కాశీ ప్రసాదం.. పద్యం
కాశిని జూచి వచ్చియును కమ్మని దీవెన తోడ నాకునున్
క్లేశము బాపి పంపెనుగ కృష్ణుడు మెచ్చెడి రీతి బిడ్డయై
భాసము బెట్టి నెన్నొసట భక్తిగ నిచ్చెను గంగ తీర్థమున్
వాసిగ కూతురై యిపుడు వత్సలతన్ గనిపించె నన్నెదన్!
(కాశీ క్షేత్రాన్ని దర్శించి వచ్చిన నా ప్రియ శిష్యురాలు, ఆ విశ్వనాథుని కమ్మని దీవెనలతో పాటు నాకు ప్రసాదాన్ని అందించింది. నా మనసులోని ఆందోళనలను (క్లేశములను) దూరం చేస్తూ, ఆ కృష్ణ పరమాత్మ కూడా మెచ్చే రీతిలో ఒక బిడ్డగా నా దగ్గరకు వచ్చింది. నా నుదుట భక్తితో బొట్టు పెట్టి, గంగా తీర్థాన్ని ఇస్తున్న ఆ సమయంలో... నాకు కూతురు లేదన్న వెలితిని పూర్తి చేస్తూ, ఒక కన్నకూతురి వలె ఎంతో వాత్సల్యంతో ఆమె నా హృదయానికి కనిపించింది.)
పువ్వు పూచి చెట్టు పులకింప జేసిన
రీతి బిడ్డ యొకతె ప్రీతి తోడ
కాశి విభుని నొసగె కరుణ తో బొట్టును
కూతు రైన దమ్మ గురువు కపుడు!
(ఒక పువ్వు పూచి చెట్టుకు ఎలాగైతే పులకింతను ఇస్తుందో, అలాగే ఆ బిడ్డ ఆత్మీయతతో కాశీ విశ్వనాథుని ప్రసాదాన్ని ఇచ్చి, బొట్టు పెట్టింది. ఆ క్షణంలో ఆ విద్యార్థిని తన గురువుకు నిజంగా కూతురై నిలిచింది.)
కాశి విశ్వేశు దీవెన గలిగె ననగ
బొట్టు పెట్టియు బిడ్డగా మురిపె మొలికె
పుత్రికే లేని వెలితిని పూర్తి జేసె
గురుని యెద నిండ ననురాగ కుసుమ మయ్యె!
(కాశీ విశ్వేశ్వరుని దీవెన లభించిందా అన్నట్లుగా, ఆ బిడ్డ బొట్టు పెడుతుంటే కూతురు లేని వెలితి తీరిపోయింది. ఆమె చూపిన అనురాగం గురువు హృదయంలో ఒక వికసించిన పువ్వులా నిలిచిపోయింది.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి