"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

01 మార్చి, 2010

మాదిగ సంస్కృతిని అంటనివ్వని "వసంతం”

( ఈ వ్యాసం సూర్య దినపత్రిక (1-3-2010) లో ప్రచురించారు. ఆ వ్యాసానికి నేను పెట్టిన పేరు ''మాదిగ సంస్కృతిని అంటనివ్వని "వసంతం” దీన్ని మార్పు చేసి " సాహిత్యంలోనూ మాదిగలకు దగా మాలల " అంటరాని వసంతం’ పేరుతో ప్రచురించారు. విషయాన్ని మార్పు చేయలేదు.)


-డా. దార్ల వెంకటేశ్వరరావు

అసిస్టెంటు ప్రొఫెసరు, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.

ఫోను: 9989628049, email: vrdarla@gmail.com

ఒక రచనను సాధారణీకరించేటప్పుడు లేదా సిద్ధాంతీకరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పాఠకుల్ని, చరిత్రని తప్పుదోవపట్టించిన వాళ్ళవుతారు. Alex Haley రాసిన Roots నవల తెలుగులో "ఏడుతరాలు' గా వచ్చింది. అది సాహిత్యం రూపంలో ఒక జాతి చరిత్రని తెలుగు వాళ్ళకి అందించింది. కేవలం తెలుగు మాత్రమే చదువుకున్న వాళ్ళు, మూలాన్ని చదువు కోని వాళ్ళు, జాతుల్లోనూ భిన్న తెగల చరిత్ర తెలియని వాళ్ళు అదే జాతి చరిత్రగా అర్థం చేసుకుంటారు.

ఇప్పుడు "అంటరానివసంతం'కూడా భారతదేశంలోని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని అంటరానివాళ్ళ చారిత్రక, సాంస్కృతిక ప్రతిఫలన దిశగా అనేక తరాల జీవితాల్ని ప్రాతినిధ్యం వహించేటట్లు చిత్రించిన నవలగా సిద్ధాంతీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే పద్ధతిలో నవల ఇతర భాషల్లోకి వెళితే దీనిలో చిత్రితమైన "అంటరాని' వాళ్ళే భారతదేశంలో నిజంగా అంటరానివాళ్ళనుకొనే ప్రమాదం ఉంది.

నవల తొలి ప్రచురణ 2000 సంవత్సరంలో జరిగింది. అంతకు ముందే నవలను ఒక మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. నవల ముఖచిత్రాన్ని గానీ, రచనా విధానాన్ని గానీ పరిశీలిస్తే విస్మరించబడిన చరిత్రను, సాహిత్యాన్ని పునర్లిఖించి, కళల్ని ఉద్ధరించాలనే ఆలోచన ఉందనిపిస్తుంది. నవలా రచనను చూస్తే విశ్వనాథ సత్యనారాయణ తన నవలల్లో మధ్యలో ప్రవేశించి చాలా విషయాల్ని వ్యాఖ్యానిస్తున్నట్లుగానే, రచయిత కూడా మధ్య మధ్యలో తన వ్యాఖ్యాన చాపల్యాన్ని ప్రదర్శించుకున్నారు. అది కూడా లిఖిత సాహిత్యమంతా వక్రీకరణకి గురయ్యిందనే ధోరణిలోనే సాగింది. నవల చివర నోట్స్ని కూడా అలాగే వివరించారు. దానిలో ఒక ధిక్కారస్వరం వినిపిస్తుంది. హేళన కనిపిస్తుంది.

ఇంత ఆలోచనతో శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన రచయిత మాదిగల చరిత్రను విస్మరించడానికి గల కారణాలేమిటి ? విప్లవరచయితల సంఘం వాళ్ళు ప్రచురించినా, ఉత్పత్తి కులాల, వర్గాల చరిత్ర రాసే వాళ్ళలోనూ తన కులం వాసనే గుప్పిస్తున్నట్లనిపిస్తుంది. ఇది కూడా సాహిత్య చరిత్ర నిర్మాణంలో చేసే ఒక కుట్రగానే భావించాలి. అది కుట్ర కాకపోతే రచయిత కూడా లక్షణాల్నే మాదిగల పట్ల ప్రదర్శించడాన్నేమనాలి?

విస్మరణకు గురైన చరిత్రనీ, సంస్కృతినీ చాలా జాగ్రత్తగా నవల్లో రికార్డ్చేసిన రచయిత, అంటరాని వాళ్ళలో అత్యంత అంటరాని వాళ్ళైన మాదిగల్ని, వారి అనుబంధ ఉపకులాలైన పాకీవాళ్ళనీ విస్మరించడం వల్ల "అంటరాని' అనే పారిభాషిక పదాన్ని ప్రయోగించడంతోనే మళ్ళీ చరిత్రని వక్రీకరణకు గురిచేస్తున్నారు.

రచయిత మార్క్సిస్టు ఉద్యమ కారుడైనా మాల కులస్థుడే! అందువల్ల నవల అంతా మాల కులస్థులు కేంద్రంగానే సాగుతుందనుకుందాం. అలాంటప్పుడు తమ కులం నుండే సాహిత్యాన్నీ, చరిత్రనీ అర్థం చేసుకుంటారనుకుంటే, అంతకు ముందు దళితేతరులు కూడా అలాగే వ్యాఖ్యానిస్తూ రాశారని అంగీకరించగలమా?

ఒక ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఆశయంతో మొదలైన రచన మరో ఆధిపత్యానికి కారణమైతే ఎలా? అయితే రచయిత అది అంత స్పష్టంగా కనిపించనివ్వకుండా శ్రామికముసుగు కప్పారు. మాలలు కూడా అంటరానివాళ్ళు. కనుక, అంటరాని వాని జ్ఞాపకాలు, అనుభవాలు, అవీ కొన్ని తరాల నాటి వన్నీ గుర్తుచేసుకున్న నవల. అవి ప్రస్తుత చరిత్రలో కనపడకపోయినా అంటరానివాళ్ళకు జ్ఞాపకాలు ఆనందాన్ని మిగిల్చే వసంతం లాంటివి. అందువల్ల అది "అంటరానివసంతం' అయ్యిందేమో! చాలా బాగుందీ లాజిక్‌!

అంటరానితనం అనగానే భౌతిక, మానసిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కష్టనష్టాలకు, అవమానాలకు గురైన మాదిగ, పాకీ వాళ్ళు కూడా మాత్రమే అవమానానికి గురయ్యారనుకొనే ప్రమాదం ఉంది. వాస్తవానికి మాదిగలు అనుభవిస్తున్న మానసిక వేదన ప్రపంచంలో మరే జాతీ అనుభవించనంత తీవ్రమైందని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి మాదిగల వేదనలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా, మాలల అంటరానితనాన్నే రచయిత "అంటరాని వసంతం'గా వ్యాఖ్యానించడం విచారకరం. నవల్లోని అనేకాంశాలకు నోట్స్ రూపంలో వివరణలిచ్చిన రచయిత, ఎక్కడా ఇది తన జీవితమనో, తమ కుటుంబం చుట్టూ కథ నడిచిందనో లేకపోతే అంటరానివాళ్ళుగా పరిగణింపబడుతున్న మాలల్ని కేంద్రంగా చేసుకొని రచన కొనసాగిందనో చెప్పలేదు. అలాంటప్పుడు కేవలం దీన్నే చదివి అంటరానివాళ్ళనూ, లేదా దళితులను అర్థం చేసుకొనేవాళ్ళకు చారిత్రక సత్యాల్ని మరోకోణంలో అర్థం చేసే ప్రయత్నమవ్వదా?

కృత్రిమమైన మార్పులు చేసి కళావారసత్వాన్ని దక్కనివ్వకుండా చేశారని ఎవరెవరిపైనో నిందలు వేసైనా పేరిణీ నృత్యం మాలలదేనని నిరూపించడానికి నవలా రచయిత కనపరిచిన శ్రద్ధ మాదిగల సాంస్కృతిక అంశాలలో ఒక్కదాని పైనా చూపలేదు. పోనీ, పురాణ కాలం నుండీ మాదిగల ఆడపడుచుగా ప్రాచుర్యంలో ఉన్న అరుంధతీదేవికి సంబంధించిన సంబంధాన్నైనా ప్రస్తావించలేదు. కానీ, మాల కులస్థుడైన చెన్నయ్య పురాణ వారసత్వం గురించి చెప్పాలనుకున్నారు. అందువల్ల అక్కడ జాంబవంతుణ్ణీ ప్రస్తావించక తప్పలేదు.

ఇలాంటి అంశాలెన్నో గుర్తించడం వల్లనేనేమో దీన్ని ఎస్‌. నారాయణ స్వామి "తెలుగు నాట మాల కులస్థుల జీవితంలో ఏడెనిమిది తరాల కథ వర్తమానంలో మొదలై గతాన్ని వెనక్కి తిరిగిచూసుకుంటూ, భవిష్యత్తులోకి తొంగిచూస్తూ మూడు కాలాల్లో నడిచిన మాల పురాణం ఇది అని ( ఈమాట ఆన్లైన్మ్యాగ్జైన్లో) వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలో బ్రాహ్మణవాసన కనిపిస్తుందన్నవాళ్ళూ ఉన్నారు. కానీ, వ్యాఖ్యలో చారిత్రక సత్యం ఉందంటున్నాను.

అసలు అంటరానితనానికి ప్రాతిపదికేమిటి అది మాలల్లో ఉందా? మాదిగల్లో ఉందా? వీరందరికంటే మరింత దిగువనున్న పాకీవాళ్ళలో ఉందా? విషయాలేమైనా నవల్లో నిజంగానే రికార్డ్అయ్యాయా? ఇలాంటివన్నీ విశ్లేషించుకోకుండా దీన్నే యావత్తు అంటరానివాళ్ళ తరతరాల జీవితాల్ని సాహిత్యీకరించిన నవలగా కీర్తిస్తే, నిజమైన అంటరానివాళ్ళకు అన్యాయం చేసినట్లు కాదా? దానితో పాటు అంటరానితనానికి ఉన్న, దానికి గురవుతున్న అనేక విషాదకర పార్శ్వాల్ని తెలుసుకోకుండా ముందే అడ్డుకున్నట్లవ్వదా? అది "అంటరాని' అని ఒక కుల తెగనే అన్ని అంటరాని కులాలకు అంటగట్టడం వల్ల జరిగే హాని కాదా? నవలని అంటరానివాళ్ళ అందరి జీవితాలకు ప్రాతినిథ్యం వహించే నవలగా సాధారణీకరించే లేదా సిద్ధాంతీకరించేవాళ్ళు ఆలోచించవలసిన ముఖ్యమైన అంశమిది.

ఈ ప్రశ్నల్నీ, నా అభిప్రాయాల్నీ ఈ నవలా రచయిత మొన్న( 19-2-2010) మా సెంట్రల్ యూనివర్సి కీ వచ్చినప్పుడు చర్చించాను. ఆయనేదో వివరణ ఇచ్చారు. అప్పుడు ఆచార్య అల్లాడి ఉమ, ఆచార్య శ్రీధర్ గార్లు ఉన్నారు ( వీరిరువురూ “అంటరాని వసంతం” నవలను ఆంగ్లంలోకి అనువదించారు. త్వరలో అది పుస్తక రూపంలో రాబోతుంది) రచయిత చెప్పిన వివరణను నా మాటల్లో చెప్పడం నాకిష్టం లేదు. ఆయనే దాన్ని ఎక్కడైనా రాస్తే మంచిది. అలా కాకుండా ఒక రచన రాసిన తర్వాత రచయిత పని పూరైపోతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడడమంటే మరో కొత్త రచన గురించి మాట్లాడడమో, ఆ రచయితగా కాకుండా ఒక బయట వ్యక్తిగా మాట్లాడడమో అవుతుందని భావించే డెత్ ఆఫ్ ది ఆథర్ భావనతో నవలా రచయిత ఉంటే మనమేమీ చేయలేం. అది మనకి లభించిన స్వేచ్చగానే భావించే అవకాశం ఉంది.

అందుకే ఈ నవలను చదివిన తర్వాత, దానిపై వస్తున్న విమర్శను చూస్తున్న తర్వాతా నేను చెప్పేది ఒక్కటే, దయచేసి మళ్ళీ మళ్ళీ మాదిగల్ని సాహిత్యంలోనూ మోసం చేయవద్దు. ఇప్పటికే తెలుగు సాహిత్యంలో మాదిగల గురించి దళితేతరులు తెలిసో తెలియకో రాసినా, దాన్ని చాలా మంది విమర్శకులు మాలల జీవితంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి “మాల వసంతం,” “అంటరానివసంతం”గా ప్రచురించుకున్నా, భవిష్యత్తులో స్పష్టంగా “మాదిగ వసంతం” రాయాలనుకునే వాళ్ళ ద్వారాల్ని ముందుగానే మూసేయొద్దు.

3 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

Sir, with all due respect, This is a stupid argument.
The same allegation may be made against Yendluri Sudhakar's Mallemoggala godugu - which examined only the lives of Madiga caste people.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈ కాలంలో దళిత పోరాటం అంతర్ముఖమైనట్లుంది. probably Because some of them can afford this luxury.

Darla చెప్పారు...

మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. అది మీకు 'stupid argument' గా అనిపించడంలోనే మా వేదన, మా సంస్కృతి, మా పేరుతో జరిగే దోపిడీ ..వీటి గురించి మీకు కనీస పరిజ్ఞానం లేదని అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాటిలో 'వేలు' పెట్టకుండా ఉంటే మీ జ్ఞానాన్ని మాలాంటి వాళ్ళు అంచనా వేసే స్థాయికి రాకుండా జాగ్రత్త పడొచ్చు.