మత్సరం
ఎన్నిసార్లు చూసినా
కన్నీళ్ళాపుకోలేనంత ఉద్వేగం!
స్వరాలు
తెరమీద కదులుతుంటే
నా లోపల
ఏదో పాత గాయం
మళ్లీ తెరుచుకుంటుంది.
గురువు
శిష్యుడి గొంతులో
తన నేర్పిన స్వరాన్ని విని
మురిసిపోవాలి...
తన స్వరాన్నే మించి
ఒక కొత్త స్వరం పుడితే
ఆనందంతో
ఆకాశాన్ని చూపించాలి...
అక్కడే
ఒక మనసు
తన నీడకే
భయపడుతుంది!
శిష్యుడి గొంతులో
సూర్యుడు ఉదయిస్తుంటే
గురువు కళ్లలో
సాయంత్రం ఎందుకు కమ్ముకుంటుంది?
తాను నాటిన చెట్టు
తనకంటే ఎత్తుగా ఎదిగితే
ఆ చెట్టు నీడలో
సేదతీరాల్సిన మనసు
దాని కొమ్మలనే
విరిచేయాలని ఎందుకు చూస్తుంది?
తన చేతిలో పెట్టిన
స్వరమే
తన చేతిని దాటి
ఆకాశాన్ని తాకుతుంటే
గురువు
చప్పట్లకు బదులు
చేతులను ఎందుకు బిగిస్తాడు?
ఇది ఓటమి కాదు...
ఇది
తనలోని చిన్నదనాన్ని
తన శిష్యుడి మహత్తులో
చూసుకోలేని విషాదం!
నిజమైన గురువు
తనను మించిన శిష్యుడిని
చూసిన రోజే
తన గురుత్వానికి
పూర్ణత్వం పొందుతాడు.
తనకంటే ఎత్తుగా
శిష్యుడిని నిలబెట్టగలిగినవాడే
నిజమైన గురువు!
స్వాతికిరణం
నన్నెప్పుడూ కదిలిస్తుంది
శిష్యుడి విజయాన్ని
తన విజయంగా చేసుకోలేని
ఒక గురువు అంతర్మథనంతో!
తెర దిగిపోయింది...
స్వరాలు ఆగిపోయాయి...
ఆ మౌనంలో మాత్రం
ఒక ప్రశ్న
ఇంకా వినిపిస్తూనే ఉంది
డా.దార్ల వెంకటేశ్వరరావు 14.9.2026
( స్వాతి కిరణం చలనచిత్రం చూసినప్పుడల్లా కలిగే ఓ ఉద్వేగం…)
