కవిత్వానికి వేళేముంది?
కవిత్వం కురియడానికి
ఆరోగ్యం
అనారోగ్యంతో పనిలేదు
వాన కురవడానికి
మేఘానికి
తనలోని తేమ
ఎంత ఉందో లెక్కలేనట్టే!
గుండెలో
ఒక చుక్క భావం ఉంటే చాలు,
అది అక్షరాలై
నేలంతా తడిపేస్తుంది.
శరీరం
మంచాన పడి ఉన్నా
మనసు మాత్రం
ఆకాశమంతా తిరుగుతుంది
వెన్నెలను చూసి
ఒక కవి పద్యమవుతాడు,
చీకటిని తాకి
మరో కవి వెలుగవుతాడు.
కాళ్లు నడవలేని చోట
ఊహ పరుగెడుతుంది
గొంతు పలకలేని చోట
అక్షరం మాట్లాడుతుంది.
కవిత్వానికి
శరీరం అడ్డుకాదు
మనసులో
మాట మొలిచిందంటే చాలు,
అది ఏ పరిస్థితిలోనైనా
పూలవానై కురుస్తూనే ఉంటుంది.
— దార్ల వెంకటేశ్వరరావు, 24.8.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి