"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

26 మార్చి, 2026

తెలుగులో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సాహిత్యంపై జాతీయ సదస్సులో దార్ల కీలకోపన్యాసం

 

జాతీయ స్థాయి అంతర్జాల సదస్సు

‘’తెలుగులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల సాహిత్య సమాలోచన’, 17&18 మార్చి 2026

కీలకోపన్యాసం.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,  

తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్

మొబైల్: 9989628049.


1. ఉపోద్ఘాతం :

గౌరవనీయులైన సభాధ్యక్షులకు, నిర్వాహకులకు, వేదికపై ఉన్న పెద్దలకు, దేశ విదేశాల నుండి విచ్చేసిన భాషాభిమానులకు, పరిశోధక మిత్రులకు... అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.

"ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని" అన్న రాయప్రోలు వారి మాటలను స్మరించుకుంటూ, నేడు ఈ అంతర్జాతీయ వేదికపై 'తెలుగులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల సాహిత్య సమాలోచనం' అనే అంశంపై మాట్లాడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

భారతీయ సాహితీ జగత్తులో అత్యున్నత శిఖరం 'జ్ఞానపీఠం'. ఆ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు వాగ్మయ మూర్తులు కేవలం వ్యక్తులు కాదు, వారు ఒక్కో యుగానికి ఒక్కో ప్రతినిధులు.

విశ్వనాథ సత్యనారాయణ గారు సంప్రదాయపు వేర్ల నుండి ఆధునిక కావ్య సౌరభాన్ని ఎలా అందించారో...

సి. నారాయణ రెడ్డి గారు 'విశ్వంభర' ద్వారా మనిషి అస్తిత్వాన్ని, విశ్వజనీనతను ఎలా దర్శించారో...

రావూరి భరద్వాజ గారు 'పాకుడురాళ్ల' ద్వారా సమాజంలోని అట్టడుగు పొరల్లోని వాస్తవికతను ఎలా ఆవిష్కరించారో...

ఈ ముగ్గురు ధ్రువతారల సాహిత్యం - ప్రాచీనత నుండి ఆధునికత వరకు, ఛందస్సు నుండి వచన కవిత వరకు, పద్యం నుండి నవల వరకు తెలుగు సాహిత్యం సాధించిన పరిణామ క్రమానికి నిలువుటద్దం.

నేటి నా ఈ ప్రసంగంలో ఈ ముగ్గురి సాహితీ వైవిధ్యాన్ని, వారు తెలుగు భాషకు చేకూర్చిన అంతర్జాతీయ గౌరవాన్ని, వారి రచనల్లోని దార్శనికతను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.

కం.

వాణికి భూషణ మైనది

జ్ఞానము నిడు పీఠ మిలను గౌరవ మందెన్

తేనెలు లొలుకును తెలుగున

ధ్యానముతో వినుడి నేడు ధరణిని బుధులన్!


జ్ఞానపీఠ పురస్కారం విశిష్టత:

ముందుగా మనం ఈ జ్ఞానపీఠ పురస్కారం యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి స్మరించుకోవాలి.

భారతీయ సాహిత్యంలో 'జ్ఞానపీఠం' అనేది సాహిత్యంలో ప్రతిఫలించే ‘భారతీయత’కు దక్కిన గౌరవం. 1961లో సాహు శాంతి ప్రసాద్ జైన్ కుటుంబం స్థాపించిన ఈ అవార్డు, మన భారతదేశ రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న 22 భాషల్లోని అత్యుత్తమ సృజనశీలురకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. నగదు కూడా అధికంగా అందిస్తారు. ప్రారంభం నుండి నేటి వరకు ఆ నగదు మారుతూ వస్తుంది. 

ఈ పురస్కారం యొక్క విశిష్టత ఏమిటంటే…

ఇది కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా, కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఉన్న భారతీయ భాషలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తుంది.ఒక రచయిత సమగ్ర సాహిత్య కృషిని గుర్తించి ఇచ్చే ఈ గౌరవం, భారతీయ సాహిత్య గౌరవానికి ఒక కొలమానంగా భావించవచ్చు. అయినప్పటికీ ఒక ముఖ్యమైన రచనను పేరుతో ఆ పురస్కారాన్ని ప్రకటిస్తారు.

పురస్కారంతో పాటు ఇచ్చే 'వాగ్దేవి' (సరస్వతీ దేవి) విగ్రహం, మన జ్ఞాన సంపదకు, కళాత్మకతకు, భారతీయతకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.

తెలుగు భాషకు ఈ గౌరవం దక్కడం అంటే - మన భాషలోని మాధుర్యం, మన సంస్కృతిలోని లోతులు భారతీయ సాహిత్య వేదికపై అగ్రభాగాన నిలిచాయని అర్థం. విశ్వనాథ వారి ఛందస్సు, సినారె వారి తాత్వికత, రావూరి వారి వాస్తవికత - ఈ ముగ్గురూ 'తెలుగు వాణి'ని భారతీయ సాహిత్య శిఖరంపై ప్రతిష్టించారు.

తెలుగు జ్ఞాన పీఠ్ పురస్కార సాహిత్య త్రివేణీ సంగమం

1. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ - 

ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగిన విశ్వనాథ సత్యనారాయణగారి సాహిత్యం సంప్రదాయబద్ధమైన పాండిత్యానికి, ఆధునిక భావజాల విశ్లేషణకు ఒక అద్భుత సంగమం. పద్యం, గద్యం, నాటకం, విమర్శ వంటి ఏ ప్రక్రియను చేపట్టినా అందులో ఆయనదైన విశిష్ట ముద్ర కనిపిస్తుంది; అందుకే ఆయనను 'సహజసిద్ధ హస్తుడు' అని పిలుస్తారు. ఆయన రచనలలో కేవలం కథా గమనం మాత్రమే కాకుండా, 'జీవుని వేదన' మరియు ఆధ్యాత్మిక దర్శనం అంతర్లీనంగా ప్రవహిస్తాయి. ముఖ్యంగా 'రామాయణ కల్పవృక్షం'లో వాల్మీకి కథను స్వీకరించినప్పటికీ, తన సొంత అనుభూతులను, భక్తిని రంగరించి ఒక నూతన రస జగత్తును సృష్టించారు. 'వేయిపడగలు' వంటి నవలల్లో భారతీయ ధర్మం, సంస్కృతి ఎదుర్కొంటున్న సవాళ్లను ధర్మారావు పాత్ర ద్వారా విశ్లేషిస్తూ, సమాజంలోని మార్పులను అత్యంత లోతుగా ప్రతిబింబించారు. 

వాల్మీకి మహర్షి ఒక పక్షి మరణం చూసి కలిగిన శోకంతో రామాయణాన్ని ప్రారంభిస్తే, విశ్వనాథ వారు తన భార్య వియోగం వల్ల కలిగిన 'జీవుని వేదన'ను రామాయణ కల్పవృక్షంలో రంగరించారు. 36 ఏళ్ల వయసులో రాముడికి సీతా వియోగం కలిగినట్లే, తనకూ అదే వయసులో భార్యావియోగం కలగడం భగవంతుడి సంకల్పమని ఆయన నమ్మడం ఆయనలోని ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం.

తెలుగులో భార్య స్మృతిలో రాసిన కావ్యాలు ఉన్నప్పటికీ, 'వరలక్ష్మీ త్రిశతి' అత్యంత ప్రత్యేకమైనది. 20 ఏళ్ల తర్వాత ఆ పద్యాలను ప్రచురించారంటే, ఆ వియోగ బాధ ఆయనను ఎంతకాలం వెంటాడిందో అర్థం చేసుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో కన్నుమూసే సమయంలోనూ ఆమెను తలచుకోవడం వారి మధ్య ఉన్న గాఢమైన అనుబంధానికి ప్రతీక.

'వేయిపడగలు' నవలలోని ధర్మారావు, అరుంధతి పాత్రలు విశ్వనాథ, వరలక్ష్మమ్మల ప్రతిరూపాలని విమర్శకులు భావిస్తారు. ఆ నవలలో అరుంధతి పాత్ర ద్వారా ఒక భారతీయ గృహిణి మహోన్నత్యాన్ని, పాండిత్యాన్ని విశ్వనాథ వారు చిరస్థాయిగా నిలిపారు.

ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇంతటి కుదుపు ఉన్నా, ఆయన పక్షవాతం వంటి అనారోగ్యాలను కూడా లెక్కచేయక వందలాది రచనలు చేయడం అసాధారణం. సుమారు 58 నవలలు, 25 కావ్యాలు, 15 నాటకాలు - ఈ గణాంకాలు ఆయనను 'కవిసమ్రాట్' అని ఎందుకు అంటారో నిరూపిస్తున్నాయి.


మొత్తం మీద, విశ్వనాథవారి రచనలు తెలుగు భాషా సౌందర్యాన్ని చాటడమే కాకుండా, మనిషి అంతరంగ మథనాన్ని, సంప్రదాయం పట్ల అచంచలమైన గౌరవాన్ని అక్షరబద్ధం చేసిన అమూల్యమైన సాహితీ నిధులు.'రామాయణ కల్పవృక్షం' తెలుగు సాహిత్యానికి తొలి జ్ఞానపీఠాన్ని తెచ్చిన ధీశాలి విశ్వనాథ వారు. ఆయన రాసిన 'రామాయణ కల్పవృక్షం' కావ్యం భారతీయ సంస్కృతీ సంప్రదాయాల సర్వస్వంగా అభివర్ణించుకోవచ్చు. అవతారిక రామాయణ రచనా వైభవాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని కావ్య నేపథ్యాన్ని చాలా సమగ్రంగా వివరిస్తోంది.

అ. సంప్రదాయం - నవ్యతల కలయిక:

విశ్వనాథ వారు తనను తాను "అవిచ్ఛిన్న సంప్రదాయార్థిని" అని చెప్పుకున్నప్పటికీ, ఆయన కవిత్వంలో ఒక అద్భుతమైన నవ్యత కనిపిస్తుంది. నన్నయ కాలం నాటి 'శ్రీ'కార మంగళాచరణ సంప్రదాయాన్ని పాటిస్తూనే, ఆధునిక కాలానికి తగినట్టుగా 'జీవుని వేదన'ను కావ్య వస్తువుగా మార్చుకున్నారు.

ఆ. రామాయణ రచనపై విశ్వనాథ వారి స్పందన:

"మరలనిదేల రామాయణంబన్నచో..." అనే పద్యం విశ్వనాథ వారి తార్కికతకు నిదర్శనం.మనం ప్రతిరోజూ తినే అన్నమే తింటాం, ఎందుకంటే ఆకలి మనది, ఆ రుచి మనది.

అలాగే రామాయణ కథ పాతదే అయినా, అందులో కవి ప్రకటించే అనుభూతి, ఆయన చూపే ప్రతిభ కొత్తవి. అందుకే ఇది మళ్ళీ రాయాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా నమ్మారు.

ఇ. గురు భక్తి - ఆత్మవిశ్వాసం:

తన గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి పట్ల ఆయనకు ఉన్న గౌరవం అపారం. అదే సమయంలో "నన్నయ తిక్కనలకు లేని భాగ్యం (విశ్వనాథ వంటి శిష్యుడు దొరకడం) చెళ్ళపిళ్ళ వారికి దక్కింది" అని చెప్పుకోవడం ఆయన అహంకారం కాదు, అది ఆయన తన కవిత్వంపై ఉన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం.

ఈ. వంశ వర్ణన - తండ్రి ప్రభావం:

తండ్రి శోభనాద్రి గారి దానగుణాన్ని పురాణ పురుషులైన దధీచి, కర్ణులతో పోల్చడం ద్వారా, తన సాహితీ సంస్కారానికి పునాది తన తండ్రి అని ఆయన చాటిచెప్పారు. 'తండ్రి ఆజ్ఞ' మరియు 'జీవుని వేదన' - ఈ రెండూ కలిసే ఈ మహాకావ్యాన్ని పుట్టించాయని ఆయన పేర్కొన్నారు.

ఉ. పూర్వకవి స్తుతి

నన్నయ నుండి నాచన సోమన వరకు గల కవులను స్తుతిస్తూ, వారిలో ఒక్కొక్కరి ప్రత్యేకతను (ఉదాహరణకు: తిక్కన శిల్పం, పోతన పుణ్యపేటి) ఒక్కొక్క పదంతో వర్ణించడం ఆయన విమర్శనాత్మక దృష్టికి నిదర్శనం.విశ్వనాథ వారు వాల్మీకి రామాయణంలోని ఆత్మను పట్టుకుని, దానికి తన పాండిత్యాన్ని, భక్తిని, తెలుగుతనాన్ని జోడించి ఒక 'కల్పవృక్షం' లా తీర్చిదిద్దారు. శ్రీమద్రామాయణ కల్పవృక్షం' లోని తొలి పద్యం (ప్రార్థనా పద్యం).


మత్తేభం.

శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు వానందవ-

లీ మంజుప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్షల-

క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహార రుక్-

 శ్రీమంతంబయి పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశరా !

(ఓ పరమేశ్వరా! సంపదలకు నిలయమైన పెట్టె వంటివాడు, భక్తులను రక్షించే కళలో మిక్కిలి ప్రసిద్ధి చెందినవాడు, ఆనందమనే తీగకు పూసిన అందమైన పువ్వు వంటివాడు, జ్ఞానమనే ఆకాశంలో వెలిగే చల్లని చంద్రుని వంటివాడు, మోక్షలక్ష్మి ధరించిన మాణిక్యాలతో కూడిన నూతనమైన మొలనూలు వంటివాడు, తన కటాక్ష వీక్షణములతో మంచు వంటి చల్లని కాంతిని ప్రసరింపజేసేవాడు అయిన ఆ అద్భుతమైన ఏకైక పరమాత్మ జ్యోతిని నేను సేవిస్తున్నాను.)

ఈ పద్యం ఒక దైవ ప్రార్థనకు సంబంధించింది. అయితే దీనిలో విశ్వనాథ సత్యనారాయణ గారు అద్వైత వేదాంతాన్ని, భక్తి మార్గాన్ని మేళవించి పరమాత్మ తత్త్వాన్ని వివరించారు. దీని అంతరార్థం గమనించాలి.

  'వెల్గునొకడే'కవి ఇక్కడ రామచంద్రుని ఒక మానవ రూపంగా కాకుండా, ఒక అద్భుతమైన 'తేజస్సు' (Light) గా వర్ణించారు. పరమాత్మ అంటే అంతటా నిండి ఉన్న ఒక చైతన్య ప్రకాశం 'నిరాకార తత్త్వం' అని దీని అర్థం.

 'చిద్గగన ప్రాలేయాంశువు' 'చిత్' అంటే జ్ఞానం. మన బుద్ధి అనే ఆకాశంలో అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి, చల్లని వెలుగును ప్రసాదించే చంద్రుడే ఆ పరమాత్మ అని కవి భావం. అంటే భగవంతుడు మన లోపల ఉండే జ్ఞాన స్వరూపుడు.

 'మోక్షలక్ష్మీ మేఖల' మోక్షం అనేది ఒక లక్ష్మి (దేవత) అయితే, ఆమె ధరించే మొలనూలు (ఒడ్డాణం) లాగా ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంటే మోక్షాన్ని పొందే మార్గంలో భగవంతుడు అత్యంత ప్రధానమైన ఆభరణం వంటివాడు, ఆయనను ఆశ్రయిస్తేనే ముక్తి లభిస్తుందని అర్థం.

'ఆనందవల్లీ మంజుప్రసవం' భక్తి అనే తీగకు లభించే చివరి ఫలం లేదా పుష్పం 'ఆనందం'. ఆ పరమాత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు మనిషికి కలిగేది బ్రహ్మానందమేనని ఇక్కడ కవి చమత్కరించారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ పద్యం ద్వారా విశ్వనాథ వారు "జ్ఞానమే వెలుగు, ఆ వెలుగే పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడం వల్ల మోక్షం లభిస్తుంది" అనే వేదాంత సత్యాన్ని బోధించారు.

ఛందస్సుపై ఆయనకున్న పట్టు, తెలుగు నుడికారాన్ని ఆయన వాడిన తీరు అద్వితీయం.ఆయన మధ్యాక్కరలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.


"వేయి పడగలు" విప్పిన ఆయన మేధస్సు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి చేర్చిందని విమర్శకుల అభిప్రాయం. 


2. డా. సి. నారాయణ రెడ్డి - 'విశ్వంభర'

రెండవ జ్ఞానపీఠ గ్రహీత సినారె గారు. ప్రాచీన ఛందస్సు నుండి ఆధునిక వచన కవిత్వం వరకు ఆయన ప్రయాణం ఆదర్శప్రాయం.


అ. విద్యార్థి దశ నుండి విశ్వంభర వరకు:

తెలంగాణ ప్రాంతంలో పుట్టి, పెరిగిన డా.సి.నారె.ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నా, తెలుగు సాహిత్యంపై మక్కువతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ చేయడం, ఆపై అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఆయన పరిశోధనా గ్రంథం "ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు" నేటికీ సాహిత్య విద్యార్థులకు ఒక ప్రామాణిక గ్రంథం వంటిది.

ఆ. విశ్వంభర - మానవ పరిణామ గాథ:

1988లో జ్ఞానపీఠం గెలుచుకున్న 'విశ్వంభర' ఒక సామాన్య కావ్యం కాదు. అది మానవుడు ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం వరకు సాగించిన ప్రయాణానికి ఒక ప్రతిరూపం. "నేను పుట్టక ముందే నెత్తి మీద నీలి తెర" అన్న పంక్తులు సృష్టి ఆరంభాన్ని సూచిస్తాయి.

"వేయి తోటలను నరికిన చేయి పూయిస్తుందా ఒక్క పువ్వును" అన్న మాటలు అధికారం కన్నా అనురాగం గొప్పదని, విధ్వంసం కన్నా సృజన మిన్న అని చాటిచెబుతాయి.

'విశ్వంభర' కావ్యం విశాల విశ్వాన్ని రంగస్థలంగా చేసుకుని, ఏ కాలానికో లేదా ఏ పేరుకో పరిమితం కాని 'సామాన్య మానవుడి' సమగ్ర కథను ఆవిష్కరిస్తుంది. ఆదిమ దశ నుండి ఆధునిక యుగం వరకు మనిషి సాగించిన సుదీర్ఘ ప్రస్థానమే ఇతివృత్తంగా, ప్రకృతి నేపథ్యంతో సాగే ఈ కావ్యం మానవుడిలోని కామక్రోధాదులను, ప్రకృతిని వశీకరించుకోవాలనే తపనను, ఆత్మశోధనను అద్భుతంగా చిత్రించింది. అలెగ్జాండర్ నుండి గాంధీ వరకు చరిత్రలో కనిపించే ఎందరో మహనీయుల రూపాలు మనిషి ధరించిన వివిధ భూమికలేనని, కళాత్మక-వైజ్ఞానిక-ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి సాధించిన త్రిముఖ సాధనే ఈ కావ్యంలోని ప్రకరణాలని సినారె వర్ణించారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెనుకంజ వేయని మనిషి జైత్రయాత్రను ప్రతిబింబించే ఈ మహోన్నత ఆలోచనా విధానమే 'విశ్వంభర' కావ్యానికి గట్టి పునాదిగా నిలిచింది.


ఇ. సాహితీ వైవిధ్యం:

సినారె కేవలం పద్యాలు, గేయాలకే పరిమితం కాలేదు. తెలుగు చలనచిత్ర గీతాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసి, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా రాశారు.ప్రపంచ స్థాయి కవి సమ్మేళనాల్లో తెలుగు కీర్తిని చాటారు."మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి" - ఈ పంక్తులు విశ్వంభరా తత్వాన్ని ఒక్క మాటలో చెప్తాయి. మనిషి అంటే కేవలం శరీరం కాదు, మనిషి అంటే ఒక విశ్వజనీనమైన చైతన్యం అని ఆయన భావన.

 'విశ్వంభర' ఒక తాత్విక కావ్యం. ఇందులో కథానాయకుడు మనిషి. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు సాగిన పరిణామ క్రమాన్ని, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని ఆయన దర్శించడమే ప్రధాన వస్తువు.

ఇతిహాస గాథల నుండి బయటపడి, మానవ వికాసాన్ని కావ్య వస్తువుగా మార్చి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత సినారెది.


3. డా. రావూరి భరద్వాజ - 'పాకుడురాళ్లు'

ఆంధ్రప్రదేశ్ కి చెందిన రావూరి భరద్వాజ కేవలం ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నప్పటికీ, జీవితమే పాఠశాలగా మలచుకుని తెలుగు సాహిత్య శిఖరాలను అధిరోహించిన అసాధారణ ప్రతిభాశాలి. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల భాషపై ఉన్న పట్టుతో వారి కష్టాలను, ఆవేదనలను అత్యంత సహజంగా చిత్రించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన రచించిన 'పాకుడురాళ్లు' నవల చలనచిత్ర పరిశ్రమలోని ‘మాయా జలతారు’ వెనుక ఉన్న చీకటి కోణాలను, మనుషుల పాకులాటను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ తెలుగు నవలా సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది.రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు. ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. చలం ప్రభావంతో ప్రారంభమైనా, సామాజిక స్పృహతో 'జీవన సమరం' వంటి రచనల ద్వారా సామాన్యుడి పోరాటాన్ని అక్షరబద్ధం చేసిన భరద్వాజ, వినూత్న శైలి, సరళమైన పాత్ర చిత్రణతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

మూడవ జ్ఞానపీఠ పురస్కారం రావూరి భరద్వాజ గారి 'పాకుడురాళ్లు' నవలకు దక్కింది. ఇది తెలుగు నవలా సాహిత్యంలో ఒక మైలురాయి.ఈ నవల సినిమా అనే రంగుల ప్రపంచం వెనుక దాగి ఉన్న క్రూరమైన వాస్తవాలను, రాజకీయాలను, మనుషుల అంతరంగ మథనాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది. మంగళగిరి పల్లెటూరులోని మంగమ్మ అనే సామాన్య యువతి, నాటక రంగం నుండి మద్రాసు సినీ మాయాలోకానికి చేరుకుని, తన తెలివితేటలతో 'మంజరి'గా మారి అగ్ర కథానాయికగా ఎదిగిన ప్రయాణమే ఈ నవల ప్రధాన ఇతివృత్తం. అవకాశాల కోసం సాగే పోరాటంలో పేరు మార్చుకుని, అగ్రహీరోల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, అపారమైన ఐశ్వర్యాన్ని, కీర్తిని గడించిన మంజరి పాత్ర ద్వారా రచయిత రావూరి భరద్వాజ గారు సినీ పరిశ్రమలోని ఎత్తుపల్లాలు, కృతజ్ఞత, ఒంటరితనం మానవ నైజాలను చిత్రించారు. చివరికి అమెరికా పర్యటనలో మార్లిన్ మన్రోను కలిసిన సందర్భంలో, గ్లామర్ ప్రపంచంలో ఏ దేశ నాయికల జీవితాలైనా ఒకేలా ఉంటాయనే చేదు నిజాన్ని గ్రహించడంతో సాగే ఈ కథ, కేవలం ఒక నటి జీవితమే కాకుండా ఆనాటి సినీ వ్యవస్థ గమనానికి అద్దం పడుతుంది.

చలనచిత్ర పరిశ్రమ వెనుక ఉన్న చీకటి కోణాలను, మాయా ప్రపంచంలో సామాన్యుల జీవితాల సంఘర్షణను ఆయన కళ్లకు కట్టినట్లు చూపారు. 'మంజరి' పాత్ర ద్వారా మానవ నైజాలను విశ్లేషించారు.


అలంకారిక భాష కంటే జన వ్యవహార భాషలోని శక్తిని చాటిచెప్పిన రచన ఇది. సామాజిక వాస్తవికతకు (Social Realism) పట్టం కట్టిన సందర్భం ఇది.

సమాలోచనం (Critical Analysis):

   ఈ ముగ్గురు రచయితలను గమనిస్తే మనకు మూడు భిన్న ధోరణులు కనిపిస్తాయి.

విశ్వనాథ: సంప్రదాయ విలువల పరిరక్షణ.

సినారె: ఆధునిక మానవతావాదం, తాత్వికత.

రావూరి: సామాజిక వాస్తవికత, సామాన్యుడి వేదన.


ఈ వైవిధ్యమే తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. మారుతున్న కాలంతో పాటు తెలుగు కవిత్వం, నవల ఎలా రూపాంతరం చెందుతూ తమ ఉనికిని చాటుకున్నాయో ఈ పురస్కారాలే సాక్ష్యం.

ఇదంతా ఒక పద్యంలో వర్ణించుకుంటే ఎలా ఉంటుందో ప్రయత్నిస్తాను.


కం.

ఒకడును ఛందస్సున మరి

యొకడును దత్త్వమున నిలను నొకడును బ్రతుకున్

ప్రకటముగ జూపి ముగ్గురు

వికసిత మొనరించి రాంధ్ర విభవపు జ్యోతుల్!

(ఒక మహాకవి (విశ్వనాథ) ఛందస్సు ద్వారా, మరొకరు (సినారె) తాత్వికత ద్వారా, ఇంకొకరు (రావూరి) బతుకు చిత్రాల (వాస్తవికత) ద్వారా తెలుగు సాహిత్య వైభవాన్ని చాటి చెప్పారు. ఈ ముగ్గురూ కలిసి ఆంధ్ర సాహిత్య ప్రకాశాన్ని దివ్యజ్యోతుల్లా వికసింపజేశారు.)


కం.

ముమ్మారు లందె దెలుగును

నమ్మగ యశమును నిడిరిల నలముగ కవులున్

సమ్మతి జ్ఞానపు పీఠము

నిమ్మహి దెలుగున నిలిచెను నిరుపమ గరిమన్!


(మన తెలుగు భాషా సరస్వతి మూడుసార్లు అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకుంది. ఈ భూమిపై నిరుపమానమైన కీర్తిని మన మహాకవులు అత్యంత సమర్థవంతంగా (నలముగ), నమ్మకమైన రీతిలో నిలిపారు. అందరి అంగీకారంతో (సమ్మతి) గౌరవించబడే ఆ జ్ఞానపీఠము, ఈ ప్రపంచంలో సాటిలేని గొప్పతనంతో తెలుగు భాషలోనే లీనమై స్థిరంగా నిలిచిపోయింది.)

నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకోవాలి. మన జ్ఞానపీఠ గ్రహీతల రచనలు మరిన్ని ప్రపంచ భాషల్లోకి అనువాదం కావాలి. భవిష్యత్తు తరాలు మన మూలాలను మరువకుండా, ఆధునిక భావాలను స్వీకరించే దిశగా మన సాహిత్యం సాగాలి.

కీలకోపన్యాసం - ముగింపు మాటలు

"ముగింపుగా మన తెలుగు సాహిత్య గగనాన ధ్రువతారలై వెలుగుతున్న ముగ్గురు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...

విశ్వనాథ సత్యనారాయణ గారు మన సంప్రదాయానికి శిఖర సమానమైన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. వారు కేవలం కథను రాయలేదు, భారతీయ జీవన వేదాంతాన్ని 'రామాయణ కల్పవృక్షం' ద్వారా అక్షరబద్ధం చేసి, మన మూలాలను మనకు గుర్తుచేశారు. ఆ సృజనలో ఒక గాఢమైన 'జీవుని వేదన' ఉంది.

ఆ తర్వాత డా. సి. నారాయణరెడ్డి గారు 'విశ్వంభర' ద్వారా కవిత్వాన్ని నేల మీద నిలబెట్టి, విశ్వవ్యాప్తం చేశారు. కాలంతో నిమిత్తం లేని మనిషి జైత్రయాత్రను చిత్రించి, ఆధునిక మానవతా వాదానికి అక్షర రూపమిచ్చారు. వారి శైలిలో అద్భుతమైన వైవిధ్యం, వేగం ఉన్నాయి.

ఇక రావూరి భరద్వాజ గారు 'పాకుడురాళ్ళు' నవలతో సామాన్యుడి భాషకు, సామాన్యుడి బతుకు చిత్రణకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. ఆడంబరాల వెనుక ఉన్న వాస్తవాలను ధైర్యంగా ఆవిష్కరించి, 'జీవన సమరాన్ని' సాహితీ గౌరవంగా మార్చారు.

ఈ ముగ్గురు మహానుభావుల సాహిత్యం కేవలం పురస్కారాల కోసం రాసింది కాదు; అది తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు భాషా వైభవం. సంప్రదాయం (విశ్వనాథ), మానవత్వం (సినారె), సామాజిక వాస్తవికత (రావూరి భరద్వాజ) - ఈ మూడు ధారలు కలిసిన చోటే తెలుగు సాహిత్యం పరిపూర్ణమవుతుంది. ఈ అంతర్జాల సదస్సు ద్వారా వారి సాహిత్యంలోని లోతులను మరింతగా విశ్లేషించి, మన తర్వాతి తరాలకు ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన నిర్వాహక వర్గానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు: