"ఇది నా జీవితం! ఆకలి, అవమానం నిండుకుండగా ఉండే దళిత జీవితానుభవమే నాకీ కవిత్వాన్నిచ్చింది"అంటూ 'లిప్తకాలస్వప్నం' లో ఎంతో నిజాయితీతో చెప్పుకున్న మాటలే డ్.దార్ల వెంకటేశ్వరరావు కవిత్వానికీ, జీవితానికీ లోతైన తాత్విక నేపథ్యాన్ని ఏర్పరిచినై. అందుకే ఈయన "దళితతాత్వికుడు"కావ్యం నిండా ఆ మరకలు, మచ్చలు,బాధలు,వేదనలు మనకు దర్శనమిస్తై. "ఈకులం లొ పుట్టకపోతే/నేనూ ఇంకోలా ఆలోచించేవాణ్ణేమో/ఈకులంలో పుట్టటమే మంచిదయ్యింది/అవమానమంటే అర్థమయ్యింది" "బడిలో అమ్మ ఒడొలో..." అనే కవితలో విద్యార్థి తాత్వికుడైతే, అదేకవితలో తనతండ్రి కాలిపై మచ్చ గురించి ప్రశ్నించిన కొడుకు గురించి "ప్రశ్నిచంటం నేర్చుకుంటున్నాడేమవుతుందో?" అనే అమ్మ ఆలోచనలో ఒక దళిత తల్లి తాత్త్వికురాలిగా కనిపిస్తుంది. "మావూరునవ్వింది" కవితలో "మనం సదూకోకూడదంటే యిన్వేందిరా!" అనే మాటల్లొ జీవితాన్ని కాచి వడబోసిన తండ్రి ఒక తాత్త్వికుడై దర్శనమిస్తాడు."పుట్టుమచ్చ మీద ప్రేమ"లో "పుట్టుకతో వచ్చిన మచ్చ/ఒకడికి అందమైన అలంకారంగానూ,మరొకడికి అసహ్యంగానూ మారుతుంది"అన్న మాటల్లో ఈ వర్ణ సమాజంలో నలిగిపోతున్న ప్రతి దళితుడు ఒక తాత్త్వికుడుగా కనిపిస్తాడు.యూనివర్సిటీ హాస్టల్లో మిగిలిన అన్నం పట్టికెళ్ళే బిచ్చగత్తెలో "హాస్టల్లో అమ్మ" కనిపించడం ఈ దళిత తాత్త్వికత వల్లనే. " నన్ను పెంచిన తీరు ఆతల్లిలో ప్రతిబింబిస్తుంటే/నా కళ్ళ ఎడారిని /ఓ జాలి నిట్టూర్పు ఆర్ధ్రమై తడుపుతుంది" అన్న అభివ్యక్తి ఎంత గాఢంగా ఉంటుందో "ఎక్కడ నుండో అమ్మ అమృత హృదయమై/లాలిస్తూ జోలపాడుతూ/ఆకలీ అవమాన ప్రపంచాల్ని జయించమనే/మేలుకొల్పు గీతం వింపిస్టుంటూండి" అన్న వాక్యాల్లొ ధ్వనించే దళిత వేదనాఘోష అంతే లోతుగా తగులుతుంది.ఆకలిని జయించినా,పుట్టుక కారణంగా అనుభవించిన అవమానాల్ని జయించటం అంత సులువా? అందుకే ఎందరో దళిత కవులు అక్షరాలను ఆత్మ రక్షణ కవచాలుగా చేసుకుంటున్నారు.అయితే ఈ కవి అక్షరాల్లో స్వాంతనను ఎలా వెతుక్కుంటున్నారో చూడండి."అక్షరం ఒక వైపు/అన్నం మరొక వైపు పెడితే/నేను అక్షరాన్నే హత్తుకుంటాను ఆబగా/మాతాత ముత్తతల మడతలు పడిన/ ఆ పొట్టల్ని సాగదీస్తే/అంబలి దొరుకుతుందేమో కాని/అక్షరం ముక్క మాత్రం కనపడదు" ఈ వాక్యాలు "కూలుతున్న లైబ్రరీ" లోనివి. ఇందులో నేతన్నల,గీత కార్మికుల,దళిత కూలీల ఎన్నెన్నో వేదనలు కనిపిస్తై. ఇదొక మంచి దళిత ఆర్తికావ్యం. ఖాలీ దొరికిన చోట చాల మంచి మినీకవితల్ని బోనస్ గా ప్రకటించటం ఈ సంపుటి ప్రత్యేకత. కోస్తా జిల్లాల పలుకుబడి వున్న మంచి కవితా సంపుటి.( 'బాధలు,వేదనల దళిత తాత్వికుడు ' పేరుతో "రమ్యభారతి" సాహిత్య త్రైమాసిక పత్రిక మయ్-జూలై-2005, పుటళు:27-28,లలో జి.సుబ్బారావు గారు రాసిన సమీక్ష వ్యాసం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి