"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

23 ఏప్రిల్, 2026

ప్రపంచ పుస్తక దినోత్సవం 2026


పుస్తక వైభవం - తేటగీతి పద్యాలు


దీప మొకటింట వెలుగుల నింపు నయ్య

పుస్తకము జగమంతట పొలుపు నింపు

కనులు గలవాని కేకదా కాంతి దొరకు

చదువ నేర్చిన వానికే జగము తెలియు


ఆపదలలోన వీడని అక్కజంబు

కష్ట సుఖముల నీడగా కలసి నడుచు

ఎన్ని మారుల చదివిన ఎగ్గు లేదు

పుడమి నిటువంటి చుట్టము పొడమ డెందు.


వేల యేండ్ల చరితలెల్ల విప్పి చెప్పు

విశ్వ విజ్ఞాన భాండము విమల రీతి

ముందు తరములకును మంచి ముల్లె యగును

వ్రాత లందున దాగిన రత్నరాశి.


రెక్కలే లేక ఎగురును రివ్వు మనుచు

చదువరుల నెల్ల తిప్పును జగము చుట్టు

కూర్చు నున్నట్టి చోటనే కుదురు గాగ

పుడమి నంతయు జూపును పుస్తకంబు.


భాష, మనుగడ, మతములు, భవ్య రీతి

నిలిచి యుండును గ్రంథాల నిశ్చయముగ

కాల గర్భాన కలవక కలను నిలుచు

అక్షరమ్మున దాగిన అమృత కళలు.


వేల యేండ్ల చరితలెల్ల విప్పి చెప్పు

విశ్వ విజ్ఞాన భాండము విమల రీతి

ముందు తరములకును మంచి ముల్లె యగును

వ్రాత లందున దాగిన రత్నరాశి.


ఒంట రిగనున్న వేళల ఓదరార్చు

పుస్తకము వంటి మిత్రుడు భువిని లేడు

జ్ఞాన ధనమును పెంచును నమ్మదగిన

తోడు నీడయి నిలుచును తోయజాత!


రెక్క లేకున్న ఎగురును రివ్వు మనుచు

చదువ రికి నూతన ప్రపంచ జగము జూపు

కూర్చు నున్నట్టి చోటనే కుదురు గాగ

దేశ దేశాల రీతులు తెలియ జేయు.


మంచి మార్గము చూపును మనిషి కెపుడు

లోక రీతుల నేర్పును లోతు గాను

తప్పు నొప్పుల దెలుపును తర్క మొప్ప

పుడమి పైనను బుద్ధుని పోల్కి నిలుచు.


పాత బడదుఎన్నటికిని పాఠ మమృత

మధుర భావాల నొసగును మహిమ తోడ

ఎన్ని తరముల కైనను ఎరువు కాదు

సొంత ధనముగ నిలుచును చోద్యముగను.


అక్ష రమ్ము లే సైన్యమై అణచి వేయు

దుష్ట మైనట్టి భావాల దురము నందు

మంచి తలపుల పెంచును మనసు నందు

శాంతి మార్గము చూపును శాశ్వతముగ.


పూర్వ కవుల యనుభవము పొందు పరచి

కావ్య రూపాన నిలిచెను కల్ప తరువు

నేర్చు కొన్నట్టి వారికి నెనరు తోడ

కోరి నంతట నిచ్చును కోటి నిధులు.


పేద గొప్పల భేదము పెట్ట దెపుడు

జాతి మతముల గొడవలు జైలు పాలు

అక్ష రములను నమ్మిన అట్టి వారు

విశ్వ నరులై వెలుగుదురు విశ్వమందు.


మొదటి సారిగ చదివిన ముచ్చటగును

తిరిగి చదివిన క్రొత్తగా తేట పడును

చావు లేనట్టి అక్షర శాంతి నిచ్చు

పుస్తకము వంటి దైవము పుడమి లేడు


చక్కగా గురు వోలెనే చదువ నేర్పు

శిష్యు డడిగిన దెలుపును శీఘ్రముగను

వయసు తోడను సంబంధ మొంద కుండ

నేర్చు కొనవచ్చు నెప్పుడూ నిశ్చయముగ.


పిల్ల లందరి చేతికి ప్రియము తోడ

పుస్తకము నిచ్చి పెంచిన పుణ్య మగును

భావి భారత పౌరుల భవ్య మార్గ

దర్శి యగు నిల పుస్తక ధరణి యందు.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

23.4.2026.


కామెంట్‌లు లేవు: