మహా ఇంధనం
రాత్రి చివరలో
ఒక చుక్క వెలుగు పుడుతుంది
దానిలో
ఎంత చీకటి కాలిపోయిందో
ఎవరూ అడగరు.
గట్టిపడిన అరచేతుల్లో
వెలుగు గింజలు దాగుంటాయి
వాటిని నేలలో నాటితే
గోపురాలు మొలుస్తాయి.
నగరం నిద్రపోతుంది
కానీ
ఎక్కడో ఒక గుండె
ఇంకా మెలకువలోనే ఉంటుంది
గడియారం ముల్లుల్ని తోసుకుంటూ.
రాతి మౌనం విరిగిన చోట
ఒక రూపం నిలుస్తుంది
ఆ రూపం అందం కాదు
గాయాల జ్ఞాపకం.
గాలి పరిమళిస్తుంది
ఏ చెట్టు తనను తాను
ఎంతగా తుడిచుకుందో
ఆ వాసన చెబుతుంది.
నదులు ఎక్కడికో పారిపోతాయి
వాటిలో
ఎంత కొండ కరిగిందో
నీరు మాత్రమే తెలుసుకుంటుంది.
అలాగే
నా లోపల ఏదో
నెమ్మదిగా అరిగిపోతూ
ఈ వెలుగులన్నింటికీ
ఆధారం అవుతోంది.
ఈ రోజు
ఎవరూ పిలవకపోయినా
నా నీడ ముందుకు వచ్చి నిలుస్తుంది
నిశ్శబ్దంగా…
“ఇదంతా
ఎక్కడి నుంచి వెలిగిందో
గుర్తుందా?”
– దార్ల వెంకటేశ్వరరావు 1.5.2026
The Great Fuel At the end of the night, a single drop of light is born. No one asks how much darkness had to burn within it. In hardened palms, seeds of light lie hidden. When planted into the earth, they rise as towers. The city falls asleep, yet somewhere, a heart remains awake, pushing forward the hands of the clock. Where the silence of stone breaks, a form stands upright. That form is not beauty— it is the memory of wounds. The wind carries fragrance; it tells how deeply a tree has rubbed itself against storms. Rivers keep running away somewhere; only the water knows how much mountain has melted into them. And so, something within me keeps slowly wearing away, becoming the unseen source of all these lights. Today, even if no one calls my name, my shadow steps forward and stands beside me, silently… “Do you remember where all this light first came from?” — Darla Venkateswara Rao, 1.5.2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి