విత్తిన అక్షరాలు
తరగతి గదిలో
నేను పలికే కొన్ని మాటలు
ఆ క్షణానికి
పాఠంలో భాగమే.
ఒక పుస్తకాన్ని చూపించాను,
ఒక ఆలోచనను పరిచయం చేశాను,
ఒక ప్రశ్నను వాళ్ల ముందుంచాను,
ఒక దారిని చూపించాను.
వాళ్లు విన్నారు.
నోట్స్ రాసుకున్నారు.
పరీక్షలు రాశారు.
తరగతులు దాటిపోయారు.
నేనూ
నా తర్వాతి పాఠానికి వెళ్లిపోయాను.
కాలం
తన పని తాను చేసుకుంది.
ఒకరోజు
అనుకోకుండా నాకో సందేశం
“సార్...
మీరు ఆనాడు చెప్పిన మాట
ఇప్పటికీ నాతోనే ఉంది.”
అంతే...
ఆ ఒక్క వాక్యం
ఏళ్ల తరబడి బోధించిన
వందల పాఠాలకంటే
నా అంతరంగాన్ని ఎక్కువగా తాకుతుంది.
మరో విద్యార్థి చెబుతాడు
“సార్,
మీరు సూచించిన ఆ పుస్తకమే
నా ఆలోచనలకు మొదటి తలుపు.”
ఇంకొకరు
“మీరు ఇచ్చిన ధైర్యంతోనే
ఆ అడుగు వేశాను.
ఇక ప్రతి అడుగూ ముందుకే వెళ్తుంది”
అప్పుడు
నా ముందున్నది
నా విద్యార్థి కావొచ్చు
ఎప్పుడో
తరగతి గదిలో
నా మాట వింటూ కూర్చున్న
ఆ యువకుడి
పూర్తయిన ప్రయాణం.
నేను బోధించినది
ఒక పాఠం అనుకున్నాను
అది వాళ్ల జీవితంలో
ఒక మలుపైందని
ఏళ్ల తర్వాత తెలుసుకుంటాను.
నేను ఇచ్చినది
ఒక పుస్తకం అనుకున్నాను
అది వాళ్ల చేతిలో
ఒక ప్రపంచానికి తలుపైందని
వాళ్ల మాటల్లో వింటాను.
వాళ్లు ఎదిగినప్పుడు
నాకు కనిపించేది
వాళ్ల విజయమే కాదు
ఆ విజయానికి ఎక్కడో ఒక మూలన
మనిద్దరి మధ్య జరిగిన
ఆ చిన్న సంభాషణ కూడా నేమో.
వాళ్లు
నన్ను గురువుగా గుర్తుచేసుకున్నప్పుడు
నేను మాత్రం
వాళ్లలో
నా బోధనకు వచ్చిన
జీవంతమైన ప్రతిధ్వనినే వింటాను.
అప్పుడు
ఉపాధ్యాయుడిగా పొందిన
గౌరవం కంటే
మనిషిగా పొందిన
సంతృప్తే గొప్పగా అనిపిస్తుంది.
గురువు తన జీవితాన్ని
తనలోనే పూర్తి చేసుకోడు
తాను తాకిన
కొన్ని మనసుల్లో
కొనసాగుతూనే ఉంటాడు.
తరగతి గది ఖాళీ అవుతుంది.
బ్లాక్‌బోర్డు తుడిచిపోతుంది.
పాఠ్యాంశాలు మారిపోతాయి.
విద్యార్థులు
తమ తమ ఆకాశాల్లోకి ఎగిరిపోతారు.
అయినా
ఎక్కడో ఒకచోట
నా మాట ఒకటి వాళ్లలో వెలుగై ఉంటే
అదే నా బోధనకు అర్థం.
అదే నా గురుత్వానికి ప్రతిఫలం.
అదే నేను సంపాదించిన
అత్యంత విలువైన జ్ఞాపకం....
గత సెమిస్టర్ లో ఇండియన్ పోయిటిక్స్, లిటరరీ క్రిటిసిజమ్ చెప్పినప్పుడు విద్యార్థులు పంపిన కొన్ని అభిప్రాయాలు...
ఆత్మకథను రాయమన్న ఈ అసైన్మెంట్ నాకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను గుర్తుచేసుకుంటూ రాయడం ద్వారా నా ప్రయాణాన్ని నేను మరింత దగ్గరగా అర్థం చేసుకున్నాను. సొంతంగా ఆలోచించి, భావోద్వేగాలను పదాల్లో వ్యక్తపరచడం వల్ల నా రచనా నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరిగాయి.ఆత్మకథ రాయడం ద్వారా జీవితంలో నడిచిన ప్రతి అడుగు గుర్తుకు వచ్చింది. చిన్ననాటి జ్ఞాపకాల నుండి యూనివర్సిటీ వరకు వచ్చిన ప్రయాణాన్ని తిరిగి ఒకసారి అనుభవించినట్టుగా అనిపించింది. మన భావాలను, )కష్టాలను, విజయాలను స్వయంగా పదాల్లో వ్యక్తపరచడం వల్ల రచనా నైపుణ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక కథ ఉంటుందని, దాన్ని చెప్పగలిగితే అది మరొకరికి స్ఫూర్తిగా మారుతుందని ఈ అసైన్మెంట్ ద్వారా తెలుసుకున్నాను. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస మంచి ప్రయత్నంగా అనిపించింది..మాలో ఉన్న ఈ సృజనాత్మక నైపుణ్యాన్ని వెలికితీసిన ఆచార్య దార్ల వెంకటేశ్వర్లు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ...
24HTMA08
రచన సాకు
MA ద్వితీయ సంవత్సరం విద్యార్థిని.
13.5.2026
….
జీవితంలో ఏం సాధించాను, ఎక్కడ వరకు గమ్యాన్ని చేరుకున్నాను, చేరుకునే క్రమంలో ఎదురు అయిన అనుభవాలు, పడిన కష్టాలు, ఎంత ఎదిగిన ఒదిగే తత్వం, మన అనుకున్న వాళ్ళే మనల్ని వేరు చేయడం, వెక్కిరింతలు, ఇవన్నీ నా అనుభవాలు రాస్తుంటే అర్థమయ్యాయి. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆచార్యుల వారికి
ఒ. స్వరూపరాణి, ఎం.ఏ.ద్వితీయ సంవత్సరం.
Name:O.Swaroopa rani
Reg no: 24HTMA03
….
రాయాలనుకున్నది రాతలే కానీ అందులో ఉన్నది గడిచిన జీవితం. ఆత్మకథలో ఎంత సృజనాత్మకంగా రాసిన కూడా అందులో ఉండే భావాలు సహజత్వంగానే కనిపిస్తాయి
చెరువులోకి చేరిన కొత్తనీరు జ్ఞాపకమే, చెరువు ఎండిపోయిన తర్వాత మిగిలిన నెర్రెలు జ్ఞాపకాలే .
గడిచిన జీవితంలో మిగిలిన జ్ఞాపకాలను, ఆనందాలను,అవకాశాలను, అవమానాలను,దుఃఖాలను,ప్రేమలను,అనుభవాలను మళ్లీ గుర్తు చేసుకునేలా ఈ ఆత్మ కథను రాయమనడం నాకు చాలా నచ్చింది.
ఇందుకు మీకు ధన్యవాదాలు సార్.
పుస్తక సమీక్ష చేయడం ద్వారా పుస్తకాన్ని చదివి అందులో ఉన్న కథ మన జీవితంలో జరిగిన కథకు దగ్గరగా ఉంటే ఆ విషయాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకునేలా ఉంటుంది నేను ఎంచుకున్న కథలలో అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి
ఇలాంటి అవకాశం మీరు మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్ 🙏
Devarakonda sravan , ఎం.ఏ. ద్వితీయ సంవత్సరం
Reg no: 24 HTMA41
…..
ఆత్మకథల రచన అనేది విద్యార్థులలో నిద్రాణమై ఉన్న సృజనాత్మక శక్తిని మేల్కొలిపి, వారి ఊహాశక్తికి సరికొత్త రెక్కలను ఇస్తుంది. పరకాయ ప్రవేశంలాంటి ఈ ప్రక్రియ ద్వారా ఇతరుల అనుభవాలను తమ స్వంతం చేసుకోవడం వల్ల విద్యార్థులలో స్వీయ అభివ్యక్తి నైపుణ్యాలు అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. కేవలం చదువుకే పరిమితం కాకుండా, సమాజాన్ని ఒక విభిన్న కోణంలో దర్శించే విమర్శనాత్మక మరియు విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణి ఈ ప్రయత్నాల వల్ల అలవడుతుంది. ఆ రకంగా చూస్తే, మాలోని ఆలోచనా పరిధిని విస్తృతం చేసి, అంతర్గత ప్రతిభకు పదును పెట్టడంలో ఈ అసైన్మెంట్ వంద శాతం విజయవంతమైంది. విద్యార్థుల మానసిక, మేధో వికాసానికి బాటలు వేసే ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మాకు కల్పించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.🙏
ఆత్మకథలు రాయడం ద్వారా విద్యార్థులు తమను తాము ఊహించుకుని ఆలోచించడం వల్ల వారిలో సృజనాత్మకత (Creativity) అద్భుతంగా పెరుగుతుంది. ఈ ప్రక్రియ కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సొంత అనుభూతులను మరియు లోతైన భావాలను స్వతంత్రంగా వ్యక్తపరిచే స్వీయ అభివ్యక్తి నైపుణ్యాలను (Self-expression skills) పెంపొందిస్తుంది. పాత్రల కోణంలో నుండి సమాజాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు, సానుభూతి మరియు విమర్శనాత్మక ఆలోచనా ధోరణి అలవడుతాయి. భాషా ప్రయోగంపై పట్టు సాధించడానికే కాక, విద్యార్థిలోని అంతర్గత ప్రతిభను మరియు సృజనాత్మక ఆలోచనలను వెలికితీయడంలో ఇటువంటి ప్రయత్నాలు వంద శాతం సఫలీకృతమయ్యాయి.
కోటకొండ శరత్ కుమార్
ఎం.ఏ. ప్రథమ సంవత్సరం
25 HTMA 40
….
నేను రాసిన ఆత్మకథ మరియు పుస్తక సమీక్ష నన్ను ఎంతో ఆలోచింపచేసాయి. ఎక్కడైనా ఒక ఎగ్జామ్ రాతపరీక్షల్లోనే పెడుతుంటారు. కానీ మన సార్ చేసిన ఈ ప్రయత్నం , నాలో ఆలోచన రేకెత్తించాయి. ఒక పుస్తకాన్ని విభిన్న రీతిలో ఇలా చూడాలి? ఆ పుస్తకం దేని గురించి ముఖ్యంగా చర్చిస్తుంది అనే ప్రశ్నలు మెదడులో వచ్చాయి . ఇక ఆత్మకథ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రవాహంలా సాగిపోతున్న జీవితం, ఒకసారి ఆగి నా చిన్నతనం నుంచి ఇప్పటివరకు సాగిన జీవితాన్ని రాస్తుంటే కళ్ళ ముందు కదిలాడినట్టు అనిపించాయి. నాకు తెలవకుండానే ఒక అంశాన్ని ఇలా రాయగలనా అనిపించింది. మరో విధంగా చెప్పాలంటే మా సార్ మాకు తెలవకుండానే , మాలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీశాడని తప్పకుండా చెప్పగలను. ఇలాంటి వాటి వల్లనే ఒక విద్యార్థి మేధాశక్తి పెరుగుతుంది. అనేకమైన అనవసరలో తన మెదడులో ఆలోచింపచేస్తాడు. ఈ ప్రస్థానాలతో ఇంకెంతో నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
బొమ్మ ప్రవీణ్ కుమార్
ఎం.ఏ.ద్వితీయ సంవత్సరం
24HTMA53
……
గడిచిన కాలం - అక్షరార్చన
గడిచిన కాలాన్ని అక్షరాల్లో బంధించే ప్రయత్నం చేసినప్పుడు.. స్మృతిపథంలో ఎన్ని మధుర క్షణాలో! తొలుత శూన్యంగా అనిపించినా, జ్ఞాపకాల కవాటాలు తెరిచిన వేళ.. అంతులేని అనుభూతుల ప్రవాహం నన్ను ముంచెత్తింది. అందులో చిరునవ్వుల చినుకులు ఉన్నాయి, సవాళ్ల సెగలు ఉన్నాయి, సమాజం నేర్పిన పాఠాల తాలూకు లోతైన గాయాలు, గెలుపు గుర్తులు ఉన్నాయి. వీటన్నింటినీ 'గడచిన కాలం' అనే శీర్షికన ఒక ఆత్మకథ లా అక్షరబద్ధం చేశాను.
మాలో మేధోమథనానికి తార్కాణంగా నిలిచిన ఈ వినూత్న ప్రయోగం అత్యంత శ్లాఘనీయం. యాంత్రికమైన సాంకేతికతకు తావులేకుండా, 'ఇంటి నుండి విశ్వవిద్యాలయం వరకు' సాగిన నా జీవన ప్రస్థానాన్ని హృదయావిష్కరణ చేయడం.. నాలో సుప్తచేతనంగా ఉన్న సృజనాత్మకతకు ప్రాణం పోసింది. అక్షరాన్నే శ్వాసగా మలచుకుని, నా అంతరంగాన్ని ఆవిష్కరించుకునే ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి నా అక్షర నీరాజనాలు, కృతజ్ఞతాభివందనాలు.
డి సాయినాథ్ రెడ్డి
ఎం.ఏ. ప్రథమ సంవత్సరం
…
గతంలో జరిగిన విషయాలను గుర్తుతెచ్చుకునే సమయంలో భావనాశక్తి నాలో మెరుగుపడిందని భావిస్తున్నాను.
మనం సమాజంలో ఎదుర్కొంటున్న సమకాలీన పరిస్థితులను, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అని పుస్తక రూపంలో సమాజానికి అందించే తరుణంలో కవిగా ఎదగాలనుకున్న వారికి ఇది గొప్ప ప్రారంభం అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.
Name: Palle Bheemsen
M.A ద్వితీయ సంవత్సరం.
24HTMA21
Roll no : 24HTMA35
…..
సార్ మీరు ఇచ్చిన అసైన్మెంట్ ద్వారా మళ్ళీ నా జీవితంలో నేను పడ్డ బాధలు,కష్టాలు,సంతోషాలు గుర్తుచేసుకున్నాను.
ఆత్మ కథ రాయలేను అనుకున్న నేను అది రాస్తుంటే నాకు తెలీకుండానే నా కళ్ళలోనుంచి నీళ్లు వచ్చాయి. ధన్యవాదాలు సార్ మీ వల్ల నేను మళ్ళీ నా గతాన్ని నెమరువేసుకున్నాను.ఇప్పటి వరకు ఎలాంటి నవలలు చదవని నేను మీ ద్వారా ఒక బుక్ చదివి సమీక్ష చేయడం జరిగింది.అప్పటి నుంచి ఏదో తెలియని కుతూహలం నవలలు చదవాలని.ఇలా నా ఆత్మ కథ రాస్తుంటే నేను చేసిన తప్పులు గుర్తుచేసుకున్నాను సార్.ఈ ఆత్మ కథ రాయడం ద్వారా నేను చేసిన తప్పులు తెలుసుకొని మళ్ళీ అలాంటి తప్పులు చేయొద్దు అని అనుకున్నాను. ఇలాంటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్🙏
పెరుమాళ్ళ సునీత
M.A ద్వితీయ సంవత్సరం.
24HTMA21
….
సమీక్ష అంటే కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు రచయిత ఆ రచన చేయటం వెనకాల ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవటం.అందులోని పాత్రల ప్రవేశం తో రచయిత ఇచ్చే సందేశం దాని వెనకల ఉన్న చరిత్రను వెతకటం..ఇక ఆత్మ కథ విషయానికి వస్తే ఆత్మ కథ రాయటం ద్వారా మన జీవితం లో జరిగిన స్మృతుల్ని స్మరించుకోవడం.ఏదైనా అనుభవం తోనే వస్తుంది ఆత్మ కథ రాస్తున్న సమయంలో తెలిసో తెలియకనో చేసిన తప్పులను భవిష్యత్తు లో మళ్ళీపునరావృతం చెయ్యకుండా సహాయపడింది.కొన్ని తీపి జ్ఞాపకాలను అలా పట్టి ఉంచింది.భవిష్యత్తులో రచనలు చేయడానికి గొప్ప పునాది వంటిది.ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు🙏
A. Hari krishna
ఎం.ఏ. ద్వితీయ సంవత్సరం
24HTMA45
….
ఆత్మకథను రాసే క్రమంలో పుట్టినప్పటి నుండి నేటి వరకు జీవితంలో జరిగిన సంఘటనలను రచించడానికి భిన్న కోణాలలో ఆలోచించడం వల్ల భావనాశక్తి మెరుగుపడుతుంది. వర్ణనాత్మకంగా రాయటం వల్ల మనలో ఒక కొత్త శైలి అభివృద్ధి చెందుతుంది. నాటి నుండి నేటి వరకు మన జీవితంలో జరిగిన పరిణామ క్రమాన్ని అంచనా వేసి, తప్పులను సరి చేసుకొని అభివృద్ధి పథంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది.
పుస్తక సమీక్ష చేయడం ద్వారా పుస్తకాలలో ఉన్న విషయాలను సమాజానికి ఎలా అన్వయించాలో తెలుస్తుంది. అలాగే ఆ పుస్తకంలో ఎటువంటి సిద్ధాంతముందో తెలుసుకోవచ్చు. తద్వారా పుస్తకాన్ని ఏ దృష్టితో అర్థం చేసుకోవాలో, ఆ పుస్తకంలో ఏ భావజాలం ఉందో తెలుసుకోవచ్చు.
రచన చేయడంలో గానీ, సృజనాత్మకంగా ఆలోచించడంలో గానీ ఇటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి అని చెప్పవచ్చు.
నాగరాజు
24HTMA28
సెకండ్ ఇయర్
….
అసైన్మెంట్, ఆత్మకథ ఎలాగ రాయాలి అనే దాని నుండి మీరు మా తోడుంటే ఎలాగైనా రాస్తామని ధైర్యంతో మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల నేను ఈ రెండు అంశాల మీద నా సొంత అభిప్రాయాలను మరియు పుస్తకంలోని అంశాలను నా జీవితానికి అన్వయించుకునిఅసైన్మెంట్ సులభతరంగా రాయడానికి పూనుకున్నాను .ఇక ఆత్మ కథకు వస్తే ఇసుకలో రాతలు నా సంతోషలైతే రాతిపై రాతలు నా బాధలు నా జీవితంలో అయ్యాయి .నా ఆత్మకథ రాస్తుంటే నాలో ఒక కొత్త కోణం నేను చూశాను నేను నా ఆత్మకథ రాస్తుంటే కన్నీటి సంద్రమై పోయింది నా హృదయం నా జీవితంలోని విషయాలను మీరు ఒక కుటుంబ సభ్యుల అనుకొని మీతో పంచుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్ .ధన్యవాదాలు సార్
.చిలుముల శిరీష
ఎం.ఏ.ద్వితీయ సంవత్సరం
24HTMA49
….
నమస్కారం సార్ 🙏, మీరు పుస్తకసమీక్షా రాయండి అన్నపుడు లైబ్రరీ కి వెళ్లి పుస్తకాలని వెతకడం మొదలు పెట్టాను. పుస్తకసమీక్షా చేయడం వలన ఒక పుస్తకాన్ని చదివి దానిలోని అంశాలని భిన్న మైన శైలిలో ఏవిధంగా వ్యక్తపరచాలో తెలుసుకున్నాను, మీరు చెప్పడం వాళ్ళేనే పుస్తకం ఏవిధంగా చదవాలి, ఏ విధంగా మా విషయాలని వ్యక్తపరచాలో తెలుసుకున్నాను.
మీరు మా ఆత్మకథ ల గురించి రాయండి అన్నప్పుడు ఏముంది లే 1 గంట లో రాసేస్తే అయిపోతుంది అనుకున్నాను.కానీ రాస్తున్నపుడు ఏం రాయాలి, ఎలా రాయాలో, ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అనే విషయాలను చక్కగా అందరికి అర్థము అయ్యేలా చెప్పారు. నా ఆత్మకథ ని రాస్తున్నపుడు నా జీవిత ప్రయాణాన్ని మళ్ళీ నా పుట్టుక నుంచి ఇప్పటి వరకు పునర్లిఖించడం జరిగింది.అలాంటి అవకాశం మీ ద్వారా మాకు లభించింది.బాల్యం నుండి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు, తీపి అనుభవాలు, చేదు అనుభవాలు, విజయాలు మరియు ఎదుర్కొన్న అడ్డంకులను, నా కుటుంబం, నా గురువుల ప్రభావం అన్నింటిని చక్కగా నా మాటల రూపంలో వ్యక్తపరుస్తూ రాసాను, రాస్తున్నపుడు నా కళ్లలో నుంచి నా కన్నీళ్లు పేపర్ మీది పడిన సందర్భాలుఉన్నాయి. అంటే ఏదో తెలియని బాధ నాకు ఆక్షణంలో వెంటాడుతూ వచ్చింది.మళ్ళీ నా గతాన్ని తవ్వి చూస్తున్నట్టు అనిపించింది.అందులో తీపి అనుభవాలకంటే, చేదు అనుభవాలనే ఎక్కువ చూసాను, మీరు మా ఆత్మకథల గురించి రాయండి అని చెప్పడం వల్లేనే మళ్ళీ నన్ను నేను అద్దంలో చూసుకోకుండా పేపర్ మీద నా ప్రతిబింబాన్ని చూస్తున్నట్టు అనిపించింది. దీనికి కారణం మా గురువు గారు.మాలోని సృజనాత్మక నైపుణ్యాలు, ఆలోచించే తత్త్వం,ని బయటికి తీశారని చెప్పగలను.ఇలాంటి వాటి వాళ్ళేనే పిల్లల్లో ఆలోచించే తత్వము, సృజనాత్మకత పెరుగుతుంది, జీవితం లోనే ఇన్ని ఆటంకాలని ఎదుర్కొన్నాను,ఇపుడు వచ్చిన సమస్య ఇది ఎంత అనే ధైర్యం పిల్లలో కలుగుతుంది, అన్నీ విషయాలని బయటికి వ్యక్త పరచడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది,జీవితం మీద నమ్మకం ఏర్పడుతుంది, ఎవరితో ఏవిధంగా ప్రవర్తించాలో తెలుసుకుంటారు. ఏదైనా అంశాని ఏ విధంగా ఇతరులకి వ్యక్త పరచాలో తెలుసుకుంటారు,నేను రాసిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది ఆ విలువను నాకు తెలుసుకునే అవకాశం నాకు మీరు ఇచ్చారు సార్,వాటి వలన నాలో ఓర్పు, జీవితంలో ఎదురయ్యే అనుభవాలని ఎదుర్కోనీ ముందుకు ఎలా సాగాలో తెలుసుకున్నాను, నాకు ఇలాంటి మంచి జీవితాన్ని ఇచ్చిన మా అమ్మ నాన్నలకి ఏమి ఇచ్చిన వారి రుణం తీర్చుకోలేను 🙏. అమ్మ నాన్నలకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు🙏.ఇందులో ఏమైనా తప్పులు రాసింటే మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలని కోరుకుంటూన్నాను సార్ 🙏.ఇలానే మమ్మల్ని నిరంతరం మీరు ప్రోతహిస్తూ, మీరు ముందుండి మమ్మల్ని మీ ముందుకు వచ్చేలా నడిపిస్తున్నందుకు ధన్యవాదములు సార్🙏నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు గురువు గారు 🙏..
Name: T.K.Maheshwari
Reg: 24HTMA12.
…
సార్ మీరు పుస్తక సమీక్ష ఇచ్చినపుడు నాకు ఎలా రాయాలో అర్ధం కాలేదు. స్కూల్ డేస్ లో పుస్తక సమీక్ష అంటే ఒక కథను రాసి ఇవ్వమనే వారు అంతే. కానీ మీరు చెప్పిన తర్వాత అర్ధమయింది సార్ ఒక నవలను చదివినప్పుడు , దానిని విభిన్న కోణాల్లో చూడాలి అని. పుస్తక సమీక్ష రాసినపుడు నాలో సృజనాత్మకతను, ప్రేరణ ని కలిగించింది నవల. ఇక
ఆత్మకథ విషయానికొస్తే జీవితం ఒక మూసిన పుస్తకంలో కనిపిస్తుంది కానీ అందులో ఉన్న విషయాలను తెలుసుకోవాలని అనిపించినప్పుడు మన జీవితంలో జరిగిన ప్రతి క్షణాన్ని భద్రపరచి దాన్ని తిరిగి చూసుకుంటే నాతో పాటు మోసుకు వచ్చిన భావాలు ఎన్నో కనిపిస్తాయి. నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క క్షణం నాకు ఎంతో విలువైనది. దాని ద్వారా నేను ఓర్పుని, సహనాన్ని నేర్చుకున్నాను. ప్రేమ , ఆప్యాయతలు , బంధాలు, బంధుత్వాలు, స్నేహం, కోపం, అవమానాలు అన్ని నా జీవితంలో ఉన్నాయి అన్న భావన నాలో కలిగింది. ఆ తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ రాసిన ఈ ఆత్మకథ నన్ను , నాకు పరిచయం చేసింది. జీవితంలో నేను చేసిన తప్పులు , మళ్ళీ చేయకూడదని నేర్పింది నా ఆత్మకథ. అలాగే చదువులో సబ్జెక్టు పట్ల వెనుబడే విద్యార్థులకు నా ఆత్మకథ స్ఫూర్తిదాయకం. సార్ మీరు ఇచ్చిన పుస్తక సమీక్ష , ఆత్మకథ ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే సాధన చేస్తే , సాధించలేనిది ఏది లేదు.
శానే. ప్రవళిక
ఎం. ఏ ద్వితీయ సంవత్సరం
24HTMA26
…
నా జీవిత కథను నేను నాకుగా రాసుకున్నప్పుడు నాలోని అనుభవాలు మరిచిపోలేను ,నా జీవితాన్ని నేను రాసుకొనేటప్పుడు మనసులో ఎన్నో రకాల భావోద్వేగాలు, అనుభవాలు, మార్పులు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో నేను అనుభవించిన అనుభూతులు
తీపి గుర్తులు : నా బాల్యం నా మొదటి విజయం మరియు నా సంతోషకరమైన క్షణాలను రాస్తున్నప్పుడు ముఖంలో తెలియని చిరునవ్వు వచ్చింది.
నేను అనుభవించిన కష్టాలు, పరిచయాల గురించి రాసేటప్పుడు ఆ బాధ మళ్లీ కళ్ల ముందు కదలాడింది.
ఇన్నాళ్లు గుండెల్లో దాచుకున్న బాధలను ఎవరికి చెప్పుకోలేని విషయాలను కాగితంపై పెట్టినపుడు మనసు తేలిక అయింది.
నేను ఇంత కష్టమైన జీవితాన్ని దాటుకుని వచ్చానా అని నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
సార్, నా జీవిత కథను నేను రాసుకోవడానికి, నా గతాన్ని తిరిగి నెమరువేసుకోవడానికి మీరు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మీ ప్రోత్సాహం వల్లే నాలోని అనుభవాలను నేను గుర్తించగలిగాను. నాకు ఈ మార్గదర్శకత్వం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
స్నేహ
ఎం.ఏ. ప్రథమ సంవత్సరం
….
శుభోదయం సార్
నేను మొదట పుస్తక సమీక్ష అంటే అదేదో నాలుగు పేజీలు చదివి రాసేయడమే అనుకున్నాను.కానీ ఒక పుస్తకం ఎలా చదవాలి అందులోని అంశాన్ని ఏ దృష్టితో చూడాలి, రచయిత ఏ కాలంలో, ఏ పరిస్థితుల్లో ఆ రచన చేయవలసి వచ్చింది అనేది ఈ మొదటి అసైన్మెంట్ ద్వారా తెలుసుకున్నాను.దీని ద్వారా నాలో ఉన్న సృజనాత్మక నైపుణ్యం నాకు తెలిసింది.
సార్ మీరు మొదట ఆత్మకథ రాయమన్నప్పుడు మేము ఏం అంత గొప్ప వ్యక్తులం కాదు మమ్మల్ని ఎందుకు రాయమంటున్నారు అని అనిపించింది కానీ రాస్తుంటే తెలిసింది ఎందుకు రాయమన్నారో అని.
ఆత్మకథ రాయడం వల్ల నేను నా ఇన్నాళ్ళ ప్రయాణంలో చవిచూసిన ఎత్తుపల్లాలు, గతకాలపు చేదు అనుభవాలనుండి పోగు చేసుకున్న తీపి గుర్తులు మళ్ళీ నెమరేసుకోవడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ధన్యవాదాలు సార్ 🙏
ఇలాంటి అసైన్మెంట్స్ ఇవ్వడం వల్ల మాలో నైపుణ్యం, సొంతంగా ఆలోచించే శక్తి పెరుగుతాయి.
ఏమైనా తప్పులు రాసి ఉంటే క్షమించండి సార్ 🙏.
Name :K.BALA KRISHNA
Reg No :24HTMA29
…..
సార్ మీరు పుస్తక సమీక్ష ఇచ్చినప్పుడు ఒక పుస్తకాన్ని ఏ విధంగా చదవాలో అందులోని అంశాలను మనం ఏ విధంగా అవగాహన చేసుకోవాలో ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు పరిపరి విధాలుగా ఆలోచించి దానిపైన ఒక సమీక్ష రాయడం అనేది ఒక గొప్ప అంశం ఈ పుస్తక సమీక్ష ద్వారా ఒక పుస్తకాన్ని మనం అందులోని కవి గురించి గానీ , ఆ పుస్తక కాలంలో సామాజిక , రాజకీయ ,పరమైన అంశాలు తెలుస్తాయి కాలంలో ఏ విధంగా వ్యవస్థ నడిచింది అని తెలుస్తది ఈ విధంగా ఒక పుస్తకాన్ని సమీక్ష చేయడం వల్ల మాకు చాలా విషయాలు తెలిసినయి సార్ ఈ పుస్తక సమీక్ష అంశాన్ని ఇవ్వడం సంతోషం .
అలాగే రెండో అంశమైనటువంటి ఆత్మకథ
ముఖ్యంగా ఆత్మకథ జననం నుంచి మొదలై మన బాల్యంలో గడిపిన మధురస్మృతులు నిజంగా బాల్యం తిరిగి రాదు అంటారు ఆ బాల్యాన్ని మళ్ల ఆత్మకథ రాస్తుంటే మరోసారి బాల్యంలోకి తొంగి చూసినట్టయింది ఆత్మకథ ద్వారా పాఠశాలస్థాయి నుండి ఇంటర్ ,డిగ్రీ యూనివర్సిటీ స్థాయి వరకు చాలా అంశాలు నెమరేసుకున్నాను ఇలా ఒక పుస్తక సమీక్ష మరియు ఆత్మకథ ద్వారా ఒక విద్యార్థికి భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లను అధిగమించేటట్లు ఉన్నాయి, ఈ రెండు అంశాలు అసైన్మెంట్ ఇచ్చినందుకు మా గురువుకి కృతజ్ఞతలు🙏
P.Beechupally
24htma32
…..
సార్, మీరు ఆత్మ కథ రాయమని చెప్పినప్పుడు నేనేం సాధించానని, నా గురించి నేను రాసుకుంటాను అని అనుకున్నాను ,కానీ రాసేటప్పుడు ప్రతి సంఘటన నా జీవితంలో ఏం జరిగిందో అనేది నేను రాశాను, ఆడపిల్లలు అంటే ఇంతవరకు చదువుకోవాలి ఇలానే ఉండాలి అన్నట్టు ఉంటది మా ఊర్లో,అలాంటిది నన్ను ఇక్కడి వరకు అంటే ఇంత చదువు చదివిపించడానికి కారణం మా నాన్న. అప్పుడే పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ చదువుతది అని చెప్పేసి ఏమంత ఫోర్స్ చేయకుండా ,ఇప్పటివరకు అయితే నన్ను చదివించాడు. ముందు పెళ్లి చేయాలి అన్నట్టు ఉండే కానీ ఇప్పుడు నా బిడ్డ చదువుకోవాలి ,ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లలో అందరూ ఉండాలి కదా, అబ్బాయిలు అమ్మాయిలు ఏంటి తేడా అని చెప్పేసి నన్ను ఇంతవరకు మా నాన్న చదివిపించిండు.ఆత్మకథ రాయడం వల్ల నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటి అంటే, నాకు నేను మళ్ళీ ఒకసారి తెలుసుకున్నాను ఏంటంటే భయపడిపోయి అప్పుడే పెళ్ళి చేసేస్తారు అని అనుకున్నాను కానీ, ముందు అడిగేసి పాలిటెక్నిక్ రాసాను సీటు వచ్చింది.తర్వాత వాళ్ళ కోసమే వద్దు అని వదిలేసుకున్నాను.ఇక్కడ యూనివర్సిటీలో నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. మా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు నేను సంతోషంగా ఉన్నాను. ఒకటి జీవితంలో ఒకటి పోయింది అని అంటే ఇంకోటి దానికన్నా మంచిది వస్తదని మాత్రం నాకు అర్థం అయింది. మనకంటూ రాసిపెట్టింది మనకి కాకుండా ఎక్కడికి వెళ్లదు అది ఏనాటికైనా మన జీవితంలోకి వస్తుంది.
యన్.మహేశ్వరి
21ihmt17
….
జీవిత చరిత్ర రాయడం అంటే జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్లి, ఆ జ్ఞాపకాలను మళ్లీ మననం చేసుకోవడమే. అప్పుడు కలిగే మధురానుభూతి చాలా గొప్పది.సినిమాల్లో హీరో గతంలోకి వెళ్లి తనను తానే పక్కనుండి చూసుకుంటాడు. అది చూసినప్పుడు నాకు కొత్తగా అనిపించేది. కానీ నేను నా జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు అదే అనుభూతి నాకు కలిగింది. నా గతంలోని సంఘటనలను మళ్లీ కళ్లముందు చూసుకుంటూ, ఆ క్షణాలను మరోసారి జీవించడం ఎంత అద్భుతంగా అనిపించిందో! జీవితంలో జరిగిన అన్ని విషయాలు అందరికీ చెప్పలేము. చెప్పాలనుకున్నా సమయం అనుకూలించకపోవచ్చు. కానీ జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు మాత్రం అన్ని విషయాలను నిర్భయంగా అందరికీ చెప్పగలం. నా జీవితంలోని అన్ని సంఘటనలు రాయలేకపోయినా, అన్నింటినీ గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ మధుర క్షణాలు మరచిపోలేనివి.
మళ్లీ నన్ను నా పుట్టుక దగ్గరికి పంపించి, అక్కడి నుంచి ఇక్కడివరకు తీసుకొచ్చిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏.
ఎల్. శ్రీధర్
….
నా ఆత్మకథ రాసేముందు అనుకున్నాను,"మనకేముంటుంది లే" అని కానీ రాసేటప్పుడు పేపరు పై పెన్ను ఆగలేదు, కొన్ని పేజీలను చిరునవ్వులతో నవ్వించాను, కొన్ని పేజీలను కన్నీళ్లతో తడిపాను, అవన్నీ నేను గుర్తుచేసుకుంటే నాకు రెండోసారి జీవించినట్లుగా ఉంది. నా ఆత్మకథ చదువుతుంటే నాకే ఎంతో స్పూర్తిదాయకంగా అనిపించింది.
మమ్మల్ని మాకు గుర్తు చేసిన ఈ ఆత్మకథ రాసే అవకాశం కల్పించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻
మేఘన
ఎం.ఏ. ప్రథమ సంవత్సరం
….
ఆత్మకథ అంటే స్థూలంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన గతాన్ని గూర్చి రాయడం లేదా చెప్పడం. అని తెలిసిందే
అయితే మానవ జీవితం కష్టసుఖాల సమ్మేళనం.
గతం గురించి మాట్లాడితే ప్రతి మనిషికి తియ్యనైన గాయాలతో కూడిన జ్ఞాపకాలు ఉంటాయి. అలాగే చేదు జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి అవి మంచివైనా, చెడ్డవైనా.
నేను నా ఆత్మకథ రాసే సందర్భంలో పడిన పాట్లు.....
అక్షరాలతో సహవాసం చేసే నేను
నా మనస్సులోని భావాల్ని సైతం
అక్షరాలతోనే తెలపాలనుకున్నా .....
కానీ..... ఈసారి
అక్షరాల్ని బంధించుటలో విఫలమయ్యాను.
అక్షరాలు సహకరించక
కలం ముందుకు సాగదిక
ఆకలితో వెతికే కళ్ళకు
కవిత ఏదీ కానరాక
అధరాలను దాటని మాట
బందీ అయినది నా నోట
సాయం కొరకు పిలిస్తేను
ఏ దేవుడు దిగిరాలేదట.....! అన్న రీతిలో సాగిన రచనను పూర్తి చేయాలని
గెలవడానికై నిరంతరముగా ప్రయత్నం చేస్తూ రాసుకున్న. అయినా అందంగా రాసుకున్న ఏ ఆత్మకథలైన ఎప్పుడూ అసంపూర్ణమే!
అందమైన ఆత్మకథ రాసేట్లు చేసి , ఆనాటి తీపి జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తు చేసిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్లకు కృతజ్ఞతలతో......
ఆనంద్, ఎం.ఏ. ప్రథమ సంవత్సరం
…,
ఒక పుస్తకాన్ని సమీక్షించడమంటే సామాన్యమైన విషయం కాదు. కవి రచనా శైలిని పరిశీలించాలి. పాత్ర చిత్రణను గమనించాలి. ఆ పాత్రల ద్వారా రచయిత ఏం చెప్పదలచుకున్నాడో గ్రహించగలగాలి. అందుల