ఓ కవిత్వప్రేమికుని లేఖ!
నా అభిమానకవీ!
నా జాతీయకవీ
అవార్డులకందని కవీ
జాతి రివార్డులు పొందిన కవీ
డా||ఎండ్లూరిసుధాకర్ గార్కి
గుండె నిండా వందనాలు!
మీరు ప్రేమనింపి పంపిన
'ఆటా'జనికాంచె...అమెరికా యాత్రా కవితలు
అందుకున్నానా స్పందన గంధ మాలికలు
సంస్కృతాంధ్రకావ్యానురాగాలు
ఉర్దూ గజళ్ళ సోయగాలు
అందమైన ప్రయోగాలు
అనుప్రాసల్లో అమరిపోయాయి
అనుభూతుల్తో నిండిపోయాయి
అంత్యానుప్రాసకు అమరత్వాన్నిచ్చాయి.
ఎంతమంది అమెరికా వెళ్ళడంలేదు
ఎంతమంది దాన్నే భూతల స్వర్గమనడం లేదు
ప్రియురాలి గ్రీన్ కౌ'గిళ్ళ'లోనే మురిసి పోవడం లేదు
ఎల్లకాలం సల్లగా భరించే
జన్మభూమీనీ ఆడిపోసుకోవడం లేదు
మీరేంటీ...
మాతృదేశమ్మీద మమకారాన్నిమరింత పెంచేశారు
ఇంక నేను కలను బలవంత పెట్టను!
అమెరికా మేధావుల అమరిక
అచట పల్లవించే చిగుర కొమ్మలచేవ
అచట పుట్టింది కాదు
అదంతా వలస పక్షుల దక్షతే
శహబాష్ కవి గారూ...
అమెరికా 'పట్టు'కొమ్మను పిండేశారు!
ఇదేమిటండీ
యాత్రాచరిత్రలన్నీ అతిశయోక్తుల్నిండిన అక్షయపాత్రలవుతుంటాయే
ఆకాశంలోని అతిశయోక్త్యలంకారాల్నే చుట్టొచ్చారు
కుందేళ్ళనొదిలి
నేను కూడా ఆడుకోవాలనుందా పాల మబ్బుల్లో
ఒక వేళ అక్కడిక్కూడా వస్తాడేమో
ప్రపంచాన్ని దడ దడలాడించిన లాడెన్
స్వభావోక్తుల్ని పట్టుకొని
ఎంత తాపీగా తిరిగారా మేడల్లో!
కృష్ణశాస్త్రిఆ ఖండికలు చదివుంటే
కొట్టేదొన్నాటెయిట్ లో
అద్భుతమైన
శ్రామిక తత్త్వ భావుకవీత్వ వెయిట్లో!
విమాన విరజాజుల వానల్లో తడిసి తడిసిన
సూటూ బూట్ల 'షి'కార్ల గురించీ
సినిమా కబుర్లు గురించీ చెప్తారనుకుంటే
చెప్పారక్కడా చెప్పుల గొప్పే
మనసు దోచిన కారల్ మార్క్స్ కి
మళ్ళీ కొన్ని మార్క్స్ వేసి
ప్రపంచ చెప్పుల్లారా ఏకం కమ్మంటే
ఎంత బావుణ్ణని ఎలా స్వప్నించారండీ!
ఘెట్టే నల్లవీధుల్లో తిరగడం గిట్టని వాళ్ళ లోగుట్టుల్నీ
గట్టి బంధాలవుతున్న భారతీయ తెల్లజట్టుల్నీ
ఎండగట్టేశారే... నిర్భయత్వం కదా కవిత్వం!
... ... ...
అమెరికా ఓ నా అమెరికా...
ఎంతమంది నీ దగ్గరకొచ్చారో
ఎన్ని డాలర్లు పొందుచేర్చుకున్నారో
దేవయ్య కొడుకు పాడిన
లిల్లేలియా పాటల్లా స్వచ్ఛంగా
నిన్నొక్కరైనా వర్ణించారా అచ్చంగా ?
అల నన్నయ్యకు లేదు
తిక్కయ్యకు లేదు
అల్లసాని పెద్దయ్యకు లేదు
'ఆటా'జనికాంచె...కవీకి దక్కిన అదృష్టం
కత్వమంటే అవధానాల 'ఆటా'విడుపు కాదు
'కమ్మ'నీయ సన్మానాల తందాన 'తానా' కాదు
డాలర్ల లాగిన్ (login) వేటా కాదు
జీవిత లోతుల తాత్విక గీతిక కదా!
మబ్బుల్తో దోబూచులాడని కవీ వర్తమానమిది
నల్లద్రాక్షపందిరినీడలో
నలుపు తెలుపుల సంగమ దృశ్యమిది
అభినవ జాషువా కొత్తగబ్బిలం చూపిన అంతరంగమిది.
... ... ...
కవీగారూ!
అష్టాదశ సంఖ్యలు
దళితులకు వేసిన
అష్టదరిద్రాల సంకెళ్ళు
ఆ సంఖ్యల్లోనే
చికాగోని “వివే”చించా రే
చిందెయ్యించారే చిందు భాగోతాన్ని
సూచించారే సామరస్య వాతావరణాన్ని
అది కదా కావాల్సింది - ఆది కథ కావాల్సింది!
నావంట్లోనూ షుగర్ ఫ్యాక్టరీ ఉంది
నా గుండెల్లోనూ అపోలా దాఖలా ఉంది
అయినా సరే...
అమెరికా విమానంలో మీరు
ఆర్ధ్రంగా దాచిన చాక్లెట్స్ ని
మానసగానో, మనోజ్ఞ గానో
మారిపో యైనా చోరీ చేయాల్సిందేనేమో!
మట్టి గురించే గాని అది గట్టి సత్యం
మట్టి తెమ్మన్న మాతాజీ
నీ తాత్త్విక లోగుట్టుకో నమస్కారం
కవీత్వీకరించడంలో కవిదెంత గొప్ప సంస్కారం
భూమ్యాకాశాల మధ్య
ఆరడుగుల ఆలోచనల మధ్య
నింగీ, నేలా ప్రపంచం మిధ్య
నిజమే తప్పవన్నీ ఆరాటాలే
నిజమే అవన్నీ ఆధిపత్యపోరాటాలే
నలభైల్లోనే ఎంత వేదాంతం!
కవి జీతమంతా సంక్లిష్టం
కవీత్వమంతా అమృతమృదుత్వం
ఎలావచ్చిందండీ అంత గాఢత్వం!
కవీత చదవడం పూర్తయ్యింది
కళ్ళన్నీ ఆనందాల జల్లయ్యింది
కనదనత్తుకోవాలనిపించింది
కవిత మళ్ళీ మళ్ళీ చదివించింది
ఎప్పుడో ఎలాగో గుండెలపైనే వాలిపోయింది!
తెల్లవారగట్ల చూశాను
మంచమ్మీదే ఉంది
భష్యత్తుని కలగన్న పసిబిడ్డలా ఉంది
మళ్ళీ మృదు కరస్పర్శ
వైట్ హౌస్ లో
పాల్ రాబ్ససన్ గొంతేదో విన్పిస్తోంది!!
నా అభిమానకవీ
నా “జాతీ”య కవీ
అవార్డులకందని కవీ
అంతర్జాతీయతా గుర్తించింది కవీ
మీ కిదే నా జైభీమ్ ల శాల్యూట్ జాతి రవీ!!
-డా||దార్ల వెంకటేశ్వరరావు
(డా// ఎండ్లూరి సుధాకర్ గారి ఆటా జనికాంచె ---అమెరికా యాత్రాకవిత్వం చదివినప్పుడు ( 11 August 2006) కురిసిన అనుభూతి చినుకులు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి