‘ప్రాణం’ గాయపడిన వేళ!
ఊయల ఊగాల్సిన చోట
నా గుండె పగిలిపోయినట్లయ్యింది.
రక్తం కారుస్తూ
ఏడుస్తూ నా వైపు పరుగెత్తుకొచ్చిన
నా కొడుకును చూసిన క్షణం...
నా ప్రాణమేగాయపడి
కళ్ళెదుట కదిలివస్తున్నట్లనిపించింది.
తగిలింది వాడికే అయినా,
నొప్పింతా నా గుండెల్లోనే
భయమంతా నా కళ్ళల్లోనే
ఒక నిలువెత్తు ఆందోళన...
ఏం చేయాలో తెలియని అయోమయస్థితి
అది కనిపించనివ్వని ఏదో గాంభీర్యం.
వరదలో చిక్కుకున్న
చిన్న పడవను చూసే నావికుడిలా
భయంతో వణికిపోతూనే
వాడికి ధైర్యంగా కనిపించాలి
"ఏమీ కాదు నాన్నా..." అని
పెదవులు పలుకుతున్నా,
ఆ మాటలు వాడిలో ధైర్యం నింపినా
నా తలనిండా సవాలక్ష ప్రశ్నలు!
ఏమయ్యిందో
రక్తమోడుతున్న గాయాన్నెలా మాన్పాలో
ఏ డాక్టరేమి చెప్తాడో...!
ఉబికివస్తున్న కన్నీళ్లను అణచుకుంటూనే
పెదవులపై చిరునవ్వు పెట్టుకుని
వాడి కళ్లల్లో ధైర్యాన్ని వెలిగించాలి!
ఆ క్షణంలో
నేనే భయపడినట్లుంటే
వాడి ప్రపంచమంతా వణికిపోతుంది.
నేనే బేలనైపోతే
వాడి నమ్మకమంతా కూలిపోతుంది.
గుండెలో తుఫాను రేగుతున్నా,
బయట మాత్రం
ప్రశాంతమైన ఆకాశమవ్వాలి
వాడి చిన్న చేతిని
నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు,
ఆ చేయి నన్ను పట్టుకుందో
నేనే దాన్ని పట్టుకున్నానో
అన్నేళ్ళపాటు అల్లారుముద్దుగా చూసుకున్నా
అప్పుడే ఎలా నిర్లక్ష్యం చేశానో
కంటిపాపను కమ్మేస్తున్న
కన్నీళ్ళకెవరు సమాధానం చెప్పాలి!
ఆసుపత్రి వైపు అడుగులు వేస్తూనే
దేవుడినో... డాక్టర్నో...కాలాన్నో
మనసంతా ఒకటే ప్రార్థన!
ఆ నొప్పిని నాకివ్వు,
ఆ భయాన్ని నాకివ్వు,
ఆ గాయాన్నీ నాకే ఇవ్వు...
వాడి చిరునవ్వును మాత్రం
మళ్ళీ వాడికి తిరిగి ఇచ్చేయ్!
డా.దార్ల వెంకటేశ్వరరావు 10.6.2026
(మా అబ్బాయి ఊయలపై నుంచి పడి, గాయమై కన్నీటి పర్యంతమైన వేళలో మనసు పడిన వేదన…)
When ‘Life’ Itself Was Wounded
The place where a cradle should have been swaying,
felt as though
my heart had shattered.
The moment
I saw my son running toward me,
bleeding and crying,
it felt as though my very life,
wounded and broken,
was moving before my eyes.
Though the injury was his,
the pain was all in my heart...
the fear was all in my eyes.
A towering anxiety...
a helpless confusion,
and yet,
a strange composure that
refused to reveal it.
Like a sailor watching
a tiny boat trapped in a raging flood,
I trembled with fear,
yet had to appear brave for him.
"It's nothing, son…
" my lips kept saying.
Those words may have filled him
with courage,
but my mind was crowded
with countless questions.
What exactly had happened?
How would this bleeding
wound heal?
What would the doctor say?
Suppressing the tears
that threatened to overflow,
I had to wear a smile
and kindle courage in his frightened eyes.
For in that moment,
if I appeared afraid,
his whole world would tremble.
If I broke down,
his faith would collapse.
Though a storm
raged within my heart, outwardly
I had to become a calm
and the cloudless sky.
When I took his little hand into mine,
I could not tell
whether he was holding me,
or I was holding him.
Though I had cherished him
all these years with endless affection,
why had I been careless
at that very moment?
Who can answer the tears
that blurred my vision?
As we hurried toward the hospital,
whether to God,
to the doctor, or
to Time itself,
my heart uttered only one prayer:
Take this pain and give it to me.
Take this fear and give it to me.
Take this wound and give it to me.
But please... return his smile to him.
— Dr. Darla Venkateswara Rao
10 June 2026.
(The pain that overwhelmed my heart when my little boy fell from the swing on 9.6.2026 night, injured himself, and came to me with tears in his eyes…)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి