"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

02 జనవరి, 2007

దళితకవిత్వంలో స్థానీయ కోణం "అట్లేటి అల"



" ఊరికి అచ్చరమైన అయ్యని కాదని
లెక్కలోకే రాకుండా
అసలు బడిమొకమే సూడనోడు
రచ్చబండవ్వడం
తాటాకు మంటైతంది అల"
ఇది రత్నాకర్ 'అట్లేటి అల' దీర్ఘకావ్యంలోని ఖండిక! ఇక్కడ ' అయ్య ' చదువుకున్న రెండవ తరం దళితులకు ప్రతీక. సమాజంలో చదువుకున్న దళతులను గౌరవించకుండా, చదువుకోకపోయినా తమ కులాధిక్యం వల్ల గౌరవింపబడటాన్ని గమనిస్తున్న దళిత చైతన్యానికి ప్రతీక ' అల 'నిజానికి దళితులకు ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం సమకూరుస్తున్నా, స్వచ్చంద సంస్థలు సహకరిస్తున్నా, దళితులు విద్యా, ఉద్యోగరంగాలలో తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటున్నా, గ్రామాల్లో కులాధిపత్యమే అధికారాన్ని, గౌరవాన్ని పొందుతుంది.ఈ స్థితిని పై కవితా ఖండికలో సమర్ధవంతంగా వర్ణించగలిగాడుకవి . అంతేకాదుగతానికీ వర్తమానానికీ మధ్య వ్యత్యాసాలను గమనిస్తున్న చైతన్యం" అల"నిండాకనిపిస్తుంది. నిజానికి దళితసాహిత్యంలో గతాన్ని స్మరించుకొంటూ, వర్తమానాన్ని నిర్మించుకొంటూ, భవిష్యత్తుకిబాటలు వేయటం చైతన్యవంతమైన వారి రచనల్లో స్పష్టమవుతుంది. అది రత్నాకర్ కవిత్వంలోనూ ఉంది.అయితే, రత్నాకర్ ఈ దీర్ఘకావ్యంలో ఒక వి శిష్టతను మిళితం చేశాడు. స్థానీయ అస్తిత్వకోణంలో దళిత సమస్య లను ఒక దీర్ఘకావ్యమంతా వర్ణించగలిగాడు. ప్రకాశం జిల్లా పరిసరాలన్నీ ఈ కావ్యం నిండా దళిత పరిమళంతో అలముకుంటాయి.భాష, భావం, వ్యక్తులు, వివిధ సంఘటనలు వంటివన్నీ దళిత జీవితం నుండే ప్రవాహమై ఉరికాయి. శిఖామణి గారన్నట్లు కవి చుట్టూనే కావ్య వస్తువు అలముకుంది. కానీ, దాన్ని వ్యక్తిగతంగానే వర్ణించకుండా దళిత జీవితాలన్నింటినీ అందులో చూసుకోగలిగేటట్లు చేయగలిగాడు కవి. అంతేకాదు దళిత భాష విషయంలో రత్నాకర్ ది ఒక ప్రత్యేక శైలి ఏర్పడుతున్నది. అది అంతకుముందు రాసిన ' మట్టిపలక ' లోనూ కనిపిస్తుంది. అయితే ఆ భాషా మాండలిక ప్రయోగాలతో కవిత్వం పరిపుష్టి కి దగ్గరయ్యింది. డా. నాగభైరవ కోటేశ్వరరవు గారు ఈ కావ్యలోని కొన్ని పదాలను వివరించారు.
మాల-మాదిగలు ఇరువురూ కలిసిమెలిసి ఉండటాన్నీ, కలహించుకోవటాన్నీ కూడా ఈ దీర్ఘకావ్యం రికార్డ్ చేయగలిగింది. ఇరువురికీ మధ్య విభేధాలు పెట్టి తమ ఆధిక్యాన్ని చెలాయించుకొనే అవకాశవాద అధికారాన్నీ వర్ణించే ప్రయత్నం పుస్తకంలో కనిపిస్తుంది.
" ఊరికి రెండు కల్లల్లా
మాల మాదిగ పల్లెలు
నండుంగున ముల్లగర్రవుతున్న ఊరు
అట్లేరు, ఆ మంచీల్ల సెలం కాడి తేడాలు
రచ్చబండ, ఆ పంచెల్ల తీర్పులు
గోచి గుడ్డలు ఆటిగోస
అర్థమయ్యేవి కాదు అలకి" (పు:24)
ఇలాంటి చోట్లలో అల కవి జీవిత దశగానే మారిపోతుంది. ఒకానొక దళిత జీవిత దశను ఇక్కడ అల చూపుతుంది. ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే అలను బలమైన ప్రతీకగా మార్చగలిగే అవకాశం ఉండేది.మరో విశేషం చెప్పుకోవాలి వర్తమాన దళితుని విద్యా మనస్తత్వాన్ని ఒకచోట ప్రశంసనీయంగా రాశాడు కవి.
"రథం కాడి బడిలో కూసుని
ఇసికలో అచ్చరాలైన అయ్యని
చూసి ఆకసమౌతుంది అల"
(పు:20) . దళితుడు ఒకప్పుడు విద్యా తృష్ణ తీర్చుకోవటానికి పడిన ఆరాటాన్నీ, ప్రస్తుతం అనేక ఉన్నత డిగ్రీలను దళితులు సాధించటం వెనుకున్న కారణాన్ని గొప్పగా అభివ్యక్తీకరించాడు. నేడు దళితుడు చదువుకోవటమనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు. ఒకప్పుడు దళితులకు చదువురాదన్నారు. వస్తుందనినిరూపించారుదళితులు. ఇంకా దళితులకే చదువు బాగా వస్తుందనే నిరూపణలు చేయాలనే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ఆచార్య కృపాచారిగారు అన్నట్లు ' దళితజాతిని తాకిన అక్షరాలిప్పుడు పవిత్రమౌతున్నాయి ' ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని చర్చించుకోవాలి
ఈ దళిత కవిత్వంలో ధ్వని గురించి ఆచార్య కృపాచారి గారు విశ్లేషించారు. చాలామంది దళిత కవులు ఇలాంటి కవిత్వాని రాస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దళిత కవిత్వంలో ఆలంకారిక ప్రయోగాల గురించి అధ్యయనం జరగ వలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శూద్రులనేది చాలా విస్తృతమైన పరిధిని కలిగిన పదమైపోయింది. ఒకప్పుడు రెడ్డి, చౌదరి, నాయుడు వంటివారంతా శూద్రులుగానే పరిగణన పొందేవారు. ఇప్పుడు ఆవర్గాలనుండే వేదరక్షణ విస్తృతస్థాయిలో జరుగుతున్నది. కవిత్వం కూడా వస్తున్నది. కనుక అప్పకవి నిరసించిన శూద్రుడెవరు? అనే విషయాల్లో ప్రమాణాల్లో మార్పులు వస్తున్నాయి. కనుక వర్తమానాన్ని గమనిస్తూ కవితా నిర్మాణాలను కూడా పెంచుకుంటూ పోవవలసిన అవసరం కనిపిస్తుంది. శూద్రుడు రాసిన కవిత్వాన్ని వ్యతిరేకించిన అప్పకవి సిద్ధాంతాలను ఎంతవరకూ వ్యతిరేకించాలో కూడా దళిత కవులు లోతైన ఆలోచన చేయవలసి న అవసరం ఉంది. మొత్తం మీద ప్రతి జిల్లానుండీ ఇలాంటి దీర్ఘ కావ్యాలు రావాలనే ఆలోచనను కూడా ఈ కావ్యం ప్రేరేపిస్తుంది. అనేక దీర్ఘ కావ్యాలొచ్చినా , దీనికొక ప్రత్యేకత ఉందని పై అంశాలను బట్టే చెప్పవచ్చు. ఇటీవల దళిత కవిత్వం రావటంలేదనుకొనేవారు వెంటనే చదవవలసిన పుస్తకం గా దీన్ని భావించవచ్చు.

-డా. దార్ల వెంకటేశ్వరరావు
-(అట్లేటి అల (దీర్ఘ కావ్యం ) కవి: డా.జి.వి.రత్నాకర్,ప్రతులకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర బూక్ హౌస్ అన్ని శాఖలు.పుటలు:60, ఖరీదు:రూ:30/)

కామెంట్‌లు లేవు: