ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026
చింత లేనట్టి మనసున చెందు శాంతి
కోప తాపము విడిచిన కొదువ లేదు
నవ్వు ముఖమున నున్నచో నవత విరియు
దారి చూపించు నట్టిది దార్ల మాట!
ప్రకృతిపై ప్రేమ జూపిన ప్రాణ శక్తి
కల్తి లేనట్టి తిండియే కాచు మనల
ముందు జాగ్రత్త నెప్పుడు ముఖ్య మనుచు
దారి చూపించు నట్టిది దార్ల మాట!
కాయ కష్టము చేసిన కలుగు సుఖము
రోగి కానట్టి వారల రోత బాపు
మంచి తిండిని తినినచో మనుజు కంత
దారి చూపించు నట్టిది దార్ల మాట!
శుభ్ర మైనట్టి నిలయము సుఖము నిచ్చు
వ్యాధి కారక కీటముల్ వదల వలయు
నిర్మ లంబుగ నుండుట నేర్పు తోడ
దారి చూపించు నట్టిది దార్ల మాట!
నిత్య మలవాటు చేసిన నిండు బలము
యోగ సాధన జేయగ యొనరు మేలు
దేహ దార్ఢ్యము పెంచెడు దీక్ష తోడ
దారి చూపించు నట్టిది దార్ల మాట!
ఆకలిని చూసి తినినచో హాయి కలుగు
మితము దప్పిన రోగముల్ మెల్ల జేరు
జిహ్వ చాపల్య మణచిన జేరు క్షేమ
దారి చూపించు నట్టిది దార్ల మాట!
వేళ తప్పక నిద్రను వెలయ జేయ
దేహ మంతట శక్తియు తెగువ నిండు
హాయి నిచ్చెడు నిద్రయే యవని పైన
దారి చూపించు నట్టిది దార్ల మాట!
మద్యపానము జేసిన మనుజు డెందు
భ్రష్టుడై పోవు నెప్పుడు వ్యధల తోడ
దుష్ట చింతన వీడిన దొరుకు సౌఖ్య
దారి చూపించు నట్టిది దార్ల మాట!
ప్రాణ యామము చేసిన ప్రాణ శక్తి
నిలకడగ నుండు నెప్పుడు నిర్మలముగ
జ్ఞాన మార్గము జూపెడు ధ్యాన మొకటె
దారి చూపించు నట్టిది దార్ల మాట!
వయసు మళ్ళిన వేళల వాడి తగ్గు
నడక సాగించి నిత్యము నవత నింప
పౌష్టి కాహార మెప్పుడు ప్రాణ రక్ష
దారి చూపించు నట్టిది దార్ల మాట!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
7.4.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి