"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

05 జులై, 2026

చల్లగాలి బాబురావు కవిత్వం 'నువ్వు నువ్వులా వెలగాలి'



నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 5.7.2026 సౌజన్యంతో

...


మనల్ని మనం సంస్కరించుకొనే మంచి కవిత్వం 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, 

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 

హైదరాబాద్.


‘’ఇప్పుడు 

దేశం గుండెల్లో 

ఏ పాటల రాగాలకూ 

స్వేచ్ఛ లేదు 

ఏ మాటల రూపానికీ 

పూర్ణత్వం లేదు 

….

ఎక్కడా... 

పరిపూర్ణ హృదయ తాళాలు 

విచ్చుకోనూ లేదు 

ఒక నిశ్శబ్ద వాతావరణం 

భయంకర విషసర్పమై 

కుటిల నీతితో కాటేస్తోంది 

….

దేశం ఒళ్ళంతా విషం ఎగబాకి 

కుళ్ళిన కులమతాల 

కంపువాసనలై ఊరు ఊరంతా 

ఉన్మాదిగా మారింది…’’ సమకాలీన భారతీయ సమాజాన్ని ప్రతిపలించే ఈ అద్భుతమైన కవిత చల్లగాలి బాబురావుది. ఆయన తెలుగు రాష్ట్రాలకు అవతల తమిళనాడులో ఉంటాడు. కానీ చక్కని తెలుగులో కవిత్వం రాస్తాడు.దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల పట్ల నిరంతరం సంఘర్షణ పడకపోతే ఇంత మంచి కవిత్వం రాయలేడు. ఆయన ఇప్పటికే ‘జీవన చిత్రాలు’(2008) పేరుతో మినీకవితలు, ‘ఆకుల కదలికలు’ పేరుతో 2010లో నానీలు, ‘కాలం సాక్షిగా’ పేరుతో 2010 లో వచన కవితా సంపుటిని ప్రచురించాడు. ఇప్పుడు ‘నువ్వు నువ్వులా వెలగాలి’ పేరుతో ఒక వచన కవితా సంపుటిని ప్రచురించాడు. దీనిలో సుమారు 47 వచన కవితలున్నాయి. ప్రతి కవితా తన హృదయాన్ని ఎంతో తీవ్రంగా కలచివేసినప్పుడు రాసిన కవిత్వంలానే అనిపించింది. ఆ కవితలు చదువుతుంటే ఈ భారతీయ సమాజంలో కులం తీసుకొచ్చిన అవమానాలను భారంగా మోస్తున్న కవిత్వమే ప్రధానంగా ఉందనిపించింది. వినోదాలు, నినాదాలు ఈ కవిత్వంలో లేవు. ఉబుసుపోక ఈ కవిత్వం రాయలేదనిపించింది. తాను కుటుంబాన్ని ఎంతగా ప్రేమించగలడో, సమాజాన్ని ప్రగతిపథంలో పయనించేవాళ్ళనూ అంతే ప్రేమించగల కవి అనిపించింది. కోనసీమ ప్రకృతి అందాలకు పెట్టిన పేరు. అది బయటకు కనిపించేది మాత్రమే. కనిపించని కుల రాక్షసి కూడా అక్కడ ఉంది. దాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. ఆ మధ్య,  ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. దానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని భావించారు. అప్పుడు అందమైన కోనసీమలో కులాధిపత్యం ఎంత అందవికారంగా నాట్యమాడిందో బహిర్గతమయ్యింది. ఆ సందర్భంగా కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని సమర్థిస్తూ ‘నీలిగగనతలపతాకం ఇది…’ అంటూ ఒక శక్తివంతమైన కవిత రాశాడు బాబూరావు గారు. 

‘’అంబేద్కర్ అంటే విజ్ఞాన శిఖరమై

మెరిసే వెలుగు కిరణంగా

అజ్ఞానపు మదాంధుల గుండెల్లో 

అసమానతల్ని రూపుమాపాలన్న 

నీలి గగనతల పతాకంరా!’’

ఆ ప్రాంతం నుండే వచ్చిన వాడిని కావడంతోనేమో, నాకు ఆ కవిత ఎంతో అనుభవాత్మకంగా అనిపించింది. అయితే, కులం అనేక అంతరాల దొంతరల్ని కలిగి ఉంటుంది. అది కులానికున్న స్వభావం. ఒకే కులంలో కూడా ఆధిపత్యాన్ని చెలాయించగలదు. అంత భావజాలాన్ని ఆధారంగా చేసుకుని కవిత్వం రాసిన ఈ కవి కూడా తన తండ్రిలోని త్యాగశీలతను గుర్తిస్తూ..

మా అందరి జీవితాల్లో 

వెలుగు నిండాలని ఆశించిన 

వెన్నెల కెరటం నీవు’ అని తన తండ్రిని, జీసస్ ప్రేమను నింపుకున్న తన తండ్రిని స్మరిస్తూ కవిత్వం మయ్యాడు. అంతలోనే ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయిన మన భారత రాష్ట్రపతి డా.ఏ.పి.జే. అబ్దుల్  కలామ్ గురించి కవిత్వమవుతూ…

‘’కలలో నేపథ్యంలోంచి 

కొత్త పాటలు నేర్చుకోమని

నిరుత్సాహమే లేని 

నిత్య స్రవంతిలా ప్రవహిస్తూ 

ఉత్సాహం ఊపిరిగా ఉన్న యువతకు 

స్పూర్తి ప్రదాతయై 

విశ్వం విశ్వసించిన అపూర్వ కళాతేజమై’ అనే స్ఫూర్తితో ఈ కవితా సంపుటి మొదలవుతుంది.

తర్వాత కొన్ని కవితలు మనసుకు సంబంధించినవీ, మనిషి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవీ ఉన్నాయి. 

‘’చిరునవ్వు ఒక సంతకం లాగ 

నాతో నిత్యం కరచాలనం చేస్తుంది

 చిరునవ్వు అనంతాకాశమైనట్లు 

నాకొక ధైర్య కవచాన్ని అందిస్తుంది. 

చిరునవ్వు ఒక స్వప్నంలాగ

 మళ్ళీ మళ్ళీ నన్ను వెంబడిస్తున్నట్లుగా…అనిపించే ఒక చిరునవ్వు గురించి వర్ణిస్తాడు కవి. ఇలా మానవ సంబంధాల్లో మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే కవితలు దీనిలో అనేకం ఉన్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న దళిత, బహుజనులపై జరుగుతున్న దాడుల నేపథ్యంతో  వర్ణించిన కవితలు కనిపిస్తాయి. 

కాశ్మీర్ కు చెందిన 8 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఆ సంఘటన పై దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళన జరిగాయి. దానికి స్పందిస్తూ రాసిన కవితలో…

‘’చారికలు కట్టిన 

కన్నీరును చూసి 

నింగిలో 

అంగలార్చిన నక్షత్రాలన్నీ 

వెలుతురు కోల్పోయిన 

నల్లమేఘపు చీకట్ల 

కన్నీటిని ధారలా వర్షించాయి’’‌ అని ప్రకృతి కూడా విలపించినా, మనుషులు మాత్రం స్పందించలేదనేది ఒక భావచిత్రంలా అభివ్యక్తీకరించిన తీరు కవి ప్రతిభకు, భావుకతకు నిదర్శనం. 

‘’అంటరాని తనాన్ని 

అస్తిత్వంగా చేసి 

మీరు మలినం చేసి వొదిలిన 

మా వాడల్లోకి, పల్లెల్లోకి 

ఏ గోవిందుడొస్తే నేం...? 

ఏ రామ పాదుకల్ని తెస్తే నేం...?

 శాప విమోచన లేనప్పుడు!?’’ అంటూ రాసిన ‘నమ్మకాల పునాదుల్ని నిర్మించలేనపుడు…’ అనే కవితలో భారతీయ సమాజంలో కులం, మతం వల్ల ఏర్పడే ప్రమాదాలను, దళితుల అస్తిత్వం పట్ల భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్న వివక్షను, మత ప్రభావాన్ని, విముక్తి మార్గాల గురించి తీవ్రంగా చర్చించాలంటున్నాడు కవి. దళితుల విముక్తి కేవలం ఆధ్యాత్మిక మార్పు మాత్రమే కాదు, ఇది సామాజిక సమానత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, మానవ హక్కుల సాధనకు అవసరమైన పరిణామం. దళితులకు సమాజంలో ప్రస్తుతం ఉన్న అస్తిత్వం, నేటికీ కొనసాగే "అంటరానితనం" కుల వివక్షలను

తెలియజేస్తుంది. దీని ద్వారా దళితులు నిత్యం సమాజంలో ఆత్మగౌరవ హననానికి  గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం హిందూ మతం చేసిన స్థిరీకృత వివక్ష కేవలం దళిత గోవిందం పెట్టడం ద్వారానో, దేవాలయాలకు దేవాలయంలో ప్రవేశార్హత కల్పించడం ద్వారానో మాత్రమే దళితులకు విముక్తి లభించదు. ధార్మిక శాపగ్రస్తతను తొలగించలేనప్పుడు ‘దళిత గోవిందం’ దళితులకు ఎలా ఉపయోగపడుతుంది. 

దళితులు సమాజంలో తమ స్థానాన్ని ప్రశ్నించుకునే మానసిక సంఘర్షణను అనేక కవితల్లో  శక్తివంతంగా వ్యక్తీకరించాడు కవి. "మా పల్లెల్లోకి" అనడం ద్వారానే, దళితులు భౌతికంగా, సాంస్కృతికంగా సమాజం నుండి ఎలా వేరు చేయబడ్డారో చెప్తున్నాడు కవి. సామాజిక చైతన్యం  కలిగిస్తూ కవిత అంతా మొత్తం భారతీయ సమాజాన్ని ప్రశ్నించే శైలిలో కొనసాగింది. దళితుల విముక్తి కోసం చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తుంది. సమానత్వ సాధన అనేది "ఏ గోవిందుడొస్తే నేం...?" అనే ప్రశ్నతో మొదలు పెట్టి దళిత విముక్తికి అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే దళితులకు ఒక విమోచన మార్గం సాధించుకోగలుగుతారని చెప్తున్నాడు కవి. భారతీయ సమాజంలో దళితుల అస్తిత్వాన్ని తెలుసుకోవాలంటే సంప్రదాయ బంధనం, వ్యవస్థాపిత వివక్ష ,

మానవహక్కుల ఉల్లంఘన, దళితులను ఆర్థిక వనరుల నుండి దూరంగా ఉంచబడిన ఆర్థిక మార్జినలైజేషన్  తెలుసుకోవాలి. ఇవన్నీ రగుల్పొల్పే ఆత్మగౌరవ చైతన్యంతో ఈ కవిత కొనసాగింది. ‘నిరంతప్రశ్న’ అనే కవిత కూడా ఇలాంటిదే. 

ఈ కవితా సంపుటికి పెట్టిన ‘నువ్వు నువ్వులా వెలగాలి...!!’ పేరుతో కూడా ఒక కవిత ఉంది. ఇదొక వ్యక్తిత్వ నిర్మాణాన్ని, దానిద్వారా తన అస్తిత్వంతో పాటు తన చుట్టూ ఉండే వాళ్ళను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మనసుని ఎక్సరే తీసి చూపుతుంది. 

‘’ఎక్కడైనా సరే... 

మనల్ని మనమే గొప్పగా

ప్రేమించుకోవాలి... 

నిన్ను నువ్వే తెలుసుకొని 

నీ అంతరంగంతోనే ముందుగా 

సజీవంగా మాట్లాడ్డం  నేర్చుకోవాలి’’

మనం ఎటువంటి వాళ్ళమో మనకు మనమే గుర్తించుకోగలిగినప్పుడు నిజమైన న్యాయనిర్ణతలం  మనమే అవుతాం. దీన్నే ‘అంతరంగంతోనే… సజీవంగా  మాట్లాడ్డం’ అనేది మనమెటువంటి వాళ్ళమో మనకే తెలిసిపోతుంది. కవిత్వం మనిషిని నిష్కల్మషంగా మార్చగలగాలి. అది ఎలాగో ఈ కవిత చెప్తుంది.  వ్యక్తిత్వ నిర్మాణంలోని వివిధ దశలు ఈ కవితలో కనిపిస్తాయి. ‘కల్మషపు ఇగో’ మనలోని అసమానతల సృష్టికి కారణం. ఎప్పుడైతే మనం ఇగోని  మనం జయించగలిగామో,

మన మాటలు ఎప్పుడూ నవ్యనవనీతంగా ఉంటాయి. ఈ కవిత గొప్ప సౌందర్యాత్మక భావనతో వెలువడింది. కవిని ప్రవక్త అని ఎందుకంటారో ఈ కవిత చదివితే తెలుస్తుంది. 

‘‘నీ పలుకులు పండిన పల్లవులై

జీవిత చరణాల్ని నడిపించే రాగాలవ్వాలి 

నీ హృదయ ద్వారాల్ని తెరచి 

పరిమళపు సువాసనల్ని ప్రేమతో 

ఆహ్వానించాలి.

నీ మాటలో భేదాల పగుళ్ళు లేకుండా 

స్వచ్ఛమైన నవజీవన తంత్రుల్ని మీటాలి’’

మనిషి భౌతికమైన అందం కంటే మానసికమైన పరిశుభ్రత, స్వచ్ఛతల వల్లనే నిజమైన సౌందర్యంతో  వెలుగొందుతాడు. మన మాటలు భావప్రేరణకు  ఉత్ప్రేరకంగా ఉండాలని భావిస్తూ "నీ పలుకులు పండిన పల్లవులై..." అన్నాడు కవి. అంతే కాదు "నీ హృదయ ద్వారాల్ని తెరచి పరిమళపు సువాసనల్ని ప్రేమతో ఆహ్వానించాలి." అనేది మానవుడు అలవర్చుకోవలసిన అంతరంగ సంస్కృతిని తెలియజేస్తుంది. 

"నీ మాటలో భేదాల పగుళ్ళు లేకుండా..." మనం మాట్లాడగలిగినప్పుడు నిజమైన స్వచ్ఛత  వల్ల మానవుడే మహనీయుడుగా భావింపబడతాడు. త్రికరణశుద్ధిగా జీవించే మానవుడికి మాత్రమే సాధ్యమయ్యే  ఆలోచనల పరిశుద్ధత అనేది భావోద్వేగాల సమన్వయం ద్వారా మాత్రమే సాధ్యం. ఈ కవిత అంతా ఎంతో పటిష్టమైన కవిత్వ నిర్మాణంతో కొనసాగింది. ఒక అందమైన పాట, మనసుని ఆనందంతో తేలియాడేలా చేసే పాటలో కృత్రిమత ఉండదు. మనం జీవనంలో ఆ కృత్రిమత లేనప్పుడు మాత్రమే అది సాధ్యం. 

కవి తన కవిత్వ లక్ష్యాన్ని తెలియజేసే కవిత్వాన్ని కూడా దీనిలో ప్రకటించాడు. అయితే, అది కేవలం అతని ఆలోచనలతో పాటు అసలు కవిత్వం ప్రజల పక్షాన్ని నిలబడాలనే భావనతో వ్యక్తమయింది. ‘అక్షరం తొలకరి వర్షంలా’ అనే దీర్ఘ కవిత స్వభావం ఉన్న కవితతో పాటు, ‘నాహృదయపాళీ’; ‘ఏం రాయను?’; ‘అక్షరచరాలు’ వంటి కవితలు అన్ని కవికి-సమాజానికి,  కవి-కవిత్వం  అనేదానికి సంఘర్షణలు. కవిత్వ ప్రయోజనాన్ని సమీక్షించుకొనే కవితలు. కవి ఎవరి వైపు నిలబడాలని తమలో తాము ప్రశ్నించుకునే కవితలు. కానీ, తాను మాత్రం ప్రజల కోసం కవిత్వం రాస్తున్నాడు. ఒక సామాజిక బాధ్యతతో  కవిత్వం రాస్తున్నాడు. సమాజంలోని కుళ్ళునీ, కుతంత్రాలనీ, అవినీతినీ, అన్యాయాన్నీ తూర్పార పట్టడం కోసం కవిత్వం రాస్తున్నాడు. కవిత్వం ఒక సైనిక దళంలా ఉండాలంటాడు. తనకోసమే తాను కవిత్వం రాసుకుంటే, దాన్ని తన దగ్గరే పెట్టుకోవాలి. అది సమాజానికి అవసరం లేదు. సమాజం కోసం కవిత్వం రాస్తే, సామాజిక వాస్తవికతను ప్రతిఫలించే  కవిత్వమైతే సమాజాన్ని ప్రతిబింబించాలనీ, సమాజాన్ని చెతన్యవంతం చేయాలంటాడు. అటువంటి కవిత్వాన్ని నిర్వచిస్తూ…

‘’ప్రతి అక్షరం 

ఒక సమూహపు ప్రతిబింబమే 

నిరంతరం ప్రవాహశక్తియై

సైనిక దళంలా

 కవాతు చేస్తూ కనిపిస్తుంది.’’ అంటాడు కవి. దీనిలోని చాలా కవితలు వామపక్ష భావజాలంతో  ప్రజల పక్షం వైపు నిలిచే ‘సాహిత్యప్రస్థానం’; ‘ప్రజాకాంక్ష’ వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సమాజం పట్ల, సామాజిక చలనశీలత పట్ల తనకంటూ ఒక ప్రాపంచిక దృక్పథంతో ముందుకు వెళుతున్నాడు ఈ కవి. 

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అభయ  గురించి కవిత్వం అయ్యాడు. మహిళాభ్యుదయ దృక్పథంతో రాసిన కవితలు ఉన్నాయి. 

ఈ కవితాసంపుటినిండా కవి బాబురావుగారు ఎంతో అభ్యుదయ వాదిలా కనిపిస్తాడు. అంబేద్కర్ భావజాలాన్ని నిలువెల్లా ప్రతిబింబించే కవిగా కూడా కనిపిస్తాడు. ఒక సామాజిక బాధ్యతతో తన కవిత్వాన్ని వర్ణించిన తీరు కూడా కనిపిస్తుంది. ఈ కవితా సంపుటికి నాతో పాటు, ప్రముఖ సినీ గేయరచయిత భువనచంద్ర ‘చిరు’గాలి’ ఎద’గాలి’ పేరుతో ముందు మాట రాస్తూ బాబురావు కవిత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ‘కొన్ని కవితలు నిప్పు కణికలయితే, కొన్ని సెగలు గక్కే అశ్రువులు. కొన్ని కలలు నిలయాలైతే, కొన్ని జ్ఞాపకాల సమాధులు. కొన్ని ప్రశ్నల కరవాలాలైతే కొన్ని నిస్సహాయ నిట్టూర్పులు’’ అన్నారు. ‘’కవి సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తాడు. అన్యాయంపై, అవినీతిపై అక్షరఖడ్గాన్ని ఝళిపిస్తాడు. నీతి, న్యాయాలకు రక్షణ కవచమౌతాడు. ఈ కోవకు చెందిన కవి శ్రీ చల్లగాలి బాబురావు. చెన్నై మహానగరంలో నివశిస్తూన్నా, తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న అక్షరయోధుడు’’ ప్రముఖ కవి ఎస్.ఆర్.పృథ్వి తన ముందుమాట ‘కవితాత్మకు అక్షరరూపం’లో కవి బాబురావునీ, ఆయన కవిత్వాన్ని చక్కగా మనకకు పరిచయం చేస్తూ సుమారు మూడు దశాబ్దాలుగా కవిత్వ రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న కవిగా చెప్పారు. ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు వి.చెంచయ్య ‘అతలాకుతలం చేసి అలరించే సుడిగాలి కవిత్వం ‘ పేరుతో కవిలో ప్రతిఫలించే ప్రగతిశీల దృక్పథాన్ని విశ్లేషించి చూపారు. ‘’కవికి ప్రధానంగా రెండు విషయాలలో స్పష్టత ఉండాలి. ఒకటి తాను రాస్తున్నది కవిత్వమేనా అనే స్పృహ. అంటే కవితా విలువల పట్ల పట్టింపు. రెండు నడక ముందుకే సాగడం ప్రకృతి సహజం గనక, పురోగామి దృక్పథం ఉండడం. ఈ రెండిటి విషయంలో కవి రాజీపడకూడదు. ఈ రాజీపడని తత్వం బాబురావుకు సహజంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అక్షర సమూహం విప్లవాక్షరమై వికసిస్తూనే ఉంటుందనడం, అసమానతల కల్మషపు ఇగోను ఎగసితన్నాలనడం, జీవితాన్ని సారవంతం వైపుగా పయనింపజేసే కొత్త ఊపరి కావాలనుకోవడం, కాషాయం విషసర్పమై కాటేస్తోందనడం ఇంకా ఇలాంటి భావ పుష్టిగల మాటలెన్నో ఈ రాజీపడని తత్వం లోంచి ఊడిపడినవే.’’ అని బాబూరావు కవిత్వాన్ని సిద్థాంతీకరించారు. కవి, విమర్శకులు పి.శ్రీనివాస్ గౌడ్ బాబురావు కవిత్వ వస్తు సంఘర్షణ గురించి చెప్తూ’బాబురావుది నిశిత దృష్టి. దేశాన్ని తాకిన ఏ సంఘటన అయినా ఒక ఆవేదనాత్మక రూపంలో బాబురావునీ తాకింది, చెన్నై వరదలను, మధ్యప్రదేశ్లో ఆదివాసీ మీద ఉచ్ఛ పోసిన మ(ను) దవాదుడు ప్రవేశ్ శుక్లా గురించి ఈసడించి, ఎంత చేసినా మనము ఊరికి ఉత్తరాన (స్మశాన స్థలి వుండే దిక్కు) వుంచబడి మన దక్షిణాదికి రావాల్సిన నిధుల అన్యాయం జరుగుతున్నదని రాయడం బాబురావు సునిశిత దృష్టే కాకుండా, జరుగుతున్న పరిణామాల లోతైన అధ్యయనం కనపడుతుంది. ఈ అధ్యయనం కూడా తన జాతి దృష్టికోణంలో చూడటం బాబురావు సుగుణం. అందుకు 'అందమైన కల' కూడా కంటున్నాడు. మనిషి మనిషిగా మిగలాలని కలవరిస్తున్నాడు’ అని కవి అంతరంగాన్ని మనముందుంచారు. 

'నువ్వు నువ్వులా వెలగాలి' కవితా సంపుటి ద్వారా తన అంతరంగాన్ని ఆవిష్కరించిన కవి, 'ఈ చిరు గొంతుకను వినండి' అనే శీర్షికతో తన కవిత్వ ప్రయాణాన్ని ఎంతో నిజాయితీగా వివరించాడు కవి. డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా మారిన ప్రస్తుత సమాజంలో, రచనల వల్ల ఎలాంటి భౌతిక ప్రయోజనం ఉండదని హేళన చేసిన వారి మాటలను పక్కనపెట్టి, కేవలం భాషపై ఉన్న మక్కువతో తన ఉద్రేకపు భావాలకు అక్షర రూపం ఇచ్చానని తెలిపాడు. పుస్తక ప్రచురణ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, కొందరు పెదవి విరిచినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా, తన కవితలకు సానపట్టి మార్గనిర్దేశం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల సాహితీ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అనంతమైన సాహిత్య సముద్రంలో తనదొక చిన్న ప్రయత్నమని వినమ్రంగా చెబుతూ, అందరూ చదవకపోయినా తన కవిత్వాన్ని అర్థం చేసుకుని ఏ ఒక్క హృదయం స్పందించినా అదే తనకు దక్కే అతిపెద్ద బహుమతి అని కవి తన నిరాడంబరతను, కవిత్వం పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమను తన కవిత్వ నేపథ్యంలో వ్యక్తపరిచాడు.

మనిషి హృదయంలో దాగున్న మూగ వేదనలకు, సంతోషాలకు అక్షర రూపమిచ్చి ఓదార్చే ఆత్మీయ మిత్రుడు కవి. తన కలం నుండి జాలువారే సిరాతో సమాజపు మూఢత్వపు చీకట్లను చీల్చే వేకువ కిరణం కవి.గాలిని శ్వాసగా, భావాన్ని భాషగా మలిచి నిర్జీవమైన అక్షరాలకు ప్రాణం పోసే అక్షర సృష్టికర్త కవి. కాబట్టే కవి బాబురావు

 ‘ కాలం దాస్తున్న

 ప్రశ్నావళి మీద

 నేనొక నిశ్శబ్దపు సంతకాన్ని

జ్వలిస్తూ…జ్వలిస్తూనే ‘’ ఉంటానన్నాడు. అలా ఉండగలగడమే మనిషితనం. అలా మానవత్వాన్ని నిత్య నూతనంగా నిలపడమే కవిత్వం చేసే పని. అది బాబురావు కవిత్వం పరిపూర్ణంగా చేస్తుంది!


 





కామెంట్‌లు లేవు: