వలస పక్షికిప్పుడేదో విరిగిన చప్పుడు
చేట్టునిండా పండ్లు కొమ్మల్నీ, రెమ్మల్నీ అలముకున్న ఏకాకులు
పండిన వెలితి ఎంత తీయని బంధం నోట్లో ఊరుతున్న కాకరకాయ రసం
పొద్దున్నే భుజాన్నెక్కుతున్న సూర్యుడు రైలు దిగినప్పుడు వెన్నెలవుతాడు
పాదలేపనాలు, అగ్నిహోత్రాలు మంత్ర మహిమలు
యంత్రభూతాలు, హిమాలయాలు, స్వర్గనరకాలు
ఏకదాటిగా కురిపించిన రసం ఉక్కిరి బిక్కిరై చందమామ కౌగిళ్ళలో రసాభాసం!
తట్టుకోలేకపోతున్నాను కాసేపు మట్టివాసనల్నీ, పైరుగాలినీ పీల్చాలి
ఆవిగో నీటికయ్యల్లో ఎగిరిపడే చేదిపరిగలు
నాన్న విసిరిన పువ్వుల్లాంటి వలలో తెచ్చే నీటిదండలు
ఆకాశమంత ఎత్తునుండే నాన్న అందించే ముంజికాయలు
పొలాల్లో పలకరిస్తున్న కందికాయలు..
" నమో వేంకటేశా… నమోతిరుమలేశా…"
టూరింగు టాకీసులో సినిమా మొదలవుతుంది
నాన్న భుజమ్మీద చంటిపిల్లాడినైపోవాలి
కానీ..అదిగో నాన్న వంట్లో మూలుగులన్నీ పీల్చేసి
చిన్నన్నయ్య జీవితాన్నంతా తాగేసి
కుమ్మనరాజు కొబ్బరితోట దారికడ్డంగా రక్తం తాగే రాక్షసిలా…!
( ఈకవిత సృజనలోకం-వరంగల్ వారు ప్రచురించిన "నాయిన-2006" కవితాసంకలనంలో, వార్త –ఆదివారం లోనూ ప్రచురితమైనది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి