ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారిగారు ఆచార్య
నాగార్జున విశ్వవిద్యాలయంలో 1979 నుండి 2010 వరకు సుమారు మూడు దశాబ్దాల పాటు సుదీర్ఘ
సేవలు అందించారు. తర్వాత గుంటూరులోని దళిత
సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో
వారు కేవలం ఆచార్యుడిగానే కాకుండా, తెలుగు, ప్రాచ్యభాషల శాఖ విభాగాధిపతి (Head of the Department), డీన్ (Dean) వంటి ఉన్నత
పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కీలక పాత్ర
పోషించారు. సాహిత్య పరిశోధనలో వారిది అందెవేసిన చేయి. వారి కలం నుండి 42 ఉత్తమ గ్రంథాలు
జాలువారాయి. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రికలలో 349 పరిశోధన పత్రాలను
(Research Papers) సమర్పించి, తెలుగు సాహిత్య వైశిష్ట్యాన్ని ప్రపంచ వేదికలపై చాటిచెప్పారు.
వారి మార్గదర్శకత్వంలో 75 మంది పి.హెచ్.డి (Ph.D.) పట్టాలను, 68 మంది ఎం.ఫిల్
(M.Phil) డిగ్రీలను అందుకోవడం వారి విధినిర్వహణలో చూపిన నిబద్ధతకు, పరిశోధనా పటిమకు
నిదర్శనం. భాషా సాహిత్యాలపై వారికన్న పట్టు అసాధారణమైనది. ఇంటర్మీడియట్ (+2) స్థాయి
నుండి డిగ్రీ (UG), పి.జి (PG) వరకు తెలుగు పాఠ్యగ్రంథాల రూపకల్పనలో ప్రధాన సంపాదకులుగా
(Chief Editor) వ్యవహరించి, తెలుగు విద్యా ప్రణాళికలను తీర్చిదిద్దారు. విద్యా రంగంలో
వారు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ'
అవార్డుతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. వారి మేధో సంపత్తి
కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. థాయ్‌లాండ్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్,
రోమ్, జపాన్, అమెరికా వంటి అనేక దేశాలను సందర్శించి, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగిస్తూ
తెలుగు భాషా సంస్కృతులను పరివ్యాప్తం చేశారు.
ఆచార్యకృపాచారిగారి పేరు చెప్పగానే
ఆయన క్రైస్తవ సాహిత్యంపై చేసిన పరిశోధనే గుర్తొస్తుంది. అంత ప్రామాణికమైన సిద్థాంత
గ్రంథంగా పేరొచ్చింది. ఆచార్య కృపాచారి గారి ప్రాథమిక మరియు ఉన్నత విద్యాభ్యాసం క్రమశిక్షణతో
కూడిన వాతావరణంలో సాగింది. 1963 నుండి 1965 వరకు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్‌లో వారు విద్యాభ్యాసం
చేశారు. ఆ తదుపరి, ఉన్నత చదువుల కోసం గుంటూరులోని ప్రసిద్ధ ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ
(AC College) లో చేరారు. ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ (ACC) తెలుగు సాహిత్యానికి, క్రైస్తవ
విలువల మేళవింపుకు పెట్టింది పేరు. ఇక్కడ చదువుకోవడం వల్లనే కృపాచారి గారికి తెలుగు
భాషా సంప్రదాయాలతో పాటు, బైబిల్ లోని నైతిక విలువలపై పట్టు చిక్కిందని మనం భావించవచ్చు.
ఈ విద్యాసంస్థల నేపథ్యం వారిలోని పరిశోధనా తృష్ణను, సామాజిక స్పృహను పెంపొందించడంలో
కీలకమైన పాత్ర పోషించాయి. తర్వాత, ఎం.ఏ., పిహెచ్. డి చేశారు. ఆచార్య తూమాటి దొణప్పగారి
పర్యవేక్షణలో డాక్టరేట్ చేశారు. వారు అనేక గ్రంథాలను ప్రచురించారు. ప్రాసంగిక
వ్యాసావళి (1983) గుజ్జర్లమూడి కృపాచారి, బండారు జ్యోతి స్వరూపరాణి గార్లు కలిసి రాసిన
వ్యాససంపుటి. దీనిలో కథాసాహిత్యంపై రాసిన వ్యాసం, ఆంగ్లసాహిత్యం
ప్రభావం వంటి వ్యాసాలు ఎంతో విలువైనవి. డా.బి.ఆర్.అంబేద్కర్ జాతీయ పురస్కారం
(1987), కార్డ్స్ సిల్వర్ జూబిలీ అవార్డు (1985), ఉత్తమ అధ్యాపకుని పురస్కారం
(1998), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి
మహాకవి జాషువా జీవితసాఫల్య పురస్కారం (2019), వంగూరి ఫౌండేషన్, అమెరికా వారి జీవిత
సాఫల్య పురస్కారం (2014), మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం(2008) ఇలా అనేక
పురస్కారాలు పొందారు. 2003 నుండి 2007 వరకు కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్
మెంబర్ గా ఉన్నారు. ఈయన రాసిన ‘‘ప్రాణహిత’’ కథలు సృజనాత్మక కథా రచయితగా ఆచార్య
కృపాచారిగార్ని మంచి కథకుడిగా తెలియజేస్తాయి. ఈయన నేటికీ ఆకాశవాణిలో జీసెస్
క్రైస్త్ గురించి, డా.బి.ఆర్.అంబేద్కర్ గురించి ధారావాహికంగా ప్రసంగాలు
చేస్తుంటారు. అవి అనేకసార్లు పున: ప్రసారాలు కావడం విశేషం.
ఐసియు కరోనా కథల పరిచయం:
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు
గొప్ప సహృదయులు, ప్రేమ మూర్తి. ఇతరుల మనసులను అర్థం చేసుకోవడంలో ఒక సైకాలజిస్టులా సరిగ్గా
అంచనా వేస్తుంటారు. మానవ సంబంధాల్లో మనం గుర్తించలేనంత సున్నితమైన విషయాలను కూడా ఆయన
తెలియజేస్తూ అప్పుడప్పుడు కథలుగా రాస్తుంటారు. ‘’స్పందన’’ ఆధ్యాత్మిక మాసపత్రికలో ఆయన ‘’ICU కరోనా కథలు’’ పేరుతో (2021-2022)లో కొన్ని
ప్రత్యేకమైన జీవన చిత్రాలను కథలుగా ఒక్కపేజీలో
సరిపోయేలా రాశారు. అవన్నీ మనం నిత్యం చూస్తున్న దృశ్యాలే అయినా వాటిని మరలా మనం ఇలా
అక్షర రూపంలో చదువుతుంటే ఆ జీవితాలలో జరిగిన
కార్యాలు ఆశ్చర్యమనిపిస్తుంది. సమకాలీన కథా సాహిత్యంలో ఆధ్యాత్మిక సత్యాలను ఆవిష్కరించిన
తీరు తెలుగు కథా సాహిత్యంలోనే ఒక నూతన పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి