అంతర్జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం ( 1 జూన్ 2026)
అమ్మ లాలన యెంతటి యమృతమగునొ
జన్మ నిచ్చిన దైవమై జగతి నొప్పు
కంటి పాపగ మనలను గాచు నెపుడు
అమ్మ ప్రేమకు సాటియే యవని లేదు!
నాన్న కష్టము మనకిడు నల్లనగను
బాట జూపును బ్రతుకున భాసమవగ
రక్షయై నిల్చు నెప్పుడు రత్నమట్లు
తండ్రి దీవెన యెంతటి ధన్యమగునొ!
తల్లిదండ్రుల సేవయే ధన్యపథము
వారి చరణాలె దేవాలయములు సుమ్మి
భూమిపై నున్న ప్రత్యక్ష బుధులు వారు
మరువకండయ్య వారిని మనసు నందు!
తమరు గంజినీ ద్రావియు దనివితోడ
కూడు బెట్టుదు రర్భకుల్ కుడువ నంచు
కంటి రెప్పగ గాతురు కంటిపాప
తల్లిదండ్రుల త్యాగము ధన్యమవదె!
రక్త మాంసము లిచ్చిన రమ్యమూర్తి
చెమట బిందువు లొలికించు శిల్పి నాన్న
ఈ యుగమ్మున నెల్లరు నెనరు తోడ
పెంచుచుందురు మనలను బ్రేమ తోడ!
ప్రాయమంతయు మనకై ప్రయాసపడియు
నడక నేర్పిన దైవాల నడత మరచి
వృద్ధులైనట్టి వేళల విడవ తగదు
భారమనుకోక సాకరే భాగ్యమబ్బ!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 1.6.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి