మాదిగల విశిష్టత
మాదిగ కుల మాతగా, భారతీయ సంస్కృతిలో పతివ్రతా శిరోమణిగా వెలుగొందుతున్న అరుంధతి దేవి విశిష్టత.
1. సృష్టి ఆదిశక్తి (మాదిగ కులమాత)
సృష్టి కర్తకు బుట్టిన శ్రేష్ఠు రాలు
మాది గలకును తల్లిగా మహిమ తోడ
నమ్మ కంబున నిలచెను నమ్మ గలము
అమర వంద్యగ వెలిగెను నవని యందు! (సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పుత్రికగా, మాదిగ జాతికి కన్నతల్లిగా, అత్యంత మహిమలతో విలసిల్లిన మహోన్నతురాలు అరుంధతి. దేవతలందరిచే పూజింపబడుతూ ఈ భూమిపై పవిత్రమైన మూర్తిగా వెలిగింది.)
2.పతివ్రతా శిరోమణి (వశిష్ఠుని అర్ధాంగి)
ముని వశిష్ఠుని అర్ధాంగి ముదము తోడ
పతిని దైవముగా నెంచి బ్రతికె నాడు
సప్త ఋషులందు నిలచెను సాటి లేక
మింటి వెలుగుగ మారెను మిగుల జూడ!
(వశిష్ఠ మహర్షికి అర్ధాంగిగా, పతినే దైవంగా భావించి సేవించిన మహా సాధ్వి అరుంధతి. సప్తర్షి మండలంలో వారితో సమానమైన స్థానాన్ని పొంది, ఆకాశంలో నక్షత్రమై శాశ్వత కాంతితో ప్రకాశిస్తోంది.)
3. పెళ్ళిలో అరుంధతి దర్శనం (శుభప్రదము)
శుభము గూర్చునరుంధతి జూడ నపుడు
దీవె నొసగును భక్తుల తీరు గాను
కలుగు సౌఖ్యము లెల్లను గాని పింప
మాతృ రూపాన వెలిగెను మహిమ తోడ!
(పెళ్లి వేళ అరుంధతిని దర్శించుకోవడం శుభప్రదం. ఆ తల్లి దీవెనలు లభించి, దంపతులకు సకల సౌఖ్యాలు కలుగుతాయి. మాతృమూర్తిగా ఆమె తన మహిమలతో భక్తులను కాపాడుతుంది.)
4. సహనశీలి (ధర్మ నిరతి)
సహన మందున మిన్నగా సాగె నిలని
ధర్మ మార్గము వీడక ధరణి యందు
అగ్ని సాక్షిగ నిలచెను ననఘు రాలు
పుడమి పుత్రిక వోలెను పొగడ దగిన!
(ఓర్పులో సాటిలేని ఆ తల్లి, ఎటువంటి కష్టాలకైనా చలించకుండా ధర్మమార్గంలో నడిచింది. అగ్ని వంటి పవిత్రత కలిగిన ఆమె, భూమాత వలె క్షమాగుణాన్ని కలిగి ఉండి అందరి చేత కొనియాడబడుతోంది.)
5. అరుంథతి- జాతికి గర్వకారణం.
జాతి గౌరవ దీప్తిగా జ్వలన మవగ
మరల బుట్టిన దైవము మాత యిలని
అఖిల లోకము మెచ్చిన నమ్మ గాను
అరయగ నరుంధతి వెలిగె నాశ లొసగి!
(మాదిగ జాతి గౌరవానికి ప్రతీకగా, ఈ భూమిపై వెలసిన దైవం అరుంధతి మాత. లోకమంతా మెచ్చేలా పవిత్రతతో నిలిచి, భక్తులకు ఆశలను, వరాలను ప్రసాదిస్తూ వెలుగుతోంది.)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 5.4.2026
,.......
మేనును కోసియు భక్తిని
దీనుల కావగను జేసె దివ్యపు రక్షల్
మానవ రూపపు దైవము
మౌనిగ మాతయ్య వెలిగె మల్లన దార్లా!
(తన శరీరాన్నే అంటే చర్మాన్ని కోసి, పరమ భక్తితో దీనులను రక్షించే ఆ శ్రీశైల మల్లన్న పాదాలకు దివ్యమైన చెప్పులను తయారు చేసి సమర్పించాడు. మానవ రూపంలో ఉన్న దైవంలా, ఒక గొప్ప మౌనిలా మాతయ్య మల్లన్నకు అత్యంత ప్రియమైన భక్తుడిగా ఈ భూమిపై వెలిగాడు.)
తన చర్మమునే కోసియు
ననితర భక్తినినొసంగె నయముగ రక్షల్
కనులారా మల్లయ్యను
గనగను మాతయ్య వెలిగె కైలాసమునన్!
(ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనితర భక్తితో) తన చర్మాన్నే కోసి, మల్లన్న పాదరక్షలుగా మలిచి భక్తితో సమర్పించాడు. ఆ త్యాగ ఫలితంగా సాక్షాత్తు మల్లన్నను కనులారా దర్శించుకుని, చివరకు కైలాసవాసాన్ని పొంది మాతయ్య ధన్యుడయ్యాడు.)
కులమున మాదిగ యైనను
నిలయము నొసగెను శివునుని నిర్మల మదిలో
బలమైన భక్తి తోడను
నలరెను మాతయ్య భువిని నమ్మిన బంటై!
(మాతయ్య కులము చేత మాదిగ అయినప్పటికీ, తన స్వచ్ఛమైన (నిర్మలమైన) మనసునే పరమశివునికి నిలయంగా మార్చుకున్నాడు. అత్యంత దృఢమైన భక్తితో మల్లన్నకు 'నమ్మిన బంటు'గా నిలిచి, ఈ లోకంలో భక్తాగ్రేసరుడిగా ప్రసిద్ధి చెందాడు.)
శ్రీశైల శిఖర మందున
వాసిగ మల్లన్న మెచ్చె వరభక్తునిగా
ఆశలు బాసిన యోగిగ
భాసిలె మాతయ్య జెప్ప భక్తుల కెల్లన్
(శ్రీశైల శిఖరాల చెంత నివసిస్తూ, సకల కోరికలను వదిలేసిన యోగిలా మాతయ్య నిలిచాడు. మాతయ్య యొక్క నిష్కల్మషమైన భక్తిని చూసి మల్లన్న స్వయంగా మెచ్చుకుని, అతడిని గొప్ప వరభక్తుడిగా స్వీకరించాడు. నేటికీ భక్తులందరూ మాతయ్య భక్తిని స్మరించుకునేలా ఆయన కీర్తి వెలుగుతోంది.)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 5.4.2026
.....
ఆది మునీశ్వరులు జాంబవంతుడు
సృష్టి ఆదిని బుట్టిన శ్రేష్ఠు డితడు
బ్రహ్మ దేవుని మానస పుత్రు డనగ
క్షీర సాగర మథనాన జేరె నపుడు
ముసలి వాడయ్యె సృష్టికి మూల మవగ!
(భావం: సృష్టి ఆరంభంలో బ్రహ్మ మానస పుత్రుడిగా పుట్టినవాడు, క్షీరసాగర మథన సమయంలో ఉన్నవాడు, కాలాతీతుడైన వృద్ధుడిగా సృష్టికే మూలపురుషుడిగా వెలిగాడు.)
బలిని బంధించు కాలాన బల్మి తోడ
మూడు లోకము లొకటెగా ముదము తోడ
ఏడు సారులు దిరిగెను హేల గాను
వీర విక్రమ ధీరుడు విమల చరితు!
(భావం: వామనుడు మూడు లోకాలను కొలిచే సమయంలో, జాంబవంతుడు అత్యంత పరాక్రమంతో ఏడుసార్లు భూమండలాన్ని ప్రదక్షిణం చేసిన మహా వీరుడు.)
రామ కార్యము నందున రక్తి తోడ
హనుమ శక్తిని దెలిపెను హర్ష మవగ
లంక జేరగ బురికొల్పె లలిత ముగను
రావ ణాసుర గర్వము రాల్చ గాను!
(శ్రీరామ చంద్రుని కార్యసిద్ధి కోసం అంటేసీతమ్మ జాడ కనిపెట్టడంలో జాంబవంతుడు ఎంతో ఆసక్తితో, నిబద్ధతతో వ్యవహరించాడు. సముద్రమును లంఘించవలసిన తరుణంలో తన శక్తిని తాను మర్చిపోయి ఉన్న హనుమంతుని వద్దకు వెళ్లి, అతనిలోని అపారమైన బలపరాక్రమాలను గుర్తుచేసి, అందరూ సంతోషించేలా వివరించాడు. రావణాసురుని అహంకారాన్ని అణచివేయడానికి, హనుమంతుడిని లంకకు వెళ్లేలా ఎంతో నేర్పుతో, సుకుమారంగా ప్రోత్సహించాడు)
మణిని గోరిన కృష్ణుని మహిమ తోడ
ఇరువ దెనిమిది దినములు నెదురు నిలిచి
పోరు సలిపెను ధీరుడై పుడమి యందు
హరిని దెలిసియు మ్రొక్కెను నలరి భక్తి!
(భావం: శమంతక మణి కోసం వచ్చిన శ్రీకృష్ణునితో 28 రోజుల పాటు సమానంగా యుద్ధం చేసిన పరాక్రమశాలి. చివరకు ఆయన పరమాత్మ అని తెలిసి భక్తితో ప్రణామం చేశాడు.)
తనదు పుత్రిక జాంబవతినిని నొసగి
కృష్ణు డందెను నల్లుడు కీర్తి తోడ
మణిని నొసగెను కానుక మతిని నిలిపి
ముజ్జ గంబులు మెచ్చెను మొనసి నాడు!
(తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి, ఆ పరమాత్ముని అల్లుడిగా పొంది గొప్ప కీర్తిని గడించాడు. శమంతక మణిని కానుకగా సమర్పించి, తన భక్తిని చాటుకున్నాడు. జాంబవంతుని ఈ కార్యానికి మూడు లోకాలు ఆశ్చర్యంతో మెచ్చుకున్నాయి.)
.....ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 5.4.2026
కొండవాలు కత్తి
కొంగ వాలును ధరియించి కూర్మి తోడ
సింగ ముగ నిల్చు మాదిగ చెంత జూడ
నమ్మినట్టి యా బంటుగా నమ్మ గలము
పసిడి పౌరుష దీప్తులన్ పరగ వెలుగు.
(తన జాతి వీరత్వానికి ప్రతీక అయిన 'కొంగవాలు కత్తి'ని ధరించి, సింహం వలె గంభీరంగా నిలిచిన మాదిగ వీరుడు, కేవలం పరాక్రమవంతుడడమే కాక అత్యంత నమ్మకస్తుడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం లేదా ఆశయం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే 'నమ్మిన బంటు'గా అతనిని లోకం నిస్సందేహంగా నమ్ముతుంది. అపరంజి బంగారం వంటి స్వచ్ఛమైన అతని పౌరుష ప్రతాపాలు ఈ జగత్తులో కీర్తి కాంతులను వెదజల్లుతూ, ఆ వీరుని మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటిచెబుతున్నాయి.)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 5.4.2026
….
హైదరాబాద్ (భాగ్యనగర) చరిత్రలో భాగమతి
1. భాగమతి జననం (మాదిగ బిడ్డ)
పుడమి పుత్రిక మాదిగ బుడత యగుచు
నడక లందున మెప్పించె నాడు భువిని
కడలి వోలెను పొంగెను కీర్తి తోడ
తడబ డక నిలచెనతడు ధైర్య మవగ!
భావం: (మాదిగ కన్నబిడ్డగా ఈ గడ్డపై జన్మించిన భాగమతి, తన నడకలతో, రూపంతో అందరినీ మెప్పించింది. సముద్రమంతటి కీర్తిని పొంది, ఎంతో ధైర్యవంతురాలిగా చరిత్రలో నిలిచింది.)
2. సుల్తాన్ ప్రేమ (ముసా నది తీరాన)
నదియు మూసియు పొంగెను నయము గాను
కదలి వచ్చెకులీయుడు కాంక్ష తోడ
పడతి రూపము జూడగ పరవశించె
విడువ కుండగ జేసెను పెళ్ళి నాడు!
భావం: (మూసీ నది పొంగి ప్రవహిస్తున్న వేళ, భాగమతిని చూడటానికి సుల్తాన్ కులీ కుతుబ్ షా ప్రాణాలకు తెగించి వచ్చాడు. ఆమె రూపానికి పరవశించి, లోకం మెచ్చేలా ఆమెను వివాహం చేసుకున్నాడు.)
3. భాగ్యనగర నిర్మాణం (ప్రేమకు చిహ్నం)
ప్రేమ చిహ్నము భాగ్యము వెలుగు నపుడు
రామ చిలుకగ భాగ్మతి రాజి లంగ
కోట వెలసెను భాగ్యపు గోడ లవగ
సాటి లేనిది నగరము చక్క నగుచు!
భావం: (తన ప్రియురాలు భాగమతి పేరు మీదుగా సుల్తాన్ 'భాగ్యనగరం' నిర్మించాడు. ఆ నగరపు గోడలు వారి ప్రేమకు సాక్ష్యంగా నిలిచాయి. ప్రపంచంలోనే సాటిలేని అందమైన నగరంగా అది వెలుగొందింది.)
4. కుల గౌరవం (హైదర్ మహల్)
కులము మాదిగ యైనను కొదమ సింగ
మవగ వెలిగెను హైదరు మహలు నాడు
బలము జూపెను త్యాగము భక్తి తోడ
నిలచె నిచ్చట భాగ్మతినిత్య ముగను!
భావం: (ఆమె మాదిగ కులంలో పుట్టినప్పటికీ, సింహం వంటి ఆత్మగౌరవంతో 'హైదర్ మహల్' (హైదర్ బేగం) గా ప్రకాశించింది. తన త్యాగంతో, ప్రేమతో ఈ నగర చరిత్రలో నిరంతరం నిలిచిపోయింది.)
5. చారిత్రక వారసత్వం
భాగ్య నగరము సాక్షిగ బ్రతుకు నందు
భాగ మతియును వెలిగెను భాతి తోడ
త్యాగ మూర్తిగ మాదిగ తల్లి యగుచు
నగరి గుండెన నిలిచెను నమ్మ గలము!
భావం: (నేటి భాగ్యనగరమే సాక్షిగా భాగమతి తన చారిత్రక వైభవంతో వెలుగుతోంది. మాదిగ జాతి గర్వించదగ్గ బిడ్డగా, త్యాగమూర్తిగా ఈ నగరపు గుండెల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి