తెలుగు శాఖ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జరుగుతున్న అన్నమయ్య సదస్సు ప్రారంభ సమావేశంలో ... మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై అధ్యాపకులు.
తెలుగు సంకీర్తనా సాహిత్యానికి అన్నమయ్య ప్రథమాచార్యుడని, పదకవితా పితామహుడిగా సంగీతం, నృత్య కళలను సాహిత్యానికి అందించిన ప్రథమ వాగ్గేయకారుడిగా నిలిచిన అజరామరుడు తాళ్లపాక అన్నమయ్య అని హెచ్ సి యు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నమయ్యకు కైమోడ్పులు ఘటించారు. బుధవారం నాడు (29.4.2026) హైదరాబాద్ యూనివర్సిటీ తెలుగు శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ‘తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు - భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం ‘ అనే అంశంపై జరిగిన సదస్సుకు అధ్యక్షత వహిస్తూ, ఆయన కీలకోపన్యాసం చేశారు. తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్నమయ్య సాహిత్యం లోని సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ, అన్నమయ్యపై పద్యాలను రచించి సభలో చదివి వినిపించారు. సదస్సు కన్వీనర్ ఆచార్య డి. విజయలక్ష్మి సదస్సు లక్ష్యాలను వివరిస్తూ అన్నమయ్య సాహిత్యంలో కేవలం భక్తి మాత్రమే కాదని, భాషా ప్రయోగాలు, సామాజిక అంశాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆచార్య ఎం. గోనానాయక్ మాట్లాడుతూ హతీరామ్ జీ బంజారా భాషలో సుమారు 150 కీర్తనలను రచించినట్లు ఆయన తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంగీత నృత్య కళల విభాగ అధ్యక్షులు ఆచార్య ఆర్ ఎన్ ఎస్ శైలేశ్వరి సాహిత్యానికి సంగీత పరంగా సంకీర్తనలు రచించిన మొట్టమొదటి వాగ్గేకారుడుగా అన్నమయ్య గురించి సోదాహరణంగా వివరించారు. ఈ సదస్సులో ఆచార్యులు పమ్మి పవన్ కుమార్, పి.వారిజారాణి, త్రివేణి వంగరి, రెడ్డి శ్యామల, భూక్య తిరుపతి, సాగి కమలాకరశర్మ, డా.బి.భుజంగరెడ్ఢి, డా.ఎస్.రఘు, డా.పి.విజయ్ కుమార్ , డా.బాశెట్టి లత, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భాగవతార్ రమేష్, రెడ్డయ్య, సుశీల్ ఆండాళ్, విజయ్, మురళీ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి డాక్టర్ పి. విజయ్ కుమార్ స్వాగతం పలుకగా, డాక్టర్ బాశెట్టి లత వందన సమర్పణ చేశారు. సదస్సు అనంతరం సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఈ సదస్సులో పరిశోధక విద్యార్థినీ, విద్యార్థులు, స్నాతక, స్నాతకోత్తర విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నమయ్య పై పద్యాలు
భక్తి తోడను గీతముల్ బాడి నావు
ముక్తి మార్గము జూపితి ముదము మీర
చక్క నయ్యని కథలను చాటి నావు
తాళ్ళ పాకయ్య నమ్రత తలచి మొక్కు.
కొండ దేవర కీర్తనల్ కొనల సాగె
తేట తేటగ పాటల తేనె లొలికె
అన్న మయ్యని పదములు అమృత ములుగ
చిన్న నయ్యకు జేజేలు చెప్ప వలయు.
తలచి నంతనె కలిగెడి తన్మ యమ్ము
కలియు గంబున దేవుని కాన బరిచె
భజన జేసెడు భక్తుల భాగ్య మయ్యె
అన్న మయ్యను మదినిని అర్చ చేయ.
వెలయ జేసిన పాటలు వేల సంఖ్య
పలుకు తేనెల సంతస పరిమ ళాలు
చిన్న నయ్యకు జేజెలు చెప్ప వలయు
అలరు మంగను గొలిచెడి అనఘు డతడె.
వేగ మెచ్చెను స్వామియు వేల భక్తి
భావ ముట్టిప డెడునట్టి పాట లాడె
తాళ్ళ పాకయ్య పదములు తరచి చూడ
ముక్తి మార్గము మనకును ముదము నిచ్చు.
కొలువు దీరిన సామిని కొలువ దగదె
తేట తేటగ పాటల తేనె లొలికె
అన్న మయ్యని పదములు అమృత ములుగ
వరుస గీతము లాడెడి వాడు నతడె.
సొగసు గూర్చిన పాటలు సొగసు గొలిపె
హరికి సేవలు మనమున హత్తు కొనియె
తెలుగు బాసకు ప్రాణము తెచ్చి నిలిపె
అన్న మయ్యను దలచిన అఘము లరుగు.
అలరు మంగను విభునిని అర్చ నలుగ
పదము లన్నియు హరికిని పరిమ ళాలు
మధుర భక్తిని జగమున మలపి నావు
తలచి మొక్కుదు నన్నను తగును మనకు.
పదకవితలకు జేజేలు పలుకు వాడ
వేద ములసార మంతయు విదిత మయ్యె
అన్న మయ్యని కీర్తన లలరు చున్న
తెలుగు బాసకు వెలుగులు దెచ్చు నపుడు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
29.4.2026





కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి