ఆధునిక సమాజ పరిణామాల్లో గమనించ వలసిన దానిలో ఒకటి మార్పు గుణాత్మకంగా పయనించడం. అలాంటి గుణాత్మక మార్పుని ఆశించడం స్వీయ అస్తిత్వంకోసం జరిగే పోరాటాల్లో ఒక ప్రధాన లక్ష్యం. అభ్యుదయ, విప్లవ, దిగంబర, స్త్రీ, దళిత, ప్రాంతీయ వాద సాహిత్యాలు సామాన్య మానవుణ్ని, అతని ఆశలను , ఆశయాలను ప్రతిబింబించే దిశగా పయనిస్తున్నాయి. వీటిలోనూ ఉండే ఖాళీలనూ పూరించే ప్రయత్నంలోనే 'దళిత స్త్రీవాదం' ఒకటి వచ్చింది. ప్రతి సాహిత్య వాదం/ ఉద్యమం ముందుగా కవిత్వంలోనే అభివ్యక్తమవుతుంది.
చల్లపల్లి స్వరూపరాణి 'మంకెనపువ్వు' పేరుతో ఒక కవితా సంపుటిని ప్రచురించారు. ఇందులోని కవితలు చాలా వరకు వివిధ పత్రికల్లో ముందుగా ప్రచురితమైనవే.అంతే కాదు వివిధ సాహితీవేత్తల చర్చల్లో ఉటకింపబడినవి అనేకం ఉన్నాయి. అంటే ఈ కవిత్వం చలనశీలన స్వభావం గలదని స్పష్టమవుతుంది.'దళిత స్త్రీవాదానికి అచ్చమైన కవితారూపం'గా జి. లక్ష్మీనరసయ్య గారు , 'హృదయ దళన కవిత'గా డాక్టర్ ఎన్. గోపిగారు , 'తొలి దళిత స్త్రీవాద కవిత్వం'గా శిఖామణి గారు ఈ కవితా సంపుటిలో గల కవిత్వం గురించి అభివర్ణించారు.
దళిత కుటుంబాలలో తలిదండ్రుల ప్రవర్తనలో 'తల్లి'గా దళిత స్త్రీని కవయిత్రి స్వరూపరాణి చూడగలిగారు.
'బజాట్లో నీ అస్తిత్వం కేవలం
ఫలానా ముత్తాయి పెళ్లాం మాత్రమే' అనడం ద్వారా స్త్రీవాదంలో లాగానే, సోమయాజి భార్య సోమిదేవమ్మగానే తప్ప దళిత స్త్రీని కూడా ప్రత్యేక అస్తిత్వ్తంతో గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తమవుతుంది. అయితే, ఇది అన్ని దళిత కుటుంబాల్లోనూ కనిపించే వాస్తవమేనా? అనేది ప్రశ్నించుకోవలసి ఉంది. అంటే కొన్ని కుటుంబాల్లో భర్త కన్నా భార్యకే ఆధిక్యత ఉంటుంది. దానికి కారణం పురుషుడితో సమానంగా, కొన్ని సార్లు ఎక్కువగా పని చేయడం, సంపాదించడం. ఇంకా చెప్పాలంటే పురుషుల కన్నా ఎక్కువ కష్టపడుతూ, ఆధిక్యాన్ని ప్రదర్శించే స్త్రీలు దళిత కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. కవయిత్రి ఇలాంటి స్త్రీలను స్పర్శించలేకపోవడం దళిత వాస్తవికతకు కొంత లోపమేనేమో. అయితే దళితులది స్వభావసిద్ధంగా మాతృస్వామ్యమైనా, ఆర్య సంస్కృతిలో పితృస్వామ్య స్వభావం దళితులపై ప్రభావం కనిపిస్తుంటుంది. దీన్నివర్ణిస్తూ కవయిత్రి
'ఆర్యుల దగ్గర అప్పు తెచ్చుకున్న గొడ్డలితో
ఆకాశమంత ఎత్తయిన' ఆమె ఆత్మను ముక్క ముక్కలుగా తెగనరకడానికి తెచ్చిపెట్టుకున్న ఆధిపత్య స్వభావమే కారణమని గుర్తించాలనే అవగాహన ఉంది. విశేషమేమిటంటే, "నన్ను వెలిగించే నాన్న స్మృతికి' అంటూ
'నాన్నా
ఎంతకీ తెల్లవారని
నా చిక్కుముడుల చీకటి కుహరంలో
నీ స్మతి
పలచని పొద్దులా మెరుస్తుంది' అని దళిత స్మృ తి కవిత్వాన్ని రాశారు. తద్వారా దళిత తల్లిదండ్రులలో గల ఆదరించే, ప్రేమించే గుణాన్ని, త్యాగనిరతిని ఆలోచింపజేస్తున్నారు.
అలాంటి కుటుంబం నుంచి వచ్చిన దళిత బాలిక 'పెచ్చులూడిన బాల్యాన్ని' అనుభవిస్తూనే, పరిగె ఏరుకుంటూనే, దొంగతనంగా తెలిసీ తెలియని వయస్సులో 'పిల్లి పెసరకాయలను కోసుకొంటూనే' చదువులో అధిక మార్కులు తెచ్చుకోవడం, దాన్ని చూసి తన దళితేతర స్నేహితురాలను ఆమె తల్లిదండ్రులు చదువు సంజా లేని పిల్లకి మార్కులొస్తున్నాయని కొట్టడం వంటి సంఘటనలు ఎన్నో రికార్డు చేసిన కవిత్వం ఇది. చదివించాలనే తహతహతో దళిత తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వేస్తున్నారు. కానీ, ఆడపిల్లల హాస్టల్స్‌లో జరిగేదేమిటి?
"అక్కడ కూడా వార్డెన్‌గాడి
ఆకలి చూపులు''. వాటి నుంచి తప్పించుకోలేక, మానసిక వ్యధకు గురవుతున్న వాళ్లెందరో!
'ఒంటిని గుప్పిట్లోకి తీసుకొని
దూరంగా విసిరేయాలని'నిపించడం గొప్ప వ్యక్తీకరణ. ఎలాగో చదువుతుంది, అవమానాలకూ ఎదురీదుతుంది, ఉద్యోగం సాధిస్తుంది, ఆఫీసులో దళిత ఉద్యోగిని పట్ల ప్రవర్తన ఎలా వుంటుంది? "
ఆఫీసుకెళ్లినప్పుడు
రిజర్వేషన్ కేటగిరి'' అనే
గుసగుసల్ని వినలేక
నాకే నా చెవుల్లో సీసం పోసుకోవాలనిపిస్తుంది'' అనడంలో వేదాలను వినకూడదని ఒకప్పుడు దళితుల చెవుల్లో సీసం పోస్తే, వేదాలను వల్లించిన నోల్లు దెయ్యాలై, పిశాచ భాషతో కర్ణభేరి పగలగొడుతున్న వర్తమాన వాస్తవాన్ని కవిత్వీకరించడం ద్వారా, దళితుల మెరిట్‌ని అంగీకరించలేని సత్యాన్ని అభివ్యక్తీకరించగలిగారు. ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే, ఆత్మ గౌరవంతో బతకాలంటే, ఆత్మవంచన చేసుకోకుండా, 'సిసలైన మనుషులుగా మనగలగా'లంటే, భవిష్యత్తరాలు దళిత కవిత్వం 'రాయనక్కర్లేని పరిస్థితి రావాలంటే, సామూహికంగా, యుద్ధాన్నే నిత్యావసర వస్తువుగా చేసుకోక తప్పదంటున్నారు కవయిత్రి! దళిత స్త్రీవాదం ద్వారా 'స్త్రీవాదం' పట్టించుకోని అంశాలు ఎన్నో ఈ కవితాసంకలనంలో ఉన్నాయి.
( మంకెనపువ్వు (కవితాసంపుటి); కవి: చల్లపల్లి స్వరూపరాణి; వెల: రూ. 40/-; ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు)
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు
Darla Venkateswar Rao on Challapally Swarooparani's Mankena Puvvu
స్త్రీవాదంలోకొత్త కోణం 'మంకెనపువ్వు' శనివారం, నవంబర్ 19, 2005 Hrs (IST) ...thatstelugu.oneindia.in/sahiti/kitabu/2005/swaroopa.html - 68k - Cached - Similar pages - Note this
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి