుల జీవితాల్లో సహజమై పోయిన జీవితాలను వర్ణించటం రచయిత లక్ష్యం. కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పూ లేదు. మార్పులకోసం ప్రయత్నిస్తే నిర్భంధాలు తప్పవు. ప్రయత్నాలు జీవితాలను చిద్రం చేస్తున్నాయి. కనుక ""మార్పు'' వైపు ఆలోచించకుండా, స్తబ్ధంగా గడిచిపోతున్న జీవితాల్లో సంఘర్షణ, మౌలిక మార్పులను రచనలో తీసుకు రాగలగాలి. అందుకనే కొత్త వాళ్ళను కార్మికులు అనుమానంగా కూడా చూస్తుంటారు. దాన్ని తరువాత ""నిఘాపోలీసు''గా కథలో వర్ణించారు రచయిత!

స్తబ్ధతను పోగొట్టటం :

అణచివేత వల్ల కార్మికుల్లో స్తబ్ధత నెలకొంది. అయినా వాళ్ళలో అసహనం ఉండేది. దాన్ని వాళ్ళు తమ తమ కుటుంబ సభ్యులతో గొడవ పడటం, కూలిపేట వాళ్ళతో కొట్టుకోవటం వల్ల అసహనాన్ని తీర్చుకొనే వారు. బాధలు తెలియకుండా ఉండేందుకు మందు తాగేవారు. మళ్ళీ ఫ్యాక్టరీ కూతపెడుతుంది. పనికి పరిగెట్ట వలసిందే ఇవన్నీ రొటీన్గా జరిగిపోయే పనులే! "అమ్మ'‘ కథానాయిక పెలగోయానీలోవ్నా ఇంటి నుండే స్తబ్ధతను చెదరగొట్టే దిశగా రచయిత తన ప్రణాళికను సిద్ధంచేసుకున్నారు. కథానాయిక కు ""నీలోవ్నా'' అని పేరు పెట్టినా, పాత్ర చారిత్రకంగా జరిగిన జీవితమే! విషయాన్ని ముందుమాటలో స్పష్టంగానే వివరించారు. 1849 ఒక గొడారి కుటుంబంలో పుట్టి 1938 లో చనిపోయిన అన్నాకిరీల్లొవ్నా వాస్తవ జీవితాన్ని కేంద్రికరించి నవల వర్ణించారు రచయత. నవలలో కథానాయిక నీలోవ్నాను భర్త, మిహయిల్వ్లాసొవ్చాలా హింసించేవాడు. తన క్రూరత్వాన్నంతా ఆమెపై చూపేవాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆమె గూనిదవుతుంది. కొద్దిగా చదువుకున్నా, అక్షరాలనూ మరిచిపోతుంది. భర్త సేవ చేయటమే తన జీవితపరమార్ధమయ్యింది. ఒక ప్రాణం ఉన్న యంత్రలా తయారవుతుంది. తాగుడు ఎక్కువ కావటంతో అనారోగ్యానికి గురై భర్త చనిపోతాడు. భర్త లాగానే కొడుకు పావెల్కూడా తాగుతుంటాడు. కానీ, అతడికి మందు సరిపడదు. ఇలా బతుకులింతే అనుకునే స్తబ్ధతా వాతావరణాన్ని ముందుగా ""అమ్మ'' ఇంటిలోనే కల్పించారు రచయిత. స్తబ్ధతను బద్ధలుకొట్టి ""అమ్మ''ను ""విప్లవం కన్న అమ్మ'' గా పరిణామం చెందేటట్లు వర్ణించారు. అందులోనే రచనా నైపుణ్యం ఇమిడి ఉంది.

సంఘర్షణ:

తమ బాధలకు కారణాలను పావెల్వివిధ పుస్తకాలు చదవటం ద్వారా, ప్రజల జీవితాలను పరిశీలించటం ద్వారా అవగాహన చేసుకున్నాడు. తన తండ్రి లాగే తానూ ""అమ్మ''ను హింసించ కూడదనుకున్నాడు. తన తల్లితో గౌరవంగా మెలిగేవాడు. పుస్తకాలు చదవటం, కొన్ని విషయాలను రాసుకోవటం, వేళకి ఇంటికి రాకపోవటం, ముఖం పీక్కుపోయి కనిపించటం వంటివన్నీ పావెల్లో ప్రవేశించిన సంఘర్షణను తెలుపుతున్నాయి. తనకొడుకు అందరిలా ఉండకుండా ప్రత్యేకంగా ప్రవర్తించటంలో మాతృత్వంలోని సహజమైన సంఘర్షణ కూడా వ్యక్తమయ్యింది. పావెల్పట్ల పడిన మానసిక సంఘర్షణ కేవలం తన మాతృహృదయానికి సంబంధించిన సంఘర్షణే అనుకోవచ్చు. నిజానికి తన కొడుకు సంతోషం కోసమే పావెల్స్నేహితులను అమ్మ మొదట్లో ఆదరించేది. ఇక్కడ కూడా "అమ్మ' పాత్రలో మాతృహృదయ సంఘర్షణే కనిపిస్తుంది.

పావెల్, ఆతని స్నేహితులు కలిసి చర్చించుకోవటం, సమాజ పరిస్థితులను మార్చాలనుకోవటం, కరపత్రాలను తయారు చేయటం, వాటిని పంచటం ""సమస్య''ను ముందు పెట్టి పరస్పర సంఘర్షణకు మార్గం తెరిచినట్లయ్యింది. సమాజంలో సమస్యలున్నా, అంతః సంఘర్షణ స్వభావాన్ని కూడా ఉంటుందని సన్నివేశంలో గమనించవచ్చు.

తర్వాత ఫ్యాక్టరీలో కరపత్రాలు దొరకటం, కొంతమందిని జైలుకి పంపటం, మళ్ళీ మళ్ళీ కరపత్రాలు సిద్దమై ప్రత్యక్షమవ్వటం వంటివన్నీ సమాజంలో భిన్న వర్గాల మధ్య గల పరస్పర సంఘర్షణ పరిస్థితులను రచయిత వర్ణించ గలిగారు. కరపత్రాలను రహస్యంగా పంచటంలో ""అమ్మ'' కూడా తనకి తెలియకుండానే ఉద్యమంలో ఒక భాగమైపోతుంది. జైలుకి వెళ్ళిన కొడుకుని కలుసుకున్నప్పుడు, తొలిసారికి, తరువాత మళ్ళీ మళ్ళీ కలుసుకున్నప్పటికీ, కోర్టులో కొడుకు ప్రసంగం విన్న తర్వాతా ""అమ్మ'' పాత్రలో గొప్ప పరిణామాన్ని ప్రవేశపెట్టారు రచయత. ఇదంతా పరస్పర సంఘర్షణ ఫలితమే! సత్యాన్ని తెలుసుకున్న జీవిత ప్రయాణమే!

భావజాల విస్తరణ:

మార్క్సిస్టు ప్రధాన సూత్రాల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించటం, ఉద్యమం నిరంతరం కొనసాగించటం , వ్యక్తిగత ఆస్తులు లేకపోవటం, స్త్రీ పురుష స్వేచ్చా వాతావరణం, ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించుకోవటం వంటినెన్నో ""అమ్మ'' నవలలో బాగావిస్తరించ గలిగారు రచయిత. జీవితం తెలిసి రాసిన రచనలు బాగుంటాయి. జీవితాన్ని నడిపించే శక్తులను గుర్తించి రాస్తే రచనలు మరింతగా బాగుంటాయి. జీవితం తెలియటం, జీవితాల్ని నడిపించే శక్తులను గుర్తించగలగటం రెండూ "అమ్మ' నవలలో ఉన్నాయి.

పావెల్బాగా పుస్తకాలు చదివేవాడు. దానితో పాటు అనేక చర్చలలో పాల్గనేవాడు. పావెల్దగ్గరకు స్నేహితులు కూడా ఒక్కొక్కరూ రావటం, మాట్లాడుకోవటం, వెళ్ళిపోవటం, ఏవో కొన్ని పత్రికలు రాయటం, వాటిని పంచటం, అవసరమైతే తమ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించటంలో తీవ్రమైన సంఘర్షణకు దిగటం వంటివి జరుగుతుండేవి. పావెల్‌ "అమ్మ' తో అంటున్నట్లే ఒకనాడు పోలీసులు అతణ్ణి పట్టుకుంటారు. జైల్లో పెడతారు. ""పావెల్'' అరెస్ట్తో కరపత్రాలు ఆగిపోకుండా మళ్ళీ కరపత్రాలు రాసి, వాటిని పంచగలగటంలో నాయకత్వం విస్తరింపబడింది. నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో వర్ణితమైంది. దానితో కరపత్రాలు రాసేదెవరు? వాటిని పంచేదెవరు? అనేది పాలకవర్గాలకు అంతుపట్ట లేదు. దానితో అనేక మంది రైతులు, కార్మికులు, ప్రజలు ఉద్యమంలో భాగస్వామ్యం పెరిగి, ఉద్యమం కొనసాగ గలిగింది. వ్యక్తి ఆగిపోతే, ఉద్యమం ఆగిపోకూడదనే భావజాలాన్ని దీనిద్వారా బాగా వివరించినట్లయ్యింది.

నిజానికి ""అమ్మ'' నవలలో కొంతమంది ఉద్యమకారులకు వ్యక్తిగత ఆస్తులు ఉన్నట్లు వర్ణితమయ్యాయి. కానీ, ఆస్తిని ఉద్యమానికి వినియోగించినట్లు వర్ణించటం మరో గమనించవలసిన విషయం! ముఖ?్యంగా రహస్యంగా ప్రెస్నడిపే లుద్మీలా, సారష్యా వంటి వాళ్ళు వ్యక్తిగత ఆస్తులు కలిగి ఉన్నావాళ్ళే! కానీ, వాటిని ఉద్యమ విస్తరణకు ఖర్చుపెట్టినట్లు రచయిత వర్ణించారు.

ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులు అమ్మకి జీతమిస్తుండేవారు. ఆమె, ఉద్యమకారులు డబ్బంతా దాన్ని ఉద్యమానికే ఖర్చుపేట్టేవారు. అలాగే ఉపాధ్యాయురాలు, డాక్టరు వంటి వాళ్ళెంతో మంది ఉద్యమానికి ఊతమిచ్చిన వాళ్ళే! ఒక నిరంకుశ శక్తిని ఎదిరించటానికి, అనేక చిన్న, పెద్ద శక్తులన్నీ చోటకు చేరక తప్పదన్నట్లు కేవలం డబ్బు ఉండటమే ప్రధానం కాకుండా డబ్బు ఉద్యమానికి వినియోగిస్తున్నారా? లేదా? అనేది కూడా ప్రధానమని నవలలో వివరించినట్లయ్యింది.

ఉద్యమకారులకు ""వివాహం'' జరగాలా? వద్దా? అనే విషయంలోనూ కథానాయకుడు పావెల్ను అమ్మాయి ఇష్టపడటం, పావెల్మాత్రం ఉద్యమానికే అంకితం కావటం వంటి వాటినీ నవలలో చర్చకు అవకాశం ఇచ్చేలా వర్ణించారు రచయిత.

తన చివరి మాటకూడా విప్లవం గురించే మాట్లాడనివ్వండని క్షయవ్యాధితో చనిపోయిన తిరుగుబాటుదారుడు చెప్తాడు. ఇలా మార్క్సిస్టు భావజాలాన్ని వివిధ పాత్రల రూపంలో గోర్కి చక్కని సమన్వయం చేసి అందించారు.

వస్తు - కళా సమన్వయం:

భర్త సేవే భాగ్యంగా భావించిన నీలోవ్నా, విప్లవకారులందరికీ "అమ్మ' గా పరిణామం చెందిన దశలను నిశిత దృష్టితో సృజనీకరించారు రచయిత. క్రీస్తుని ఎవరైనా పల్లెత్తుమాటంటే పడని "అమ్మ' చివరికి, క్రీస్తునీ, చర్చి, వాతావరణాన్ని, తాను చేస్తున్న రహస్యోద్యమ కార్యకలాపాలను జీవిత సత్యాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయాణంగా భావిస్తుంది. అది "ఆమె' పాత్రానుగుణంగా రచయిత తీసుకొచ్చిన గొప్ప పరిణామం. పాత్రలో పాఠకుడు లీనమవ్వాలను కుంటాడు.

నాటి రష్యా నిరంకుశ చక్రవర్తుల పాలన, దేశ పరిస్థితులు, దాని ఫలితంగా 1902లో సొర్మొవో

ప్రాంతంలో జరిగిన మేడే దినోత్సవం, తదనంతరం అనేక మందిని జైళ్ళకు పంపటం, సైబీరియాకి వలస పంపి, హతమార్చటం వంటివన్నీ వస్తుగత వాస్తవ సంఘటనలు. పావెల్నిజ జీవితంలో ఫ్యోత్జులామొవ్‌. అతని తల్లే అన్నాకిల్లొవ్నా.

చారిత్రక వాస్తవాన్ని గోర్కీ కళాత్మకం చేశాడు. అలాంటి పీడనను ఎదుర్కొనేందుకు కాలంతో దేశంతో నిమిత్తం లేకుండా ""తమదే'' అని ఫీలవ్వగలిగేటట్లు సృజనీకరించాడు. సత్యాన్ని సత్యంగా చెప్పటం కంటే, కళాత్మకంగా చెప్పటం వల్ల అది మనసుల్లో స్థిరంగా నిలిచిపోతుంది. మనసుల్ని కదిలిస్తుంది. ఇంద్రియాను భూతుల్ని సుఖ?దు:ఖాలతో నింపేస్తుంది. సత్యం దర్శనీయమవుతుంది. అది జీవితాల్ని ఫలవంతం చేస్తుంది. శక్తి గోర్కి రాసిన "అమ్మ' నవలకు ఉంది. అందుకనే నూరేళ్ళయినా, "అమ్మ' నవలలో సజీవ కళ తొణికిస లాడుతుంది. ఉద్యమకారులకు ఊతమవుతుంది. విముక్తి గీతాల్ని వినిపిస్తుంది.


No comments: