"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

24 జులై, 2026

ఒక మెసేజ్.. రెండు పార్శ్వాలు

 నీ మెసేజ్

పొద్దున్నే చూద్దామనుకుంటాను…

ఆగలేను 

ఇంకా కళ్లలో నిద్రతడి ఉండగానే

నీ ఒక్క మాట

ఉదయాన్ని పూలవాసనగా మార్చేస్తుందేమోనని

తడబడే వేళ్లతోతెరిచేస్తాను.


నీ మెసేజ్

మధ్యాహ్నం చూద్దామనుకుంటాను…

ఆగలేను 

ఎండలతో అలసిపోయిన రోజులో

నీ పలకరింపు

చల్లని నీళ్ల గ్లాసులా దిగిపోతుందేమోనని

నవ్వుకుంటూ తెరిచేస్తాను.


నీ మెసేజ్

సాయంత్రం చూద్దామనుకుంటాను…

ఆగలేను 

సంధ్యా వెలుగుల్లో

ప్రకృతి వేసుకున్న రంగులకంటే

నీ మాటలే మరింత అందంగా ఉంటాయేమోనని

ఆతృతగాతెరిచేస్తాను.


నీ మెసేజ్

పడుకునే ముందు చూద్దామనుకుంటాను

ఆగలేను 

రోజంతా అలసిన మనసుకు

నీ అక్షరాలు

వెన్నెల దుప్పట్లా కప్పుకుంటాయేమోనని

చిరునవ్వుతోతెరిచేస్తాను.


అయినా…

తెరిచింది ఫోన్ మాత్రమే కాదు 

చదివింది మెసేజ్ మాత్రమే కాదు

మళ్లీ జీవించాలనిపించే 

మనసంతానే పిచ్చిదానా!

నువ్వు మళ్ళీ మళ్ళీ జీవించాలనే పిచ్చితోనే!!

- దార్ల వెంకటేశ్వరరావు 

.....


నీ మెసేజ్ …!



నీ మెసేజ్

పొద్దున్నే చూద్దామనుకుంటాను…

వద్దులే 

ఇంకా పూర్తిగా విప్పుకోని ఈ ఉదయపు వెలుగుల్లో

ఒక విషాదపు నీడను కలపడం ఎందుకని

నిశ్శబ్దంగాఫోన్‌ను మూసేస్తాను.


నీ మెసేజ్

మధ్యాహ్నం చూద్దామనుకుంటాను…

వద్దులే 

ఆకలితో ఎదురుచూసిన ఈ అన్నంపైన

నీ జ్ఞాపకం చేదు పొగలా కమ్ముకుంటే

రుచులన్నీ బూడిదవుతాయేమోనని

మళ్లీ మూసేస్తాను.


నీ మెసేజ్

సాయంత్రం చూద్దామనుకుంటాను

వద్దులే 

అస్తమిస్తున్న సూర్యుడు

ఆకాశమంతా అందమైన రంగులు చల్లుతున్న వేళ

నీ ఒక్క మాట

ఆ రంగులన్నిటినీ బీభత్స దృశ్యాలుగా మార్చేస్తుందేమోనని భయపడి

మూసేస్తాను.


నీ మెసేజ్

పడుకునే ముందు చూద్దామనుకుంటాను…

వద్దులే 

రోజంతా అలసిపోయిన మనసు

కాస్త ప్రశాంతత ఒడిలో నిద్రించబోతుంటే

నీ జ్ఞాపకం

అర్థరాత్రి సముద్రంలా ఉప్పొంగి

లోపల తుఫాన్లేవో లేపుతుందేమోనని

చివరిసారిగా మూసేస్తాను.


అసలు నీ మెసేజ్ 

జీవితాంతం చూడకపోతే

నేను ప్రతిక్షణం సంతోషంతో బ్రతికేస్తాను

అందుకే 

నీ నెంబరే బ్లాక్ చేస్తే మంచిదేమో

-దార్ల వెంకటేశ్వరరావు 

కామెంట్‌లు లేవు: