ఆధునిక భారతీయ దేశభక్తి పద్యాలు
మ్యాగి తినుచును, నెస్కఫె మధురమనుచు,
సోని ఫోనున మాట్లాడు సొగసుకాడు,
హోండ బైకుపై తిరుగుచు నుల్లసమున,
కోకు తాగుచు మురియును గూఢముగను!
అన్ని వస్తువు లన్యుల వాడుకొనుచు,
డాలరును జూసి యేడ్చును డాబు లొలుక
రూప్య విలువలు పడిపోయె రోత యనుచు,
భారతీయుల తెలివికి బండ తిట్టు!
మెక్కి మెక్డొనాల్డున, భార్య మేలు కొరకు
డోమి నోసున పిజ్జాలు తోడు దెచ్చి,
ఆపి లనెడి కంప్యూటరు నలరి జూచు,
రాడొ వాచీన సమయముల్ రమ్యముగను!
జూసి డాలరు, నేడ్చును జూడ వింత!
రూప్య విలువలు పడిపోయె రోత యనుచు,
అన్ని వస్తువు లన్యుల వాడుకొనుచు,
భార తీయుల తెలివికి బండ తిట్టు!
వలద నంచును మనదైన వస్తువులను,
కోరి కొనుచుండు నన్యుల కూర్పు లన్ని,
డాల రనగనె గుండెలు డాల్చు నతడు,
భార తీయుల వింతైన భ్రమల జూడ!
లేవి ప్యాంటును దొడిగియు, లీల తోడ
రేబ నను కళ్ళజోడును వేయు నతడు,
వోడ ఫోనున ముచ్చట్లు నొద్దికగను
చాటు చుండును దనదైన చంద ములను!
వాడు నొల్డుస్పరై సను వాసనలను,
వేడ గిల్లెటు బ్లేడున వింత జేసి,
పేర్సు సబ్బున మేనును బెంచి నాడు,
నేటి కాలపు యువకుడు నిఖిల జగతి!
డా.దార్ల వెంకటేశ్వరరావు
25.5.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి