"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

09 జూన్, 2008

డా//ద్వా.నా.శాస్త్రి గారి ష్ష్టి పూర్తి సాహితీ ఉత్సవం! 15-06-2008




యువకళావాహిని & డా//ద్వానా.శాస్త్రి షష్టి పూర్తి సారధ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ నెల 15 వతేదీన శ్రీ త్యాగరాయ గానసభ, హైదరాబాదులో జరపాలని నిశ్చయించారు. సాయంత్రం 5-30 నిమషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా డా//ద్వానా.శాస్త్రి షష్టి పూర్తి అభినందన సంచికను ఆవిష్కరిస్తారు. అలాగే డా//ద్వానా.శాస్త్రి గారు రాసిన తెలుగు సాహిత్య చరిత్ర , ఐదవ ముద్రణను, హాస్య రచనలను కూడా ఆవిష్కరిస్తారు. ఆచార్య చేకూరి రామారావు గార్కి డా//ద్వానా.శాస్త్రి గారు గురుపూజా సత్కారం చేస్తారు.అలాగే గతంలో పకటించిన డా//ద్వానా.శాస్త్రి సాహితీ పురష్కారాలు, ఆత్మీయ పురష్కారాలను కూడా ప్రదానం చేస్తారు.



(ఆంధ్ర జ్యోతి 9-6-2008 సౌజన్యంతో పాపినేని శివశంకర్ గారి వ్యాసాన్ని ఈ సందర్భంగా పునర్ముద్రిస్తున్నాం)
ఒకడు ద్వానా శాస్త్రి - పాపినేని శివశంకర్

ఒక జరుక్ శాస్త్రి, ఒక ద్వానా శాస్త్రి లేకపోతే తెలుగుసాహిత్యరంగంలో సందడి ఏముంటుంది? ఎక్కడున్నా సందడికి మారుపేరు ఇద్దరూ. హాస్యానికి, సున్నితమైన అధిక్షేపానికి మారుపేరు ఇద్దరూ. పేరడీలో, గారడీలో ఏదో ఒకటి చురుగ్గా చేసేస్తూ ఉంటారు. ఏం జేస్తేనేం? మన మనసుల్ని కాస్త ఆహ్లాదపరుస్తుంటారు. మండువేసవిలా మారిపోయినట్టున్న ప్రస్తుత సాహిత్యవాతావరణం పూర్వంగూడా ఇలానే ఉండేదా? భావకవుల కాలంలోను ఇంతలా సాహిత్యకారులు విడివిడి గుంపులుగా ఉండేవాళ్ళా? అదేమోగాని ఈ ద్వాదశి నాగేశ్వరశాస్త్రి మాత్రం తన హృదయాన్ని కాస్తంత విశాలం చేసుకొని, సాహిత్య ప్రేమికులందరిని తనలోకి ఆహ్వానిస్తుంటాడు. 'సాహిత్యరంగంలో రాజకీయరంగంలో లాగా అసూయలు, ద్రోహాలు, అబద్ధాలు, అహంకారాలు బాగా ఉన్నాయి' అని తెలుసుకొన్నాడు. రచయితల్లోని 'మేడిపండు'తత్వాన్ని గమనించాడు. 'అది భరించరానిది' అనుకొన్నాడు. లోపాలు లేని మనిషి ఉండడని, అయితే వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యాలని భావించాడు. అందుచేతనే తన పేరు లో ఉన్న 'శాస్త్రి' పదాన్ని కులపరంగా గాక, జ్ఞానపరంగా సార్థకం చేసుకున్నాడు. వర్ణ పరిమితులు, వర్గపరిమితులు దాటి, సాహిత్య ప్రపంచంలో ఎవరినైనా ఆత్మీయంగా పలకరించగల అవగాహన పెంచుకున్నాడు. సూటిగా గాకుండా పక్కదారిగుండా తెలుగు ఎమ్మేలోకి వచ్చినవాడు ద్వానా శాస్త్రి. అంటే సైన్సు చదివి, ఆపైన సాహిత్యం చదువుకున్నాడు. ఆ లోపం లోపంగాకుండా అతను పూరించుకున్న తీరు అభినందించదగింది. అందుకు ద్వానా కృషి ఒక కారణమైతే అతని గురువుల గొప్పతనం మరో కారణమై ఉంటుంది. తూమాటి దోణప్ప, చేకూరి రామారావు, కొత్తపల్లి వీరభద్రరావు లాంటి హేమాహేమీల దగ్గర చదువుకున్న ద్వానా శాస్త్రి తెలుగులో చక్కగా రాణించాడంటే ఆశ్చర్యమేముంది? తెలుగు పండితుల్లో ఇప్పటికీ ప్రాచీన సాహిత్యంపై పట్టు ఉన్నవాళ్ళకి ఆధునిక సాహిత్యం తెలీదు. శ్రీశ్రీని దాటి, మహా అయితే తిలక్‌ను దాటి వాళ్ళు ఇవతలికి రారు. ఇక ఆధునిక సాహిత్యంతో బాగా పరిచయం ఉన్నవాళ్ళకి ప్రాచీన కవిత్వం మీద, వ్యాకరణం, అలంకార శాస్త్రంమీద అధికారం ఉండదు. ఈ రెండింటి మీదా తగుమాత్రం అధికారం ఉన్న విమర్శకుల్ని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ఈ లెక్కలోకి-ద్వానా శాస్త్రి కాదంటే తప్ప- ఆయన కూడా చేరతాడని నా అనుమానం! గుంటూరు సాహితీమిత్రులంటే ద్వానాశాస్త్రికి బాగా ఇష్టం. చనువు, అతను నా 'అనుమతి' లేకుండానే నన్ను 'పాపినేనీ!' అని ఏకవచన సంబోధన చెయ్యగల చనువుతీసుకున్నాడు. (ఇంకా ఎన్.గోపిలాంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే నన్నట్లా పిలుస్తారు.) ఆ మధ్యకాలంలో రెండుమూడు వారాలకోసారి గుంటూరు వస్తుండేవాడు, ఇక్కడి సివిల్, గ్రూప్‌వన్ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి. అప్పుడు నేను కూడా ఒక మిత్రుడి కోరికపై అవే పాఠాలు మరొకచోట చెప్పేవాడిని. తను వచ్చినప్పుడు కలుసుకునే వాళ్ళం. ఈ విడివిడి కొలువులుగాకుండా, ఇద్దరం కలిసి, తనేమో భాషాశాస్త్రం, నేనేమో సాహిత్యశాస్త్రం చెప్పటానికి ఒక అవగాహనకు వచ్చాం. విద్యార్థుల అదృష్టమో, దురదృష్టమోగాని మా ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ద్వానా శాస్త్రి కవిగా కన్నా విమర్శకుడుగానే కన్పిస్తాడు నాకు. అతని విమర్శలో పదునుంటుంది. నిర్భీ తి ఉంటుంది. ఈ మాటలు రాస్తే నలుగురూ ఏమనుకుంటారో, ఏ వాదం వాళ్ళతో ఏ తంటా వస్తుందో అని పెద్దగా ఆలోచించడు. దళితోద్యమం ఉద్యమస్థాయి నుంచి కిందకి దిగి, పాయలై, ధోరణి స్థాయికి చేరింది అని చెప్పగలిగాడు. మైనారిటీ సాహిత్యం ఉద్యమమే కాదన్నాడు. జాషువా కవిత్వంలోని రెండో పార్శ్వం- హిందూమతం పట్ల, దైవస్వరూపాలపట్ల గల గౌరవం- తెలియచేశాడు. ' ఔరా! ఇవి అవధానాలా?' అని ఇప్పటి అవధాన విద్యలో ఎట్లా పసతగ్గిందో వివరించాడు. వెనకటి సాహిత్యాన్ని పునర్‌మూల్యాంకనం చెయ్యటమంటే పూర్వవిషయాన్ని అప్పటి సందర్భంనుంచి విడదీసి వక్రీకరించడం కాదని బోధించాడు. విచ్చలవిడి కామకృత్యాలను, బూతులను ఏ పరమార్థం లేకుండా కవిత్వంలో ప్రయోగించే అరాజక కవుల్ని దుయ్యబట్టాడు. ద్వానాశాస్త్రి విమర్శావ్యాసాల్లోని ఈ పదును సమీక్షావ్యాసాల్లో తగ్గిందనిపిస్తుంది నాకు. పాదరసంలాంటి పరుగు, బహుముఖ సాహిత్య కార్యవ్రగ్రతవల్ల కావా లి, ద్వానాశాస్త్రి తన వ్యాసాలపై ఎక్కువ శక్తి వినియోగించలేదు. అందువల్ల విలువైన ప్రతిపాదనలతో, ప్రామాణికత్వంతో గొప్ప వ్యాసాలుగా రూపొందాల్సిన వాటిని కేవలం చిన్న, మంచి వ్యాసాలుగానే మిగిల్చాడు. దర్శనం కన్న ప్రదర్శనం ముఖ్యమైన ఇప్పటి 'సభా సంస్కృతి' ద్వానాశాస్త్రిని అంతో ఇంతో ఆవహించిందనే అనుకుంటాను. మొక్కుబడి సభలు, స్పాంటేనియస్ సమీక్షలు, పైపై పొగడ్తలు ఇవాళ సాహిత్య రంగంలో మామూలుగా కనపడే దృశ్యాలు. అవి కాలంలో నిలబడేవి కావు. మిగిలేది, మిగలాల్సింది సీరియస్‌గా మనం చేసే కృషి మాత్ర మే. హైదరాబాద్ వాతావరణంలో నిత్యం ఇటువంటి దృశ్యాలమధ్య వెలుగుతున్న ద్వానాశాస్త్రి వాటిల్లో కూరుకుపోతాడా, లేక తన విశేష ప్రజ్ఞని మరింత విలువైన కృషి కి వెచ్చిస్తాడా అనేది చూడాలి. ఏ దృశ్యాల, సన్నివేశాల మధ్యనున్నా ద్వానాశాస్త్రి అంతరంగం అకలుషంగా ఉందనే నా నమ్మకం. ద్వానా శాస్త్రి రచనల్లో అప్పుడప్పుడు నేను పరిశీలించేది తెలుగు 'సాహిత్య చరిత్ర'. అది నాక్కావాల్సిన సమాచారం కొంత ఇవ్వగలుగుతుంది. అద్భుత సూత్రీకరణలు అందులో లేకపోవచ్చు. కాని విలువైన విషయ వివేచన ఉంది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు రెండూ సవ్యంగా విశ్లేషించగల శక్తి- ఎంతోమంది విమర్శకుల్లో లేనిది- ద్వానా శాస్త్రిలో ఉంది. అంతకుమించి ఏ కవిత్వాన్ని అయి నా హృదయధర్మంతో ఆస్వాదించగల శక్తి ఉంది. ఇంకా అంతకుమించి ప్రాచీనమైనా, ఆధునికమైనా పక్షపాతరహితంగా విమర్శించగల సమచిత్తం ఉంది. విమర్శరాసినా ఆహ్లాదంగా చదివించే శైలి అతనిది. నానా మార్గాల్లో వేగంగా పరిగెత్తుతున్న ద్వానా శాస్త్రి ప్రతిభ ఏకీకృతమై, సాంద్రమై మన సాహిత్యాన్ని సుసంపన్నం చెయ్యాలని నా కోరిక. స్నేహశీలి, సాహిత్య ప్రేమికుడు, సాహిత్యప్రేమికుల ప్రేమికుడు ద్వానా శాస్త్రికి అరవై వసంతాలు నిండుతున్న ఈ సందర్భంలో నిండైన శుభాకాంక్షలు.




కామెంట్‌లు లేవు: