ఆకాశవాణి వారి జాతీయ కవి సమ్మేళనంలో
కవిత వినిపించిన మా మిత్రుడు
డా.తిరునగరి శ్రీనివాస్ పై
కొన్ని ప్రశంస పద్యాలు
తే.గీ.
వాణి వీణపై పలికిన వాక్కు వోలె
తనదు నాకాశవాణిలో తనివి తీర
తేట తెలుగున పాడెను తిరునగరియు
దిశల వెలిగెను కవితా దీప్తి నాడు!
ఆ.వె.
పాలకడలి నుండి ప్రభవించు చంద్రుడై
కవిత లహరి దెచ్చె ఘనత మెరయ
తెలుగు వెలుగు దిశల వెలయంగ జేసెరా
శ్రీనివాస కవియు శ్రేష్ఠుడగుచు!
తే.గీ.
కొండ వాగున పారెడు కొనపు వోలె
నిర్మలముగను సాగెడి నిత్య ధార
విన్న వారికి విందుగా విమల రీతి
శ్రీనివాసుడు పంచెను స్థిరపు భణితి!
(కొనపు (కొనపు + ఓలె): 'కొనపు' అంటే అందమైన లేదా తీరైన అని అర్థం. కొండవాగు తీరుగా, వేగంగా పారుతున్నట్లుగా ఆయన కవితా ధార సాగిందని భావం.)
తే.గీ.
తనదు నాకాశవాణిలో తనివి తీర
పరుల పేర్లను పలికిన పలుకు తోడ
వింత మురిపెము నిండగ వినిన నాడు
తనదు పేరే తానె యెంత ధన్య జీవి!
ఆ.వె.
తెలుగు తల్లి నొసట తీర్చిన తిలకమై
జాతి వేదిక పైన జయము నొందె
విజ్ఞుడైన యట్టి విమర్శ కాగ్రేసరుడు
శ్రీనివాస కవికి సిరులు కలుగు!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
22.1.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి