Monday, March 02, 2009

వర్గీకరణను సమర్థించిన పుస్తకం దళిత ఉద్యమం- వెలుగు నీడలు

-డా//దార్ల వెంకటేశ్వరరావు

అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ,

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్

vrdarla@gmail.com

అందరికీ నమస్కారం,

దళిత ఉద్యమం- వెలుగు నీడలు అనే పుస్తకం పై మాట్లాడడానికి నాకు కూడా అవకాశం కల్పించినందుకు గ్రంథ రచయిత డా//పి. కేశవకుమార్ గార్కి కృతజ్ణతలు తెలియజేస్తున్నాను.

సర్వసాధారణంగా ప్రతి సమస్యనీ తమ దృష్టి కోణం నుండే చూస్తుంటారు. అభ్యుదయవాదులు దళిత సమస్యను దళిత ఉద్యమం, దళిత సాహిత్య వాదం గా విభజించి చూశారు. అలా దళిత సాహిత్యం ఇంక వాదంగానో, ధోరణిగానే ఉంది తప్ప, ఉద్యమస్థాయిని పొందలేదని ఎస్.వి.సత్యనారాయణ లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని దళిత మేధావులు ఖండించారు. వారిలో కత్తి పద్మారావు, బొజ్జాతారకం తదితరులు వేగంగా స్పందించారు.

మార్క్సిస్టులు కులం కూడ వర్గంలో భాగంగానే చూస్తుంటారు.తెలంగాణా వాదులు ప్రత్యేక రాష్ట్రమే సమస్యల పరిష్కారం చేస్తుందని వాదిస్తున్నారు. దళిత సమస్యలో ప్రస్తుత వర్గీకరణ సమస్యను ఆ దృష్టితోనే చాలా మంది తెలంగాణా వాదులు చూస్తున్నారు. మాలలు సమైక్య వాదంతో విశ్లేషిస్తున్నారు. ఎస్.సి.లోని అన్ని పీడిత కులాల గురించి మాట్లాడుతున్నట్లే ఉంటూ, మాదిగల సుదీర్ఘ సమస్య అయిన వర్గీకరణను విస్మరిస్తుండటమో లేదా దాన్ని స్పృశించకుండానే సమస్యల్ని చర్చకు పెట్టడమో, అది పెద్ద సమస్య కాదన్నట్లు వ్యవహరించడమో చేస్తుంటారు. మాదిగలు తమకి అత్యవసరమైన వర్గీకరణ సమస్య నుండే అన్ని సమస్యలను చూస్తుంటారు. ఈ పుస్తకాన్ని నేను మాదిగ దృక్పథంతోనే చూస్తున్నాను.

అంబేద్కర్ ని లిబరల్ బూర్జువా గా చూసే బ్రాహ్మణీయ ఆలోచనలను ఖండిస్తూ బలమైన తార్కికతనే వినిపించగలుగుతూనే, అన్ని సమస్యలకు, అంబేద్కర్ భావజాలమే పరిష్కారమనే వాదన సరైంది కాదని చెప్పడంలో రచయిత డా// కేశవ కుమార్ వస్తు గత దృష్టి ( objectivity) కనిపిస్తుంది.

మీడియా గురించి చెప్పిన వ్యాసంలో బి.సిల గురించి, అలాగే ముస్లిములను ( పుట: 58 – 67, 102 – 112) ) స్ర్తీలను ( పుట: 96), దళితులపై క్రైస్తవ మతప్రభావాన్ని (పుట: 98-101) ప్రస్తావించిన రచయిత మాదిగలను, వారి ఉద్యమాన్ని, సాహిత్యాన్ని దళిత సాహిత్యంలో అంతర్భాగంగానే (పుట:76) పరిశీలించారు. మాదిగల వర్గీకరణ సమస్యను ఒక ప్రజాస్వామిక పద్దతిలో, సామరస్య వాతావరణంలో పరిష్కారం కావాలనే ఆకాంక్షను దళిత ఉద్యమం- సామాజిక న్యాయపోరాటాలు’ వ్యాసం ( పుటలు: 44 - 49) లో సుదీర్ఘంగానే రచయిత చర్చించాడు. ‘బ్రాహ్మణత్వ’ పారిభాషిక పదంలా ‘మాలత్వ’ వంటి వాటిని ప్రయోగంచడంలో సంయమనాన్ని పాటించాలని సూచిస్తున్నాడు. వర్గీకరణ సమస్యను విశ్లేషిస్తూ నిస్సహాయుడైన భర్త యజమాని పై తిరగబడలేని నిస్సహాయతనే భార్యను వేదించేలా కనిపిస్తుందని, అలాగే కా.రా. రాసిన యజ్ణం కథలో దళితుడు నిస్సహాయతతో తన కొడుకిని నరికేలా చేసినట్లు వర్ణించిన సామ్యాలతో దళితుల్లోని లోతైన తరతరాల వేదనామయ జీవితాన్ని పట్టుకోగలిగాడు. ఈ సందర్భంలో రచయిత వ్యాఖ్యలను తప్పని సరిగా గుర్తుచేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి.

’మాల కులానికి చెందిన దళిత కవులు ఒక సామూహిక స్వప్నం ఎజెండా నుంచి తొలిగి పోయాక ఒక అక్షరం కూడా రాయలేకపోయారు. మాదిగ కులానికి చెందిన దళిత కవులు మాదిగ కవులుగా కాస్తంత గౌరవం తెచ్చుకున్నా ఒక అడుగు కవిత్వంలో ముందేసినా ఆ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది” ( పుట: 48)

“జనాబా ప్రాతిపదికన యస్సీ రిజర్వేషన్లలోవర్గీకరణ జరగాలన్న మాదిగల డిమాండ్ న్యాయ సమ్మత మైంది. అందుకు అందరు మేధావుల నుండి ప్రజాస్వామిక ఉద్యమాల నుండి ,అన్ని రాజకీయ పార్టీల నుండి ఆమోద ముద్ర లభించింది కూడా! వర్గీకరణ డిమాండ్ ని వ్యతిరేకిస్తున్నమాల మహానాడుకి, మాల కులానికి చెందిన దళిత మేధావుల మద్దతు లేదు.” ( పుట: 47-48)

ప్రధాన వైరుధ్యాలు ఉన్న దళితులు, దోపిడీ అగ్ర కులాల మధ్య కన్నా మిత్ర వైరుధ్యాలున్న మాలా, మాదిగ కులాల మధ్య ఎక్కువ శత్రుత్వం, ద్వేషం, అనుమానం ఉన్నట్లుందని, అలా కనిపిస్తుందని చాలా మంది భావించడం జరుగుంతుంది. నిజానికి ఈ రెండు ఉపకులాలు తరాల తరబడి వెనుకుబాటు తనానికి గురైనవే. అంటరానితనాన్ని, ఆకలిని, దారిద్ర్యాన్ని, అవమానాల్ని అనుభవించడంలో మినహాయింపులేని కులాలే ( పుట: 46)

అని దళితులు ఉమ్మడిగా ఉద్యమాలు చేయవలసిన అవసరాన్ని ఈ వ్యాసాలన్నింటిలోనూ విస్తరించాడు.

”దళిత ఉద్యమం. ఉమ్మడి దళిత ఉద్యమం వంటి ప్రత్యేక పారిభాషిక పదాలను పుస్తకం ( పుట: 26) ప్రయోగించినప్పుడు అవి ఎలా పుట్టుకొచ్చాయో చెబితే ఇంకా బాగుండేది. కానీ, పరోక్షంగా మాదిగ వర్గీకరణ ఉద్యమం వల్లే ఆ నూతన పారిభాషిక పదాలు పుట్టుకొచ్చాయని గుర్తించవలసి ఉంది.

పుస్తకంలో వ్యావహారిక భాషను వాడాలనే కుతూహలంలోనో, ఆంగ్ల ప్రభావం నుండి తప్పించుకోలేకో తెలుగు భాషకున్న నాజూకు తనాన్ని మరింత సాధించవలసి ఉంది. అలాగే, టైపో గ్రాఫిక్ దోషాలని సమర్థించుకోవాలని చూడక పోతే, బ్ చాలా చోట్ల అక్షర దోషాలను కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు అస్తిత్త్వం అని రాయవలసి ఉండగా, అస్థిత్వం ( పుట: 06) అనీ, భేదాభిప్రాయాలు కి బదులు బేధాభిప్రాయాలు ( పుట: 09) వంటివి చిన్నచిన్నవే అయినా వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి.

మంచి పుస్తకానికి సంపాదకుడు వ్యవహరించిన జూలూరి గౌరీశంకర్ ని అభినందిస్తున్నాను, అయితే, ఆయన చేసిన సంపాదకత్వం ఏమిటో వివరిస్తూ కనీసం ఒక పుటలోనైనా రాస్తే బాగుండేదనిపించింది.

మొత్తం మీది పుస్తకం లో వ్యాసాలు అంబేద్కరిజాన్ని, ఆ వెలుగులో బహుజనవాదానీ, తద్వారా దళిత ఉద్యమ లక్ష్యమైన రాజ్యాధికార భావజాలాన్ని సమర్థవంతంగానే వ్యక్తం చేయగలిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. దళితుల, ముఖ్యంగా మాదిగలు కోరుకుంటున్నా వర్గీకరణ సమస్యను ప్రజాస్వామిక ధోరణితో చర్చకు ఆహ్వానించిన రచయితను మనసారా అభినందిస్తున్నాను. మొత్తం మీది ఈ పుస్తకం పై నా అంచెనాను కింది విధంగా అభిప్రాయపడుతున్నాను.

దళిత ఉద్యమం- వెలుగు నీడలు పుస్తకాన్ని మాదిగ దృష్టితో చూసినప్పుడు దళిత సమస్యలను సాధికారికంగా చెప్తూనే, ఆంధ్రప్రదేశ్ లోని దళిత ఉద్యమంలోని వెలుగు మాల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటం గానూ, ఆ వెలుగు మరింత తేజోవంతం కాకపోవడానికి, తాత్కాలికంగా నీలి నీడలు కమ్ముకోవడానికీ, దళిత ఉద్యమానికి మాదిగలు కలిసి రాకపోవడమే కారణమవుతుందని రచయిత చాలా వ్యూహంతోనే చెప్తున్నాడని అనిపిస్తుంది. బ్రాహ్మణీయ కుట్ర, వర్గ, అంతర్గత, ప్రాంతీయత వంటి సమస్యలు తాత్కాలికంగా కమ్ముకుంటున్న నీడలే తప్ప, అవి చీకటిని సృష్టించలేవనే ఆశావాదాన్ని ప్రకటిస్తున్నాడు. దళిత సమస్యలను వాస్తవిక దృష్టింతో చూస్తూనే, నిజమైన సమైక్యతను ఆకాంక్షిస్తున్నాడు. అందుకే నా అభినందనలు తెలుపుతున్నాను.

( డా//పి.కేశవకుమార్ రచించిన దళిత ఉద్యమం-వెలుగునీడలు గ్రంథావిష్కరణ సభ, ప్రెస్ క్లబ్బు, హైదరాబాదు లో

ది: 3-3-2009న చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు)

No comments: