"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

22 మార్చి, 2026

శ్రామిక జీవన సౌందర్యం, మానవ జీవన తాత్త్వికతల సమ్మేళనం ‘‘అలుగ్గుడ్డ’’

 

నినాదం దినపత్రిక, 21.3.2026.సౌజన్యంతో


శ్రామిక జీవన సౌందర్యం, మానవ జీవన తాత్త్వికతల సమ్మేళనం ‘‘అలుగ్గుడ్డ’’


‘‘అలుగ్గడ్డ’’ వచన కవితను రచించిన వారు ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU), వారణాసిలోని తెలుగు శాఖలో సుదీర్ఘకాలం ఆచార్యులుగా, శాఖాధిపతిగా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు విజయవాడలోని ఒక స్వయం ప్రతిపత్తి కళాశాలలో పనిచేశారు. శ్రీరామ చంద్రమూర్తిగారు కేవలం విద్యావేత్తగానే కాకుండా, కవిగా, విమర్శకుడిగా వివిధ సామాజికాంశాలపై స్పందిస్తూ తనదైన ముద్ర వేశారు. బెనారస్ వంటి చారిత్రక నగరంలో ఉంటూనే తెలుగు తనాన్ని, శ్రమజీవుల వేదనను అప్పుడప్పుడు కవిత్వం కూడా రాస్తుంటారు. రాసిన కవితలు సంఖ్యాపరంగా తక్కువే. కానీ, అవి ఎంతో విలువైనవి కావడం విశేషం. అటువంటి వాటిలో ఆయన రాసిన 'అలుగ్గుడ్డ' కవిత సామాన్యమైన ఒక పాత గుడ్డ ముక్క ఆత్మకథలా కనిపిస్తున్నప్పటికీ, అందులో లోతైన సామాజిక, మానవీయ ప్రతీకాత్మకతను గమనించాలి.‘’అలుగ్గడ్డే కదా! అని తేలిగ్గా చూడకు నన్ను!ఇల్లు శుభ్రపరుస్తున్నాననే విషయాన్ని మర్చిపోకు’’ అని ప్రారంభమయ్యే ఈ కవిత లో కొన్ని పాదాలు శ్రామికుడినీ, దళితుల్నీ వర్ణిస్తున్నట్లు అనిపిస్తుంది.‘’కంపులీనుతున్న ఫినాయిలు నీటిలోనో/ కంటికింపైన సోపాయిలు నీరులోనో /కొండొకచో రకరకాల యాసిడ్లలోనో’’ మునిగి తేలుతున్న అలుగ్గడ్డలాగే ఈ దేశంలో నేటికీ యంత్రాలకంటే చౌకగా పనికి దొరుకుతున్న వాళ్ళు సఫాయి కార్మికులు. ఈ వర్ణన వారిని గుర్తు చేస్తున్నట్లనిపిస్తుంది.

నిస్వార్థ సేవకు ప్రతీక:

అలుగుడ్డ (ఇంటి నేలను తుడిచే గుడ్డ) తన ఉనికిని కోల్పోతూ ఇతరుల మురికిని కడుగుతుంది. ఇది సమాజంలోని నిస్వార్థ సేవకులకు, కార్మికులకు ప్రతీక."మలినమైన ఇంటి గదుల్ని తళుకులీనేలా చేయడంలో నా జీవిత చరమాంకంలో నలుపురంగు సంతరించుకుంటోంది" అని మన జీవితాల్లో వెలుగు నింపడానికి తమ జీవితాలను ధారబోసే త్యాగధనులను స్ఫురింపజేస్తుంది. ఇది సమాజ శ్రేయస్సు కోసం తమను తాము కరిగించుకునే నిస్వార్థ శ్రమజీవులకు సజీవ ప్రతీక. కవితా ప్రారంభంలోనే "ఇల్లు శుభ్రపరుస్తున్నాననే విషయాన్ని మర్చిపోకు / అవసాన దశలో కూడ సేవలందిస్తున్నానని సంతోషించు" అంటూ అలుపెరగని సేవకుడి ఆర్తిని వినిపిస్తాయి. తన సహజమైన 'నిర్మల రంగు'ను కోల్పోయి, నలుపును పులుముకున్నా సరే, ఇతరుల గదులు 'తళుకులీనడం' ముఖ్యం అనుకునే ఆ భావన సమాజంలోని అట్టడుగు వర్గాల కార్మికుల త్యాగాన్ని సూచిస్తుంది. సమాజం తనను పెంటకుప్పలో పారవేసినా, తాను మాత్రం "నరజాతికి హితైషిని, లోకబంధుని" అని చాటుకోవడం ద్వారా, నిస్వార్థ సేవకులకు ఉండే విశాల హృదయాన్ని, వారి గొప్పతనాన్ని కవి ఈ కవితలో అద్భుతంగా ఆవిష్కరించారు.

వినియోగ సంస్కృతి:

వస్త్రం పత్తిగా ఉన్నప్పుడు, కొత్త బట్టగా ఉన్నప్పుడు దానికి ఇచ్చే గౌరవం అది పాతబడగానే మృగ్యమవుతుంది. ఇది మనుషుల మధ్య ఉండే అవసరార్థపు సంబంధాలకు అద్దం పడుతుంది. శక్తి ఉన్నంతవరకు వాడుకుని, వయసు పైబడిన తర్వాత లేదా అవసరం తీరిన తర్వాత మనుషులను 'అలుగ్గుడ్డ'లా పారేసే ఆధునిక ధోరణిని కవి చర్చకు పెట్టారు. 'వినియోగ సంస్కృతి' (Use and Throw Culture) మనిషి నైజాన్ని, సమాజంలో పెరుగుతున్న అవసరార్థపు సంబంధాలను ఎండగడుతుంది. "ఏపుగా పెరిగి, గుబురుగా విచ్చుకున్నాను... దర్జీల నేర్పులకు సుందరాకృతులొందాను" అంటూ తన యవ్వన దశలో (కొత్త వస్త్రంగా ఉన్నప్పుడు) అందరినీ మురిపించి, వారి "మానాభిమానాలు కాపాడి తరించాను" అని అలుగుడ్డ చెప్పుకుంటుంది. అయితే, అదే వస్త్రం "కాలంతీరి రోజులు మారి ముదుసలినై" పోగానే, సమాజం చూపే వివక్షను కవి అత్యంత హృద్యంగా చిత్రించారు. "అందం మందగించేసరికి అలుగ్గుడ్డనైతీ!" అన్న వాక్యం, కేవలం వస్తువులకే కాక, వయసు మళ్ళిన మనుషులకు, శక్తి ఉడిగిపోయిన శ్రామికులకు కూడా వర్తిస్తుంది. అవసరం ఉన్నంత కాలం నెత్తిన పెట్టుకుని, ఆకర్షణ తగ్గగానే చిన్నచూపు చూసే ఆధునిక ధోరణిని ఇక్కడ 'వస్త్రం' అనే ప్రతీక ద్వారా కవి వర్ణించారు కవి.ముఖ్యంగా, సేవ చేసిన వస్తువును లేదా వ్యక్తిని చివరకు ఏ విధంగా విస్మరిస్తారో "చీకి, చీలికలు-పేలికలైన నన్ను విడిచీ / చీపురుతో చిమ్మి పెంటకుప్పల పారవేతురో!" అన్న పంక్తులు ప్రతిఫలిస్తాయి. "రాతి బండలపై పొర్లాడుతున్నానన్న వేదన గుర్తించరేం?" అని అలుగ్గుడ్డ ఆవేదన చెందడం, యజమాని సౌకర్యం కోసం తన ఆకారాన్ని, రంగును (అస్తిత్వాన్ని) కోల్పోయిన సేవకుడి ఆర్తనాదంగా కనిపిస్తుంది. అంతేకాదు, నేటి సమాజంలో వృద్ధాప్యాన్ని ఒక భారంగా భావించి పక్కన పెట్టే 'వినియోగవాద' ధోరణికి నిలువుటద్దం. మనిషి విలువను అతని 'ఉపయోగం' బట్టి కాకుండా, అతని 'అస్తిత్వం' మరియు 'త్యాగం' బట్టి గుర్తించాలనే గొప్ప సందేశాన్ని కవి ఈ ప్రతీక ద్వారా అందించారు.

కాలక్రమ పరిణామం - జీవిత చక్రం:

అలుగ్గడ్డ కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పనిమనిషి చేసే సేవను ప్రతిఫలింపజేస్తూనే తాత్విక సత్యాలను చర్చకుపెట్టేలా…‘’ఇల్లంతా తోమి, పామడంతో పంకిలం నాకు నేస్తం/ కురూపిని కాగానే దండేనికి వ్రేలాడబడతాను./ఇంటిలోని మకిలిని తరుమగలమేగాని/ మనసుకంటిన మలినాన్ని తుడువగలమా/ తరతరాలకల్మషాన్ని తొలగుమంటారేగాని/ నిర్మలమైన జీవితాల్ని స్వాగతించరెందుకు?/ఎంత దయలేనివారు మీ జాతివారు?’’ /‘కాళీదాసుకమనీయంగా తెలిపినట్టు /శైశవాది దశలన్నియు నాకు నప్పుతాయి’ అని వర్ణించారు కవి. కాళిదాసు రఘువంశ రాజుల జీవితంలోని నాలుగు దశలను (ఆశ్రమ ధర్మాలను) ఎంత క్రమశిక్షణతో గడిపేవారో రఘువంశం - 1.8 లో ఇలా వర్ణించారు.

"శైశవేऽభ్యస్తవిద్యానాం /యౌవనే విషయైషిణామ్ |

వార్ధకే మునివృత్తీనాం /యోగేనాంతే తనుత్యజామ్ ||"

బాల్యంలో (శైశవ దశలో) కేవలం విద్యను అభ్యసించడంపైనే దృష్టి పెట్టేవారు. యౌవనంలో ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకుంటూ, రాజ్యపాలన, గృహస్థాశ్రమం గడిపేవారు. ముసలితనం (వార్ధక్యం) రాగానే రాజ్యభారాన్ని సంతానానికి అప్పగించి, ముని వృత్తిని స్వీకరించి తపస్సు చేసేవారు.చివరకు యోగ సాధన ద్వారా దేహాన్ని త్యజించి మోక్షాన్ని పొందేవారు.అలుగ్గడ్డ' కవితలో కవి ఈ పురాణ ప్రతీకను చాలా చమత్కారంగా, లోతుగా వాడారు. రఘువంశ రాజుల వలెనే ఈ 'గుడ్డ' కూడా. శైశవంలో పత్తిగా విచ్చుకుంది. యౌవనంలో అందమైన వస్త్రంగా మారి అందరినీ మురిపించింది. వార్ధక్యంలో అలుగుడ్డగా మారి (ముని వృత్తిలాగా) నిస్వార్థంగా ఇల్లు శుభ్రం చేసే సేవలో నిమగ్నమైంది. చివరగా పెంటకుప్పలో కలిసిపోతూ (తను త్యజించడం) మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. అంటే, ఒక గొప్ప రాజవంశీయుల జీవిత చక్రం ఎంత పద్ధతిగా సాగుతుందో, ఒక సామాన్యమైన అలుగుడ్డ జీవితం కూడా అలాగే అన్ని దశలను ("శైశవాది దశలన్నియు") సార్థకం చేసుకుంటుందని కవి ఇక్కడ కాళిదాసును ఉదాహరిస్తూ చెప్పారు.

సాధారణంగా సాహిత్యం పట్ల ఉన్న ప్రగాఢమైన అవగాహన, కవి వ్యక్తిగత అనుభవాలు కవితా నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాయి. కాళిదాసు 'రఘువంశం'లోని ఉన్నతమైన జీవన విలువలని ఒక సామాన్యమైన అలుగ్గుడ్డ జీవితానికి అన్వయించడం వెనుక కవికి గల సాహిత్య పరిపుష్టి కనిపిస్తుంది. రఘువంశ రాజులు తమ జీవిత దశలను (బాల్యం, యౌవనం, వార్థక్యం) ఎంత పద్ధతిగా, త్యాగపూరితంగా గడిపారో, ఈ అలుగ్గడ్డ కూడా తన ఉనికిని అలాగే సార్థకం చేసుకుంటుందని చెప్పడం ద్వారా, కవి సామాన్య వస్తువులోనూ 'ఉదాత్తత'ను (Sublimity) దర్శించగలిగే దృక్పథం కనిపిస్తుంది. ఇది కేవలం పాండిత్యం మాత్రమే కాదు, సమాజంలోని శ్రమజీవుల పట్ల కవికి ఉన్న అనుభూతి చింతనగా కూడా చూడాలి. కాశీ వంటి పుణ్యక్షేత్రంలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉంటూ నిరంతరం సంస్కృత, తెలుగు సాహిత్యాల మధ్య తులనాత్మక ప్రయాణం చేసిన కవికి, లోకంలోని 'అనిత్యత్వం', 'సేవ' అనే అంశాలు నిత్య అనుభవాలు. అందుకే, పాత గుడ్డ ముక్క పడే వేదనను కేవలం వస్తుగతంగా చూడకుండా, దానిని ఒక ముని వృత్తితోనో, ఒక త్యాగధనుడి జీవితంతోనో పోల్చగలిగారు. తనకు తెలిసిన గొప్ప సాహిత్యం నుండి స్ఫూర్తి పొందుతూనే, తన కళ్ళముందు కనిపిస్తున్న నిరాదరణకు గురైన వృద్ధాప్యాన్ని, అణగారిన వర్గాల నిస్వార్థ శ్రమను కవి ఈ కవితలో ఏకీకృతం చేశారు. 

బాహ్య శుద్ధి - అంతర శుద్ధి:

"ఇంటిలోని మకిలిని తరుమగలమేగాని మనసుకంటిన మలినాన్ని తుడువగలమా?" అన్న ప్రశ్న కవితలో కీలకమైన మలుపు.ఇక్కడ 'అలుగ్గుడ్డ' కేవలం నేలను తుడిచే సాధనం మాత్రమే కాదు, అది విజ్ఞతకు ప్రతీక. బయట మెరుపుల కోసం ఆరాటపడే మనిషి, లోపల పేరుకుపోయిన స్వార్థం, అహంకారం అనే కల్మషాన్ని వదిలించుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు కవి."ఇంటిలోని మకిలిని తరుమగలమేగాని / మనసుకంటిన మలినాన్ని తుడువగలమా?" అని కవి వేసిన ప్రశ్న ఈ కవితకే ప్రాణవత్తరమైనది. మరోవైపు, అలుగ్గుడ్డ తనపై మురికిని వేసుకుంటూ ఇతరులకు శుభ్రతను ప్రసాదిస్తుంది. "మలినమైన ఇంటి గదుల్ని... నా జీవిత చరమాంకంలో నలుపురంగు సంతరించుకుంటోంది" అనడం ద్వారా సేవకుడు తన నైతికతను కోల్పోకుండా లోక కళ్యాణం కోసం చేసే త్యాగాన్ని సూచిస్తున్నారు కవి. మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవడంలో చూపే శ్రద్ధను, తన అంతరాత్మను శుద్ధి చేసుకోవడంలో చూపడం లేదన్న పచ్చి నిజాన్ని కవి ఇక్కడ అలుగుడ్డ నోటి ద్వారా పలికించారు. ఇది బాహ్య ఆడంబరాల కంటే అంతఃశుద్ధి మిన్న అనే ఉన్నతమైన తాత్విక చింతనను ప్రతిఫలిస్తుంది.

పర్యావరణ స్పృహ:

ప్లాస్టిక్ యుగంలో కృత్రిమత్వానికి భిన్నంగా, పత్తి (సహజత్వం) తన చివరి దశలో కూడా భూమికి హాని చేయదని చెప్పడం ద్వారా ప్రకృతి సహజ సిద్ధాంతాన్ని ప్రతీకగా వాడారు. అలుగ్గడ్డ తన అస్తిత్వాన్ని ప్రకృతిలో కలిపే విధానం గొప్ప పర్యావరణ స్పృహను చాటిచెబుతుంది. "కాలుష్య హేతువుని కాను- / నరజాతికి హితైషి నేను" అని చెప్పుకోవడం ద్వారా, కృత్రిమమైన ప్లాస్టిక్ వస్తువుల కంటే ప్రకృతి సిద్ధమైన పత్తి వస్త్రం ఎంత మేలైనదో కవి వివరించారు. "మట్టిలో మట్టినౌతాను" అని ప్రకృతి నుండి వచ్చిన వస్తువు తిరిగి ప్రకృతిలోనే కలిసిపోవాలనే సనాతన ధర్మాన్ని గుర్తుచేస్తుంది. ఆధునిక నాగరికతలో మనం వాడుతున్న అనేక వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తుంటే, అలుగుడ్డ మాత్రం తన మరణంలో కూడా భూమికి భారమవ్వనని సగర్వంగా ప్రకటిస్తుంది."నాగరికత ప్రతీక నేను" అని అనడంలో, మనిషి సంస్కృతికి మూలాధారమైన వస్త్రం, తన అంతిమ దశలో కూడా పర్యావరణానికి హితైషిగా ఉండటమే నిజమైన నాగరికత అని కవి భావన.ఈ కవితలో 'అలుగ్గుడ్డ' అనేది అణగారిన వర్గాల గొంతుకగా, నిరాదరణకు గురైన వృద్ధాప్యంగా, మనుషుల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగట్టే ఒక సామాజిక దర్పణంగా కనిపిస్తుంది. "కాలిపోతూ వెలుగునిచ్చే కొవ్వొత్తిని నేను" అనడంలోనే ఆ ప్రతీకాత్మకత పతాక స్థాయికి చేరింది.వీటన్నింటితో పాటు ఈ కవితలో తెలుగు వారి సామాజిక జీవన సరళి, సాంస్కృతిక విలువల ప్రతిఫలనం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, తెలుగు వారి గృహ జీవనంలో 'శుభ్రత'కు ఇచ్చే ప్రాముఖ్యతను, ఇంటిని దేవాలయంగా భావించే సంస్కృతిని ఈ కవిత గుర్తుచేస్తుంది. "ఇల్లు శుభ్రపరుస్తున్నాననే విషయాన్ని మర్చిపోకు" అనడంలో, బాహ్య శుద్ధి వెనుక ఉండే అంకితభావాన్ని కవి చాటిచెప్పారు. 

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

తెలుగుశాఖ, పూర్వ అధ్యక్షులు, 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.



కామెంట్‌లు లేవు: