"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

22 ఏప్రిల్, 2026

ప్రపంచ ధరణి దినోత్సవం -2026

 ప్రపంచ ధరణి దినోత్సవం 




కం.

ధరణిని ప్రేమగ జూడగ

సిరిసంపద లిచ్చు నవని జీవులకెల్లన్

ధర రక్షితయై నిలచును

పరహితమౌ త్రోవ జూపి పావనమగుచున్.


ఆ.వె.

అవని తల్లి కంటె నధిక దైవము లేదు

ఓర్పు కలిగి పెంచు నొప్పుగాను

మొక్కలనిడి మనము మోదమునను పెంచ

పచ్చనైన భూమి పరవశించు!


కం.

పొగలను మానిపి నేడును

జగతిని గావగ మనమున సత్తువ జూపన్

నగములు నదులును నవ్వును

తగవగు దీవెన లొసగును ధరణియు మనకున్!


తే.గీ

నేల తల్లిని మనమును ప్రేమనొసగి

కాచుకొన్నచొ మనలను గాచు నెపుడు

ముందు తరముల వారికి మోదమిడగ

ప్రకృతి వనమును కాపాడ వలయు నిలచు!


ఆ.వె.

గాలి లోన నిండె కాలుష్య మిప్పుడు

ధరణి తల్లి నేడు తల్లడిల్లె

వీడ వలయు నయ్య వేగమే ప్లాస్టిక్కు

పచ్చ నైన భూమి పరవశించు!


కం.

వశమగు ప్రకృతిని గావగ

కుశలము కలుగును జగతికి కోరిన రీతిన్

పశుపక్ష్యాదుల బ్రతుకున

వొసగును హాయిని వినయము వొసగును మనకున్!


తే.గీ.

కన్న తల్లియు బిడ్డల కష్టమరయు

ధరణి మాతయు జీవుల దయను గాచు

ఓర్పు వహియించు నెప్పుడు నుర్వి తల్లి

త్యాగ గుణమున మిన్నగా తనరు చుండు!


తే.గీ.

కోర్కె తీర్చును దివిలోన కొమ్మ లవని

ప్రాణ మిచ్చును ధరణిపై పచ్చ చెట్లు

మొక్క నాటిన కలుగును మోద మెపుడు

విత్తు నాటగ ఫలములు వెలుగు నిచ్చు!


తే.గీ.

మురికి పట్టిన అద్దము ముఖము జూప

పొగలు నిండిన ప్రకృతియు ప్రొద్దు జూప

శుభ్ర మున్నచొ నిలుచును శుభము లెపుడు

ధరణి గావగ మనమును తలచ వలయు!


తే.గీ.

దప్పి గొనినట్టి వాడును దయను గోరు

నీరు లేనిచొ ధరణియు నిరత మేడ్చు

వాన చినుకులు నేలను వొనర దడుప

పంట పొలములు మురియును పరవశమున!


తే.గీ.

ఓడ భారము మోయును నొప్పుగాను

భూమి మోయును జీవుల భువిని నెపుడు

ఎంత భారము నైనను నింత యనక

తల్లి వోలెను మనలను దరిని జేర్చు!


తే.గీ.

దీప మున్నచొ నిలుచును దివ్య కాంతి

పొగలు లేనిచొ ప్రకృతియు ప్రొద్దు వెలుగు

శుభ్ర మున్నచొ ప్రకృతికి శోభ కలుగు

ధరణి గావగ మనమును తలచ వలయు!


తే.గీ.

ధరణి తల్లియు నొసగును దారి జూపి

జూపి నిలుపును మనలను జూడ నపుడు

నపుడు మొక్కల నాటగ నవని నవ్వు

నవ్వు వెలుగును జగతికి నమ్మకముగ!


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

22.4.2026



కామెంట్‌లు లేవు: