‘సత్యం, శివం, సుందరం’ దళిత, మార్క్సిస్టు దృక్పథం:
ఆచార్య దార్ల ప్రసంగం.
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై వరుసగా ప్రొఫెసర్ మనోజ్ఞ, ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే, డా.భట్టు లక్ష్మీనారాయణ, లక్ష్మి తదితరులు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ప్రసంగం (సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ - 14.11.2026లో జనసాహితి వారు ఏర్పాటు చేసిన ‘సాహితీ చర్చ’ కార్యక్రమంలో మరాఠీ దళిత రచయిత, ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే, పాలమూరు విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ప్రొఫెసర్ మనోజ్ఞ, కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మి పాల్గొన్నారు. సభకు జన సాహితి జంట నగరాల అధ్యక్షులు డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ కవయిత్రులు కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, మహే జబీన్, ఎండ్లూరి మానస తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నేను మాట్లాడిన ప్రసంగ సారాంశాన్ని అందిస్తున్నాను.)
సభాధ్యక్షులు డా.భట్టు లక్ష్మీనారాయణగార్కి, వేదికపై ఆసీనులైన ప్రముఖ మరాఠీ దళిత సాహిత్య వేత్త ఆచార్య శరణ్‌కుమార్ లింబాలే గార్కీ,, ప్రొఫెసర్ మనోజ్ఞ గార్కీ, సభను ఏర్పాటు చేసిన లక్ష్మి గార్కీ సాహితీ ప్రియులైన మీ అందరికీ నమస్కారం. ఈ వేదికపై మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు ఎం.ఏ.లో 2005లో ఒక కోర్స్ గా ‘దళిత సాహిత్యం’ పెట్టాను. అప్పటికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరులో తప్ప, మరెక్కడా ఆ కోర్సు లేదు. నేను మా సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కోర్సు పెట్టిన తర్వాతనే డా.బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కోర్సు సిలబస్ లో రిఫరెన్స్ గ్రంథంగా శరణ్ కుమార్ లింబాలే గారి ఈ పుస్తకాన్ని కూడా పెట్టాను. ప్రొఫెసర్ సునీత రాణి గారు నాకు ఆ పుస్తకం ఇచ్చి, చదవమన్నారు. చదివిన తర్వాత దాన్ని కూడా రిఫరెన్స్ పెడితే బాగుంటుందని సలహా తీసుకొని పెట్టాను. నేను మొట్టమొదటిసారిగా సత్యం శివం సుందరం గురించి దళిత దృష్టితో ఆ భావనలను ఎలా అర్థం చేసుకోవాలో ఆ పుస్తకం ద్వారానే తెలుసుకున్నాను.
1. భారతీయ తాత్వికత - సత్యం, శివం, సుందరం: ఒక పునరాలోచన
భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక దృక్పథంలో ‘సత్యం, శివం, సుందరం’ అనే భావనలు అత్యంత ప్రాచీనమైనవి, లోతైనవి. మన వేదాలు, రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా ఈ మూడింటి చుట్టూనే తిరుగుతుంటాయి. సత్యం, శివం, సుందరం మూడింటిలో కేంద్ర భావన ఒకటే..దైవం.
సత్యం అంటే ఏమిటి? భగవంతుడే సత్యం, ఈ భౌతిక ప్రపంచమంతా మాయ, శాశ్వతంగా నిలిచేది దేవుడే అనేది భారతీయ తత్వశాస్త్రం చెప్పే మూల సూత్రం. భారతీయ తత్వశాస్త్రంలో ‘సత్యం’ అనే భావనకు అత్యంత ప్రాచీనమైన, ఆధ్యాత్మికమైన లోతు ఉంది. ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతం వంటి భారతీయ తాత్విక మార్గాలు ఈ భౌతిక జగత్తును 'మిథ్య' లేదా 'మాయ'గా అభివర్ణిస్తాయి. కాలం మారుతున్న కొద్దీ నశించిపోయే ఈ దృశ్యమాన ప్రపంచం తాత్కాలికమని, ఎప్పటికీ మార్పు చెందకుండా, సర్వవ్యాప్తంగా, శాశ్వతంగా నిలిచే పరమాత్మ లేక బ్రహ్మ పదార్థమే ఏకైక 'సత్యం' అని ఈ తత్వశాస్త్రం బోధిస్తుంది. ఇంద్రియాలకు గోచరించే ఈ భౌతిక ప్రపంచం కేవలం మాయాజాలమని, దీని వెనుక ఉన్న దివ్య చైతన్యమే పరమ సత్యమని భావించడం భారతీయ ఆధ్యాత్మిక దృక్పథం యొక్క మూల సూత్రం.
అయితే, ఈ ఆధ్యాత్మిక సత్య భావనకు భిన్నంగా ఆధునిక శాస్త్రీయ దృక్పథం, ముఖ్యంగా దళిత-భౌతికవాద కోణం భిన్నమైన వాస్తవికతను ముందుకు తెచ్చింది. శాస్త్రీయ దృక్పథం ప్రకారం, కంటికి కనిపించే, భౌతికంగా స్పృశించగలిగే, ప్రయోగశాలలో నిరూపించగలిగే పదార్థమే (Matter) సత్యం. అలాగే, సామాజిక వాస్తవికతలో నిరుపేదలు, అట్టడుగు వర్గాలు అనుభవించే ఆకలి, దౌర్జన్యాలు, కుల వివక్ష, కష్టజీవుల చెమట, వారి కన్నీళ్లే కంటికి కనిపించే ప్రత్యక్ష సత్యాలు. అమూర్తమైన దేవుడిని లేదా మాయా సిద్ధాంతాన్ని పక్కనపెడితే, మనుషుల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఈ భౌతిక,సామాజిక రుగ్మతలే అత్యంత బలమైన, ఎల్లప్పుడూ సజీవంగా ఉండే వాస్తవ సత్యాలని ఈ లౌకిక, శాస్త్రీయ తాత్వికత వివరిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ శరణ్‌కుమార్ లింబాలే తన పుస్తకంలో వివరించారు.
ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబాలే తో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ తదితరులు
శివం: సమస్త లోకానికి శుభకరమైన ఆలోచన చేసేది, పవిత్రమైనది భగవత్ తత్వమే. భారతీయ తాత్వికతలో 'శివం' అంటే సమస్త లోకానికి మంగళకరమైనది, శుభకరమైనది, పవిత్రమైనది అని అర్థం. ఈ విశ్వాన్ని సృష్టించి, కాపాడే భగవత్ తత్వమే పరమ పవిత్రమైనదిగా, సమస్త జీవకోటికి శుభాన్ని చేకూర్చే శక్తిగా ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి. భగవంతుని గురించిన ఆలోచన చేయడమే మనిషికి శుభకరమని, అది అంతిమంగా మానసిక ప్రశాంతతను, మోక్షాన్ని ఇస్తుందని ఈ తత్వశాస్త్రం నమ్ముతుంది. శుభకరమైన ఆలోచనలు ఉంటే శుభం జరుగుతుంది అనేది ఒక సత్సంకల్పంగా బోధిస్తుంది. మన ఆలోచనే మన శుభా శుభాలను నిర్ణయిస్తుందని వివరిస్తుంది.
అయితే, దళిత సాహిత్య దృక్పథంలో మరియు శరణ్‌కుమార్ లింబాలే లాంటి ఆలోచనాపరుల ‘దళిత సౌందర్యశాస్త్రం’ (Dalit Aesthetics) ప్రకారం ఈ ‘శివమ్’ భావనకు సరికొత్త అర్థం చెప్పారు. కేవలం పురోహిత వర్గ కర్మకాండలను ఆచరించడం, ఆధిపత్య వర్గాల సంప్రదాయాలను పాటించడమే శివం కాదని... సమాజంలో తరతరాలుగా వేళ్లూనుకున్న అసమానతలను, కుల వివక్షను, పీడనను ఎదిరించి, సమసమాజాన్ని స్థాపించడానికి జరిగే పోరాటమే నిజమైన 'శివం' (శుభకరం) అని వారు భావిస్తారు.
ఇక మూడవది ‘సుందరం’ అనే భావన. భారతీయ తాత్వికతలో, సౌందర్య శాస్త్రంలో 'సుందరం' అంటే భౌతికంగా కనిపించే రూపురేఖలు, ప్రకృతి అందాలు లేదా ఈశ్వర సృష్టి అంతా సర్వ సుందరమైనది అనే ఒక సాధారణ భావన ఉంది. ఈ సృష్టి వెనుక ఉన్న దివ్యత్వాన్ని, అందాన్ని ఆస్వాదించడమే సౌందర్యమని మన సాంప్రదాయ కావ్యశాస్త్రం చెబుతుంది. సుందరం భౌతిక రూపం కూడా నశించి దాని అంతస్సారం మనలో కలిగించే ఆనందమే సౌందర్యం. అది కలగాలంటే మనలో దైవత్వం రావాలి. అంటే సత్వగుణం అలవడాలి. మానవుడే దేవుడవ్వాలి. భౌతికంగా మనిషి చనిపోయినా ఆ జీవాత్మ, పరమాత్మలో ఐక్యం కావడమే నిజమైన సౌందర్యం. దీన్ని భారతీయులు ఎంతో లోతైన భావనలతో వివరించారు.
కానీ, ఆచార్య శరణ్‌కుమార్ లింబాలే గారు ఈ సంప్రదాయ సౌందర్య భావనలను తీవ్రంగా ప్రశ్నించారు. సమాజంలో అట్టడుగున ఉండి, కుల వివక్షను, ఆకలిని, ఆర్థిక వ్యత్యాసాలను అనుభవిస్తున్న దళిత బహుజనుల కోణం నుంచి ఆయన ఈ పదానికి సరికొత్త అర్థాలను వెలికితీశారు. రాచరికపు భవనాలు, రక్తంతో నిర్మించిన పెద్ద రాజభవనాలు, వాటిని చూసి పులకించిపోయే కవుల వర్ణనలు ఎప్పుడూ అసలైన సౌందర్యం కాలేకపోతాయని ఆయన వాదించారు. కళ కళ కోసమే అనే వాదనలోని ఆనందంలో సుందరత్వాన్ని వెతికితే దళితుల్లో అటువంటి సుందరత్వం ఉండదన్నారు. ఆ భవనాలు కట్టడానికి తమ ప్రాణాలను, చెమటోడ్చిన కూలీల ఆకలిని, వారి కన్నీళ్లను, వారి శ్రమను పట్టించుకోని ఏ సౌందర్యశాస్త్రం కూడా నిజమైనది కాదని లింబాలే గారు స్పష్టం చేశారు. కష్టజీవుల చెమటలో, వారి కష్టాల్లో, అణచివేతకు వ్యతిరేకంగా ఎగిరే ధిక్కార స్వతంత్ర పతాకంలోనే అసలైన సౌందర్యం దాగి ఉందని ఆయన నిరూపించారు. కాబట్టి, కేవలం భౌతిక ఆకారాన్ని లేదా ఈశ్వర సృష్టిని చూసి మురిసిపోవడం కాదు... మనుషుల ఆకలిని, వారి పోరాటాలను, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేదే అసలైన 'దళిత సౌందర్యశాస్త్రం' అని మనం గ్రహించాలన్నారు. రస సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం - దళిత సౌందర్యశాస్త్రం గురించి తన గ్రంథంలో ప్రొఫెసర్ శరణ్ కుమార్ లింబలే ప్రస్తావించారు. దీని వెనుక ఉన్న రెండు ప్రధాన వాదనలను పరిశీలించాలి.
1. సంప్రదాయ రస సిద్ధాంతం చెప్పేది ఏమిటి?
సంప్రదాయ సంస్కృత కావ్యశాస్త్రం, భరతుని నాట్యశాస్త్రం ప్రకారం, రసం అనేది ఒక విశ్వవ్యాప్తమైన, ఆనందమయమైన అనుభూతి. ‘విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తిః’ అంటే విభావాలు, అనుభవాలు, వ్యభిచారి భావాల సంయోగం వల్లే రసం పుడుతుందని చెబుతారు. ఇక్కడ సాహిత్య పఠనం వల్ల కలిగే ఆనందం లేదా రసానుభూతి అందరికీ ఒకేలా ఉంటుందని, అది ఉన్నతమైన మానసిక స్థాయులకు, రసాస్వాదన నైపుణ్యాలకు సంబంధించినదని సంప్రదాయవాదుల నమ్మకం.
2. దళిత సౌందర్యశాస్త్రం (Dalit Aesthetics) లేవనెత్తే ప్రశ్నలు ఏమిటి?
కానీ, శరణ్‌కుమార్ లింబాలే వంటి దళిత సాహిత్యవేత్తలు ఈ సిద్ధాంతాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. వారి ప్రకారం…సమాజంలో అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అట్టడుగు వర్గాలు, కుల వివక్షను అనుభవించేవారు, కూలీలు పడే కష్టాలు, ఆకలి, అవమానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి, సంప్రదాయ రస సిద్ధాంతం కేవలం ఉన్నత వర్గాల అనుభవాలకే పెద్దపీట వేస్తుందని వారు వాదిస్తారు. దళిత సౌందర్యశాస్త్రం కేవలం ఆనందాన్ని పంచేది కాదు; అది బాధను, అణచివేతను, ఆక్రోశాన్ని, వాటికి వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని అక్షరరూపం ఇస్తుంది.
సాహిత్యం చదివి ప్రశాంతంగా ఆనందించడం కాకుండా, సమాజంలోని అసమానతలను ప్రశ్నించేలా, అన్యాయాలను ఎదిరించేలా పాఠకుడిలో చైతన్యాన్ని నింపడమే దళిత సౌందర్యశాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యంగా భావించారు.కాబట్టి, సంప్రదాయ రస సిద్ధాంతం అందరికీ సార్వత్రికమైనది కాదని, అది కేవలం ఒక వర్గం లేదా ఒక ప్రత్యేక జీవన విధానం నుంచి పుట్టినదేనని దళిత సౌందర్యశాస్త్రం వాదిస్తుంది. దీన్ని "పూర్తిగా సత్యం" అనలేము కానీ, ఇది సాహిత్య విమర్శలో ఒక బలమైన ప్రత్యామ్నాయ దృక్పథం అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. మా జీవితాల్లోని బాధలు, అవమానాలు, కన్నీళ్లు, మా కష్టాల నుంచి పుట్టే అనుభవాలే మాకు రసాలను పండిస్తాయని దళితులు భావిస్తారు. మా కష్తటాలనుండి ఇతరుల భోగభాగ్యాలను చూసి పొందే ఆనందం మాది కాదనీ; మా అస్తిత్వ వేదన, మా ఆత్మగౌరవ పోరాటమే మా సాహిత్యానికి ప్రాణమంటారు. కుల వివక్షను అనుభవిస్తున్న మనుషుల సంఘర్షణ,పోరాటాలే ప్రధానమైనవిగా శరణ్ కుమార్ లింబాలే భావించారు. ఈ భావనలు నిజానికి సాహిత్య విమర్శ సిద్ధాంతాల్లో ఒక సంచలనాన్ని కలిగించాయి.
(ఒక విద్యార్థిగా నాకూ అటువంటి కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. కాలేజీ రోజుల్లో ప్రధాన స్రవంతి సాహిత్యంగా పిలువబడే సాహిత్యం చదువుతున్నప్పుడు అందులో ప్రేమ, శృంగారం, వర్ణనలు మాత్రమే ఉండేవి. కానీ, బయట సమాజంలో దళితులు, అట్టడుగు ప్రజలు పడుతున్న నానా తంటాలు, వివక్ష నాకు కళ్లకి కట్టినట్టు కనిపించినా, పాఠ్యాంశాల్లో ఉండేవి కాదేమిటని అనిపించేది.. అప్పుడు నాకు ఒకటే సందేహం వచ్చేది దళితులు ప్రేమ కవితలు రాస్తున్నారు, కానీ వారి చుట్టూ జరుగుతున్న ప్రేమ ఎలాంటిదో రాయాలి. సామాజిక అన్యాయాలపై మాట్లాడుతూ రాయాలి, తన రాతలు తన అస్తిత్వాన్ని తాను జీవిస్తున్న సమాజంలో ఎలా ప్రతిపలిస్తుందో, ఎలా అనుభవంలోకి వస్తుందో దాన్ని రాయచ్చు కదా ‘ అనిపించేది. అలా రాసిన రచనలు ప్రధాన జీవన స్రవంతి సాహిత్యంగా చదువుతున్నట్లే పాఠ్యాంశాల్లో చదువుకుంటే బాగుండేది కదా అని కలలు కనేవాణ్ణి. ఆ కలలు ఎం.ఏ.లో దళిత సాహిత్యం ఒక కోర్సుగా పెట్టిన తర్వాత నెరవేరాయని అనిపించింది. ఇది ప్రసంగంలో చెప్పాలనుకున్నాను కానీ సమయం సరిపోక చెప్పలేకపోయాను.)
3. మార్క్సిస్టు దృక్పథంతో ఈస్తటిక్స్:
ఈ సభను ప్రజాసాహితి వారు ఏర్పాటు చేశారు. కానీ మనం దళిత మేధావి రచయిత శరణ్ కుమార్ లింబాలే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. ఆయన దళిత్ ఈస్తటిక్స్ థియరీ ని లోతుగా గమనిస్తే, వర్గ స్వభావాన్ని ఆయన స్పష్టంగా వివరించారు. మార్క్సిజం ప్రకారం, సమాజంలో ఆర్థిక వనరులను నియంత్రించే వర్గమే (Ruling Class), సమాజం ఏది నమ్మాలో కూడా నిర్ణయిస్తుంది. ఏది నిజం, ఏది ధర్మం అనేది పాలకవర్గాలే నిర్ణయిస్తాయి. శ్రామికులు కష్టపడటం, యజమానులకు సేవ చేయడం 'ధర్మం' (సత్యం) అని నమ్మిస్తారు. పాలకవర్గ వ్యవస్థకు భంగం కలగకుండా, సమాజంలో శాంతి (Status quo) ఉండటమే 'శివం' (మంగళకరం) అని ప్రచారం చేస్తారు. తిరుగుబాటును 'అశుభం'గా లేదా 'పాపం'గా చిత్రీకరిస్తారు. కష్టజీవుల చెమట, రక్తంపై నిర్మించబడిన రాజభవనాలను, ప్రకృతిని చూసి కవులు 'సుందరం' అని పొగుడుతారు. కానీ ఆ భవనాలు కట్టిన కూలీల ఆకలి, కన్నీళ్లు ఆ సౌందర్యశాస్త్రంలో కనిపించవు. మార్క్సిస్టు సౌందర్యశాస్త్రం (సిద్ధాంతం) శరణ్‌కుమార్ లింబాలే వాదనతో చాలావరకు ఏకీభవిస్తుంది.సామాజిక వాస్తవికత (Social Realism) అనేది సాహిత్యం అనేది కల్పిత స్వర్గాలను, అలౌకిక ఆనందాన్ని (రసానందం) ఇవ్వడానికి కాదని చెప్తుంది. అది సమాజంలోని వర్గ పోరాటాన్ని, దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపించాలి. మార్పు కోసం కళ ఉపయోగపడాలనీ చెప్తుంది. "తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, కానీ ముఖ్యమైనది దానిని మార్చడం" అని మార్క్స్ అన్నారు. అదే విధంగా, సాహిత్యం సమాజాన్ని మార్చే ఒక ఆయుధంగా ఉండాలి.
మార్క్సిజానికి, దళిత దృక్కోణానికి మధ్య తేడా (లింబాలే విమర్శ) :
ఈ సందర్భంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. శరణ్‌కుమార్ లింబాలే మార్క్సిజాన్ని పూర్తిగా అంగీకరించారనుకోవడానికి వీల్లేదు. ఆయన దాన్ని కూడా విమర్శించారు. మార్క్సిజం సమాజాన్ని కేవలం ఆర్థిక వర్గాలుగా (ధనిక - పేద) మాత్రమే చూస్తుంది. కానీ భారతదేశంలో ఆర్థిక దోపిడీతో పాటు కుల వివక్ష అనేది మనిషి పుట్టుకతోనే ముడిపడి ఉందని లింబాలే వాదించారు. పేదవాడైన అగ్రవర్ణ కూలీకి సమాజంలో గౌరవం ఉంటుంది, గుడిలోకి ప్రవేశం ఉంటుంది; కానీ దళితుడికి డబ్బు ఉన్నా కులం పేరుతో అవమానం తప్పదు. కాబట్టి, కేవలం ఆర్థిక సమానత్వం (మార్క్సిజం) మాత్రమే సరిపోదు, సామాజిక సమానత్వం (అంబేద్కరిజం) కూడా కావాలని లింబాలే స్పష్టం చేశారు.మార్క్సిస్టు దృక్కోణంలో "భగవంతుడే సత్యం, శివం, సుందరం" అనే ఆలోచన శ్రామిక వర్గాన్ని పోరాటం నుండి దూరం చేసే ఒక భావజాల ముసుగు (Ideological Veil). నిజమైన 'సత్యం' శ్రమజీవుల కష్టం, నిజమైన 'శివం' దోపిడీ లేని సమాజ నిర్మాణం, మరియు నిజమైన 'సుందరం' సమసమాజ స్థాపన అని మార్క్సిజం చెబుతుంది. శరణ్‌కుమార్ లింబాలే తన పుస్తకంలోని 'అంబేద్కరిజం మరియు మార్క్సిజం' (Ambedkarism and Marxism) అధ్యాయంలో, ఈ రెండు సిద్ధాంతాలకు అణగారిన వర్గాల విముక్తి ప్రధాన లక్ష్యమైనప్పటికీ, భారతదేశ వాస్తవ పరిస్థితుల్లో వాటి మధ్య ఉన్న కీలకమైన భేదాలను లోతుగా విశ్లేషించారు.
మార్క్సిజం మతాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది ("మతం ఒక మత్తుమందు"). అంబేద్కరిజం మనిషికి నైతిక విలువలు, సామాజిక గౌరవం ఇచ్చే ధర్మం అవసరమని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావించారు. అందుకే ఆయన హిందూ మతంలోని కుల వ్యవస్థను తిరస్కరించి, స్వేచ్ఛ, సమానత్వం, కరుణను బోధించే బౌద్ధమతాన్ని (నవయాన బౌద్ధం) స్వీకరించారు. లింబాలే దృష్టిలో ఇది కేవలం మత మార్పిడి కాదు, దళితులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఒక గొప్ప సాంస్కృతిక తిరుగుబాటుగా భావిస్తున్నారు. మార్క్సిజం వ్యవస్థను మార్చడానికి సాయుధ పోరాటం లేదా విప్లవాత్మక హింసను సమర్థిస్తుంది. కానీ అంబేద్కరిజం రాజ్యాంగబద్ధమైన హక్కులు, విద్య, సంఘటిత పోరాటం, ప్రజాస్వామ్య విలువల ద్వారా శాంతియుత మార్పును కోరుకుంటుంది. శరణ్‌కుమార్ లింబాలే మార్క్సిజాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. దళితుల విముక్తి కోసం మార్క్స్ యొక్క ఆర్థిక సమానత్వ సిద్ధాంతం మరియు అంబేద్కర్ యొక్క సామాజిక సమానత్వ సిద్ధాంతం రెండూ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, భారతదేశంలో కుల నిర్మూలన జరగకుండా కేవలం మార్క్సిజం ద్వారా సమసమాజం సాధ్యం కాదని, దళిత సాహిత్యానికి అంబేద్కరిజమే అసలైన ప్రాణవాయువు అని ఆయన స్పష్టం చేశారు.
4.‘ధ్వని’ (Dhvani),వ్యంగ్యార్థాల తిరస్కరణ:
ఆనందవర్ధనుడు ప్రతిపాదించిన 'ధ్వని' సిద్ధాంతం ప్రకారం, సాహిత్యంలో అభిధార్ధాన్ని మించి అంతర్గత అర్థం (Implicit meaning) లేదా ధ్వని ప్రధానంగా ఉండాలి. కవి తన భావాన్ని ఎక్కడా నేరుగా చెప్పకుండా, అలంకారాలతో, గూఢార్థాలతో, సున్నితమైన సంకేతాలతో పాఠకుడికి అందజేయాలని ఆ సిద్ధాంతం చెబుతుంది.
కానీ, శరణ్‌కుమార్ లింబాలే గారు, దళిత సౌందర్యశాస్త్రం ఈ ధ్వని సిద్ధాంతాన్ని, వ్యంగ్యార్థాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. వారి వాదన ఏమిటంటే అణచివేతకు, కుల వివక్షకు గురైన దళితుడికి తన బాధను అలంకారాలతో, కవితాత్మక పదజాలంతో అలంకరించి దాచిపెట్టి చెప్పే తీరిక, అవసరం లేవు. సమాజంలో తన మీద జరుగుతున్న దాడిని, అవమానాలను, వివక్షను ఏమాత్రం దాచుకోకుండా సూటిగా, పదునుగా, కఠినమైన వాస్తవ భాషలో చెప్పడమే దళిత సాహిత్య లక్షణం. ఒకవేళ అక్కడ సున్నితమైన భాషను వాడితే, ఆ వ్యంగ్యార్థాల వెనుక నిజమైన బాధ యొక్క తీవ్రత తగ్గిపోయి, అణచివేత స్వభావం మరుగైపోతుంది. అందువల్ల, గూఢార్థాల కంటే నేరాలనూ, అన్యాయాలనూ ఎత్తిచూపే నిరసన గళమే దళిత సాహిత్యానికి ప్రాణాధారమని లింబాలే గారు స్పష్టం చేశారు.
సిద్ధాంతపరంగా "అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు" (సత్యం, శివం, సుందరం) అని చెబుతూనే, ఆచరణలో మాత్రం ఒక మనిషిని అంటరానివాడిగా చూసి, దేవాలయాల్లోకి రానివ్వకపోవడాన్ని లింబాలే ప్రశ్నిస్తారు."భగవంతుడే అన్నీ చూసుకుంటాడు" అనే ఆలోచన, తరతరాలుగా అణచివేతకు గురవుతున్న వారిని తమ హక్కుల కోసం పోరాడకుండా నిస్సహాయులుగా మారుస్తుందని దళిత చింతన భావిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి వేదాంతం కంటే, ముందు కడుపు నిండే మార్గం మరియు ఆత్మగౌరవం ముఖ్యమని ఆయన వాదిస్తారు.లింబాలే వంటి దళిత సాహిత్య విమర్శకులు ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని కాకుండా, సమాజంలో ఆచరణలో ఉన్న వివక్షను ప్రశ్నిస్తున్నారని గమనించాలి.
భారతీయ ఆధ్యాత్మిక దృక్కోణంలో మనిషి అంతర్గత శాంతిని, మోక్షాన్ని, విశ్వజనీన ప్రేమను లక్ష్యంగా చేసుకుంటుంది.దళిత సాహిత్య దృక్కోణంలో ఈ భూమిపై మనిషికి దక్కాల్సిన సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్న లక్ష్యంగా చేసుకుంటుంది.
కాబట్టి, భగవంతుడిని సత్యం, శివం, సుందరంగా చూడటం అనేది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక భావన కాగా, ఆ పేరుతో జరిగే సామాజిక అన్యాయాలను ఎదిరించి, సమానత్వాన్ని కోరుకోవడం అనేది దళిత సౌందర్యశాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం. అణగారిన వర్గాల గొంతును సాహిత్యంగా మలచవచ్చని నిరూపించిన లింబాలే గారికి, ఈ సభను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, ఇక్కడ కూర్చున్న సాహిత్య ప్రియులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 14.11.2026.


కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి