"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 December, 2023

విల్సన్ రావుగారి ‘నాగలికూడా ఆయుధమే...‘పై నవతెలంగాణ లో ఆచార్య దార్ల వ్యాసం

 విల్సన్ రావుగారి ‘నాగలికూడా ఆయుధమే...‘పై నవతెలంగాణ  , 18.12.2023 న   ఆచార్య దార్ల వ్యాసం ప్రచురితం. ఆ పత్రిక సౌజన్యంతో పునర్ముద్రిస్తున్నాను.

18.12.2023 నవతెలంగాణ దినపత్రిక


”ఒక నిర్వేదం, నిస్తేజం ఆవరించినప్పుడు
ఆప్యాయమైన పలకరింపు కోసం
కక్కటిల్లిపోయేవాళ్ళకు
నీడనిచ్చి సేదతీర్చే
పచ్చటి వేపచెట్టులాంటివాడు
పసిబిడ్డ నవ్వులాంటివాడు” (శాస్త, పు: 1) ఈ ఖండిక ప్రముఖకవి కొమ్మవరపు విల్సన్‌రావు ‘నాగలికూడా ఆయుధమే…!” లోని తొలికవితలోని తొలిపాదాలు. దీన్ని చదవగానే నాకు ఈ కవే స్ఫురించారు. కానీ, చివరవరకు చదివిన తర్వాత ఇది కవిత్వాన్ని శ్వాసించే మహావక్షంలాంటి కె.శివారెడ్డి గురించి అని తెలిసింది. కవితకు ‘శాస్త’ అని శీర్షిక పెట్టారు. దీనికి నిఘంటువులో చాలా అర్థాలున్నాయి. ఇంగ్లీషులో ఉన్న A ruler అనే అర్థం ఎంతో ఔచిత్యంగా ఉంది. విల్సన్‌రావు కూడా అమ్మతనంలాంటి అమతతుల్యమైన ప్రేమ నిండిన మనిషి. ఆయన కవిత్వం కూడా తియ్యనిపదాలతో మెత్తగా గుండెలు నిండా చేరిపోయిన ఆనందం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. విల్సన్‌రావు కవిత్వానికి పాఠకుణ్ణి ఒక ట్రాన్స్‌ లోకి తీసుకుపోయే తత్త్వం ఉంటుంది. కవితలో తాను ప్రధానంగా చెప్పాలనుకున్న అంశాన్ని పట్టుకోవాలనుకుంటూ, ఆ నిర్మాణానికి ముందు ఆశ్చర్యపోతాం. అందువల్ల కవి పంచే అనుభూతి సాంద్రతతో పాటు, ఆ నిర్మాణం, ఆ కవిత లక్ష్యార్థం పాఠకుణ్ణి పదే పదే చదివించేలా చేస్తుంది.
తెలుగు కవులకు ఒక మహావక్షమై బుద్ధదేవునిలా తన కరుణార్ద్రహదయంతో కవులకు నీడనిచ్చి, కవిత్వమంటే ఏమిటో చెప్పకనే చెప్పే సరసమైన సంభాషణలతో జ్ఞానమిచ్చి, భావుకత రెక్కల్నిఎగురవేయడమెలాగో నేర్పే సమకాలీన కవుల చరద్విశ్వవిద్యాలయా చార్యుడులాంటివారు శివారెడ్డి. ఆయనతో మాట్లాడినా, ఆయన కవిత్వాన్ని చదివినా ఒక సాహిత్యపు పులకరింతతో మానవత్వాన్ని అభిషేకించినట్లుంటుంది. శివారెడ్డి కవిత్వాన్ని రాసే దశ్యాన్ని విల్సన్‌రావు ఒక భావచిత్రంలో వర్ణిస్తూ…
‘మధ్యవేలు ఊతంతో

చూపుడు వేలూ, బొటనవేలూ మధ్య

 ఇమిడిన తన కలం ప్రసరించే

 పల్లె ఒడి పద సంపద

 ఆయన జీవితమంత ధైర్యాన్నిస్తుంది” అని వ్యక్తీకరించిన అభివ్యక్తిలో ఎంతో బలమైన వస్తు, శిల్పవైవిధ్యం ఉంది. దీన్ని పైపై చూపులతో చదివితే వెంటనే అర్థంకాదు. సాధారణంగా కవులు చూపుడు వేలుని అంబేద్కరిజంలోని ఆత్మగౌరవాన్నీ, బొటనవేలుని మార్క్సిజంలోని సమైక్యపోరాటశక్తినీ చెప్పడానికి ప్రతీకాత్మకంగా వాడుకుంటారు. ఇక్కడ దీన్ని కవి ఉద్దేశించారో లేదో గానీ, ఆ రెండూ సైద్దాంతిక బలానికి సంబంధించినవి. వస్తు నిర్దేశానికి అభివ్యక్తి చాలా ముఖ్యం. అది మధ్యవేలులాంటిదికావచ్చు. కానీ, సారంలో జీవితానికి ఒక ధైర్యాన్నివ్వాలి. అవన్నీ శివారెడ్డిలో, ఆయన కవిత్వంలో తమకు ఆదర్శంగా చేశాయనీ, అందుకే ఆయన తమకు అందరికీ ఒక ఆచార్యుడు వంటివారని తన గురుస్మరణతో ఈ కవితాసంపుటిని ప్రారంభించారు కవి. అయితే, ఇది ప్రాచీన కావ్యావతారికల్లో చేసే ప్రశంసలాంటిది కాదు.

ప్రస్తుతం వచన కవిత్వం బాగా రాస్తున్న మొదటి పదిమందిలో విల్సన్‌రావుు ఒకరు. ‘దేవుడు తప్పిపోయాడు’ (2017) కవితా సంపుటి ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చింది.
తన కవిత్వం అంత బలంగా, బిగువుగా ఉండడానికి గల ఒక రహస్యాన్ని విల్సన్‌రావే వెల్లడించారనిపించింది. అది ఈ కవితాసంపుటిలోని ప్రతికవితలోనూ ప్రతిఫలిస్తుంది. తాను రాసిన కవితను వెంటనే పత్రికల్లోనో, సామాజిక మాధ్యమాల్లోనో చూసేసుకోవాలనే ఉబలాటం మంచిది కాదని గుర్తించాల్సిన కవులు ఎంతోమంది ఉన్నారు. తీర్చిదిద్దిన శిల్పంలాంటి కొన్ని కవితలను తన నాల్గవ కవితా సంపుటిగా ప్రచురించారు.
తెలుగులో కొంతమంది కవిత్వాన్ని చదివి దానిలో ఉన్నదాన్ని అనుభూతి చెందినంతగా, ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ప్రతి పదంలోనూ కవిత్వం, ప్రతి కవితలోనూ ధ్వన్యాత్మకమైన భావన. ప్రతి కవితలోనూ సామాజిక స్పహ. విల్సన్‌రావు తన నాలుగో కవితా సంపుటికి ”
నాగలి కూడా ఆయుధమే..!” దీనిలో సుమారు 67 వచన కవితలు ఉన్నాయి. వీటిలో కొన్ని దీర్ఘ కవితల స్వరూప స్వభావాలను, మరికొన్ని మినీ కవితల స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
”ఎంత నేరం కాకపోతే మరీనూ?

 మాట గొంతులోనే

 హత్యకు గురవుతున్నచోట

స్వేచ్ఛకోసం అర్రులు చాచడమా?” అనడానికి ముందు కవి ఒక ఆత్మీయుణ్ణి గురించి స్వగతంలో మనసులో అనుకోగానే తన కళ్ళముందుమెరుపులా వాలేవాడనీ, అతడు కనిపించకపోతే ఎలా ఉంటుందో మనసు పడిన సంఘర్షణ, గుండెపడిన తడబాటు, ఆలోచన చేసిన హెచ్చరికలను, సమాజానికి కావలసిన స్వేచ్ఛకోసం కొందరు చేస్తున్న త్యాగాన్నీ కీర్తిస్తాడు.’జ్ఞానవాక్యం’ కవితలో కవిత్వశక్తిని అభివ్యక్తీకరించిన తీరు అద్భుతం.
‘నాలో నిద్రిస్తున్న కలలను మేల్కొలిపి

నాలో గూడు కట్టుకున్న

 సందేహాలను కూల్చేసి

నన్నొక సజీవ జలపాతాన్ని చేసింది” దీనిలో తనని సజీవం చేసిన ‘వాక్యం’ ఎవరు? ఈ కవిత నవతెలంగాణ నిర్వహించిన మహాకవి దాశరథి రంగాచార్య స్మారక రచనల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. ‘జ్ఞానవాక్యం’ ప్రతి మనిషికీ అదొక మహావాక్యమే, అది ఒక కవిత్వం కావచ్చు. అది ఒక మహాకవి మాట కావచ్చు. అది ఒక ప్రవక్త ప్రవచనం కావచ్చు. కానీ, అదంతా మళ్ళీ జీవితమై, మళ్ళీ అదంతా అనుభవమై ఎదురవుతుంది.
మక్కెన సుబ్బరామయ్య స్మారక కవితల పోటీలో బహుమతి పాందిన కవిత ‘పద్యానికి పూచిన పువ్వు’ ఒక చక్కని ఎలిజీ. ఏ ద్వేషం లేని మంచి మనుషులెంతోమంది ఉంటారు. మనం చూడగలగాలి. మనం చూసే చూపును బట్టి కూడా మన చుట్టూ ఉండే మంచి కనిపిస్తుంది. అందుకేనేమో మన పూర్వీకులు ‘యద్భావం తద్భవతీ’ అన్నారు. ప్రతి రోజూ తానెన్ని కష్టాలు పడుతున్నా, తన చుట్టూ ఉండేవాళ్ళతో సంతోషంగా గడుపుతూ, సంతోషాన్ని పంచేవాళ్ళుంటారు. కవి దీన్ని
”పొద్దు పొడుపుకు ఆత్మీయ సత్కారం చేసి

 చిన్న చిరునవ్వు మన కళ్ళలోకి ఒంపుతాడు” అని గుర్తుచేస్తాడు.
”ఒట్టిపోతున్న ప్రపంచం” కవితలో కొన్ని పాదాల్లో రెండేసి పదాలను ప్రయోగిస్తూ ఒక చరిత్రను మరొక చరిత్ర ధ్వంసం చేసి తమ చరిత్రను ప్రపంచానికి బహిర్గతం చేసే ప్రయత్నం చేసినా, రెండు చరిత్రలలోని వాస్తవాల్నీ గుర్తించే కొత్త ఉదయాలు ఉదయించకమానవు అని చెప్పడంలోనే కవి శిల్పరహస్యం దాగి ఉంది.
మనిషి అస్తిత్వానికి తాను, తన చుట్టూ ఉన్న పరిసరాలు, తన ఆలోచనలు కారణమవుతాయి. తన ఆలోచన సవ్యదష్టిలో ఉండడం, ఉండకపోవడం అనేది తన అవగాహనను బట్టి ఉంటుంది. ఒక్కోసారి తన శత్రువు ఎవరో గుర్తించలేని యుద్ధం చేస్తుంటాడు. తనకు తానే శత్రువుగా కూడా పరిణమిస్తుంటాడు. తన శత్రువుని గుర్తించి ఆ శత్రువు లక్ష్యాన్ని గురిచూసి కొట్టగలడం ఎంతో పరిశీలన, జీవితానుభవాల వల్ల మాత్రమే అలవడతాయి. భారతదేశంలో రైతు దుస్థితికి లేదా రైతు అస్తిత్వాన్ని నిర్ణయిస్తున్నదెవరు? తానేమి చేస్తున్నాడో తెలియకుండా తాను పండించడమే పనిగా పెట్టుకుంటే సరిపోతుందా? తన పొలంలో పండే పంట ఏమి వేయాలనేది చెప్పేదెవరు? ఒక వేళ ఏవరైనా చెప్పినా తాను వింటాడా? ఒక వేళ విన్నా, ఆ లాభనష్టాలకు కారకుల్ని నిజంగా గుర్తించగలుగుతున్నాడా? ఒకవేళ తనకు అందవలసిన సహాయం, సహకారం ప్రకతి, ప్రజలు, ప్రభుత్వం, చట్టాలు అన్నీ సక్రమంగా అందించినా తన ఆలోచనలోని ‘తాను’ బయటకొస్తున్నాడా? ఒకవేళ ఇప్పటివరకు చెప్పుకున్న ఈ సహాయ సహకారాలు లేకుండా తానొక్కని ఆలోచనతోనే ‘తాను’ నిజంగా నిలబడగలుగుతున్నాడా? ఇవన్నీ రైతులు, ప్రజలు, ప్రభుత్వం, అది చేసే ఒప్పందాలపై కూడా ఆధారపడి రైతు అస్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇవన్నీ ఏమి చేసినా చేయకపోయినా
రైతు ‘తాను’ నిరంతర శ్రామికుడు. ‘తాను’ నిరంతం భూమిని నమ్ముకున్న విశ్వాసి. ఈ రెండు విధాల అస్తిత్వాల సంఘర్షణ ‘నాగలి కూడా ఆయుధమే…! కవితలో కనిపిస్తుంది.
”భూమికీ ఒక గుండె ఉందని

ఆ గుండెలో కొంత తడి ఉందని తెలిసాక

 దాని ఊపిరితో ఊపిరి కలిపి” అంటూ సాగే ఈ పాదాల్లో రైతు ‘తాను’ గా బహిర్గతమయ్యే శ్రామికుడు, ‘తాను’గా నమ్మకంపై నిలబడే ఒక ఆత్మవిశ్వాసంగా జీవించే గొప్ప చైతన్యాన్ని అక్షరీకరించాడు కవి. అదే కవి అదే రైతు ఉనికిలోని మరో కోణాన్ని పట్టుకుని చూపిస్తూ…
”ఆకలి డొక్కలు నింపే

 చట్టాలు చేయాల్సిన చట్టసభల” లలో దాగిన నిర్వీర్యతను, నిస్సహాయతను, నిలువుదోపిడీని గుర్తించమంటాడు. అయినా కవి ఎగిరిపడే కెరటంలాంటివాడు. తనని తాను నమ్ముకుంటాడు. చివరిలో ‘నాగలిని ఒక ఆయుధం’గా అభివర్ణించడంలో రైతుల సమైక్యశక్తిని ప్రదర్శించాల్సిన అవసరాన్నీ సూచిస్తాడు కవి. రైతు అస్తిత్వంలోని భిన్నపార్వ్శాల్నీ, భిన్న పోరాటమార్గాల్నీ, తన శత్రువుని గుర్తించడంలోని నేర్పరితనాన్ని రైతుకి చూపించడంలో కవి రైతుపక్షపాతిగా మారిపోవడమే ఈ కవిత తారాస్థాయికి చేరడం. ఈ కవితకు కొనసాగింపులాంటి కవిత ‘అనివార్యం’. కానీ, రైతు జీవితాన్నీ సమన్వయించుకొనే అవకాశం ఉన్నా, మనస్తత్వ సంఘర్షణకు సంబంధించిన కవిత ఇది.
సమకాలీన సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి నవల, కథ తోడ్పడితే, కవిత్వం సమకాలీన మానవీయతను ఆత్మీకరించుకోవడానికి తోడ్పడుతుంది. కరోనా తెచ్చిన మానవీయ సంబంధాల విధ్వంసం, అదే సమయంలో జీవితం పట్ల మనుషులు వ్యవహరించవలసిన తామరాకు మీద నీటి బింధువుల్లాంటి మానవజీవన గమ్యాన్నీ స్ఫష్టంగా చూపించింది. కళ్ళెదుటనే రక్తసంబంధీకులు కనిపిస్తున్నా ముట్టుకోనివ్వని కొంతకాలం బలవంతంగా ఉండాల్సిన క్వారంటైన పరిస్థితులు…వీటిని వర్ణిస్తూ కవి…
”చూడగానే ఎదురేగి నిన్ను హత్తుకోలేని

 అలసిన నీనుదుటిపై ముద్దెట్టుకోలేని

 కనీసం నీశ్వాసను తాకలేని అసహాయ” స్థితిని ప్రపంచవ్యాప్తంగా చూశామని ఆనాటి భయంకరమైన మానవీయ ఉద్వేగాన్ని కవిత్వీకరించారు. నవల, కథల కంటే పాత్రలు లేని, స్థల కాలాలు లేని వర్ణనలు ప్రపంచంలోని అన్ని దేశాల మానవ ఉద్వేగాల్నీ కవిత్వం అనుభూతిలోకి తీసుకొస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదేమో. ఇలాంటి వర్ణనలు ఒక భాషకు, ఒక దేశానికి మాత్రమే పరిమితమైనవి కాదు. విల్సన్‌రావు కవిత్వంలో ఇటువంటి సాధారణీకరించే అనుభూతులెన్నో ఉన్నాయి.
లోకంలో సాధారణంగా కొడుకు లేదా కూతురు తన తల్లిదండ్రులకు ఎంతో అందంగా కనిపిస్తారు. అలాగే, తన మనవలు కూడా తమ తల్లిదండ్రుల్లా అనిపిస్తూ, ఒక్కోసారి తానే ఒక ప్రతిబింబంగా అనిపిస్తూ ఆనందపారవశ్యానికి గురిచేస్తారు. అందుకనే పిల్లల్ని మన పూర్వీకులు ”ఆత్మావై పుత్రనామాసి” అనీ, ”అంగాదంగాత్సంభవసి”అనీ ప్రవచించారు. ”హిఈజ్‌ మై సిన్సియర్‌ లవర్‌” కవిత చదివి చూడండి. కవిలోని ప్రేమ, కవిలోని సౌందర్యం అది ఇచ్చే ఆనందం మనకీ అనుభూతిలోకి వస్తుంది. నిజానికి ఈ కవిత ప్రతి పాదాన్నీ ఉదహరించాలనిపిస్తుంది.
”నా ఆత్మలో అతడింకిపోయాడో

 అతని ఆత్మలో నేనింకిపోయానోగానీ

ఏదో తెలియని ఊహ ఒకటి

నాలో ఊపిరిపోసుకొని మౌనినైనప్పుడు

నా మౌనానికి మాటలు కూర్చే నాయకుడౌతాడు అని వర్ణించడం ఒక వేద వాక్యాన్ని వచనంలో ప్రవచించినట్లుంది. ‘గుండెలపై వెచ్చటి ముద్దివ్వ”డం, ”కల్లాకపటమెరుగని కొంటెకోణంగి”గా కనిపించడం ప్రేమలోని స్వచ్ఛతను, నిష్కల్మషత్వాన్ని చెబుతున్నాయి. ”నా ప్రేమమయ జీవిత పుస్తకంలో మొదటి వాక్యము చివరి వాక్యము అతడే” అంటూ బాల్యాన్నీ, యౌవనాన్నీ, వద్ధాప్యాన్నీ, ఆ మానవ పరిణామ గతులన్నీ మనకు రుచి చూపిస్తాడు కవి. ఇలాంటి కవిత్వం రాయాలంటే గుండె నిండా ప్రేమ ఉండాలి. ఈ కవిత్వం చదువుతుంటే బైబిల్‌లోని ప్రేమగీతాన్ని చదువుతున్నట్లుంది. ప్రేమించే మనిషిని అక్షరాల్లో అభిషేకించినట్లుంది. ఒక వేదమేదో నాకు జీవితాన్ని ప్రబోధిస్తున్నట్లుంది. ఈ కవిత్వం నిండా ప్రేమ పరిమళాల్ని పంచుతున్న మానవత్వం ఉంది. ఒక కవినీ, ఒక విమర్శకుడినీ, ఒక రైతునీ, ఒక కవినీ, ఒక స్నేహితుడినీ… ఇలా మానవుడెన్ని రూపాల్లో కనిపిస్తాడో, మానవుని ప్రేమను ఎన్ని రూపాల్లో దర్శించి, స్పర్శించలగమో ఈ కవిత్వం చూపిస్తుంది.
ఈ కవితాసంపుటి నిండా కవిత్వం ఉంది. కవిత్వాన్ని చేసిన మానవీయ పరిమళం ఉంది. అమతతుల్యమైన ప్రేమతత్వముంది. జీవన వ్యాఖ్యానం ఉంది. జీవితాన్ని జీవించడమెలాగే ఈ కవిత్వం నేర్పుతుంది. అన్ని కవితల్నీ చదివినా, వాటన్నింటినీ విశ్లేషించాలనుంది. అది మరో సందర్భంలో చేస్తాను. మళ్ళీ శివారెడ్డిపై రాసిన ‘అతడూ, నేనూ- కొన్ని కవిసమయాలూ…’ అనే కవితతోనే దీన్ని ముగించాలనిపిస్తుంది. కవి శివారెడ్డి ఈ కవితకు ఒక నెపం మాత్రమే. ఈ కవితలోనే ‘మానవత్వం పరిమళించే ప్రేమతత్వాన్ని పంచే ప్రతి ఒక్కరినీ చూడొచ్చు. ఈ కవిని కూడా చూడొచ్చు. ఈ కవి లక్ష్యాన్ని చూడొచ్చు. ఈ కవి ఆశయాన్ని తెలుసుకోవచ్చు.
”మంచి కవిత్వం అంటే

 దానికి గుండె ఉండాలి

 ఆ గుండె కన్నీరు కార్చాలి

 ఆ కన్నీరు కాలపు బరువుల్ని మోయా”లి అనేది కవి కవిత్వతత్వం పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయం. అంతే కాదు కవిత్వం ఎలా ఉండాలి?
”నేనున్నాననే భరోసాతో/ తొలకరి చినుకై/ జీవాక్షర”మవ్వాలి. కవిత్వం నవ్వుల పరిమళం అద్దాలి. తీపి కలలను పంచాలి. ఒక నులివెచ్చన కరస్పర్శగామారాలి. మనః పలకంపై చెరగని ముద్ర వేయాలి. ఇవన్నీ కవి విల్సన్‌రావు మహాకవి శివారెడ్డి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే సందర్భంలో కవి పలికి కావ్యశాస్త్రవాక్యాలు. నిజంగానే ఇదంతా ఈ కవితాసంపుటిలోని కవితల్లో కనిపిస్తుంది. కవి విల్సన్‌రావుతో మాట్లాడుతుంటే ఒక పిల్లాడి స్వచ్ఛత మనలోనూ ప్రవేశిస్తుంది. ఇక ఆయన అంతరంగం చిలికి ఈ కవిత్వామతాన్ని తాగితే నిజంగానే మనం అమరులమవుతాం.

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 9182685231


(నవతెలంగాణ దినపత్రిక, 18.12.2023, సాహిత్య అనుబంధం సౌజన్యంతో)





No comments: