నేనెవర్ని?
అయినా పరిగెట్టాలని లేదు
వాళ్ళంతా వాహ్యాళికెదురు చూస్తున్నారని తెలుసు
అయినా నడవడానికి అడుగులిష్టపడ్డంలేదు
ఇంటికొచ్చిన వాళ్ళంతా బయలుదేరారనీ తెలుసు
అయినా అడుగులు గడపదాడ్డం లేదు
కుటుంబమంతా భోజనానికి సిద్ధమై
నాసికాపుటాలకు రుచులు విసురుతున్నారనీ తెలుసు
అయినా అసలు లేవాలనిపించట్లేదు
జరగాల్సిన వన్నీ సక్రమంగా జరిగిపోతన్నప్పుడు
ఇంక ఊపిరి తియ్యాలనే లేదు!
ఇంకా తీయాల్సిన అవసరమేలేదు!
ఎవ్వరైనా ఎవ్వరికోసం
ఎవ్వరెవరికోసం చేస్తారు?
నేనెవరు? నువ్వెవరు ?
ఔను....నేనెవర్ని?
నాకూ - నీకూ ఏమిటీ సంబంధం?
ఎవ్వరెందుకు శ్వాసించాలి?
ఎవ్వరెందుకు దప్పికలవ్వాలి?
నేనెందుకు ఆహారం తినాలి ?
నేనెందుకు కోరిక తీర్చుకోవాలి?
ఇవన్నీ చేస్తున్నదెవరు ?
నేనా? నువ్వా? నేనెవర్ని?
నేనూ నువ్వూ ఒకే గృహంలో లేకపోతే
నాకో నీకో ఎందుకీ శ్రమ?
పునరపి జననం పునరపి మరణం
ఎన్ని నువ్వుల్ని
నేను తృప్తి పరచాలి?
ఎన్ని నేనుల్ని
నువ్వు సంతృప్తి పరచాలి?
నేనే శాశ్వతమైతే
నువ్వు లేని క్షణంలో నేనెక్కడున్నాను?
నేనెవర్ని?
పంచేంద్రియాలకతీతుణ్ణా?
కాదు!
మరి నేనెవర్ని?
ఈ సప్తధాతువుల్నీ కాను
ఆలోచన్నో, ఆనందాన్నో కాను
తాత్కాలిక సుఖ, దుఃఖాలు...
ఈర్ష్యా ద్వేషాల్నీ కాను...నేనెవర్ని?
నేనొక భ్రమనూ కాను
నేనొక దృశ్యంలా ముందుకొస్తాను
నన్ను చూశాననుకుంటావు
నన్ను బంధించాననుకుంటావు
నన్నేమి చూశావు
నన్ను నువ్వే బంధించగలిగితే
వాళ్ళూ... వీళ్ళూ
నన్ను బంధించారనడమెలా సాధ్యం?
నన్ను వినడమూ అంతేనా!
నన్ను నీ సొంతం చేసుకోవడమూ అంతేనా!
నేనెవర్ని?
నీకెలా కనిపిస్తే...
వాళ్ళకూ నేనెలా అలాగే కనిపించాను?
నీకెలా వినిపిస్తే
వాళ్ళకూ నేనెలా అలాగే వినిపించాను?
నేనెవరిని?
8.12.2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి