"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

19 మార్చి, 2026

​యుగాది శుభాకాంక్షల పద్య కుసుమాలు

 ​యుగాది శుభాకాంక్షల పద్య కుసుమాలు

​తే.గీ.

పవన మౌనట్టి పరవిద్య బ్రహ్మ విద్య

భవహ రునిశివ శక్తుల పథము నిలుచు

శివక రుణగెలు పొసగును సిరుల తోడ

భువిని నిలుపుము నీపరా భవము దార్ల!

(భావం: ప్రాణవాయువు వంటి మౌనమే పరవిద్య, అదే బ్రహ్మవిద్య. అది సంసార హరుడైన శివుని, శక్తి స్వరూపిణి అయిన పార్వతి మార్గంలో నిలుపుతుంది. ఆ శివుని కరుణ మనకు సిరిసంపదలతో పాటు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఓ దార్లా! ఈ భువిపై నీవు ఆ 'పరా' (శక్తి), 'భవ' (శివుల) తత్త్వాన్ని నిలుపుము.)

కం.

ధరను పరా భవ కృపలన్

సిరమున దీవనలు నిలిపి సిరులను నిడుగా

నిరతము పరా భవ! మనియు

పరమాత్ముని వేడుకొందు భక్తిని నెపుడున్!

(భావం: ఈ భూమిపై పరా (పార్వతీదేవి), భవ (పరమశివుడు) ల అనుగ్రహంతో మీ శిరస్సుపై దైవ దీవనలు సదా నిలిచి ఉండి, మీకు సకల సంపదలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంతేకాక, ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరు ఎల్లప్పుడూ పరా (అత్యున్నత స్థితిలో), భవ! (ఉండుగాక!) అని ఆ పరమాత్మను మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.)

కం.

పరహిత మెన్నడు విడువక

ధరణిని సుఖములను నలర తనియగ ప్రజలన్

కరమున బ్రోచుచు నెపుడును

సిరమున దీవనలు నిడుచు శివుడును బ్రోచున్!

(భావం: పరోపకార భావాన్ని ఎన్నడూ విడువకుండా, ఈ భూమిపై ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లేలా, ఆ పరమశివుడు తన హస్తంతో మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ దీవించుగాక!)

​కం.

తరగని సంపద లొసగుచు

కరవును బాపుచును జయము గలుగును ధరపై

పరమాత్ముని కృప తోడను

విరసిలు లోకమున శాంతి వేడుక తోడన్!

(భావం: కరువు కాటకాలు తొలగిపోయి, తరిగిపోని సంపదలతో ఈ భూమిపై అందరికీ విజయం కలగాలని, పరమాత్మ కృపతో లోకమంతా శాంతి సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్ష.)

​కం

స్థిరముగ లోకము లన్నియు

వరలుచు సౌఖ్యమున నలర వర్థిలు నెపుడున్

కరముల మోడ్చుచు వేడెద

పరమేశుని భక్తి తోడ ప్రార్థన జేతున్!

(భావం: "లోకాః సమస్తాః సుఖినోభవంతు" అన్నట్లుగా, సమస్త లోకాలు స్థిరమైన సౌఖ్యంతో వర్ధిల్లాలని, రెండు చేతులూ జోడించి ఆ పరమేశ్వరుడిని భక్తితో ప్రార్థిస్తున్నాను.)

​కం.

ధరను పరా భవ కృపలన్

సిరమున దీవనలు నిలిపి సిరులను నిడుగా

నిరతము పరా భవ! మనియు

పరమాత్ముని వేడుకొనెను భక్తిని 'దార్లా' !

(భావం: ఈ ధరపై పార్వతీ పరమేశ్వరుల కృపతో, దీవనలు శిరస్సున నిలిచి సంపదలు కలగాలని, నిరంతరం ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటూ 'దార్ల' ఆ పరమాత్మను భక్తితో వేడుకొన్నాడు.)

​తే.గీ.

చివురు పుట్టెడి మావిడి చెట్టు వోలె

పాత కష్టాల నన్నిటి పారద్రోలి

నూతనమ్మగు కాంతులు నోర నూర

హాయి నిడుగాక మనకిక యీ యుగాది!

(భావం: చిగురించే మామిడి చెట్టులాగా, పాత కష్టాలన్నింటినీ పారద్రోలి, కొత్త వెలుగులు మనసు నిండా నిండుతూ ఈ యుగాది మనకు ఎంతో హాయిని ఇవ్వాలి.)

​తే.గీ.

తీపి చేదులు కలిసిన వేప తీపి

కష్ట సుఖములు జగతిలో కలిసి యుండు

నెండ వానలు సరియైన నిలను పంట

ధైర్యమున్నచొ దొరకును దైవకృపయు

(భావం: వేప ప్రసాదంలో తీపి, చేదు కలిసి ఉన్నట్లే, ఈ ప్రపంచంలో కష్టసుఖాలు కలిసే ఉంటాయి. ఎండ, వానలు సరిగ్గా ఉంటేనే పంట పండుతుంది; అలాగే మనిషిలో ధైర్యం ఉంటేనే దైవకృప లభిస్తుంది.)

​తే.గీ.

వాగు రీతిగ మలినము వాడి పోవ

స్వచ్ఛమైనట్టి మనసుతో బ్రతుక వలయు

సకల జనులకు నిచ్చుత సౌఖ్యములను

ప్రభవు డిచ్చును గావుత పావనముగ!

(భావం: ప్రవహించే వాగులోని మలినం కొట్టుకుపోయినట్లు, మనలోని కల్మషం తొలగిపోవాలి. స్వచ్ఛమైన మనసుతో బ్రతకాలి. ఆ భగవంతుడు జనులందరికీ పావనమైన సౌఖ్యాలను ప్రసాదించాలి.)

​తే.గీ.

కోయిలమ్మయు పాడెడు కొమ్మ పైన

తీయ తేనియ పలుకులు తెలుపు నట్లు

మమత నిండిన పలుకులు మానవాలి

పలుక వలయును సతమును పావనముగ!

(భావం: కొమ్మపై కోయిల పాడే పాట తేనెలా ఎంత తీయగా ఉంటుందో, మానవులందరూ కూడా ఒకరితో ఒకరు మమతతో నిండిన మాటలను అంతే పవిత్రంగా, తీయగా పలకాలి.)

​తే.గీ.

తొలగి చీకటి రవియును తోచు నట్లు

మలిన మెల్లను వీడగా మనసు లోన

జ్ఞాన దీపము వెలుగుచు జగతి పైన

శాంతి నిడుగాక నెప్పుడు శోభ నొసగి!

(భావం: చీకటి తొలిగి సూర్యుడు ఉదయించినట్లుగా, మనసులోని మలినం తొలగిపోవాలి. జ్ఞానదీపం వెలుగుతూ ఈ లోకానికి శాంతిని, శోభను ప్రసాదించాలి.)

​తే.గీ.

తనదు ఫలముల నితరుల కనగ నిచ్చు

మేలు కోరెడు వృక్షము మిగుల గొప్ప

పరుల సేవను జేయుచు భార్య తోడ

హైయి నుండుము ధరణిలో అనుదినమ్ము!

(భావం: తన పండ్లను ఇతరులకు పంచిపెట్టి మేలు చేసే వృక్షం ఎంతో గొప్పది. అదే విధంగా పరోపకారం చేస్తూ, ధర్మపత్నితో కలిసి ఈ భూమిపై ప్రతిరోజూ హాయిగా, ఆనందంగా ఉండాలి.)

కామెంట్‌లు లేవు: