ప్రశ్న : భూమి గుండ్రంగా గోళాకారంలో వుందన్నారు కదా ! మరి గోళానికి కింద వున్న నీరు, కిందికి ఒలికిపోదా ? భూమి కింది మనుషులు జారిపోయి కిందికి పడిపోరా ?
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
జవాబు: నేను చిన్నప్పుడు మా అమ్మమ్మతో '1969 లోనే అమెరికా వాళ్లు చంద్రుడి మీదకు వెళ్లి దానిపై కాలు పెట్టారు, అక్కడ నడిచారవ్వా' అంటే... 'నోరు మూసుకోరా అలా పైకి వెళ్లిన వాళ్లకు చంద్రుడి దగ్గరకు పోగానే ఠపీమని తలకు కొట్టుకోడా ! అలా పైకి వెళ్లిన వాళ్లు పైన తల కాళ్లు కింద వుంటే చంద్రుడి మీద కాళ్లు ఎలా పెట్టగలరు, ఎలా నడవగలర్రా.. మతిగాని పోయిందా ? నీకు చదువు చెప్పినవాడ్ని పట్టుకొని నాలుగు తన్నాలి' అంది. అంతేకాదు ఆమె 105 సంవత్సరాల పాటు బతికింది. కానీ చనిపోయేంత వరకూ చంద్రుడ్ని ఒక దేవుడుగాను, అక్కడ తనలాంటి ముసలమ్మ ఒకరు దోశలు చేస్తున్నట్లు లేదా రాట్నం తిప్పుతున్నట్లు నమ్మేది. భూమి బత్తాయి (మోసంబి/ సంత్ర) పండు లాగా లేదా ఫుట్‌బాల్ లాగా గుండ్రంగా వుందవ్వా' అంటే నా మీద చాలా కోపానికి వచ్చేది. నాకు, మా స్కూల్లో సరియైన తెలివి తేటలు నేర్పడం లేదని నా గురించి చాలా బెంగపడిపోయేది.
మా అమ్మమ్మ కంటే చదువు రాదు. కానీ, చదువుకొన్న వాళ్లలో కూడా చాలా మందికి
భూమి గుండ్రంగా ఉండటం గురించి, దానిపై సముద్రపు నీరు నిలిచి ఉండటం గురించి, భూమికి అవతలివైపు ఉన్న వారి స్థితిగతుల గురించి చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి.
ముందుగా మనమందరం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
భూమి అనేది (దాదాపు) గుండ్రంగా ఉన్న ఒక పదార్థపు ముద్ద. దానికి ద్రవ్యరాశి (mass) వుంది. మన శరీరం కూడా పదార్ధంతోనే తయారైంది. అంటే మనకూ ద్రవ్యరాశి (mass) వుంది. నీరు కూడా పదార్థమే కాబట్టి దానికీ ద్రవ్యరాశి (mass) ఉంది. ద్రవ్యరాశి ఉన్న రెండు వేర్వేరు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం (gravitational force) వుంటుంది. అంటే భూమి గోళాకారంలోనే వున్నా.. ఆ భూమికి, మనకు మధ్య ఆకర్షకబలం వుంటుంది. మనం భూమ్మీద ఎక్కడున్నా భూమి తనకు ఉన్న ఆకర్షకబలంతో మనల్ని తనపైనే అంటే భూమి నేల వైపు ఉండేలా ఆకర్షిస్తుంది. నేల నుండి అంతకంటే కిందికి పోలేము కాబట్టి నేలమీదే వుంటాము. మన బరువు వల్ల మ మనం నీటిలో పడినపుడు నీటి అడుగు వరకు చొచ్చుకు పోగలం అంటే.. మనం నీటిలో మునిగిన తర్వాత మెల్లగా నీటి అడుగున ఉన్న నేల మనకు ఆనే వరకు మనల్ని భూమి ఆకర్షిస్తుంది. అందుకే నీటిలో పడ్డ రాయి మునుగుతుంది. అది నీటి అడుగున ఉండే నేలను చేరేవరకు భూమి దాన్ని ఆకర్షిస్తుంది. మనకు ఈత రాకపోయినా (ఒకవేళ ఈత వచ్చినా ఈదక పోతే) భూమ్యాకర్షణ వల్ల
నీటిలోకి మునిగిపోయి, నీటి అడుగున ఉండే నేలను చేరుతాము.
మనకు, భూమికి మధ్య ఆకర్షక బలం వుండడం వల్ల మనం భూమి మీదే వున్నట్టే భూమి మీద ఉన్న సముద్ర జలాలకు, సరస్సులోని నీటికి, బావుల్లోని నీటికి, కాలువలలో, నదులలో, బకెట్లలో, మురికి గుంటలలో, రోడ్డు మీద బొందలుంటే ఆ బొంలలో ఇంకా ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటి కన్నింటికి ద్రవ్యరాశి (mass) వుంది. కాబట్టి ఆ నీటిని కూడా భూమి తనవైపు ఆకర్షించి తనకు (నేలకు) అంటిపెట్టుకొని ఉంటుంది.
మీరన్నట్టు మనం భూమికి అడుగున (ఆవలివైపు) వున్నట్టు భావించినా, అప్పుడు కూడా మన కాళ్ళు భూమివైపు, నేలకు (లంబదిశలో) అని ఉంటాయి. అంటే భూమికి అవతలివైపు కూడా మన కాళ్లు కిందకి భూమిని (నేలకు) ఆనుకుని ఉండి, తల భాగం ఆకాశం వైపు ఉండేట్లు ఇక్కడ ఉన్నట్టే భూమికి అవతలివైపు కూడా ఉంటాము.
భూమికి ఆవలివైపునకు ఎవరు ఉన్నా.. వాళ్ళు కూడా మనం ఇక్కడ భూమిని (నేలకు) ఆనుకుని ఉన్నట్టే వాళ్ళు కూడా అటువైపు భూమికని (నేలను) ఆనుకుని ఉంటారు.
భూమిని ఆనుకుని ఉన్న వాళ్ళలో ఎవరూ ఎటూ జారి పడిపోరు. ఎందుకంటే మనల్నందరినీ భూమి తన ఆకర్షక బలంతో, తనవైపు ఆకర్షిస్తుంది. మనల్ని భూమి తనకు అంటిపట్టుకొంటుంది. ఎందుకంటే.. మనల్ని భూమ్యాకర్షక బలపు పట్టు నుంచి ఊడబెరికి 'కిందికి' జారలేదు పడేలా (లేదా ఆకాశం లోకి ఎగిరి పోయేలా) లాక్కునే మరో ఖగోళ వస్తువు దరిదాపుల్లో ఎక్కడా లేదు.
ఇలా ఎంత చెప్పినా మీకున్న సందేహం పూర్తిగా సమసిపోదు. కాబట్టి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. దాన్ని మీరు ఆలోచన ద్వారా గానీ లేదా ప్రాయోగికంగా ఋజువు చేసుకొనే పరిశీలన ద్వారా గానీ ఖరారు చేసుకోండి.
ఒక గుండ్రటి అయస్కాంతపు బంతి మీ చేతిలో ఉన్నట్లుగా ఊహించండి. దానికి పైభాగాన ఒక చీల (మేకు లేదా మొల)ను నిలబెట్టినట్టు ఊహించండి. అది అయస్కాంతపు ఆకర్షణ కు లోనుకావడం వల్ల, దానికే అంటుకొని నిలబడి ఉంటుంది. ఇపుడు మెల్లగా ఆ అయస్కాంతపు బంతి మీద వున్న చీల (మేకు లేదా మొల)తో సహా అయస్కాంతాన్ని 180 డిగ్రీల కోణంలో తిప్పండి. ఏమి గమనించారు (లేదా ఊహించారు). ఆ చీల అయస్కాంతానికి అంటుకొనే వుంటుంది. నిజానికి కింద మన భూమి ఉన్న దాని మీద భూమ్యాకర్షక బలం కన్నా అయస్కాంత బలపు ఆకర్షణ ఎక్కువ. కాబట్టి పడిపోకుండా అలాగే వుంటుంది. ఇపుడు ఆ అయస్కాంతాన్ని భూమిగా, మనల్ని, సముద్రపు జలాల్ని, చీల (మేకు లేదా మొల)అని ఊహించుకోండి. అయస్కాంత బలం లాగే భూమ్యాకర్షక బలం వల్ల మనం గానీ, నీరు గానీ (ఇతర ఏ వస్తువైనా గానీ) భూమికి అంటిపెట్టుకొనే వుంటాము.
భారతదేశంలో మనము, భూమికి అవతల అమెరికాలో ఉండే అమెరికా వాళ్ళు భూమివైపే కాళ్లు వుండేలా భూమికి అంటిపెట్టుకొనే వున్నాము. ఎటూ పడిపోకుండా. భూమి మీద ఉన్న లోతైన, లోయల వంటి పల్లపు ప్రాంతాలన్నీ సముద్రపు నీటితో లేదా మంచి నీటి తో భూమిని (నేలకు) అంటిపెట్టుకొనే ఉంటాయి.
-- ప్రొ|| ఎ. రామచంద్రయ్య (విశ్రాంత), NIT Warangal, జనbవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర నాయకులు.
(Rajeshwer Chelimela , Jvv Telangana wall నుండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి