"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

25 అక్టోబర్, 2025

నాన్న కావాలి!

  


రాత్రి నిద్రపట్టలేదు 

గండెలంతా బరువు బరువుగా ఉంది

తిన్నానంటే తిన్నాను

ఏమి తిన్నానో నాకే తెలియదు 

నోట్లో ఏమి పెట్టుకుంటున్నానో

ఏమి తింటున్నానో నాకే తెలియకుండా తింటున్నాను

అది రుచిగా ఉందో లేదో తెలియదు 

'ఏమి ఆలోచిస్తున్నావు' నన్నే గమనిస్తున్న మంజు అడిగింది.

ఏదో చెప్పేశాను.

'పోనీ ఏం కూరో తెలుసా? '

'ఏదొకటిలే' అని చెప్పాలనుకున్నాను

కానీ, ఏదో గొంతులో చిరాకు మాటలు బయటకొచ్చాయి.

ఆమె మౌనంగా అలా చూసింది.

నేను త్వరగా ముగించేశాను.

ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలనిపించలేదు.

వచ్చేసి, మంచమెక్కాను.

ఫోన్ తీశాను

బొటనవ్రేలు ఏదో టైపు చేసింది.

మళ్ళీ అదే బొటనవ్రేలు డిలీట్ చేసింది.

వాట్సాప్ ఓపెన్ చేశాను

ఎవరెవరో ఏవేవో మెస్సేజలు

కొన్ని నవ్వులు... కొన్ని ఏడుపులు...కొని ఎమోజీలు...

కళ్ళు స్క్రీన్ చూడలేకపోతుంది

కళ్ళల్లో ఎక్కడనుండో ఉరికి పడిన నీళ్ళు...

అక్షరాలు కనపడ్డం లేదు

కళ్ళు నలుపుకున్నాను

మళ్ళీ చూపుడువేలుతో స్క్రీన్ తాకుకున్నాను

అక్షరాలు మసగ్గా అనిపిస్తున్నాయి. 

గుండె పట్టేస్తున్నట్లనిపిస్తుంది

చెంపలు తడిసిపోతున్నాయి. 

కారుతున్న కన్నీళ్ళను చూపుడు వేలు బయటకు తుడిచేయాలని ప్రయత్నిస్తుంది.

ఆ పని ఒక్క వేలుకి చేయలేకపోతోంది.

మిగతావేళ్ళు కూడా సాయం చేశాయి

రెండు కళ్ళూ ముఖాన్ని తడిపేస్తున్నాయి.

కప్పుకున్న దుప్పటి పక్కకి తప్పించాను

రెండు చేతులూ కలిశాయి.

ముఖాన్ని తుడిశాయి.

పసిపిల్లాడిలా లాలించాయి.

ముక్కులు ఎగశ్వాసను 

గుండేదో ఉక్కిరిబిక్కిరనీ చేస్తుంది

ఊపిరితిత్తులు గాలినివ్వాలని తమ ప్రయత్నం తాము చేస్తున్నాయి.

ఈలోగా ఆమె రెండు మూడు సార్లు లోనికొచ్చి,

మౌనదేవతలా ఏమీ అనలేక వెళ్ళిపోయిన దృశ్యాలు దుప్పట్లో దాక్కున్న కళ్ళల్లో కూడా కనిపిస్తున్నాయి.

నేనేదైనా బాధ పడితే ఆమె అల్లాడిపోతుంది.

అలాంటప్పుడు ఎందుకలా ఉన్నావ్? 

ఏమైంది చెప్పొచ్చుకదా? వంటి ప్రశ్నలకు నా నుండి వచ్చిన చిరాకు సమాధానాలు ఆమెకు గుర్తున్నాయి.

'కాసేపు నన్ను ఒంటరిగా వదిలెయ్...నన్నేమీ అడక్కు'

బహుశా అవే మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటాయేమో...

ఏమీ మాట్లాడలేదు.

కానీ, కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది.

ఇంకా ఆమె ఏమీ తినలేదు.

ఇళ్ళంతా బల్బులు వెలుగుతున్నాయి. కానీ ఇల్లంతా చీకటిలా అనిపిస్తుంది.

***

ఒక ఆకర్షణీయమైన మొక్క 

జాలిగా నా ముందు నిలబడి, కాస్త బతికించమని బ్రతిమాలినట్లనిపించింది.

నేనే కాదు

నిన్ను పెంచి పోషించేవాళ్ళు చాలా మంది ఉన్నారని చూపించాను

రెండు ఆకులనూ కృతజ్ఞతతో తలాడించింది

కొన్నాళ్ళయ్యింది

ఆ మొక్క

ఒక వృక్షంలా నిలబడింది

సంతోషించాను

నన్ను పిలిచింది.

తన విశాలమైన బాహువుల్ని చాపింది

అనుమానిస్తూనే అడుగేశాను

నన్ను ఆక్రమించింది 

తన ఊడలతో బంధీ చేసింది

ఊపిరాడ్డలేదు.

పిలుస్తున్నాను

అలా అనుకుంటున్నాను

గుండె గొంతులోనే మూలుగుతుంది

నా మాటలెవరికి వినిపించడం లేదు

ఊపిరాగిపోయేలా ఉంది!

***


ఇంట్లో మనుషులున్నాం. 

కానీ ఇల్లంతా శూన్యంగా అనిపిస్తోంది.

ఏదో శ్మశాన వైరాగ్యం!

కాసేపు ఆమె ఒడిలో తలపెట్టి ఏడ్వాలనిపించింది!

ఈలోగా 'నాన్నా...బిళ్ళలేసుకో' అంటూ ఒక చేత్తో మెడిసిన్ బాక్స్, మరో చేత్తో నీళ్ళ బాటిల్ తో బాబు వచ్చాడు.

ఆ చిట్టి చేతులు వాటిని మోయలేకపోతున్నాయి.

నిన్న గాక మొన్న కళ్ళ తెరిచిన పసిమొగ్గ...

నిండా పదేళ్ళులేవు.

మాట్లాడకుండా లేచాను

వాడ్ని దగ్గరకు తీసుకున్నాను.

ముద్దాడాను.

వాడి మీద చల్లని బిందువులేవో కురిశాయి.

వాడ్ని ముత్యాలేవో అభిషేకించాయి.

'నడ్డిమీద తడివుతుందేమిటి నాన్నా...' అమాయకంగా తన నడ్డి వైపు చూపిస్తున్నాడు.

మాట్లాడలేకపోయాను.

వాడిచ్చిన బిళ్ళలు నోట్లో వేసుకున్నాను. 

దగ్గొస్తుంది.

'ఆగు నాన్నా..నీకోటి తెస్తా...' అంటూ హడావిడిగా వంటగదిలోకి పరుగుపెట్టాడు.

గబగబా చేతిలో ఏదో పట్టుకొచ్చాడు.

నోరు తెరవమన్నాడు...

ఉప్పగా, చేదుగా అనిపించాయి.

ఉప్పు కళ్ళు...కరక్కాయ ముక్కలు

మరోసారి దగ్గరకు తీసుకున్నాను. ముద్దాడాను.

ముద్దాడుతూనే ఉండిపోవాలనిపించింది.

కాసేపు నా కళ్ళల్లోకి. చూస్తూ వాడలానే ఉండిపోయాడు.

గువ్వలా ఒడిలో ఒదిగిపోయాడు.

ఆ దృశ్యం ఎంత బాగుంది.

వాడిని అలాగే హృదయానికి హత్తుకొని ఉండిపోవాలనిపించింది.

ఏదో ఉద్వేగం...ఏవో మాటలురాని ప్రవాహం

పెదవుల్ని పదేపదే తడుపుకొనే చేస్తుంది.

ముక్కు పదేపదే లోనికి ఎగశ్వాస తీసుకొంటుంది

ఊపిరాడ్డంలేదు.

ఎక్కడలేని ఉక్కిరిబిక్కిరి.

ఏదో తెలియని మానసిక వేదన

పదేపదే వాడ్ని ముద్దులు పెట్టుకొంటూ

వాడి ముఖాన్ని సుకుమారంగా తాకుతూ

లక్ష జలపాతాలొకేసారి ఉరికిపడే హోరునేదో ఆపుకుంటూ...

వాడ్ని చివరిసారిగా గండెలకు హత్తుకున్నాను.

***

అమ్మా... నాన్నను లేపు...

స్నానం చేయించాలి.

స్కూల్ కి లేటయిపోతుంది.

వాడింకా మాట్లాడుతూనే ఉన్నాడు!

వాడింకా నాన్నను లేపుతూనే ఉన్నాడు!!

- దార్ల వెంకటేశ్వరరావు, 25.10.2025








కామెంట్‌లు లేవు: