ఆంధ్రప్రభ దినపత్రిక, సాహితీగవాక్షం 8.7.2024 సౌజన్యంతో
...
‘ఆది’నానీల్లో అభ్యుదయ భావాలు
కవిత్వం ఉంటే అది ఏ రూపంలో వెలువడినా పాఠకులు దాన్ని ఆదరిస్తారు. అది పద్యం, వచన కవిత్వం, మినీ కవిత్వం, దీర్ఘ కవిత్వం..ఇలా ఏదైనా కావచ్చు. “ఎన్నాళ్లుగానో
భావాలు నానుతున్నాయి.
ఇవాళ
నానీలై మొలకెత్తాయి.” అంటూ డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఇటీవల వెలువరించిన ‘నానీల సుగంధం’ నానీల సంపుటి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది. కవికున్న గుణం సమాజంలో ఏదైనా తాను దర్శించిన దానికి అతను మానసికంగా ఎంతో సంఘర్షణపడతాడు. అప్పుడు గాని అది కవిత్వమై బయటికి రాదు. ఆ లక్షణాన్నే ‘ఆది’ నానీరూపంలో అందంగా చెప్పాడు. నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్ .గోపి ఈ పుస్తకానికి ముందుమాటలో ఇలా అన్నారు. ‘’పాతికేళ్ల క్రితం నేను శిల్పీకరించిన నానీల బాటలో సుమారు ఐదువందల సంపుటాలు వచ్చాయి. పుస్తక రూపంలో రాకుండా దాదాపు వెయ్యి మందికి పైగా కవులు నానీలు రాశారు. నాణ్యమైన నానీలలో ‘ఆది’ వాటిని మరింత సుసంపన్నం చేస్తున్నాడు.’’ ఈ కవిత్వం ఎంత బాగుందోనని ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి.
సాధారణంగా ప్రాచీన కవులు చరిత్రను, వారసత్వాన్ని, సంస్కృతినీ కీర్తిస్తుంటే, ఆధునిక కవులు సమకాలీన సమాజంలో ఉన్న సమస్యలను వర్ణిస్తుంటారు. దీన్నే ‘ఆది’ కూడా పాటించాడు.
రైతులు - వ్యవసాయ సమస్యలు:
మన భారతదేశంలో పాలకులు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యాన్నివ్వాలి. కానీ అది జరగడం లేదు. ఆ రైతులకు అందించవలసిన విత్తనాలు, ఎరువులు సరైన సమయంలో అందిస్తే చాలు. పంట నిల్వ ఉంచుకోవడానికి గిడ్డంగులు నిర్మించాలి. అలా చేస్తే అదే వాళ్ళకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా పండించిన పంటకు తగిన మద్దతు ధర ఇచ్చినా సరిపోతుంది.కానీ, ఇవేమీ చేయకుండా రకరకాలైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రైతులు కూడా చైతన్యవంతలై ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పంజాబ్ రైతులు చేస్తున్న ఉద్యమం. అభ్యుదయ భావాలున్న ప్రతీకవీ ఈ ఉద్యమాన్ని సమర్థిస్తూ కవిత్వం రాశాడు. దీన్ని సమర్థిస్తూ కవి ‘ఆది’ కూడా అభివ్యక్తి వైవిధ్యంతో కొన్ని నానీలు రాశాడు.
‘’రైతు ట్రాక్టర్లు
ఢిల్లీ చేరుకున్నాయి
చలికి
వణుకుమొదలైంది.’’ పంజాబ్ లో మొదలైన రైతు ఉద్యమం ఢిల్లీ కి చేరింది అనడంలో రాష్ట్రాల్లోని సమస్య రాజధానికి చేరిందని, దానితో పాలకుల లో ఆందోళన ఎక్కువైందనేది కవి చక్కగా అభివ్యక్తీకరించాడు. కేవలం పంజాబ్ రైతులు మాత్రమే కాదు; భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతుల పట్ల వాళ్ళ జీవితాన్ని తన నానీల కవిత్వంలో పలికించాడు. రైతు తాను ఉదయం మేల్కొన్నది మొదలు తన జీవితాన్ని ఎలా చాలింప చేయవలసి వస్తుందో అక్కడి వరకు అనేకమైనటువంటి సంఘటనలకు ‘ఆది’ కవిత్వమయ్యాడు.
‘ఉదయాన్నే
కోడి కూత వేసింది
రైతు దినచర్య
కళ్ళల్లో మెదిలింది’
అంతా కష్టపడినా రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటి నుండి తప్పించుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నారు.
‘’నేటి భారతంలో
దళారుల పద్మవ్యూహం
రైతే
అభిమన్యుడు.’’
ఎన్ని నష్టాలు వచ్చినా, కష్టాలు ఎదురైనా వ్యవసాయాన్నే నమ్ముకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే కవి భావించినట్లు...
‘పంటను
రైతు నీటితో కాదు
కన్నీటితో
పండిస్తున్నాడు’ పంట మోసం చేయట్లేదు. వ్యవసాయ పొలమూ మోసగించడం లేదు. అందుకనే కవి
‘వరి పంట
వంగి నేలను ముద్దాడింది
రైతు కష్టం
యవ్వనమైంది’‘
రైతు నేలను
చెమటతో తడిపాడు
ప్రపంచం
కడుపు నిండిపోయింది’ అని కూడా కవి గుర్తించమంటున్నాడు. కానీ కొన్ని సార్లు ప్రకృతి సృష్టించే బీభత్సం రైతుల్ని అయోమయంలో పడేస్తుంది. అయినా సరే వాటిని తట్టుకొని కూడా నిలబడతారు. జనాన్ని నిలబెడతారంటూ …
‘రైతులు
కనిపించే దేవుళ్ళు
తాము వస్తుండి
ప్రపంచం కడుపు నింపుతారు’
‘వాన
జోరుగా కురిసింది
పంట చూసి
రైతు గుండె గండిపడ్డది’.
ఇదొక పార్శ్వమైతే మధ్య దళారీలు చేసే మోసాల వల్ల జరుగుతున్నదేమిటో చెప్తూ...
‘పంటలకు
గిరాకీ ఎక్కువే
రైతులకే
గిట్టుబాటు తక్కువ’ అన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే …‘ఎక్కడ చూసినా
రైతు ఆత్మహత్యలే
కలియుగం కాదిది
ఆకలి యుగం’’
‘రైతు
మట్టితో సహజీవనం
మరణించాక
మట్టి దుప్పటి తోడని కావచ్చు’అని ముగిస్తాడు.
పొద్దుటే లేచి రాత్రి వరకు మాత్రమే కాదు, రాత్రిపూట కూడా వ్యవసాయంతోటే తన జీవితాన్ని ముడిపెట్టుకున్న రైతు జీవితాన్ని చదివితే ఆ కష్టాలన్నీ మనకు ఈ నానీల్లో కనిపిస్తాయి. ఈ కవి రైతుకు సంబంధించిన సమస్యలను, జీవితాన్ని అక్కడక్కడ కొన్ని నానీలు గా వర్ణించాడు. వాటిని ఒకక్రమంలో పెడితే నానీలు రైతు కావ్యం అనిపిస్తుంది.
కరోనా నేర్పిన పాఠాలు:
ప్రపంచ వ్యాప్తంగా ఈ శతాబ్దంలో వచ్చిన ఒక మహమ్మారి కరోనా. కరోనా జీవితాల్ని పునర్ మూల్యాంకనం చేసుకునేలా చేసింది. ప్రకృతికి మానవుడికి ఉన్న మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించింది. జీవితమెంత క్షణబంగురమో చూపించింది. కొంతమంది కథలు, మరి కొంతమంది నవలలు రాశారు. కవిత్వం అయితే చెప్పలేనంతగా వచ్చింది. ఈ కవి కూడా కరోనా ప్రభావంతో కొన్ని నానీలు రాశాడు.
‘కరోనాతో / విద్యాసంస్థల బంద్/ పేరెంట్స్ కు/ ప్రశాంతత బంద్’ ‘రైలు బోగీల్లా/ ఎంతటి చక్కటి లైను/ క్యూ పద్ధతి /కరోనా నేర్పింది’. పౌరుడు స్పందించవలసినప్పుడు మాట్లాడకుండా ఉండే ఒక జఢత్వ స్థితిని కవి ఇలా వర్ణిస్తున్నాడు. ‘మళ్లీ దేశమంతా/ లాక్ డౌన్ నా?/ మనం/ మాస్కులు ఎప్పుడు తీశామని’
సమాజంలో సమస్యల గురించి పోరాడేవాళ్లు కొంతమందైతే దాని ఫలితాలను పొందేవాళ్ళు ఇంకొకరు. సమస్యల పరిష్కారానికి అందరూ స్పందించకుండా, నిర్వీర్యంగా, మౌనంగా ఉండడాన్ని నిరసిస్తున్నాడు కవి.
కవి- కవిత్వ రహస్యాలు:
కవులు కవిత్వం చెబుతూనే, తమ అనుభవాలు కవిత్వం ఎలాగయ్యాయో, ఏది కవిత్వమవుతుందో చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఏ కవి కూడా దానికి అతీతం కాదు. పైగా ఈ కవి విశ్వవిద్యాలయంలో పరిశోధన కూడా చేశాడు. కాబట్టి సాహిత్యాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసిన వ్యక్తి. అందువల్ల కూడా కావ్యశాస్త్ర అంశాలు ముఖ్యమని భావించి బహుశా వాటిని కూడా కవిత్వేకరించాడు.
‘కవిత్వం/ కవికి జీవనది/ బొంతను, ముంతను/ భాగస్వాములను చేస్తుంది’ ‘మనసును/ దండంపై ఆరేశా/ కన్నీటి బొట్లు /కవితలేరాలాయి’‘పండ్లు బాగా/ మాగితేనే రుచికరం/ కవితలు కూడా /అంతే మరి’ ‘కవి మిత్రులు/ సాయంత్రం మాట్లాడేవారు/ ప్రతి మాట కవితై విరబూసేది’‘కన్నీటి చుక్కకొక/ కవిత రాలిపడ్తుంది/ హృదయాన్ని/ కట్టిపడేస్తుంది’
‘కవికి మరోకవి/ అభిమాని/ కవిత్వంలో గాఢత/ గట్టిదైనప్పుడు’ ‘కవిత్వం/ నిశాచర జీవి/ సూర్య చంద్రులకు కూడా / టార్చి వేసి చూస్తుంది’ ‘చీకటి/ అందర్ని నిద్రపుచ్చుతుంది/ కవిత్వం/చీకటిని మేల్కొల్పుతుంది’ ‘విశ్వంలో/ కవి చంద్రుడు ఒక్కడే/ వెలుగు చైతన్యానికై/ వెంపర్లాలాడుతాడు’ ‘పేదవాడినై/ కొందర్కి దూరమయ్యా/ కవితలు/ అందర్నీ కలిపాయి’ ‘కవిత్వానికి/ రాత్రి పగలు ఉండవు/ చీకట్లో పుట్టి /పగల్ను చుట్టేస్తుంది’ నానీలు ఎటువంటివో చెబుతూ ‘నానీలు/ జీవన సూక్తులు/హృదయాన్ని/ కదిలించే బాణీలు’ అనడం ద్వారా నానీల స్వభావాన్ని చెప్పడమే కాకుండా తన నానీలు కూడా అటువంటివేనని ధ్వనింపజేస్తున్నాడు కవి. మనం ఆధునిక సమాజంలో ఉన్నమా? ప్రాచీనకాలం నాటి భూస్వామ్య వ్యవస్థలోనే బతుకుతున్నామా? రాచరిక స్వభావాన్ని, భూస్వామ్య భావజాలాన్ని మూఢవిశ్వాసాల్ని వదల్లేకుండా ద్రవాధునిక సమాజంలో జీవిస్తున్నామా? ఈ ప్రశ్నలన్నీ సమాజంలో కనిపిస్తున్న మానవ జీవన విధానాన్ని బట్టి అనిపిస్తోంది. ఒకవైపు నగర జీవనం , శాస్త్రీయత విస్తరిస్తూనే, ఆ పక్కనే గ్రామీణ జానపద స్వభావం మూఢవిశ్వాసాలు సమాంతరంగానే పయనిస్తున్నాయి. ఈ కవి ఈ విషయాలపై ఒక నానీ రాస్తూ ‘ సైంటిస్టులు/ సైన్స్ డే లో/ ప్రసంగాల హోరు/ శివరాత్రికి/ జాగాల జోరు’ అని ఈ సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించమంటున్నాడు. ఇలాంటి నానీలెన్నో డా.గిన్నారపు ఆదినారాయణ తన ‘నానీల సుగంధం’ నిండా పరుచుకున్నాయి. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటాల్లో ఇది తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు,
ఈమెయిల్: darlahcu@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి